రాష్ట్రీయం

కన్నడ గద్దెపై యెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపాటు ** సుప్రీంకోర్టు సీజేను ఆశ్రయించిన వైనం
* ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ వినతి
బెంగళూరు, మే 16: కన్నడ రాజకీయాలపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బిఎస్ యెడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ వాలా రాజ్‌భవన్ నుంచి బీజేపికి ఆహ్వానం పంపారు. అసెంబ్లీలో బల నిరూపణకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. దీంతో గత 24 గంటలుగా కన్నడ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు గవర్నర్ తెరదించారు. గవర్నర్ నుంచి లేఖ రావడంతో కర్నాటకవ్యాప్తంగా బీజేపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. గవర్నర్ పంపిన ఆహ్వానం లేఖ వివరాలను బీజేపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. 75 ఏళ్ల బిఎస్ యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రధాని నరేద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హాజరు కాకపోవచ్చని సమాచారం. త్రిశంకు సభ ఏర్పడి, ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకున్న ఏకైక పెద్ద పార్టీని పిలవాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలతో పాటు రాజ్యాంగ నిపుణుల
సలహాలను గవర్నర్ పరిగణనలోకి తీసుకుని ముందుగా బిఎస్ యెడ్యూరప్పకే అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
కాగా కర్నాటకలో గవర్నర్, బీజేపి కలిసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, గురువారం బిఎస్ యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని, ఎంత రాత్రి అయినా తమ వినతిని విని విచారించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభ్యర్థించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ అంశంపై పిటీషన్‌ను తయారు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వారు వినతిపత్రంలో కోరారు. రాష్టప్రతి రాంనాథ్ కోవింద్‌నూ కలిసి కర్నాటకలో బిఎస్ యెడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండా నిలువరించాలని కాంగ్రెస్ కోరనుంది.
అంతకు ముందు ఉదయం రాజ్‌భవన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం బిఎస్ యెడ్యూరప్ప ఎంపీ అనంత్‌కుమార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని, గవర్నర్ బీజేపిని ఆహ్వానిస్తారనే నమ్మకం ఉందని, తాను బీజేపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సమాచారం లేఖ ఇచ్చానని తెలిపారు.
అంతకు ముందు బీజేపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిఎస్ యెడ్యూరప్పను శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సమావేశానికి కేంద్ర మంత్రి జావడేకర్ హాజరయ్యారు. బీజేపికి అసెంబ్లీలో 104మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 38 సీట్లు, బిఎస్పీకి రెండు సీట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధి ఒకరు నెగ్గారు. బిజెపి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చేసే ప్రయత్నాలపై రాజకీయ పార్టీల్లో స్పెక్యులేషన్లు ఊపందుకున్నాయి. జేడీ(ఎస్) చీలుతుందని, లేదా కాంగ్రెస్‌లో జేడీ(ఎస్)తో కూటమి ఏర్పాటును వ్యతిరేకించే ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికే బీజేపి సంపాదించిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
బీజేపికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ రాసిన లేఖపై కాంగ్రెస్ మండిపడింది. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరించారని, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ధ్వజమెత్తారు. 15 రోజులు గడువు ఇవ్వడం ద్వారా బీజేపి తనబలాన్ని 104 నుంచి 111కు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారన్నారు. మరో సీనియర్ నేత అశోక్ గెల్హాట్ మాట్లాడుతూ కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపి, గవర్నర్ కలిసి హత్య చేశారని ఆరోపించారు.
కాగా కాంగ్రెస్- జేడి(ఎస్) కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించిన కుమారస్వామి కూడా తమ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలియచేస్తూ గవర్నర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి పరమేశ్వర తదితరులు ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వేరువేరుగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశాలను నిర్వహించాయి. తన నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు పార్టీలు చేసిన తీర్మాన ప్రతులను కుమారస్వామి గవర్నర్‌కు ఇచ్చారు. న్యాయ కోవిదులను సంప్రదించి, సుప్రీంకోర్టు తీర్పుల వివరాలను తెలుసుకుని వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు రాజ్‌భవన్ వెలుపల వేచి ఉన్న విలేఖర్లకు కుమారస్వామి చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటానని గవర్నర్ తెలియచేశారన్నారు. అంతకు ముందు కుమారస్వామి పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ బీజేపికి మెజార్టీలేదని, ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల నగదు, పదవి ఇస్తామని బీజేపి ఎర చూపుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంత తతంగం జరుగుతున్నా, ఆదాయం పన్ను శాఖ ఏంచేస్తోందని నిలదీశారు. కాగా కుమారస్వామి ఆరోపణకు ధీటుగా బీజేపి ఎంపి శోభా కండ్రంజీ తీవ్రంగా స్పందిస్తూ, బీజేపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జేడీఎస్ చేస్తున్న ఎత్తుగడలను వివరిస్తూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.