జాతీయ వార్తలు

అధిక వృద్ధితోనే పేదరిక నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో పేదరిక నిర్మూలనకు అధిక వృద్ధి రేటు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి ఫలాలు పేదలకు అందడం తప్పనిసరని ఆయన అన్నారు.
గురువారం ఇక్కడ ఆయన 25వ ప్రపంచ సేవింగ్స్, రిటెయిల్ బ్యాంక్స్ సదస్సులో మాట్లాడుతూ ఆశావహ సమాజం వృద్ధి ఫలాల ద్వారా పేదల జీవన ప్రమాణాల పెరుగుదల కోసం నిరవధికంగా వేచిచూడజాలదని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు అధిక వృద్ధి రేటు అవసరం. గరిష్ఠ సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు రావడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వృద్ధిని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. అయితే, అభివృద్ధి, పురోగతి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుతోందని, అనేక మందికి వాటి ఫలాలు అందడం లేదనే ప్రమాదకరమయిన వాస్తవం పట్ల మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని జైట్లీ అన్నారు. అందువల్ల ‘వృద్ధి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే, అది నెమ్మదయిన ప్రక్రియగా ఉంటుంది. ఆకాంక్షలతో కూడిన సమాజం నిరవధికంగా వేచిచూడజాలదు’ అని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఆర్థిక సంఘటితత్వం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల సేవలు పొందని ప్రజలకు ఆ సేవలను అందుబాటులోకి తేవడం, అభద్రతలో ఉన్న ప్రజలకు భద్రత కల్పించడం, నిధులు లేని వారికి నిధులు అందుబాటులోకి తేవడం, సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు సేవలు కల్పించడం అనేది ప్రధాన లక్ష్యమని జైట్లీ అన్నారు.
బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కొన్ని నెలల్లోనే 330 మిలియన్ ఖాతాలు తెరిచాయని ఆయన వివరించారు. తొలుత వాటిని జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా తెరిచినప్పటికీ, తరువాత ప్రజలు క్రమంగా వాటిలో నగదు జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఖాతాల నిర్వహణను ప్రోత్సహించడానికి ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.