రాష్ట్రీయం

శాసన వ్యవహారాల్లో తలదూర్చం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: చట్టసభల్లో జరిగే శాసనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యసభ ఆమోదం పొందాల్సివున్న మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు సంబంధించిన విషయాలపై విచారణకు జస్టిస్ మదన్ బి లోకుర్, ఎస్. అబ్ధుల్ నజీర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. మోటారు వాహనాల చట్టం 2017 సవరణ బిల్లు గత ఏప్రిల్ 10న లోక్‌సభ ఆమోదం పొందింది. అయితే ఇటీవలే ముగిసిన రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోద ముద్ర వేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) పింకీ ఆనంద్ తెలిపారు. వచ్చే నవంబర్ మాసాంతంలో జరిగే శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మృతులకు అందించే పరిహారాన్ని రెండు లక్షలకు, తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని కొత్త బిల్లులో పొందుపరచడం జరిగిందని కోర్టు వ్యవహారాల సహాయకుడు అడ్వొకేటు గౌరవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులో మృతిచెందిన వారికి రూ.25వేలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ 12వేలు పరిహారంగా చెల్లించే విధంగా పథకం ఉందని వివరించారు. కాగా ఈ విషయమై ధర్మాసనం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సవరించిన పరిహారం మొత్తాన్ని బాధితులకు చెల్లించేందుకు అంగీకరిస్తే అలా చెల్లించాల్సిందిగా సూచించగలమని పేర్కొంది. అయితే రాజ్యసభ ఆమోదించకుండా సవరించిన చట్టాన్ని అములు చేయాల్సిందిగా తాము కోరలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం రెండు లక్షల పరిహారం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే అలా చేయకూడదని కోర్టు చెప్పబోదని, ఈవిషయంలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని థర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యసభ ఆమోదం పొందని ఈ వ్యవహారంలోప్రభుత్వం సైతం నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నందున పరిహారం చెల్లింపు విషయంలో రోడ్డు ప్రమాద పరిహార ట్రిబ్యునల్ సూచన మేరకు ఢిల్లీ అనుసరిస్తున్న విధానాన్ని అన్నిచోట్లా అమలు చేయాలని, ఇందుకు సంబంధించి రోడ్డు భద్రత కోసం ఏర్పాటైన మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కమిటీ, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇవ్వాలని కోర్టు వ్యవహారాల సహాయకుడు అభిప్రాయపడ్డారు. కాగా వాహన ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. నాలుగు లేదా రెండు చక్రాల వాహనాల అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను ఐదేళ్లు(నాలుచక్రాల వాహనాలకు), మూడేళ్లు (రెండు చక్రాల వాహనాలకు) వ్యవధికి అములో ఉండేలా ఓ విధానాన్ని అమలు చేయాలని, ఈ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కాగా దేశ వ్యాప్తంగా 18 కోట్ల వాహనాలు రోడ్లపై తిరుగుతుండగా ఇందులో కేవలం నాలుగు కోట్ల వాహనాలకు మాత్రమే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కమిటీ స్పష్టం చేసింది. ఇలా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనా కారణంగా జరిగే ప్రమాదాల్లో బాధితులకు పరిహారం అందడం లేదని పేర్కొంది. కాగా తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ వేసిన పిటిషన్ హియరింగ్‌కు వచ్చిన సందర్భంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం 2015 ఏప్రిల్ 22న రోడ్డు భద్రతకు సంబంధించిన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ అనేక నివేదికలు కోర్టుకు సమర్పించడం జరిగింది.