జాతీయ వార్తలు

దేశానికి పెను సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: భారతదేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో అతిపెద్ద సవాలు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. నల్సార్ వర్శిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరైన జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 1300మంది
న్యాయమూర్తులు వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అనునిత్యం ప్రయత్నిస్తున్నారన్నారు. దేశానికి సంక్షేమం, అభివృద్ధి ఎంత సవాలో, కేసుల పరిష్కారం కూడా అంతే సవాలని అర్ధం చేసుకోవాలన్నారు. పాతికేళ్లు పైబడిన కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయని, కనీసం ఐదేళ్లు దాటిన కేసులన్నింటినీ పరిష్కరించాలనే ‘మిషన్’తో తాము పని చేస్తున్నామని, అది నెరవేరుతుందో లేదో చూడాలని సిజె వెల్లడించారు. దేశంలో న్యాయవిద్య పూర్తి చేసిన వారు పశ్చిమ దేశాలవైపు చూస్తున్నారని, మంచి అవకాశాల కోసం -ఉన్నత చదువుల కోసం పశ్చిమ దేశాలకు వెళ్తున్నారని అటువంటి సంస్థలను మనదేశంలో నిర్మించుకోలేకపోవడం పెద్ద లోటన్నారు. రానున్న రోజుల్లో న్యాయవిద్యకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలున్న ఉన్నతస్థాయి విశిష్ట సంస్థలను రూపొందించుకోవాల్సి ఉందని, అందుకోసం న్యాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒకపుడు న్యాయవిద్యకు పెద్దగా ఆదరణ లేదని, కాని నేడు అన్ని వృత్తుల్లో న్యాయవాద వృత్తి అత్యుత్తమమైనదన్నారు. న్యాయవాదులు జీవితాంతం న్యాయం కోసం పోరాటం సాగించాల్సి ఉంటుందని, అందులో విజయం సాధించినపుడు లభించిన సంతోషం దేనికీ సమానం కాదన్నారు. న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లో చేరకుండా న్యాయవాదిగా రాణించినపుడే మంచి గుర్తింపు ఉంటుందన్నారు. న్యాయవిద్యను అభ్యసించిన వారు న్యాయశాస్త్ర రంగానికే సేవలు అందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి న్యాయసేవలు అందించడంలో వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు.
తన్య చౌదరికి 17 పతకాలు
న్యాయవిద్యలో దేశవ్యాప్త ఖ్యాతి గడించిన నల్సార్ యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో 17 బంగారు పతకాలు సాధించి తన్య చౌదరి అందరి దృష్టీ ఆకర్షించింది. విద్యాంశాల్లో ప్రతిభాపాటవాలకు 16 పతకాలు వస్తే, వైస్ ఛాన్సలర్ పేరిట ఉన్న అత్యుత్తమ విద్యార్ధిని బంగారు పతకం కూడా తన్య సాధించింది. 14వ స్నాతకోత్సవంలో మొత్తం 46 బంగారు పతకాలు అందించగా, అందులో తన్యకే 17 వచ్చాయి. ఎల్‌ఎల్‌ఎంలో అపరాజిత నిగం, వరుణ్‌మాలిక్‌లు బంగారు పతకాలు సాధించగా, హర్షిత్ నియోటియా ఆరు, క్షితిజ్ గోయల్ మూడు, మేఘ కృష్ణమూర్తి మూడు, మాలికా చద్దా మూడు, ఆదిత్య విక్రం మూడు పతకాలు సాధించారు. ఊర్మిక వినయ్ త్రిపాఠి, దీపాంకర్ కృష్ణ దాస్, జైదీప్ కొడాలి, వరుణ్ బాలిగ, హయా ఆరిఫ్, పి రవీంద్రనాధ్ ప్రభాకర్‌లు ఒక్కో బంగారు పతకం సాధించారు. ఆల్‌టైమ్ రికార్డు కింద 17 పతకాలను తన్య చౌదరి పొందడంతో స్నాతకోత్సవ కాంప్లెక్స్ చప్పట్లతో మార్మోగింది. అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించినందుకు జస్టిస్ ఉమేష్ చంద్ర బెనర్జీ స్మారక బంగారు పతకం, పావని కశ్యప్ మెమోరియల్ గోల్డ్ మెడల్, కుమారి జివిఎన్‌ఆర్ భానుమతి స్మారక గోల్డ్‌మెటల్, పావని సత్యనారాయణమ్మ స్మారక గోల్డ్ మెడల్, లక్ష్మీదేవి జుంజున్‌వాలా గోల్డ్ మెడల్, రాకేష్‌కుమార్ అగర్వాల్ మెమోరియల్ గోల్డ్ మెడల్, రాయి బహుదూర్ నౌరాంగ్ రాయ్ ఖైతాన్ మెమోరియల్ గోల్డ్ మెడల్, పావని సర్వేశ్వరరావు మెమోరియల్ గోల్డ్ మెడల్, కుంజ్ బిహారి జుంజున్‌వాలా గోల్డ్ మెడల్, డాక్టర్ కెపిసి కాంధీ గోల్డ్ మెడల్, ఎకె గంగూలి గోల్డ్ మెడల్, ఇషిత్రి బెనర్జీ గోల్డ్ మెడల్, సివి సుబ్రహ్మణ్య శాస్ర్తీ గోల్డ్ మెడల్, అనంత నర్సింహారెడ్డి గోల్డ్ మెడల్, జస్టిస్ పి జగన్మోహన్‌రెడ్డి స్మారక గోల్డ్ మెడల్, హిందుస్థాన్ టైమ్స్ లిమిటెడ్ గోల్డ్ మెడల్ తన్యకు దక్కాయి. లా ఆఫ్ ఎవిడన్స్, క్రిమినల్ లా, లా ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటివ్ లా, కంపెనీ లా, కానిస్టిట్యూషనల్ లా, ల్యాబర్ లా సబ్జెక్టులతోపాటు సహ పాఠ్యాంశాల్లో ఆమె చూపిన ప్రతిభకు మొత్తం 17 బంగారు పతకాలు దక్కడం విశేషం.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు గ్రంథాలను, రెండు జర్నల్స్‌ను, స్టూడెంట్ లా రివ్యూ, నల్సార్ న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, నల్సార్ ఉప కులపతి ప్రొఫెసర్ ఫైజన్ ముస్త్ఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి, సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉపకులపతి యూనివర్శిటీ నివేదిక ఆవిష్కరించారు.

చిత్రం.. సుప్రీం చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా అందుకున్న
పతకాలను ఆనందంగా చూపుతున్న తాన్య