జాతీయ వార్తలు

భారత్ దూసుకుపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 11: అతివేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందని, 2030 నాటికి మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో సైతం ఇదే విధంగా భారత్ ఆర్థిక రంగంలో కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ దిక్సూచిగా మారుతుందన్న అభిప్రాయాన్ని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు సైతం వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. పెట్రోటెక్ 2019 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. ఇటీవలే భారత్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన చెప్పారు. 2030 నాటికి ఇది రెండో స్థానానికి చేరుకుంటుందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా అపకారం 2030 నాటికి భారత్ దేశం.. అమెరికా స్థానాన్ని పక్కకు తోసి రెండోస్థానాన్ని ఆక్రమిస్తుందని, చైనా మొదటిస్థానంలో ఉంటుందని, అమెరికాకు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పిందన్నారు. రోలర్ కోస్టర్‌లా నిత్యం మారుతున్న చమురుధరల వల్ల అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదని, వీటి ధరల స్థిరీకరణకు ప్రయత్నించాలని, ఆయిల్, గ్యాస్‌లకు పారదర్శక, స్థిర మార్కెట్ కోసం కృషి చేయాలని, అప్పుడే మన అభిలషణీయ విధానంలో వినియోగదారులకు వీటిని స్వేచ్ఛగా సరఫరా చేయవచ్చునని అన్నారు. ప్రపంచంలోనే భారత్ రిఫైనింగ్ సామర్థ్యంలో నాలుగోస్థానంలో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది 2030 నాటికి 200 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థాయికి చేరుతుందన్నారు. గత ఏడాదే దేశంలో జీవ ఇంధన విధానాన్ని ప్రవేశపెట్టామని, ద్వితీయ, తృతీయ తరం జీవ ఇంధనాలపై పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని జీవ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు. దీని నిమిత్తం విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాక, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్లలో వృథాను అరికట్టడంపై దృష్టి సారించామన్నారు. అందుకే విద్యుత్‌కు సంబంధించి వరల్డ్ బ్యాంకు ప్రకారం 2014లో 111లో ఉన్న ర్యాంకును 2018 నాటికి 29కు మెరుగుపర్చామన్నారు. ఉజలా పథకం కింద దేశమంతటా ఎల్‌ఈడీ బల్పులను పంపిణీ చేశామన్నారు. వీటిని వాడకం వల్ల 17 వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగామన్నారు. మహిళలు, పిల్లలు పొగతో పడుతున్న ఇబ్బంది నుంచి విముక్తి కలిగించడానికి, పర్యావరణ పరిరక్షణకు దేశవ్యాప్తంగా 6.4 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లను అందజేశామన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 12 వరకు జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన 95 మంది విద్యుత్ శాఖ మంత్రులు, ఏడు వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
చిత్రం..సోమవారం నోయడాలో జరిగిన పెట్రోటెక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ