జాతీయ వార్తలు

ఉమ్మడి యుక్తి.. విపక్షాల శక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: లోక్‌సభకు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడేందుకు తెరవెనుక చర్చలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటుకు తెరవెనుక చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్‌వాదీ, బీఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ఏర్పడి, ఒకే అభ్యర్థిని రంగంలోకి దించటంతో బీజేపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే నరేంద్ర మోదీని గద్దె దించవచ్చునని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు సమైక్యంగా పోటీ చేసేందుకు మార్గదర్శక సూత్రాల రూపకల్పన కూడా జరుగుతోందని, ముందుగా ప్రతిపక్షానికి చెందిన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకోవటం మంచిదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయ పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సీట్లలో ఆయా పార్టీలు పోటీ చేయవచ్చు. బీజేపీ గెలిచినచోట రెండో స్థానంలో వచ్చిన ప్రతిపక్షానికి ఆ సీటును కేటాయించటం మంచిదని బీఎస్పీ భావిస్తోంది. ఈ లెక్కన దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో బీఎస్పీ దాదాపు నలభై సీట్లలో పోటీచేస్తే, సమాజ్‌వాదీ పార్టీ 32, కాంగ్రెస్ ఎనిమిది సీట్లలో పోటీ చేసేందుకు వీలుంటుంది.
బీజేపీని ఓడించేందుకు బీఎస్‌పీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ ఉంటుంది. ఇలాంటిచోట్ల కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్-వామపక్షాలు-బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఇక్కడ తృణమూల్-వామపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని భావిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు పోటీ పడటం వలన బీజేపీకి లాభం చేకూరుతుంది. మహాకూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి విషయంలో కూడా తొందరపాటు ప్రదర్శించకూడదని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ముందుగా రాష్టస్థ్రాయిలో సీట్లను సర్దుబాటు చేసుకోవాలి. ఎన్నికల ఫలితాలు వచ్చాక జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఒక అవగాహనకు రావటం మంచిదని సీతారాం ఏచూరి సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్థి పేరు ప్రకటించే విషయంలో కూడా ఎలాంటి తొందర పాటు ప్రదర్శించకూడదని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం విదితమే.
అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించటం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక అవగాహనకు రావటం ద్వారా ప్రధాన మంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటం మంచిదని వామపక్షలు ప్రతిపాదిస్తున్నాయి. రాహుల్ గాంధీని ప్రతిపక్షం ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించటం కొన్ని భాగస్వామ్య పార్టీలకు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి ప్రధాన మంత్రి ఎంపిక ఎన్నికల అనంతరం చేసుకోవటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభలో ఉన్న 543 స్థానాలకుగాను 400 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించటం ద్వారా నరేంద్ర మోదీని సునాయసంగా ఓడించవచ్చునని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.