జాతీయ వార్తలు

కేంద్రంతో కలిసి పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ‘ఈ విజయం నాది కాదు.. మీదే. మీరంతా నా కుటుంబం. మీ బిడ్డగా మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాను’ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం రామ్‌లీలా మైదానంలో మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 20 నిమిషాలపాటు బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్ ఢిల్లీలో సజావుగా పాలన సాగించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దేశ రాజధానిలో పాలన సజావుగా సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు. అలాగే ఢిల్లీని నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తనను తాను ఢిల్లీ బిడ్డగా, ప్రజలందరి ముద్దుబిడ్డగా కేజ్రీవాల్ ఈ సందర్భంగా అభివర్ణించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేసినా ఢిల్లీ ప్రజలందరి కోసం తాను సీఎంగా కృషి చేస్తానని అన్నారు. దేశ రాజధానిలోని రెండు కోట్ల మంది ప్రజలు తన కుటుంబమేనని తెలిపారు. అలాగే, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల సహకారాన్ని కూడా కోరిన కేజ్రీవాల్ ‘ఎన్నికల సమయంలో నాపై ఈ పార్టీలు చేసిన విమర్శలకు సంబంధించి వాటిని క్షమించాను’ అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అత్యంత తీవ్రంగా చేపట్టిన బీజేపీ కేజ్రీవాల్‌పై అదే స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఒకదశలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పార్లమెంటు సభ్యుడు ప్రవీష్ వర్మల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధాన్ని విధించాల్సి వచ్చింది. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించినప్పటికీ వారణాసి కార్యక్రమాల కారణంగా రాలేకపోయారు. దాదాపు 20 నిమిషాలపాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్ ‘్ఢల్లీకి పరిమితం చేసే విధంగానే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రూపొందించాం. అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలను ఆహ్వానించలేదు’ అని తెలిపారు. తన పాలనలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేదని, అందరి అభివృద్ధి కోసం తాను కృషి చేశానని కేజ్రీవాల్ తెలిపారు. గత ఐదేళ్లుగా ఢిల్లీని అత్యంత వేగవంతమైన నగరంగా తీర్చిదిద్దామని, రానున్న ఐదేళ్లలో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం కల్పించిన ఉచిత సౌకర్యాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆరోగ్యం, విద్య వంటి వౌలిక అవసరాల విషయంలోనూ
ప్రజలపై చార్జీలు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ‘కేజ్రీవాల్ ప్రతీది ఉచితంగా ఇచ్చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఈ సృష్టిలో ప్రతి విలువైన వస్తువు ఉచితంగా లభించేదే. తల్లి ప్రేమ, తండ్రి ఆశీస్సులు. కేజ్రీవాల్ ప్రజలను ప్రేమిస్తాడు. ఉచితంగానే ఆ ప్రేమను పంచుతాడు’ అని అన్నారు. దేశ రాజకీయాల్లో ఓ పరివర్తనకు నాంది పలుకుతూ ఢిల్లీ ప్రజలు తీర్పునిచ్చారని కేజ్రీవాల్ అన్నారు. ఈ కొత్త శకం రాజకీయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో ఢిల్లీ అభివృద్ధికి వివిధ రకాలుగా కృషి చేసిన 50 మంది ప్రత్యేక అతిధులుగా రామ్‌లీలా మైదాన్ వేదికను అలంకరించారు. ఇదిలావుండగా కేజ్రీవాల్ కేబినెట్‌లో మంత్రులుగా సిసోడియా, సత్యేంద్ర జైన్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర పాల్, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 70 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 62 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి.
*చిత్రాలు.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరైన అశేష జనం
* ప్రజలనుద్దేశించి ప్రసంగంచిన కేజ్రీవాల్