జాతీయ వార్తలు

ఎన్డీఏకు తలొగ్గిన కాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రాఫెల్ యుద్ధ విమానాల అంశంలో ఎన్‌డీఏ సర్కారుకు తలొగ్గిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుడు నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ధ్వజమెత్తారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన కాగ్ తలాతోకా లేని నివేదికను పార్లమెంటుకు సమర్పించిందని ఆరోపించారు. ఈ నివేదిక పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై కాగ్ చెప్పింది తక్కువ, చెప్పంది ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అసంబద్ధ నివేదికను అందచేయడం ద్వారా కాగ్ దేశానికి అన్యాయం చేసిందన దుయ్యబట్టారు. ఆ నివేదిక నిరుపయోగమని వ్యాఖ్యానించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) మాత్రమే రాఫెల్ కుంభకోణం వివరాలను వెల్లడించగలుగుతుందని చిదంబరం స్పష్టం చేశారు. రక్షణ శాఖ గట్టి విజప్తి మేరకే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ధరలు వంటి వాణిజ్యపరమై అంశాలు వెళ్లడించటం లేదని కాగ్ పేర్కొనడాన్ని గమనించాలని చిదంబరం అన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను యూపీఏ నిర్ధారించిన ధర కంటే తొమ్మిది శాతం తక్కువ ధరకు కొనుగోలు చేశామన్న ఎన్డీఏ వాదన నిజం కాదనేది కాగ్ నివేదిక ద్వారా నిరూపితమైందని చిదంబరం వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 2.5 శాతం తక్కువ ధరకు మాత్రమే యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. ఎన్డీఏ సర్కారు ఒక దశలో ఇరవై శాతం తక్కువ ధరకు యుద్ధ విమానాలు కొనుగోలు చేశామంటూ చేసిన ప్రకటన కూడా తప్పుల తడక అనేది స్పష్టమైందని చిదంబరం అన్నారు. వివాదాస్పద ఒప్పందానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలకు కాగ్ నివేదికలో సమాధానాలు లేవని ఆయన దుయ్యబట్టారు. కొనుగోలు చేయాల్సిన యుద్ధ విమానాల సంఖ్యను 126 నుండి 36కు ఎందుకు తగ్గించారనే ప్రశ్నకు సమాధానం లేదని, 126కు బదులు 36 విమానాలను భారత దేశం అవసరాలకు అనుగుణంగా చేయటం మూలంగా దస్సాల్ట్ సంస్థకు కలిగిన లాభం ఏమిటి? అనే ప్రశ్నలకు కూడా కాగ్ సమాధానం చెప్పలేదన్నారు. సావరిన్ గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీతోపాటు ఎస్క్రో ఖాతా నిబంధన తొలగించడం వలన దస్సాల్ట్ సంస్థకు కలిగిన లాభం ఏమిటి? భారత దేశానికి కలిగిన నష్టం ఏమిటి అనేది కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేయలేదని చిదంబరం చెప్పారు. అవినీతి నిరోధక నిబంధనను తొలగించడం వెనక ఉన్న అదృశ్య ఉద్దేశ్యం ఏమిటి అని ఆయన నిలదీశారు. కాంట్రాక్టు సంపాదించేందుకు ఒత్తిడి తీసుకురాకూడదని, ఏజెన్సీ సహకారం తీసుకోకూడదని కాగ్ ఎందుకు స్పష్టం చేయలేదని ప్రశ్నించారు. అదే విధంగా, ఖాతా పుస్తకాలను పరిశీలించే అవకాశం, సమగ్రత ఒప్పందం లేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కాగ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. దస్సాల్ట్ మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని, ఆఖరు యుద్ధ విమానాన్ని ఎప్పుడు సరఫరా చేస్తుంది? 36 యుద్ధ విమానాల సరఫరా షెడ్యూలు ఏమిటి? అనేది కాగ్ ఎందుకు స్పష్టంగా వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. భారత దేశానికి వచ్చిన మొదటి రాఫెల్ యుద్ధ విమానం ఎప్పుడు పోరాట యుద్ధ విమానాంగా మారుతుంది? 36 విమానాల్లో ఆఖరుదానిని ఎప్పుడు సరఫరా చేస్తారు? అది ఎప్పుడు యుద్ధ విమానాంగా మారుతుందంటూ చిదంబరం ప్రశ్నల వర్షం కురిపించారు. 126కు బదులు 36 యుద్ధ విమానాలు తీసుకోవటం వలన దేశ భద్రతా అంశాలపై పడే ప్రభావం ఏమిటి? మిగతా 90 యుద్ధ విమానాలకు ఎప్పుడు ఆర్డర్ జారీ చేస్తారు? అనే ప్రశ్నలకు కాగ్ ఎందుకు సమాధానం ఇవ్వలేదన్నారు. రాఫెల్‌పై కాగ్ ఇచ్చిన నివేదిక ఎందుకూ పనికి రాదని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని 10 ఆర్టికల్ దేశ రక్షణకు సంబంధించిన అంశాల వెల్లడిని నిరోధిస్తుందే తప్ప వాణిజ్య పరమైన అంశాల వెల్లడిని అరికట్టదని చిదంబరం అభిప్రాయపడ్డారు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన వాణిజ్య వివరాలు, విమానం ధర ఎందుకు వెళ్లడించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వకపోతే తమ నిరసన తెలపవలసిన కాగ్ అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించిందని అడిగారు.
కాగ్ నివేదికలో రాఫెల్‌కు సంబంధించి ఇచ్చిన పలు వివరాలు, అంశాలు, పట్టికలు గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నివేదిక ద్వారా కాగ్ తనను తాను ఒక జోకర్‌గా మార్చేసుకుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కాగ్ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తుందని చిదంబరం హామీ ఇచ్చారు.

చిత్రం.. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం