జాతీయ వార్తలు

తూత్తుకుడిలో మళ్లీ హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూత్తుకుడి, మే 23: తూత్తుకుడిలో బుధవారం తాజాగా తలెత్తిన హింసలో ఒకరు మృతి చెందారు. స్థానిక అన్నానగర్‌లో ఆందోళనకారులు మంగళవారం కాల్పుల ఘటనను నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి పోలీసులపై రాళ్లదాడికి దిగడమే కాకుండా రెండు పోలీసు బస్సులను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు గుంపులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో తూత్తుకుడి ఘటనలో మృతిచెందిన ఆందోళనకారుల సంఖ్య 10కి చేరింది. తూత్తుకుడిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఏ క్షణం ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. నిన్నటి కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఆసుపత్రికి రావడానికి ప్రయత్నించారు. అంతకుముందు ఇదే ఆందోళనకారులు రెండు పోలీసు బస్సులకు నిప్పంటించారు. ఆసుపత్రిలోకి తోసుకునివస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. తూత్తుకుడిలో అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు పొరుగు జిల్లాల నుంచి పెద్దఎత్తున పోలీసు బలగాలను పంపించారు.
తూత్తుకుడి సంఘటనపై హైకోర్టు రిటైర్డు జడ్జితో ఏకసభ్య కమిషన్‌ను విచారణ నిమిత్తం ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వేలాది మందితో కలెక్టరేట్‌ను ముట్టడించడం, శాంతిభద్రతలు అదుపు తప్పడం, కాల్పుల్లో 10 మంది మృతి చెందిన ఘటనలపై ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతుందని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు రాజధాని చెన్నైకు 600 కి.మీ దూరంలో ఉన్న తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని, కాలుష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ ఆందోళనకారులు నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం మంగళవారం అదుపుతప్పడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.
తూత్తుకుడి హింసాత్మక సంఘటనలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఢిల్లీలో హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. కాగా స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ పనిచేయడం లేదని ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. కోర్టు ఆదేశాల కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. తమ కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలు గతంలోనే నిలిచిపోయాయన్నారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఉత్పత్తిని నిలిపివేశామన్నారు. కాగా స్టెరిలైట్ కంపెనీ విస్తరణకు సంబంధించిన కార్యకలాపాలపై స్టే ఇస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎం సుందర్, జస్టిస్ అనిత సుమంత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ కార్యకర్త ఫాతీమా బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కంపెనీ విస్తరణపై బహిరంగ విచారణ నిర్వహించి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రెండు నెలల క్రితం ఇప్పుడున్న పరిశ్రమ మూతపడడంతో, రెండవ యూనిట్ నిర్మాణానికి గతంలో ఈ సంస్థ దరఖాస్తు చేసింది. ఈ పరిశ్రమలో ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి కూడా అనుమతి ఇవ్వలేదు.

కాపర్ ప్లాంట్ మూసేయాల్సిందే
న్యూఢిల్లీ: తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. తూత్తుకుడిలో ఆందోళనకు దిగిన వారిపై కాల్పులు జరిపి పది మంది మరణించడాన్ని ఆ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పోలీసు కాల్పుల్లో తలలు, ముఖాలపై బుల్లెట్ గాయాలు ఉండడాన్ని సీపీఎం ప్రస్తావిస్తూ, పోలీసుల కర్కశత్వానికి నిదర్శమని పేర్కొంది. కాపర్ ప్లాంట్ వద్ద గాలి, నీరు, భూమి, పరిసరాలు కలుషితమైపోతున్నాయని స్థానికులు ఎంత మొత్తుకున్నా వినకుండా, పర్యావరణాన్ని పట్టించుకోకుండా ప్లాంట్‌ను విస్తరించడాన్ని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో ఖండించింది. ఈ సంఘటనపై పూర్తి న్యాయ విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తూత్తుకూడిలో కాల్పుల ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. కాల్పులకు బాధ్యత వహిస్తూ తమిళనాడు ఏఐఏడీఎంకె ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని పేర్కొంది. మోదీ ప్రభుత్వ హయాంలో వేదాంత లాంటి సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించింది.