జాతీయ వార్తలు

తాలిబన్లను తలపిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు, విద్వేషాలు, హింసను ప్రేరేపిస్తూ దేశాన్ని అథోగతి పాలుచేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. మృతవీరులు దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన అమరవీరుల భారీ ర్యాలీలో నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. రాజస్థాన్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో అక్బర్‌ఖాన్ అనే వ్యక్తిని పలువురు కొట్టిచంపిన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వార్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘దేశంలో సుహృద్భావ వాతావరణాన్ని పాడుచేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాక్షస చేష్టలతో తాలిబన్‌లను మించిపోయారు. మనుషులను చంపేస్తున్నారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. కమలనాథులు చెబుతున్న హిందు సిద్ధాంతాలు ఇవేనా?’ అంటూ మమత నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించాలని ఆమె ఉద్వేగపూరితంగా పిలుపునిచ్చారు. ‘దేశంలో నిత్యం ఏదో ప్రాంతంలో దాడి జరుగుతోంది. ఈ రోజు మరొక వ్యక్తి హిందుత్వవాదులకు బలైపోయాడు. మత ఉగ్రవాదానికి పాల్పడుతోంది’ అని తృణమూల్ అధినేత్రి మండిపడ్డారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి అక్బర్‌ఖాన్‌ను చంపిందెవరో నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. ‘బీజేపీ హఠావో..దేశ్ బచావో’ అంటూ మమత పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో బీజేపీ ఆధిపత్యానికి గండికొడతామని ఆమె ప్రకటించారు. టెంట్‌లే నిర్మించలేని వారు దేశాన్ని నిర్మిస్తారా? అంటూ మోదీని నిలదీశారు. మిడ్నాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా టెంట్ కూలిపోయిన ఘటనను తృణమూల్ అధినేత్రి గుర్తుచేస్తూ వ్యంగ్యోక్తులు విసిరారు. కాగా ఢిల్లీ గద్దెపై నుంచి బీజేపీని దించేయాలన్న ఉద్దేశంతో జనవరిలో ఇక్కడ భారీ సభకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీలతో ఓ భారీ ర్యాలీ నిర్వహించే యోచన ఉందని మమతా బెనర్జీ ప్రకటించారు. ‘మా కుర్చీ పోతాదన్న భయం లేదు. దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా ఆవేదన అంతా వారి కోసమే’ అని పశ్చిమ బెంగాల్ సీఎం స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని 42 లోక్‌సభ సీట్లూ గెలుచుకుంటాం. ఇది మా ప్రతిజ్ఞ. బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించుకుంటాం’ అని ఆమె వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే దేశానికి మార్గనిర్దేశన చేస్తుందని సీఎం ప్రకటించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గినంత మాత్రాన బీజేపీ లాభపడిపోయిందని కాదని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం, ఎంపీల సంఖ్య 150కి పడిపోవడం ఖాయమని తృణమూల్ చీఫ్ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఇప్పుడు సీట్లు 2019 ఎన్నికల్లో కోల్పోతుందని ఆమె ధీమాగా చెప్పారు. పెద్దనోట్ల రద్దువెనక పెద్ద కుంభకోణం ఉందని మమతాబెనర్జీ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోదన్న పశ్చిమ బెంగాల్ సీఎం ‘మేం సీబీఐ, ఈడీకి భయపడం’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో 2024 అంటుంటారని, ముందు 2019ను దాటి వెళ్లాలని ఆమె సవాల్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఏకైక అజెండా బీజేపీని ఓడించడమేనని, ఆ పార్టీ నుంచి దేశాన్ని కాపాడేందుకు యుద్ధం చేస్తామని ఆమె అన్నారు.