జాతీయ వార్తలు

జమిలి అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కోరిన 24 గంటల అనంతరం ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది విస్తృతమైన న్యాయ ప్రక్రియ కావడంతో ఇప్పట్లో అది సాధ్యం కాదని అన్నారు. శాసనసభల కాలపరిమితిని పెంచడం కాని, తగ్గించడం కాని చేసిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమని ఆయన చెప్పారు. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. అలాగే జమిలి ఎన్నికల నిర్వహణకు పెద్దయెత్తున ఈవీఎంలు, వివిపాట్స్ (పేపర్ ట్రయల్ మిషన్లు) అవసరమవుతాయని చెప్పారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ నినాదంపై 2015 నుంచి తాము సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నామని చెప్పారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 13.95 లక్షల ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లను సెప్టెంబర్ 30 నాటికి సిద్ధం చేస్తున్నామని, అలాగే 15.15 లక్షల వివిపాట్‌లు నవంబర్‌కు ముందే సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో అక్కడక్కడా వీవీపాట్స్ పనిచేయకపోతే వాటి స్థానంలో కొత్తవి ఉంచడానికి అదనపు మిషన్లు అవసరమవుతాయని చెప్పారు. ఒకవేళ 2019లో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దేశంలో తమకు 24 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని రావత్ తెలిపారు. ఇది పార్లమెంట్ ఎన్నికలకు అవసరమయ్యే దానికంటే రెట్టింపు సంఖ్య అని ఆయన వివరించారు. మే 16న లా కమిషన్‌తో జమిలి ఎన్నికల గురించి చర్చించామని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 12లక్షల అదనపు ఈవీఎంలు, అదే సంఖ్యలో వివిపాట్ మిషన్ల కొనుగోలుకు 4,500 కోట్ల రూపాయల అవసరమవుతాయని తాము లా కమిషన్‌కు వివరించామని సిఇసి ఓపీ రావత్ తెలపారు. ఇలావుండగా దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాసారు.