జాతీయ వార్తలు

అపూర్వం.. అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ఆధునిక భారతం భిన్న రూపాల్లో పురివిప్పింది. సైనిక పాటవం, చారిత్రక వైభవం, సాంస్కృతిక వైవిధ్యం, వ్యూహాత్మక ఆయుధ సంపత్తి 71వ గణతంత్ర శోభను మరింతగా ఇనుమడించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జాయెద్ బోల్సోనారో ముఖ్య అతిధిగా హాజరైన రిపబ్లిక్ డే ఉత్సవాలు ఆదివారం రాజ్‌పథ్‌లో కనువిందు చేశాయి. జాతీయ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ అమరయోధులకు నివాళి అర్పించిన క్షణం నుంచి మొదలైన ఈ వేడుకలు అనన్య సామాన్యంగా అద్భుతరీతిలో కొనసాగాయి. వేలాదిగా హాజరైన ప్రజల సమక్షంలో సామాజిక, ఆర్థిక ప్రగతి కూడా ఈ ఉత్సవాల్లో కళ్లకు కట్టింది. ఈ ఏడాది ఈ వేడుకలు అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. వార్ మెమోరియల్‌లో మోదీ శ్రద్ధాంజలి ఘటించడం తొలిసారి అయితే, చినూక్, అపాచీ హెలికాప్టర్ల విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారి. అలాగే, ఏ-శాట్ ఆయుధ వ్యవస్థ ప్రదర్శన కూడా మొదటిసారిగా గణతంత్ర వేడుకల్లో జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. గణతంత్ర వేడుకల ప్రారంభానికి సంకేతంగా రాజ్‌పథ్‌లో 21 తుపాకుల శాల్యూట్‌తో జాతీయ పతాకావిష్కరణ జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా అనేకమంది ఈ కవాతును తిలకించారు. తమ తమ అభివృద్ధి, సంస్కృతిని ప్రతిబింబిస్తూ 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖలు కనువిందైన రీతిలో 22 శకటాలను ప్రదర్శించాయి. గోవా రాష్ట్రం ప్రదర్శించిన శకటం జీవవైవిధ్య పరిరక్షణ ఇతివృత్తంగా సాగింది. వైమానిక దళం తన శకటాల్లో రాఫెల్ యుద్ధ విమానం, తేజాస్ యుద్ధ విమానం, తేలికపాటి హెలికాప్టర్లు ఆకాశ్ క్షిపణి వ్యవస్థ నమూనాలను ప్రదర్శించింది. అలాగే, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్‌తో రూపొందించిన శకటం కూడా ప్రతిఒక్కర్నీ ఆకట్టుకుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, రక్షణ చర్యలను చేపట్టేందుకు తాము అనుసరించే ఆధునిక టెక్నాలజీని జాతీయ విపత్తుల నిరోధక విభాగం తన శకటంలో అద్భుతంగా కళ్లకు కట్టింది. కెప్టెన్ భరద్వాజ్ సారథ్యంలో ధనుష్ ఆయుధ వ్యవస్థ కూడా ఈ ఉత్సవాల్లో దర్శనమిచ్చింది. 36 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే శక్తి ఈ ఆయుధ వ్యవస్థకు ఉంది. అపాచీ, చినూక్ హెలికాప్టర్లు గగనతల విన్యాసంతో కనువిందు చేశాయి. 90 నిమిషాలపాటు సాగిన భారతీయ గణతంత్ర మహోత్సవం అత్యంత కనువిందుగా అబ్బురపరచే రీతిలో సాగింది. త్రివిధ దళాలు, పారా మిలటరీ, ఇతర సైనిక విభాగాలు సాగించిన కవాతు సైనిక బ్యాండ్ల నేపథ్యంలో ఓ అద్భుతానే్న కళ్లకు కట్టింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు పొందిన 49 మంది బాలబాలికలు జీపుల్లో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. అలాగే, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు యోగా అవసరాన్ని ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఈ ఏడాది కవాతులో మహిళా శక్తి కూడా తన సత్తా చాటుకుంది. సీఆర్‌పీఎఫ్ మహిళా విభాగానికి చెందిన దళాలు సాగించిన మోటార్ బైక్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. వీటిని చూసిన ఓ యువతి ‘నేను సీఆర్‌పీఎఫ్‌లో చేరతాను’ అని ప్రకటించడం గమనార్హం. ఈ విన్యాసాలు చూసిన ప్రతిఒక్కరూ ఆ మహిళల సాహసకృత్యానికి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. దాదాపు 40 విమానాలు తమ విన్యాసాలతో గణతంత్ర శోభను మరింత ఇనుమడించాయి.

'చిత్రం... ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతును తిలకిస్తున్నరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, ముఖ్య అతిథిగా హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడు జాయెద్ బాల్సోనారో