జాతీయ వార్తలు

అఖిలపక్షం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 15: శబరిమల ఆలయ వివాదం పరిష్కారానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. అన్ని వయసుల మహిళలకు ఆలయ దర్శనం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పు అమలుకు కేరళ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పలుపార్టీల నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో జనవరి 22 వరకు సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయరాదని, సుప్రీంలో దాఖలైన రివ్యూ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు గతంలో మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కొనసాగించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని, అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించే విషయంలో మరో ఆలోచనకే తావు లేదని పేర్కొన్నారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), బీజేపీలు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఆలయం ఈనెల 17న తెరుస్తారని, రెండు నెలల పాటు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారని ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అమలు చేయకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరాయి. దీనికి సీఎం తిరస్కరించడంతో అఖిలపక్ష సమావేశం నుంచి ఆ పార్టీలు వాకౌట్ చేశాయి.
అఖిలపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఆయన అన్నారు. ఒకవేళ కోర్టు రేపు మరో నిర్ణయం ఏదైనా ప్రకటిస్తే దానిని సైతం తాము అమలు చేస్తామని చెప్పారు. ఏదిఏమైనా ప్రభుత్వం భక్తుల వెంటనే ఉంటుందని, అందరు భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తాము కోర్టు తీర్పును శిరసావహిస్తున్నామని, దీనిని భక్తులు అర్థం చేసుకోవాలని అన్నారు. కేరళ అసెంబ్లీ విపక్ష నేత రమేష్ చెన్నితల మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం భక్తుల విశ్వాసాలకు సవాల్ అని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పిఎస్ శ్రీ్ధరన్ పిళ్లై మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంతో సమయం వృథా అని వ్యాఖ్యానించారు.
భక్తుల మనోభావాలను గౌరవించాలి: ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్
ఫుజారియా సిటీ (యూఏఈ), నవంబర్ 15: శబరిమల వివాదంలో సంప్రదాయాలు, భక్తుల మనోభావాలను తప్పక గౌరవించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ అభిప్రాయపడ్డారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకిస్తూ ఇక్కడ లింగ సమానత్వం హక్కు వర్తించదని అన్నారు. మతం, భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయాలపై అమలులో ఉన్న ఆచారాలను మార్చాలనుకునేటప్పుడు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న అనేక అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదని, ఒక్క శబరిమల అయ్యప్ప ఆలయంలో మాత్రమే వారి ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయని, ఎందుకంటే అది అక్కడ సంప్రదాయం అని, భక్తుల మనోభావాలు కూడా దీనిలో ముడిపడి ఉన్నాయని, అందుచేత మనం వాటిని గౌరవించాల్సిందేనని రవిశంకర్ అన్నారు.