జాతీయ వార్తలు

ఏపీకి ప్యాకేజీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పరిశీలిస్తోంది. ఏపీకి హోదా ఇవ్వటం సాధ్యంకాదు కనుక, దానిస్థానే ప్యాకేజీ ప్రకటించటం ద్వారా అత్యధిక ఆర్థిక సాయం అందించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో తలెత్తిన పరిణామాలను వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలు, గత రెండు రోజుల్లో సిఎం చంద్రబాబు మీడియా వద్ద వ్యక్తం చేసిన అసంతృప్తి, ఆగ్రహం తదితర అంశాలను మోదీకి వివరించారు. విభజన చట్టం హామీల అమలుపై గత శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపట్ల తెదేపాలో తీవ్ర అసంతృప్తి రగిలిన విషయాన్ని ప్రస్తావించారు. తెదేపా, వైకాపాలు పార్లమెంట్ లోపలా బయటా సోమవారం చేసిన ధర్నా అంశాన్నీ వెంకయ్య ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఏపీకి ఏదోకటి వెంటనే చేయాలన్న వెంకయ్య సూచనతో ఏకీభవించిన ప్రధాని మోదీ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించినట్టు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం గురించి ఒక నిర్ణయం తీసుకునేందుకు అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్యతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమైందా? ఏపీ సిఎం చంద్రబాబుతో చర్చలు జరిపిందా? అని మోదీ వెంకయ్యను ప్రశ్నించారు. ఇంతవరకు కమిటీ భేటీ కాలేదని వెంకయ్య వివరించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంపై నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు పంపిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉన్నాయని వెంకయ్య ప్రధానికి వివరించినట్టు తెలిసింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశంపై వెంటనే అరుణ్ జైట్లీతో సమావేశమై తదపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోదీ ఆదేశం మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వెంకయ్యనాయుడు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి పార్లమెంటు ఆవరణలోని ఆయన కార్యాలయంలోనే రెండుసార్లు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఏపీకి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనేది నిర్ణయించేందుకు తనకు మరింత సమయం కావాలని జైట్లీ సూచించటంతో సమావేశం ఎలాంటి ఆలోచనకూ రాకుండానే ముగిసింది. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టతకు వచ్చిన తరువాత, బిజెపి నేతలు చంద్రబాబుతో సమావేశమవుతారనే మాట వినిపిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన సమాధానంపట్ల సిఎం చంద్రబాబు మీడియావద్ద వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రాయాలు బిజెపి అధినాయకత్వానికి ఎంతమాత్రం నచ్చలేదని విశ్వసనీయంగా తెలిసింది. బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత విలేకరుల సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక మంత్రిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేయటం మంచిదికాదని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. తెదేపా నేతలు బాహాటంగా విమర్శలు గుప్పించకుండా బిజెపి అధినాయకులతో అంతర్గత చర్చలు జరిపితే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనేది గత ఏడాదే చంద్రబాబుకు స్పష్టం చేశాం. హోదాకు బదులు అత్యధిక ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తోన్న సమయంలో, చంద్రబాబు విమర్శలు గుప్పించటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఏపీకి వివిధ పథకాల అమలులో 90 శాతం గ్రాంటు, పది శాతం రుణం లభిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఏపీకి ఇంతకంటే ఎక్కువే ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వాదిస్తున్నారు. ఏపీకి హోదా కావాలా? లేక అంతకంటే ఎక్కువ అర్థిక ప్యాకేజీ కావాలా? అని కేంద్ర సీనియర్ మంత్రి ఒకరు ప్రశ్నించారు. ఏపీకి వీలైనంత వరకు ఎక్కువ ఆర్థిక సాయం, ఎక్కువ కాలం సాయం చేయటం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వారంటున్నారు.
పిఎంతో తెదేపా ఎంపీల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు లేదా ఎల్లుండి తెదేపా ఎంపీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి వివరించేందుకు తెదేపా ఎంపీలు ప్రధాని అప్పాయింట్‌మెంట్ అడిగారు. సోమవారం సాయంత్రమే పిఎంతో సమావేశం కావాలని ఎంపీలు అడిగారు. మోదీ మాత్రమే హోదా సమస్యను పరిష్కరించగలుగుతారని తెదేపా ఎంపీలు భావిస్తున్నారు.

చిత్రం.. ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ద్వారం వద్ద తెదేపా ఎంపీల ధర్నా