జాతీయ వార్తలు

తేల్చాల్సింది పార్లమెంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: నేరచరిత్ర కలిగిన నాయకులు చట్టసభల్లో పోటీ చేయవచ్చా అనే అంశంపై సుప్రీం కీలక తీర్పును ఇచ్చింది. నేరచరిత్ర ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉండి రాజకీయాలను వ్యాధిలా పట్టిపీడిస్తున్నారని, దానికి పూర్తిగా చికిత్స చేయాల్సిన బాధ్యత పార్లమెంట్‌దేనని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనిపై పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని దాఖలైన పిటిషన్‌పై జరిగిన సుప్రీం విచారణ జరిపి మంగళవారం తీర్పును వెలువరించింది. క్రిమినల్ కేసులు విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై నేరం రుజువు కాకముందే వారిపై అనర్హత వేటు వేయలేమని, అలాగే వారిపై క్రిమినల్ రికార్డు ఉన్నంత మాత్రాన పోటీ చేయకుండా ఆపలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయం పార్లమెంట్‌కే వదిలివేస్తున్నామని, ఈ విషయంలో లక్ష్మణరేఖను దాటలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో నేరస్తులను చట్టసభలకు దూరంగా ఉంచే సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో నేరతీవ్రత అధికం కావడం ఆందోళన కలిగిస్తోందని, ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెట్టకుండా ఒక చట్టం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. ఈదేశ ప్రజలు స్వచ్ఛమైన నేతలతో కూడిన రాజ్యపాలన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. నేరమయంగా మారిన ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేసే పరిస్థితి లేదని, అయితే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారినప్పుడు జోక్యం చేసుకోక తప్పదని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటే జోక్యం చేసుకుని ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని, చట్టసభ సభ్యులు నేరాలకు పాల్పడినట్టు రుజువైతే వారిని సభ్యత్వానికి అనర్హులను చేసేలా ఆ చట్టం ఉండాలన్నారు. ఈ సందర్భగా సుప్రీం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ప్రొఫార్మాలో అతను/ఆమెపై ప్రస్తుతం ఉన్న క్రిమినల్ కేసులు, గతంలో కేసుల్లో ఏమైనా శిక్షపడిందా? తదితర వివరాలను సమర్పించాలి. అలాగే వారు ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తుంటే సంబంధిత పార్టీకి కూడా ఆ వివరాలను తెలియజేయాలి. ఆ పార్టీ వారు తమ వెబ్‌సైట్‌లో ఆ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను ఉంచాలి. ఆ అభ్యర్థి గత చరిత్ర గురించి, కేసుల గురించి ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి స్థానిక పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. విస్తృతంగా అంటే నామినేషన్ వేసన తర్వాత కనీసం మూడుసార్లు ప్రచారం చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రస్తుతం డబ్బు, మందబలమే సమాజాన్ని నడిపిస్తోందని దీనివల్ల రాజకీయాలు కలుషితమై పోయాయని, నిజాయితీ గల నేతలే కరవవుతున్నారని పౌరులు ఆవేదన చెందుతున్నారని ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి తగిన ప్రయత్నాలు చేపట్టాలని సుప్రీం పేర్కొంది. కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు దోహదం చేయవచ్చునని తెలియజేసింది. ఈ నిబంధనల వల్ల క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి కనీసం భయపడవచ్చునని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.