జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని అందరూ గర్హించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: న్యూజిలాండ్‌లో ఉగ్రవాది ఒకరు దాడి జరిపి 49 మందిని చంపిన సంఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉగ్రవాద చర్యను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని, ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఇలాంటి వాటిని అందరూ గర్హించాలని అన్నారు. ఈ మేరకు ఆయన న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెరన్‌కు ఒక లేఖ రాస్తూ ఇలాంటి విపత్తు సమయంలో ఆ దేశ ప్రజలకు భారత్ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాల్లో పాశవికంగా దాడులు చేసి ఇంతమంది అమాయకులను పొట్టనపెట్టుకోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎలాంటి చర్యనైనా భారత్ గర్హిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యయుతమైన సమాజంలో హింసకు, ద్వేషానికి తావు లేదని అన్నారు. ఈ ఘోర సంఘటనలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న న్యూజిలాండ్ వాసులకు ఆయన సంఘీభావాన్ని తెలిపారు.
ఉగ్రవాదమే ఇస్లాంకు ప్రధాన శత్రువు
ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఉగ్రవాదం అన్నది పెద్ద ఆటంకంగా మారిందని, ఇస్లాం, మానవత్వానికి ఇది పెద్ద శత్రువని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఇరానియన్ పార్లమెంట్ కమిటీ సభ్యులతో సాంస్కృతిక అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంతో ఏ ఒక్క దేశానికో వర్గానికే, ప్రాంతానికో ఆపద కాదని, ఇది ప్రపంచంలోని మానవత్వ విలువలకే అతిపెద్ద సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇస్లాం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, సంస్థలు దానిని ఒక రక్షణ ముసుగుగా వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వాస్తవానికి ఇలాంటి వారే ఇస్లాంకు శత్రువులని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా పరిణమించిందని, దీనిపై పోరాటానికి మానవజాతి అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. భయంకర నరమేధం వాషింగ్టన్: న్యూజిలాండ్ లోని రెండు మసీదులపై ఉగ్రవాది జరిపిన దాడిని భయంకర నరమేధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రజలకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని, దీని నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ విపత్కర కాలంలో న్యూజిలాండ్‌కు తాము అండగా ఉంటామని, వారికి కావాల్సిన ఏవిధమైన సహాయ సహకారాన్ని అయినా అందజేస్తామని ఆయన చెప్పారు. అలాగే అమెరికా సెక్రటరీ మైక్ పాంపియో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తమ మిత్రదేశమైన న్యూజిలాండ్ ప్రజలకు వచ్చిన ఈ కష్టానికి అమెరికన్ పౌరులందరూ తీవ్ర కలత చెందారని ఆయన చెప్పారు.