జాతీయ వార్తలు

జేఎన్‌యూ విద్యార్థి నేత ఖలీద్‌పై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర నడిబొడ్డున నిత్యం అత్యంత భద్రత ఉండే కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాన్‌స్టిట్యూషన్ క్లబ్ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై ఓ ఆగంతకుడు కాల్పులకు దిగాడు. ఖలీద్ కాల్పుల నుంచి తప్పించుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి ఓ ఆయుధాన్ని విసిరి పారిపోయినట్టు తెలిపారు. ఆయుధాన్ని (పిస్తోల్) పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిలో ఎంతమంది పాల్గొన్నారన్నదానిపై అయోమం నెలకొంది. కాల్పులు జరిగాయా? లేక ఆయుధం విసిరేసే వెళ్లారా అన్నదానిపై స్పష్టత లేదని న్యూఢిల్లీ రేంజ్ జాయింట్ పోలీసు కమిషనర్ అజయ్ చౌదరి అన్నారు. విభిన్నకథనాల నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్ కాంప్లెక్ వెనుకవైపున టీ తాగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు జేఎన్‌యూ విద్యార్థి నేత ఖలీద్ చెప్పారు. కాంప్లెక్స్ వెనక భాగంలో మవ్‌లాంకర్ ఆడిటోరియం, ఎంపీల క్వార్టర్స్ ఉన్నాయి. అమాంతం ఓ వ్యక్తి దూసుకొచ్చి తనను కింద పడేశాడని, తరువాత కాల్పులకు తెగబడ్డాడని విద్యార్థినేత వెల్లడించారు. భయంతో తాను అక్కడి నుంచి పరుగుతీశానని, ఆగంతకుడూ అక్కడి నుంచి మాయమయ్యాడని ఖలీద్ అన్నారు. అయితే దాడి చేసిన వ్యక్తి ముఖం తాను చూడలేదని మీడియాకు తెలిపారు. క్లబ్ ఎంట్రెన్స్‌లోనే జేఎన్‌యూ విద్యార్థినేతపై ఇద్దరు కాల్పులు జరిపుతుండగా చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఫ్రీడం ఫ్రం ఫియర్’ పేరుతో ఏర్పాటైన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఉమర్ ఖలీద్‌పై జరిగిన దాడి ఘటన తీవ్ర సంచలనం రేపింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, దివంగత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక సదస్సులో ప్రధాన వక్తలు. కాగా తనను కింద పడేసి పిడిగుద్దులు కురిపించాలని విద్యార్థినేత తెలిపారు. వెంటనే దుండగుడు కాల్పులు జరపలేదని, అక్కడున్న వారు అప్రమత్తమవ్వడంతో పారిపోయాడని ఖలీద్ అన్నారు. మరోసారి గాలిలోకి కాల్పులు జరిపాడని చెప్పడంతో అసలేం జరిగిందన్నదానిపై విచారణ జరుపుతున్నట్టు డిప్యూటీ కమిషనర్ మాధుర్ వర్మ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించనున్నట్టు ఆయన తెలిపారు. తాము టీ తాగుతుండగా ముగ్గురు తమ వద్దకు వచ్చారని ఖలీతోపాటు అక్కడే ఉన్న సైఫీ చెప్పాడు.‘ ముగ్గురిలో ఒకడు ఖలీద్‌ను పట్టుకున్నాడు. పెద్ద పెనుగులాటే చోటుచేసుకుంది. అప్పుడే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అయితే ఖలీద్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు. మరోసారి కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు’అని సైఫీ వివరించాడు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. కొద్ది గంటల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉండగా ఈ కాల్లుల ఘటన తీవ్ర కలకలం రేపింది.