జాతీయ వార్తలు

మాటలొద్దు.. ఇక చేతల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/బెంగళూరు, ఫిబ్రవరి 15: చిరునవ్వుతో ఉద్యోగంలోకి..అదే చిరుదరహాసంతో మృతువు ఒడిలోకి..! ఇదే దేశ సేవే పరమార్థంగా జీవితాన్ని త్యాగం చేసే సైనికుల కథ. తమ కుమారులు దేశం కోసమే మరణించారన్న ధీమా ఆయా కుటుంబాలను ఊరడిస్తున్నా..చేతుల్లో పెంచిన కొడుకు పోయాడన్న బాధ మాత్రం వారికి తీరనిదే. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌పూర్ నుంచి కర్నాటకలోని గుడిగెరె వరకు దేశవ్యాప్తంగా అనేక గ్రామాలు సైనిక దళాల్లోకి యువతను పంపుతాయి. దాదాపు దేశ సైన్యంలో ఎక్కువమంది ఈ ప్రాంతంలోని గ్రామాలకు చెందినవారే. కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన జైష్-ఏ-మహమ్మద్ ముష్కరుల దాడిలో 40 మంది జవాన్లు మరణించడం ఈ ప్రాంతంలోని గ్రామాలను ఉలిక్కిపడేలా చేసింది. మృతుల్లో తమవాళ్లు ఉన్నారేమోనన్న బెంగ ఒకపక్క పీడిస్తున్నా..దేశం కోసమే మరణించారన్న కనిపించిన ఆనందం వారిలో తొణికిసలాడింది. ‘దేశం కోసమే మా అబ్బాయి మరణించాడు. ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయితే, అతని ప్రాణాన్ని బలిగొన్న బాధ్యులను మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే’ అని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన పంకజ్ త్రిపాఠి తండ్రి ఓంప్రకాష్ త్రిపాఠి అన్నారు. పుల్వామా దాడుల నేపథ్యంలో ‘బద్‌లాలో’, ‘బద్‌లాలో’ ‘పాక్ సే బద్‌లాలో’ అన్న నినాదాలు అన్ని వీధులు, గ్రామాల్లో హోరెత్తాయి. ఈనెల 9వ తేదీనే జమ్మూ వెళ్లిన 30 ఏళ్ల విజయ్‌కుమార్ వౌర్య అంతలోనే మరణించాడన్న వార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది. అతనికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడిని కోల్పోయిన అతని తండ్రి రామాయణ్ వౌర్య మాత్రం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడూ భారత భూభాగంవైపు, భారత సైనికుల వైపు కనె్నత్తిచూసే ధైర్యం కూడా చేయనివిధంగా పాక్‌ను అత్యంత కఠినంగా బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పశ్చిమబెంగాల్‌కు చెందిన మరో కుటుంబం కూడా పాక్‌పై ప్రతీకారం కోసమే డిమాండ్ చేస్తోంది. జీవితంలో మరచిపోలేని విధంగా భారతదేశం ఉగ్రమూకలకు బుద్ధి చెప్పాలని ఆక్రోశంతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నెల రోజుల సెలవుపై తమ కుమారుడు సాంత్రా ఇంటికి వచ్చాడని, బాగా చదువుకోవాలని, చదువుకుంటే సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం వస్తుందని తన మేనల్లుడికి కూడా చెప్పి వీడ్కోలు తీసుకుని వెళ్లి తిరిగినిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి మదన్‌లాల్ అతని జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇలా ఓ ప్రాంతం, ఓ రాష్ట్రం అని లేకుండా దేశం నలుమూలల నుంచి తమ కుమారులను సైన్యంలోకి పంపిన కుటుంబాలు ఈ తాజా ఘటనపై నిప్పులు చెరుగుతున్నాయి. దేశం కోసమే ఈ అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసినప్పటికీ వారిక రారన్న బాధ మాత్రం ఈ కుటుంబాలను కలచివేస్తోంది. చిన్నప్పటినుంచి కూడా తమ కుమారుడు సైన్యంలో చేరాలన్న పట్టుదలతో ఉండేవాడని, ఈ దాడిలో మరణించిన భగీరథ్ సింగ్ గురించి గ్రామ సర్పంచ్ చాంద్ గుర్జార్ గుర్తు చేసుకున్నాడు. ఇతని మరణంతో మొత్తం గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైందని, పాక్‌పై ప్రతీకారానికి పట్టుబడుతున్నారని తెలిపారు. గత నెలలో తన కుమారుడి పుట్టినరోజుకు వచ్చిన తిలక్‌రాజ్ సోమవారమే విధుల్లోకి వెళ్లాడని, అంతలోనే అతనిని మృత్యువు కాటేయడం ఆ కుటుంబానికి తీరని వేదననే మిగిల్చింది. అలాగే రాజస్తాన్‌కు చెందిన భగీరథ్ సింగ్ కూడా రెండు రోజుల క్రితమే జమ్మూ వెళ్లాడు. అతడు కూడా ఈ ఉగ్రమూక దాడిలో అసువులు బాశాడు. ఇలా ప్రతి కుటుంబానిదీ ఓ త్యాగనిరతితో కూడి కథ.