జాతీయ వార్తలు

మహిళలే దేశ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వ్యవస్థలో మార్పులొస్తే చాలదని, మహిళలు సాంకేతికంగా సాధికారికత సాధించాలని, ప్రజా ప్రతినిధులుగా సమర్థవంతులుగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. ప్రతిరంగంలో మహిళలు శక్తివంతులుగా ఎదగడం దేశానికి గర్వకారణమన్నారు. అయితే తొలి రోజన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ప్రధానంగా ప్రస్తావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆయన ఎలాంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు రెండోరోజు ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళలు సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారని, వారికి మంచి అవకాశాలు కల్పిస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరుస్తారని కితాబునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వలో మహిళలు స్పీకర్‌గా, మంత్రులుగా రాణిస్తున్నారంటూ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఎటువంటి ప్రతిభ కనబరుస్తున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఉపయోగిస్తున్నారన్న ప్రధాని మహిళా ప్రతినిధుల కొరకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తామన్నారు. దేశ పౌరులను తీర్చిదిద్దడంలో ఒక తల్లిగా, సోదరిగా, భార్యగా మహిళల జీవితంలో భూమిక ఉందన్నారు. మహిళా ప్రతినిధులు వారానికి రెండు రోజులు తమ నియోజకవర్గంలో పర్యటించాలని, తమ తమ నియోజకవర్గాల్లో తమకంటూ సొంత ఇమేజీని తయారు చేసుకోవాలని ప్రధాని అంటూ, ఒకసారి అలాంటి ఇమేజీ ఏర్పడితే అది శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. చట్టాలను రూపొందించడంలో మహిళలు సమర్థవంతమైన పాత్ర పోషించాలని మోదీ అంటూ, మహిళలు మగవారికన్నా మెరుగ్గా సవాళ్లను, సమస్యలను ఊహించగలరని, అందువల్ల చట్టాలను చేసేటప్పుడు వారు అవసరమైన మార్పులను సూచించాలన్నారు. మహిళలకు సాధికారికత కల్పించడానికి మగవాళ్లెవరని ప్రధాని ప్రశ్నిస్తూ, సవాళ్లు ఎదురయినప్పుడే మనలోని శక్తి ఏమిటో తెలుస్తుందన్నారు. మగవారికన్నా ఆడవారిలోనే అంతర్గతంగా ఎక్కువ శక్తి ఉంటుందని, కుటుంబ జీవనంలో, సామాజిక జీవనంలో సవాళ్లు ఎదురయినప్పుడు అది ప్రతిఫలిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ రాష్టప్రతి ప్రతిభా పాటిల్ మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న కండబలం, ధనబలానికి వ్యతిరేకంగా చట్టసభల్లో మహిళలు పోరాడాలన్నారు. మహిళా ప్రాతినిధ్యం గురించి మాట్లాడేటప్పుడు మగవారి మైడ్‌సెట్‌లో మార్పు రావాలనే మాట వినిపిస్తూ ఉంటుంది. అది జరగడానికి చాలా కాలం పడుతుంది. అయితే చిన్నప్పటినుంచి కూడా మన పిల్లలకు పురుషులు, స్ర్తిలు సమానమనే విషయాన్ని తెలియజేయాలని ప్రతిభా పాటిల్ అన్నారు. సదస్సులో మగవారు మహిళా సాధికారికత గురించి మాట్లాడడం, మహిళలు దేశ సాధికారికతలో తమ పాత్ర గురించి మాట్లాడడం పట్ల సదస్సును ఏర్పాటు చేసిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఆసియా స్థాయిలో ఇలాంటి సదస్సును ఏర్పాటు చేయాలనే సూచన సమావేశంలో వచ్చింది. మహిళా ప్రతినిధుల రెండు రోజుల జాతీయ సదస్సు ఆదివారం పార్లమెంటు సెంట్రల్ హాలులో ముగిసింది. ఈ సదస్సుకు సమన్వయకర్తలుగా తెలుగురాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు కె కవిత, కొత్తపల్లి గీత వ్యవహరించారు. ఈ జాతీయ సదస్సుకు తీర్మానాన్ని ఎంపీ కొత్తపల్లి గీత ప్రతిపదించారు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమానికి మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

చిత్రం... జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో మహిళలతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ