అక్షర

స్వోత్కర్ష లేని సద్విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగులో ఆధునిక నవల’
(సాహిత్య వ్యాసాలు)
-అంపశయ్య నవీన్
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

నిపుణుడైన స్వర్ణకారుని చేతిలో బంగారపుముద్ద పోత పోసుకొని రకరకాల నగలుగా నగిషీలు దిద్దుకొన్నట్లే, చేయితిరిగి రచయిత చేతిలో ఏ రచనాప్రక్రియ అయినా కొత్తదనాన్ని, నిండుదనాన్ని సంతరించుకొంటుంది. అది ‘వ్యాసం’అయినా, ‘సమీక్ష’అయినా, చివరికి ‘ముందుమాట’ అయినా ఒక సమగ్ర రచనాశిల్పాన్ని కలిగి ఉంటుంది. కథారచయితగా, నవలాకారునిగా లబ్దప్రతిష్టులైన నవీన్ రచించిన ‘తెలుగులో ఆధునిక నవల’అన్న ఈ సాహిత్య వ్యాసాల సంపుటి ఆయనలోని ఒక సద్విమర్శకుని దర్శింపజేసే ఉత్తమ రచన.
దీనిలో ఇరవై పైచిలుకు ‘వ్యాసాలు’, ఆరు గ్రంథాలకు రాసిన ‘ముందుమాటలు’ మరో ఇరవై దాకా సమీక్షలు చోటుచేసుకొన్నాయి. సాహిత్య వ్యాసాలలో తొలితరం తెలుగు నవలల్లోని డొల్లతనాన్ని నిష్కర్షగా వెల్లడించారు. ఆధునిక తెలుగుసాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే నవల గానీ, నవలా యుగానికి యుగకర్త లాంటి నవలాకారుడు గానీ లేకపోవడం లోటుగా భావించారు. భ్రమల్లో కాదు వాస్తవంలో జీవించాలన్నది నవీన్ తత్త్వమని ఇది స్పష్టం చేస్తుంది. చేరా, కాళోజీ, దాశరథి రంగాచార్య, బుచ్చిబాబు, రావూరి భరద్వాజ వంటి ప్రముఖుల రచనలపై వీరు సారించిన దృష్టి కొత్త వెలుగును ప్రసరింపజేసింది. ‘ప్రజల మనిషి’, ‘అల్పజీవి’, ‘పాకుడురాళ్ళు’వంటి ప్రసిద్ధ నవలలను ఆధునిక దృక్పధంతో అనుశీలించారు. ఇంకా అబ్దుల్‌కలాం, దార్శనికతను, భక్తవత్సలరెడ్డి సాహిత్య కృషిని ఇతరులకు మార్గదర్శనం చేసేటట్లు వివేచించారు. తెలుగులోని మాండలికాలపై ప్రామాణికమైన, పరిశోధనాత్మక రచనను అందించారు. ‘తెలంగాణ సినిమా- నిన్న, నేడు, రేపు’ అన్న వ్యాసం తెలంగాణలోని సినిమా పరిశ్రమ నేపథ్యానికి, వర్తమానపు వారసత్వానికి, రేపటి ఆశలకు అద్దంపట్టేదిగా ఉంది.
‘ముందుమాటలు’ మొహమాటానికి రాసినవి కావు. ఆయా అంశాలకు స్పందించి, గుణదోషాలను ఎత్తిచూపేవిగా రాసినవి. ‘సమీక్షలు’ మొక్కుబడిగా కాకుండా ముక్కుసూటిగా చేసినవి. సాహిత్య విమర్శను ప్రేమించే చదువరిని ఈ పుస్తకం ఆతృతగా, ఆసాంతం చదివింపజేస్తుంది. అరుదైన సమాచారాన్ని అందించి, ఆలోచింపజేస్తుంది కూడా!

- గౌ.శం.