జాతీయ వార్తలు

బీజేపీ బెంబేలెత్తిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 26: రాబోయే ఎన్నికల్లో ఎన్‌డిఏ యేతర పార్టీలన్నీ ఒకే తాటిపైకి వస్తాయన్న విషయం తెలిసి బీజేపీ బెంబేలెత్తిపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డిఏ నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చేస్తున్నాయని, ఇప్పుడది మునుగుతున్న నౌక అని ఆయన అన్నారు. ముంబయిలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ విడివిడిగా పోటీచేయడం వల్లే బీజేపీ గెలుస్తోందన్నది నగ్న సత్యమని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఏ యేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి నిలబడతాయి, అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలిచేది అని సింఘ్వీ వ్యాఖ్యానించారు. ‘ఓట్లు చీలిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీజేపీని కట్టిడి చేస్తాం’ అని కాంగ్రెస్ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడం చిన్న విషయం కాదని, అందుకే అక్కడ బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకే వేదికపైకి రావాలని ప్రతిపక్షాలన్నీ నిర్ణయించడం బీజేపీని భయభ్రాంతులను చేస్తోందని సింఘ్వీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అహంకార పూరిత వైఖరి నచ్చకే భాగస్వామ్య పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలకు ఏం ఒరగబెట్టామని మోదీ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందని కాంగ్రెస్ నేత నిలదీశారు. ప్రజలను ఘోరంగా మోసగించిన ఎన్‌డీఏకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మోదీ ఏవో జిమ్మికలు చేసుకుంటూ ప్రజలను దగా చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వృద్ధిరేటు ఘోరంగా పడిపోయిందని ఆయన విమర్శించారు. 2004-14 మధ్య వ్యవసాయ వృద్ధిరేటు 4.2 శాతం ఉంటే ఇప్పుడది 1.9కి పడిపోయిందని సింఘ్వీ పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదారం రెట్టింపుచేస్తామన్న నరేంద్ర మోదీ చేసిన హామీ ఓ జోక్‌గా ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల హామీలన్నీ బీజేపీ గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు.
‘రైతులకు గిట్టుబాటు ధరలేదు. యువతకు ఉపాధి అవకాశాల్లేవు. అన్ని వర్గాలూ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి’ అని ఆయన చెప్పారు. అవసరానికి సరిపడా పంచదార దేశంలోనే ఉత్పత్తి అవుతున్నా పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవడం మోదీ సర్కార్ గొప్పతనం అని సింఘ్వీ నిప్పులు చెరిగారు.