జాతీయ వార్తలు

గోరక్షణ పేరిట అరాచకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోసంరక్షణ పేరుతో దేశంలో పలుచోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అసాంఘిక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయని ఆయన అన్నారు. గోసంరక్షకుల పేరుతో చెలామణి అవుతున్న వారిలో 80శాతం మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారేనని తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నిజనిర్ధారణ నివేదికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన మైగవ్. ఇన్ వెబ్‌సైట్ రెండేళ్లు పూర్తి చేసిన సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దేశవ్యాప్తంగా ప్రజలతో మాట్లాడారు. తన ప్రభుత్వం, తన పనితీరుపై వారడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిచ్చారు. ‘‘ఆవుపై భక్తి వేరు.. ఆవు సంరక్షణ వేరు. గోసంరక్షకుల ముసుగు వేసుకుని కొంతమంది నేరాలకు పాల్పడుతుండటం నేను గమనించాను. ఈ పేరుతో అరాచకాలకు పాల్పడటంపై నాకు తీవ్రంగా కోపం వస్తోంది. గోసంరక్షణ అన్న పేరుతో ఇతరులను హింసాత్మకంగా వేధించటం సహించరానిది. వాళ్లు నిజంగా గోసంరక్షకులైతే, ఆవులు కసాయి వాళ్ల చేతుల్లో కంటే, ప్లాస్టిక్ తినడం వల్లనే అధిక సంఖ్యలో చనిపోతున్నాయన్న వాస్తవాన్ని గుర్తెరిగేవారు. ఆవులను ప్లాస్టిక్ తినకుండా ఆపేవారు.’’ అని స్పష్టం చేశారు. దేశంలో గోరక్షణ పేరుతో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని స్పందించటం ఇదే మొదటిసారి.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టౌన్‌హాల్ మీటింగ్ తరహాలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి మైగౌవ్.ఇన్ వెబ్‌సైట్ రెండేళ్ల వేడుకలను నిర్వహించారు. ప్రధానమంత్రి కార్యాలయంతో సమన్వయం చేసే విధంగా రూపొందించిన కొత్త యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పాలనే సుపరిపాలన అని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల ఫలితాలు చివరి మైలు వరకు, చివరి లబ్ధిదారుడి దాకా చేరినప్పుడే మంచి పాలనకు అర్థమని మోదీ స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైగవ్.ఇన్ నిర్వహించి వివిధ పోటీల్లో విజేతలకు మోదీ పురస్కారాలిచ్చారు. మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే,
* దేశంలో ఏ మూల ఏం జరిగినా ప్రధానినే వేలెత్తి చూపుతారు. అది సుపరిపాలన పద్ధతి కాదు. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు బాధ్యతాయుత పాలన సాగినప్పుడే సుపరిపాలన సాధ్యం.
* 8శాతం వృద్ధిరేటు స్థిరంగా 30 ఏళ్లపాటు కొనసాగితే ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
* వైద్య ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
* అందరికీ తాగడానికి స్వచ్ఛమైన నీరు లభిస్తే సగం జబ్బులు దూరమవుతాయి
* దేశానికి వేల మంది పర్యాటకులు వచ్చినట్లయితే భారత దేశ సాంస్కృతిక వారసత్వ సంపద ఆర్థిక సంపదగా రూపాంతరం చెందుతుంది.
* దేశంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినా, ప్రపంచంలో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, స్థిరంగా వృద్ధిరేటు పెరుగుతోంది.
* మనం దిగుమతులను వీలైనంతగా తగ్గించుకోవాలి. ప్రధానంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఎఫ్‌డిఐ లను అనుమతించటం ద్వారా స్వదేశంలోనే రక్షణరంగ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించవచ్చు.
* స్వచ్ఛత, పారిశుధ్యం కోసం పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో పేదల మద్దతు గణనీయంగా ఉంది.

సామాజిక మాధ్యమం సాధికార శక్తి
సామాజిక మాధ్యమం సాధికారతకు ఉపకరణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. సమాచారాన్ని ఇవ్వటం, స్వీకరించటం ద్వారా ప్రతి ఒక్కరూ సాధికారత సాధించవచ్చని ఆయన అన్నారు. ఇదొక జవాబుదారీ వ్యవస్థ అని కూడా జైట్లీ వ్యాఖ్యానించారు.

35లక్షల వినియోగదారులు
2014లో ప్రారంభించిన మైగవ్ పోర్టల్‌లో 35లక్షల 30వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 34లక్షల కామెంట్లు వచ్చాయి. 590 చర్చావేదికలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాకు 4.27లక్షల ఫాలోవర్లు ఉన్నారు.