జాతీయ వార్తలు

కమరన్ ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కశ్మీర్‌లోని పుల్వామాలో నలభై మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న కారుబాంబు ఘాతుకానికి కుట్ర పన్నిన జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమరన్‌ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. సీఆర్‌పీఎఫ్ కాన్వాయిపై జరిగిన దాడిలో ఉపయోగించిన కారుబాంబును తయారు చేసిన హిలాల్ అహమద్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వీరితోపాటు మరొక ఇస్లామిక్ ఉగ్రవాదిని కూడా భద్రతా దళాలు కాల్చి చంపాయి. జైషే మహమ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఘాజీ అలియాస్ కమరన్, హిలాల్ అహమద్, మరో ఉగ్రవాది ఏరివేతకు దక్షిణ కాశ్మీర్‌లోని పింగ్లాన్ ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఒక మేజర్ విభూతి శంకర్ దౌందియాల్, ముగ్గురు జవాన్లు హవాల్దార్ షియోరాం, హరిసింగ్, అజయ్‌కుమార్ వీరమరణం పొందారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, కొందరు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మరణించాడు. 55 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులతోపాటు సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు) దళాలు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. పుల్వామాలోని పింగ్లాన్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందటంతో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున దాడి చేశాయి. భద్రతా దళలు తమను చుట్టుముట్టడాన్ని గమనించిని ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఒక మేజర్, ముగ్గురు జవాన్లు మరణించారు. భద్రతా దళాలు భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరటంతో ఘాజీ అలియాస్ కమరన్, హిలాల్ అహమద్ మరణించారు. మరో ఇద్దరు అక్కడి నుండి తప్పించుకుని మరో ఇంట్లోకి జొరబడి ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారుతూ కాల్పులు జరుపుతుండటంతో ఎన్‌కౌంటర్ పద్దెనిమిది గంటల పాటు జరిగింది. జమ్ముకశ్మీర్‌లో సాయంత్రం త్వరగా చీకట్లు అలుముకుంటాయి కాబట్టి భద్రతా దళాలు ఈ రోజుకు ఎదురు కాల్పులు నిలిపివేసి చుట్టూ మాటువేసి ఉన్నాయి. రేపు ఉదయం తెల్లవారగానే మళ్లీ ఎదురు కాల్పులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌కు కుడిభుజం లాంటివాడైన ఘాజీ అలియాస్ కమరన్ ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ అహమద్ ధర్‌ను ఉగ్రవాద సంస్థలోకి తీసుకుపోవటంతోపాటు ఆత్మాహుతి దాడికి సిద్ధం చేశాడు. నలభై మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న దాడి సంఘటన జరిగిన ఐదో రోజే ఈ కుట్రకు సూత్రధారైన కమరన్‌ను భద్రతా దళాలు హతమార్చటం భద్రతా దళాల విజయంగా చెప్పుకోవచ్చు. జైషే మహమ్మద్ అధినేత అజర్ మసూద్‌కు ఇది శరాఘాతం లాంటిది. పాకిస్తాన్ పౌరుడైన ఘాజీ అలియాస్ కమరన్ కశ్మీర్‌లో తిష్టవేసి స్థానిక యువకులను తీవ్రవాదులుగా మార్చటంలో కీలకపాత్ర నిర్వహిస్తున్నాడు. యువకులను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు దొంగచాటుగా పంపించటం, అక్కడ వారికి ఉగ్రవాదంలో శిక్షణ ఇప్పించిన తరువాత తిరిగి కశ్మీర్‌కు తెచ్చి భద్రతా దళాలపై దాడులు చేయించటంలో కీలకపాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
చిత్రం..దక్షిణ కశ్మీర్‌లోని పింగ్లాన్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో దగ్ధమవుతున్న ఓ ఇల్లు