జాతీయ వార్తలు

ఆపరేషన్ తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి సారించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడ పార్టీని సిద్ధం చేయటంపై కసరత్తు మొదలుపెట్టారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేయిస్తున్నారు. రాహుల్ ఆదేశం మేరకు ఏఐసీసీ కార్యనిర్వాహణ ప్రధాన కార్యదర్శి అశోగ్ గెహ్లాట్, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శి కుంతియా, కొత్తగా నియమితులైన ముగ్గురు కార్యదర్శులు సలీం, బోస్‌రాజు, శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం కాంగ్రెస్ వార్ రూంలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘ సమావేశం జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అనుసరించవలసిన వ్యూహంపై వీరు చర్చలు జరిపారు. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అనుసరించవలసిన విధానంతోపాటు, పార్టీ విజయావకాశాలపై చర్చలు జరిగాయి. కాగా, ఇలాంటి సమావేశాలు ఇక మీదట కూడా జరుగుతాయని కుంతియా చెప్పారు. శనివారం నాటి చర్చలు అసంపూర్తిగా మిగిలాయని ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీని పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణను ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కేంద్ర తెలంగాణ పేరుతో మూడు భాగాలుగా విభజించి, కొత్తగా నియమితులైన ముగ్గురు కార్యదర్శులకు వాటి బాధ్యతలను అప్పగించారు. ఎవరు ఏ ప్రాంతంలో పని చేస్తారనేది తరువాత నిర్ణయిస్తామని కుంతియా చెప్పారు. ముగ్గురు కొత్త కార్యదర్శులు ఎళ్లుండి హైదరాబాదుకు వెళ్లి టీపీసీసీ, డీసీసీ నాయకులతో చర్చలు జరుపుతారని ఆయన చెప్పారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని, పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేస్తామని కుంతియా పేర్కొన్నారు. ముగ్గురు కొత్త కార్యదర్శులు తమకు నిర్ధారించిన తెలంగాణ ప్రాంతాల్లో వంద రోజుల పాటు ఉండి, పార్టీని గ్రామ స్థాయి నుండి పటిష్టం చేస్తారని అన్నారు. అదేవిధంగా, అన్ని రకాల కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తారని కుంతియా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన శక్తి ఆప్ పనిని వంద రోజుల్లో పూర్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనేది కూడా నిర్ణయిస్తామన్నారు. డీసీసీ, మండల్, బ్లాక్ స్థాయి కమిటీల సమావేశాలను కూడా నిర్వహిస్తారని వివరించారు.
ఉత్తమ్ కొనసాగుతారు
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. ఆయనను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించారు. ఉత్తమ్ నాయకత్వంలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. టీపీసీసీకి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని, ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం చర్చలు జరిపామని కుంతియా ప్రకటించారు. సీనియర్ నాయకుడు నాగేందర్ రాజీనామాపై స్పందిస్తూ ఎవరు ఉన్నా పోయినా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం జరగదని కుంతియా స్పష్టం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ఓట్ల శాతం 30.70 ఉన్నది. దానం నాగేందర్ పోయినా మరో నాయకుడు పోయినా కాంగ్రెస్ ఓటు శాతం తగ్గదు. తగ్గబోదు’ అని కుంతియా ఆవేశంగా అన్నారు. ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎమ్మెల్సీ వీడినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుందనుకోవద్దని ఆయన అన్నారు. వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్టులు, ఇతరు పనులు లేదా బదిలీల వ్యవహారం లేదా కేసులుండవచ్చునని కుంతియా వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో వెనుకబడిన కులాల వారికి ప్రాధాన్యత లేదని దానం నాగేందర్ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించగా, ఆ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని కుంతియా అన్నారు. ఏఐసీసీలో 91 మంది కొత్త వారిని నియమిస్తే ఇందులో బీసీలు 51 శాతం ఉన్నారని చెప్పారు. టీపీసీసీ సభ్యుల్లో 61 శాతం మంది బీసీలేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, అనధికారికంగా పత్రికలతో మాట్లాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
పార్టీ పటిష్టానికి కృషి: ఉత్తమ్
తెలంగాణలో పార్టీ పరిస్థితిని సమీక్షించామని, ముగ్గురు కొత్త కార్యదర్శులు పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చెస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కార్యదర్శులకు బాధ్యతలు, అధికారాలు ఉంటాయన్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా వీరి మాట చెల్లుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు చెప్పినట్టు ఉత్తమ్ అన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలనేది కూడా చర్చించామని ఉత్తమ్ తెలిపారు.