జాతీయ వార్తలు

కేంద్రంలో అధికారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 14: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓ పెద్ద సవాల్‌గా మారి దానిని ఓడించగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న వారిని ఓడించేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సచిన్ పైలెట్ తెలిపారు. ఇప్పటికే బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ బలహీనపడిందని, అందులో కీలక భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే వైదొలిగాయని పేర్కొన్న సచిన్ పైలెట్ ‘యూపీఏ మాత్రం చాలా బలంగా ఉంది. దీని భాగస్వామ్య పక్షాలు విధేయంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల యూపీఏ భాగస్వామ్య పక్షాల నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది’ అని సోమవారంనాడు ఇక్కడ మీడియాతో సచిన్ పైలెట్ అన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న దీమాను వ్యక్తం చేసిన ఆయన దేశంలో బీజేపీని ఓడించగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉందని పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజవాది పార్టీ, బీఎస్పీలు పొత్తు కుదుర్చుకోవడం, కాంగ్రెస్‌ను ఏకాకిని చేయడంపై మాట్లాడిన ఆయన ‘ఈ కూటమిలో కాంగ్రెస్ లేనంతమాత్రాన అది బలహీనపడినట్టు కాదు’ అని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, దీనివల్ల పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహం కలిగిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒక పటిష్టమైన వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని పేర్కొన్న పైలెట్ ఇందులో భాగంగా ప్రతి లోక్‌సభ స్థానంలోనూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని, ముఖ్యంగా యువతపై దృష్టి పెడతామని సచిన్ పైలెట్ తెలిపారు.