జాతీయ వార్తలు

రెహానా ఇంటిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 20: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని, ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. రెహానా ఫాతిమా శుక్రవారం పోలీసు రక్షణ మధ్య అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లడానికి విఫలయత్నం చేశారు. రెహానా ఫాతిమా శబరిమలలో కొండలు ఎక్కుతుంటే, కొందరు ఆందోళనకారులు కొచ్చిలోని పనంబిల్లి నగర్‌లో గల ఫాతిమా ఇంటికి చేరుకున్నారని పోలీసులు వివరించారు. ఆందోళనకారులు ఫాతిమా ఇంటిపై దాడి చేసి, ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారని వారు తెలిపారు. పంబా నుంచి బయల్దేరి అయిదు కిలో మీటర్ల దూరంలో కొండపై ఉన్న ఆలయ సముదాయం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన తిరువనంతపురం జిల్లా కజకొట్టంకు చెందిన మరో 46 ఏళ్ల మహిళ ఇళ్లపైనా ఆందోళనకారులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. కొండ ఎక్కడానికి ఆ మహిళ ప్రయత్నించిన తరువాత కొద్ది సేపటికే ఆందోళనకారులు తుంబ, మురుక్కుంపుజలోని ఆమె ఇళ్లపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. అయితే, భక్తుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఆ మహిళ శబరిమల ఆలయంలోకి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇదిలా ఉండగా, రెహానా ఫాతిమా హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు కవితతో కలిసి శుక్రవారం భారీ పోలీసు రక్షణ మధ్య శబరిమల ఆలయానికి వెళ్లడానికి ప్రయత్నించారు. వీరిద్దరు అయ్యప్ప ఆలయం ఉన్న కొండపైకి చేరుకున్నప్పటికీ అయ్యప్ప భక్తులు వ్యతిరేకించడంతో ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనుదిరిగారు.