జాతీయ వార్తలు

వరదలతో అస్సాం విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/ మాల్దా/ ముంబయి, జూలై 30: భారీ వర్షాలు అస్సోం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న అసోంలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. కజిరంగా జాతీయ పార్కులో దాదాపు 80 శాతం నీట మునిగింది. 22 జిల్లాల్లోని సుమారు 19 లక్షల మంది వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన అసోంను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌తో కలిసి ఆయన వరదబాధిత ప్రాంతాలయిన నాగోన్, మొరిగోన్, కజిరంగా ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. మొరిగోన్ జిల్లాలోని భకత్‌గోన్ సహాయక శిబిరంలో ఉన్న వరద బాధితులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి, సంబంధిత రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులతో జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరద పరిస్థితి భయానకంగా ఉందన్నారు. అయితే ఏమాత్రం లోటుపాట్లు లేకుండా బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం సమస్యకు పరిష్కారం కాదని, భయంకరమైన వరద పరిస్థితిని చక్కదిద్దడానికి తగిన కార్యాచరణ అవసరమని ఆయన అన్నారు.
పశ్చిమబెంగాల్‌లో ఫుల్లర నది పొంగిపొర్లడంతో వెల్లువెత్తిన వరదల వల్ల మాల్దా జిల్లాలోని 31కి పైగా గ్రామాలు నీటమునిగాయి. దీంతో 22వేల మంది ప్రజలు దెబ్బతిన్నారు. గంగానది ఉప్పొంగి ప్రవహించడంతో ఫరక్కా ఆనకట్ట సమీపంలో బీర్‌నగర్ సమీపంలో రెండు కిలోమీటర్ల పొడవున కరకట్టకు గండిపడింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. అధికారులు మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, వరద బాధితులను వాటిలోకి తరలించి, వారికి ఆహార పదార్థాలను సరఫరా చేశారు. బిహార్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ముంచెత్తిన వరదల వల్ల 26 మంది మృతి చెందగా, 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ముంబయి, దాని పరిసర ప్రాంతాలను ఎడతెరిపి లేని వర్షాలు వదలడం లేదు. శనివారం కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెంట్రల్ రైల్వేలో లోకల్ రైళ్లు శనివారం ఉదయం ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం రాత్రి ముంబయి నగరంలో 10.42 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. తూర్పు సబర్బన్‌లో 4.88 మి.మీ, పశ్చిమ సబర్బన్‌లో 12.29 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మహారాష్టల్రోని మిగతా ప్రాంతాల్లోనూ గత 24 గంటల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో అత్యధికంగా 186.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

చిత్రాలు.. అస్సాంలో వరద పరిస్థితిని ఏరియల్ సర్వే చేసిన అనంతరం మారెగావ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక సహాయ పునరావాస కేంద్రం వద్ద బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తదితరులు.
గౌహతికి సమీపంలోని పసహౌబారి ప్రాంతానికి పడవల్లో అత్యవసర సరకులను చేరవేస్తున్న దృశ్యం