జాతీయ వార్తలు

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: ‘భారత్ ప్రేమికులం..భారత్ విధేయులం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ సదస్సులో లక్షలాది మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని తెలిపారు. అలాగే రక్షణ బంధాన్ని కూడా విస్తరించుకుంటాయని, అద్భుతమైన రీతిలో వాణిజ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. తన భార్య మిలానియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే గొప్ప సంప్రదాయం భారతదేశానిదని ఉద్ఘాటించారు. న్యాయ పాలన, సమత, సామరస్యాలకు భారత్ ఓ అద్భుమైన వేదిక అన్నారు. భిన్న మతాలకు చెందిన వ్యక్తులు సామరస్యపూర్వకంగా ప్రార్థనలు చేసుకునే అరుదైన సంప్రదాయం ఈ దేశానికి ఉందని తెలిపారు. భారతదేశానికి విధేయమైన స్నేహ దేశంగా అమెరికా ఉంటుందని పేర్కొన్న ట్రంప్ నరేంద్ర మోదీని దేశం కోసం రాత్రింబవళ్లు పనిచేసే అసాధారణమైన నాయకుడిగా అభివర్ణించారు. ఉగ్రవాదులను, వారి సిద్ధాంతాలను కలసికట్టుగా ఇరు దేశాలు దునుమాడతాయని ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాద గ్రూపుల అంతు చూసేందుకే తమ ప్రభుత్వం పాకిస్తాన్‌తో కలిసి కూడా పనిచేస్తోందని అన్నారు. తనకు లభించిన అద్భుతమైన
స్వాగతానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు మూడు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను రెండు దేశాలు మంగళవారంనాడు కుదుర్చుకోబోతున్నాయని, ఆ విధంగా భారత్‌కు తాము అత్యంత ప్రధానమైన రక్షణ భాగస్వామ్య దేశంగా మారబోతున్నామని అన్నారు. భారత్-అమెరికా మధ్య సహజసిద్ధమైన, నిరంతరమైన స్నేహబంధం ఉందని ప్రజల హర్షధ్వానాల మధ్య ట్రంప్ ప్రకటించారు. రక్షణ ఒప్పందాలపై రెండు దేశాలు గట్టిగా కృషి చేస్తున్నాయని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ఓ పట్టాన రాజీ పడని వ్యక్తిగా అభివర్ణించారు. మోదీని ప్రశంసలతో ముంచెత్తిన ఆయన ‘కష్టపడే మనస్తత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా ఉన్నత పదవులను భారత్‌లో అధిరోహించగలరని చెప్పడానికి మోదీయే నిదర్శనం’ అంటూ ఆయన టీలు అమ్ముకునే స్థాయి నుంచి మోదీ ఎదిగిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రాణిస్తోందని పేర్కొన్న ట్రంప్ మొత్తం మానవాళికే ఓ ఆశాజనం కానున్నదని, అదేవిధంగా ఆర్థికంగా కూడా తిరుగులేని దేశంగా అవతరించబోతోందని అన్నారు. ‘తన శక్తి సామర్థ్యాలను, పలుకుబడిని ఉపయోగించుకుని ఒక దేశం ఎదగడం వేరు, ప్రజలకు పూర్తి స్వేచ్ఛను అందిస్తూ అన్నివిధాలుగా నిరుపమానంగా మారడం వేరు, అదే భారతదేశం’ అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని, అదేవిధంగా రానున్న పదేళ్ల కాలంలో భారతదేశం పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి అతి పెద్ద మధ్యతరగతివాసుల దేశంగా మారబోతోందని అన్నారు.

*చిత్రం...మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్