జాతీయ వార్తలు

పౌర చట్టాన్ని రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 11: దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అలజడి రేపుతున్న పౌరసత్వ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే, ‘్ఢల్లీ రండి. అప్పుడు వీటిపై మాట్లాడదాం’ అని ఆమెకు మోదీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. శనివారం రాజ్‌భవన్‌లో మోదీతో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ మూడింటినీ కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని ప్రధానికి స్పష్టంగా తెలియజేశానని, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లానని మమత తెలిపారు. ప్రధానిని తాను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని పేర్కొన్న ఆమె రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయం గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశానని అన్నారు. కేంద్రం నుంచి తమకు 7 వేల కోట్ల రూపాయల తుపాను సహాయం సహా మొత్తం 28వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్న విషయాన్ని తెలియజేశానని అన్నారు. దేశ పౌరులకు సంబంధించి ఎలాంటి వివక్ష ఉండకూడదని మోదీకి తెలియజేయడంతోపాటు పౌరసత్వ చట్టంపై పునరాలోచించాలని కూడా ఆయనను కోరానని అన్నారు. ఈ డిమాండ్లకు మోదీ నుంచి వచ్చిన స్పందన ఏమిటన్న ప్రశ్నకు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల విషయంలో సంబంధిత పత్రాలను పరిశీలించాల్సి ఉందని ప్రధాని తెలియజేశారని మమత తెలిపారు. అలాగే, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు సంబంధించి ప్రస్తావించినపుడు ‘నేను ఓ ప్రభుత్వ కార్యక్రమం మీద ఇక్కడకు వచ్చాను. అవకాశం ఉంటే ఢిల్లీలో వీటిపై మాట్లాడతాను’ అని మోదీ తెలియజేశారని అన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మోదీ, మమత భేటీకి రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. మోదీతో సమావేశం ముగిసిన వెంటనే కొద్దిసేపు మీడియా మాట్లాడి మమతా బెనర్జీ టీఎంసీ విద్యార్థి సంఘం చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వెళ్లిపోయారు. రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేది లేదని ఆ ధర్నాలో ఆమె తెగేసి చెప్పారు. పౌరసత్వ చట్టానికి సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన గెజిట్ కేవలం కాగితాలకే పరిమితం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్‌లోనే కాదు దేశంలో ఎక్కడ కూడా అమలు కాదని మమత ఉద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఏది తోస్తే అది చేయడానికి వీల్లేదని మమత బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. దేశంలో ఇప్పటివరకు పరిస్థితుల తీవ్రతను గుర్తించని వ్యక్తులు వెంటనే మేలుకోవాలని పిలుపునిచ్చారు. మోదీతో మమతా బెనర్జీ సమావేశంపై కాంగ్రెస్, సీపీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ ద్వంద్వవైఖరి ఈ సమావేశంతో బహిర్గతమైందని పేర్కొన్నాయి. బీజేపీని ఎదిరించాలన్న ఉద్దేశం మమతా బెనర్జీకి ఏమాత్రం లేదని, పరోక్షంగా రాష్ట్రంలో ఆ పార్టీకి సహకరిస్తున్నారని సీపీఎం పేర్కొంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సొమెన్ మిత్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకు ద్రోహం చేస్తున్నందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను అధికార టీఎంసీ తిరస్కరించింది. బీజేపీతో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, మోదీతో మమతా బెనర్జీ సమావేశం కావడం అన్నది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన భేటీ అని వివరించింది.

'చిత్రం... పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ