జాతీయ వార్తలు

మా ప్రభుత్వం సుస్థిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 14: రాష్ట్రంలో తమ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి సమస్య లేదని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఉద్ఘాటించారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చాలా బలంగా ఉందని, దీనిని కుప్పకూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. ఆపరేషన్ లోటస్ పేరిట కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత కొంతకాలంగా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కుమారస్వామి స్పందించారు. అయితే, అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విషయం నిజమేనని, అయితే, తమ ఎమ్మెల్యేలెవరూ ఆ పార్టీవైపు వెళ్లే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ లోటస్ గురించి మీడియాలో వచ్చిన కథనాలను చూశాను. అంతేకాదు, కర్నాటకలో రాష్టప్రతి పాలన విధించే అవకాశం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే, ఈ రకమైన తప్పుడు కథనాలకు సూత్రధారులు ఎవరన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకమైన తప్పుడు కథనాల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేకూరుతుందో తనకు అర్థం కావడంలేదని, అంతిమంగా వీటివల్ల రాష్ట్ర ప్రజలకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ ఇప్పటికీ వదంతులు బలంగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు, వీరిలో కొంతమంది ఎవరికీ అందుబాటులో లేకపోవడం కూడా ఈ కథనాలకు బలం చేకూరుస్తోంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకుల సమక్షంలో ముంబైలోని ఒక హోటల్‌లో ఉన్నారంటూ జలవనరుల మంత్రి డీకే శివకుమార్ చేసిన ఆరోపణను ప్రస్తావించినపుడు ‘వీరంతా నన్ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు’ అని స్పష్టం చేశారు. అయితే, వారి పేర్లను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత పనులమీదే ఈ ఎమ్మెల్యేలు ముంబై వెళ్లారే తప్ప దానికి మరో కారణం లేదని, దీనికి రాజకీయాలను ఆపాదించాల్సిన అవసరం లేదని తెలిపారు. ‘నా ప్రభుత్వానికి ముప్పువాటిల్లుతున్న పరిస్థితులే ఉంటే నేను ఏవిధంగా మీ ముందు ఇంత ధీమాగా మాట్లాడగలుగుతాను’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.