జాతీయ వార్తలు

వాతావరణ విపత్తులను సమష్టిగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: వాతావరణంలో నిత్యం చోటుచేసుకుంటున్న పెనుమార్పుల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధికంగా ఉంటుందని, దీనిని సమష్టిగా ఎదుర్కోవడానికి అన్ని దేశాలు పరస్పరం సహాయం, సహకారం అందించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్‌ఐ) ఆధ్వర్యంలో ఇక్కడి హేబిటేట్ సెంటర్‌లో ప్రారంభమైన మూడు రోజుల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ఎందుకుంటున్నదంటే ఆయా దేశాల్లో ఎక్కువగా రుతు ఆధార పంటలు పండిస్తున్నారని, అలాగే చాలా వృత్తులు రుతువుల మీదే ఆధారపడి ఉన్నాయని అన్నారు. ప్రకృతి కనె్నర్ర జేస్తే రైతులతో పాటు అనేక వర్గాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారని, వారి బతుకులు ఛిద్రం అవుతున్నాయని అన్నారు.
అదనపు నీటితో
వ్యవసాయం మరింత విస్తరణ
మనం తగినంత అభివృద్ధి సాధించడానికి తగిన స్థాయిలో పంటలు కూడా పండించాల్సిన అవసరం ఉందని, దానికి మనం నీటిపారుదల వ్యవస్థను సైతం తగినవిధంగా అభివృద్ధి చేయాలని, అదనపుచుక్కతో అదనపు పంటను సాధించవచ్చునని అన్నారు. ఎక్కువగా రసాయనాల మీద ఆధారపడకుండా సేంద్రియ పంటలు పండించాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు రైతులకు సూచించారు. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీలను వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. అలాగే పట్టణీకరణ, క్లీన్ ఎనర్జీ, వేస్టు మేనేజ్‌మెంట్, అడవుల సంరక్షణ తదితర అంశాలన్నీ వాతావరణంపై ప్రభావం చూపేవేనని అన్నారు. తగిన అభివృద్ధి సాధించడం అన్ని దేశాల లక్ష్యమని, దాని నిమిత్తం నిత్యం మనకు ఎదురయ్యే వాతావరణ సమస్యలను సంయుక్తంగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. భారతీయులకు పూర్వకాలం నుంచి ఉన్న వేదతత్వం వల్ల వారు ప్రకృతితో మమేకమై ఉన్నారని ఆయన చెప్పారు. దేశం అభివృద్ధి సాధించాలంటే ప్రతి పౌరుడు తమ పరిధిలో పాటుపడాలని, దీని నిమిత్తం పొగలేని దీపావళిని జరుపుకుందామని, రసాయన రంగులతో వాతావరణం కలుషితం చేయకుండా, సహజ రంగులనే వాడి హోలీని నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 2022 నాటికి 40 శాతం శిలాజేతర ఇంధన వనరుల ద్వారా తయారు కావాలన్న లక్ష్యం వైపు దూసుకుపోతున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం అడవుల విస్తీర్ణాన్ని 21.54 నుంచి 33 శాతానికి పెంచడానికి ప్రణాళికలు వేసి ఆ దిశగా కృషి చేస్తున్నామని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టెరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథూర్, మారిషస్, నేపాల్, నార్వే సహా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.