జాతీయ వార్తలు

జడ్జి ఆకస్మిక బదిలీపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ బదిలీ వ్యవహారం దుమారం సృష్టించింది. గురువారం అర్థరాత్రి అకస్మాత్తుగా ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఆయన బదిలీని అధికార బీజేపీ సమర్ధించింది. న్యాయమూర్తి బదిలీ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, ‘సాధారణ’ బదిలీగానే చూడాలని బీజేపీ నేతలు చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణల వెనక బలమైన కారణమే ఉంది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు సందర్భంగా ఆందోళనకారులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులకు న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అకస్మాత్తుగా రాత్రికి రాత్రి జడ్జిని బదిలీ చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖ స్పందించింది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని స్పష్టం చేసింది. ఇలా ఉండగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధర్‌తోపాటు ఇద్దరు జడ్జిలను బదిలీ చేస్తూ వేర్వేరుగా మూడు ఉత్తర్వులు వెలువడ్డాయి. మురళీధర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికాగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వసంతరావుమోరే, రవి విజయ్ కుమార్ మలిమథ్ కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి. ఈ ముగ్గుర్నీ వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. మురళీధర్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ముగ్గురు జడ్జిల బదిలీకి ఆమోదం తెలిపారు. జస్టిస్ మురళీధర్ బదిలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ హైకోర్టులో అత్యంత సీనియ ర్ న్యాయమూర్తుల్లో ఆయనొకరు. సీఏఏ ఉద్యమాలకు సంబంధించిన కేసు విచారణ జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేసు విచారించిన బెంచ్ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలోపెట్టుకునే అకస్మాత్తుగా జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే మురళీధర్‌ను బదిలీ చేశారని వెల్లడించారు. కాంగ్రెస్ న్యాయమూర్తి బదిలీ వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మురళీధర్‌ది సాధారణ బదిలీయేనని మంత్రి చెప్పారు. న్యాయమూర్తి బదిలీ ఓ ప్రక్రియగా మంత్రి తెలిపారు. అలాగే బీజేపీ సీనియర్ నేత, మంత్రి ప్రకాష్ జవడేకర్ జస్టిస్ మురళీధర్ బదిలీ నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు. కొలీజియం సిఫార్సులను అనుసరించే బదిలీ ప్రక్రియ సాగిందని ఆయన వెల్లడించారు. ఈనెల 12న కొలీజియం సిఫార్సు చేసిందని జవడేకర్ అన్నారు. ఢిల్లీ అల్లర్లకు బీజేపీ నేతలు కారణమని కోర్టు తప్పుపట్టినందునే కక్షసాధింపుగా జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ‘దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్టిస్ మురళీధర్ బదిలీ మినహాయింపుకాదు. అయితే సిగ్గుచేట్టు’అని ప్రియాం క ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్రంపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘జస్టిస్ మురళీధర్ ఆకస్మిత బదిలీ న్యాయమూర్తి లోయా ఉదంతాన్ని గుర్తుచేస్తోంది’ అని అన్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి హెచ్ బీ లోయా సోహ్రాబుద్దీన్ బూటకపుఎన్‌కౌంటర్ కేసును విచారించారు. 2014 డిసెంబర్ 1న జస్టిస్ లోయా అనుమానాస్పద స్థితిలోమృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడా అంశాన్ని రాహుల్ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఓ ప్రకటన చేస్తూ బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి ప్రతికారం తీర్చుకుంటోందని ధ్వజమెత్తారు.