సబ్ ఫీచర్

‘నేషనల్ హెరాల్డ్’ విలేఖరిగా నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేషనల్ హెరాల్డ్’ స్వాతంత్య్ర సమర కాలంలో అఖిల భారత కాంగ్రెస్ భావాలను బాగా ప్రచారం చేసిన పత్రిక. 1940 దశకంలో ఆ పత్రికకు ఎం.చలపతిరావు సంపాదకులుగా ఉండేవారు. ఆయన నెహ్రూ మిత్రుడు. నెహ్రూ రాజకీయ నాయకుడే కాదు, ఉద్విగ్నమైన ‘నేషనల్ హెరాల్డ్’ అనుభవాలతో పాలుపంచుకున్న ప్రతినిధి కూడా. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెహ్రూ పర్యటన ఏర్పాటైంది. పత్రిక యాజమాన్యం అభీష్టంపై చలపతి రావు, నెహ్రూ వెంట ఉండవలసి వచ్చింది. రాయ్‌బెరేలీ లోని సిమ్రీ రాజ భవనంలో నెహ్రూను చలపతిరావును కలవాల్సి ఉంది. పూర్వ పరిచయం లేకపోయినా నెహ్రూ ఏమాత్రం అరమరికలు లేకుండా చలపతిరావుతో మాట్లాడారు. పత్రికని యధావిధిగా నడపడానికి ప్రయత్నించమని, ఏ విధంగా సమాధానపడకుండా కాంగ్రెస్ ఉద్యమానికి సహాయం చేస్తుండమని సలహాయిచ్చారు. తన స్వేచ్ఛకు పత్రికా సిబ్బంది స్వేచ్ఛకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న పరిస్థితులను చర్చించుకున్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో తన వెంట ఉండవలసిందని చలపతిరావును.. నెహ్రూ కోరారు.
నిర్ణీత సమయం మీద వారు సిమ్రీరాజ భవనంలో కలుసుకున్నారు. చాలా విశాలమైన ప్రదేశంలో విందు ఏర్పాటుచేసారు. నెహ్రూ ముందున్న టేబిల్ యావత్తూ భోజన పదార్థాలతో నిండి ఉంది. చలపతిరావు శాఖాహారి. ఇది గమనించిన నెహ్రూ కొన్ని పళ్లు, ఇతర శాఖాహార పదార్థాలు తెమ్మని ఆజ్ఞాపించారు. విందు సమయం ఉల్లాసంగా గడచిపోయింది. ఆ తరువాత ఇద్దరు వివిధ విషయాల గురించి మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో వినోబాభావే ప్రస్తావన వచ్చింది. ఆయన ఎవరని చలపతిరావు అడిగారు. ‘గొప్ప విశేషం. నేనెన్నడూ వినోబాభావేను కలుసుకోలేదు. ఆశ్రమంలో నేనాయనను చూసినట్టో, లేక ఆయన్ను గురించి విన్నట్టో లీలగా గుర్తు. అయితే ఎన్నడూ ఆయనను గమనించలేదు. మంచి నిర్మాణాత్మకమైన కార్యదర్శి. విశిష్టమైన పాండిత్యంతోపాటు అత్యంత వినయంగా పనిచేస్తారు. ఆయనంటే గొప్ప అభిప్రాయం ఉన్నది గాంధీజీకి. మొదటి సత్యాగ్రహిగా ఆయనను గాంధీజీ ఎన్నుకొనడానిబట్టే మనం ఈ విషయం చెప్పవచ్చు. ‘గాంధీజీ దృష్టిలో నిర్మాణాత్మకమైన వ్యక్తి మొదట. రాజకీయ కార్యకర్త తరువాత’అని వినోబా గురించి నెహ్రూ వెల్లడించారు.
అది జవహర్‌లాల్ నెహ్రూతో చలపతిరావు (ఎం.సి) గడపనున్న రోజు. మొదట కారులో నెహ్రూతోపాటు ఎం.సి. కూర్చోవలసి వచ్చింది. ఎం.సి.కి ఇది కొంత యిబ్బంది కలిగించింది. చొక్కా, ప్యాంటు, చిరిగిన కోటు. చేతిలో శిరస్త్రాణంలా ఉన్న హేటు. ఈలాంటి వాలకంతో ఎం.సి. కొంత ఇబ్బంది పడ్డారు. అయితే నెహ్రూ ఆయనను హాయిగా ఉండేటట్లు చేసారు. ఆయన మోయలేనంతగా ఉన్న తన గులాబి, మల్లె, బంతి పూదండలలో ఎం.సిని కప్పేశారు.
చాలా జయప్రదమైన పర్యటన అది. ప్రతి ఊరి దగ్గర గుంపులు, గుంపులు జనం. దుమ్ముధూళి కూడా లెక్కపెట్టకుండా. జనంలో వారు కలసిపోయారు. ప్రజలతో నెహ్రూది నిగూఢమైన సంబంధం. సామ్రాజ్యవాదం కనుక త్రోవలో ఎదుటపడ్డట్టయితే నిజంగా పట్టుకుని ఆయన దానితో పెనుగులాడేవారు కూడా. ‘హోషియార్ హోజావ్! (జాగ్రత్త పోరాటం వచ్చింది) ఖూబ్ తయారీకరో(బాగా తయారుకండి) సంఘట్టన్ కరో(నిర్మాణపు ఏర్పాట్లుచేయండి) ఖద్దర్ పెహనో (ఖద్దరు ధరించండి) జబర్దస్తీ చందా మత్ దో! (బలవంతంగా వసూలుచేసే పన్నులు చెల్లించకండి) ధూళితో కూడిన గ్రామీణ ప్రాంతపు మార్గంలో, ఊరూరా వారి ప్రయాణం రెండువందల యాభై మైళ్ళ పొడవున జరిగింది. రోడ్లన్నీ ఆర్చిలతో అలంకరించారు. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలని జనం. వారిలో కొన్ని వేల మంది తోవ ప్రక్కన గుంపుగూడడం. కొందరు చెట్లు కొమ్మలు ఎక్కి కూచోవడం, ఇంక ఆప్రక్క ఈ ప్రక్క గుమికూడిన వారికి లెక్కలేదు. ఇతను హిందువు, ఇతను ముస్లిం అనే ప్రశ్న లేదు. వీరువారు అనకుండా యావన్మందీ కదలివచ్చారు. వృద్ధులు, పిల్లలు, స్ర్తిలూనూ.
త్రోవ పొడుగునా నెహ్రూ ఎం.సి.తో కులాసాగా కబుర్లు చెపుతూనే ఉన్నారు. దక్షిణాది సంగతులను తెలుసుకుంటున్నారు. హిందీ వ్యాప్తి గురించి. తనకు హిందీ ఎంతవరకు వచ్చునని అడిగేవారు. ‘‘నేనీ ప్రజలతో ఏదో తేలిక అయిన హిందీ మాట్లాడుతాను. చిన్నచిన్న తేలిక పదాలు కల్పించుకుని మాట్లాడతాను. చూడండి బ్రిటిష్ పాలన ఒక విధమైన ‘బనియా పాలన’ డబ్బు అప్పిచ్చి పీడించే వడ్డీ వ్యాపారస్తుల పాలన అనే అర్ధంతో ‘సాహుకారరాజ్’ అనే పదం ఉపయోగిస్తాను అన్నారు. దాంతో ఆయన ‘సాహుకారరాజ్’ అనే అంతటా మాట్లాడసాగారు. వేలాది ప్రజలు అది అర్థం చేసుకున్నారు.
కొద్దిరోజుల తరువాత జవహర్‌లాల్ నెహ్రూ ఇంకా అనేక గ్రామాలు పర్యటిస్తూ బారాబంకీవద్ద ఒక పెద్ద బహిరంగ సభలో ప్రసంగించి అక్కడినుంచి నేరుగా కారులో దాదాపు రాత్రి 11గంటలకు నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి వచ్చారు. వ్రాసుకునే కాగితాల ‘పాడ్’ ఇవ్వమని అప్పుడు డ్యూటీలో వున్న ఉప సంపాదకుణ్ణి అడిగి తీసుకున్నారు. తన బారాబంకీ ఉపన్యాసాన్ని పత్రికలో ప్రచురణార్థం తానే వ్రాసి ఉప సంపాదకుడికి ఇచ్చిమరీ వెళ్ళారు. అక్టోబరు 23వ తేదీ పత్రికలో అది ప్రచురితమైంది. పత్రిక రచనారంగంలో విశిష్టమైన రచన అది. మరునాడు ఉదయం పత్రికలో ఆ వార్త చదివి ఎం.సి. తన కళ్ళనుతానే నమ్మలేకపోయారు. బారాబాంకీలో ఆ పత్రిక విలేఖరి వ్రాసినది కానేకాదది. అతనికి రచనాశైలి తెలియనే తెలియదు. అతడు పంపిన వార్తను సంపాదకుడే తిరిగి వ్రాసి ఉండాలి.
ఎం.సి. ఆఫీసుకు వెళ్ళీవెళ్ళగానే ఆ వార్త ప్రతి తీసుకురమ్మని కబురుచేసారు. సంపాదకుడు ఎల్‌ఎకీ ఎం.సి. గదిలోకి వచ్చి ‘ఆ వార్త మీరు రాశారా?’అని అడిగారు. లేదని ఎం.సి. చెప్పారు. తీరా ప్రతి వచ్చాక చూసేటప్పటికీ అది ముత్యాల్లా స్పష్టంగా, కొట్టవచ్చినట్లు జవహర్‌లాల్ స్వదస్తూరితో వ్రాసినది అని వారు తెలుసుకున్నారు. ఆ వ్రాతపతిని ఆ ఉప సంపాదకుడు ఒక విధంగా పాడుచేసాడు. జవహర్‌లాల్ నెహ్రూ పేరుముందు ‘పండిట్’అనే మాట చేర్చాడు. ఆ మాట చేర్చడం ఆయనకు యిష్టం ఉండదు. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ ఎం.సి. దగ్గరికి వచ్చి ‘ఏం? ఇప్పటికైనా తేరుకున్నారా?’అని అడిగారు. పదిహేను రోజుల క్రితం తాము చేసిన ప్రయాణాన్ని గురించి ప్రస్తావిస్తూ ‘ఆ తేరుకున్నాను. బారాబంకీ విలేఖరి కూడా తెప్పరిల్లుకునే వుంటాడని అనుకుంటాను’ అని ఎం.సి. కొంటెగా అన్నారు.నెహ్రూ మందహాసం చేశాడు. బారాబంకీపై తాను చేసిన యుక్తికి తనలో తానే ఆనందిస్తూ.

- జి.వెంకటరామారావు