జాతీయ వార్తలు

‘హోదా’ ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు సోమవారం లోక్‌సభలో ధర్నా చేశారు. టిడిపికి చెందిన పనె్నండు మంది సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ గందరగోళం సృష్టించారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ వారిచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. ఎన్‌డియే ప్రభుత్వంలో భాగం పంచుకుంటూ లోక్‌సభలో ధర్నా చేయటం అర్థరహితమని, ప్రభుత్వంపై కోపం ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు జ్యోతిరాధిత్య సింధియా తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి అన్నారు.
వైఎస్‌ఆర్‌సిపికి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, వెళగపల్లి వర ప్రసాదరావు పోడియంవద్ద నిలబడి ప్లకార్డులు పట్టుకుని నినాదాలిచ్చారు. తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, కింజారపురామమోహన్ నాయుడు, ముత్తెంశెట్టి శ్రీనివాసరావు, పందుల రవీంద్రబాబు, మాగంటి మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావు, కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, మల్యాద్రి శ్రీరాం, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్, మాగంటి వెంకటేశ్వరరావు రెండో వరుసలో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. తెలుగుదేశం సభ్యులు ఉదయం పార్లమెంటు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం వారు లోక్‌సభలోకి వచ్చి తమ నిరసన కొనసాగించారు.
గంటా నలభై ఐదు నిమిషాల పాటు రెండు పార్టీల సభ్యులు ఎడతెరిపి లేకుండా నినాదాలిచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యురాలు బుట్టా రేణుక అలసిపోయి కొద్దిసేపు తన సీట్లో కూలబడిపోయారు. సభలో నినాదాలిస్తున్న తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుసార్లు హెచ్చరించారు. పోడియం వద్ద నిలబడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొంటూ నియమ నిబంధనలను గుర్తుచేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ తెలుగుదేశం సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సుమిత్రా మహాజన్ వారి నినాదాలను పట్టించుకోకుండా మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఆ తరువాత జీరో అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం నినాదాలు మిన్నంటటంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ సమయంలో సభలోకి వచ్చిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తన సీట్లో కూర్చుండి పోయారు. కొద్దిసేపు శివప్రసాద్ తదితరులతో మాట్లాడిన అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.
చిత్రాలు.. పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న ఏపి టిడిపి, వైకాపా ఎంపీలు