శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విస్తారంగా వర్షాలు జిల్లాలో భయం.. భయం అప్రమత్తమైన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 30: జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ వాయుగుండంగా రూపాంతరం చెందే పరిస్థితులతో నెల్లూరు జిల్లా ప్రమాదటంచుకునకు చేరుకుంది. ఇటీవల రోవాన్ తుఫాన్ అనంతరం కురిసిన భారీ వర్షాలతో జిల్లా అంతటా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సుమారుగా 1750 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటి అల్పపీడన ద్రోణితో మరో రెండు రోజులకుపైగానే భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. దక్షిణ కోస్తాలో చివరన ఉన్న నెల్లూరుతోపాటు చిత్తూరు, తమిళనాడు రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నెల్లూరుజిల్లా వ్యాప్తంగా సగటున ఆరు సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు ఉద్ధృతమవుతాయని చెబుతున్నారు. పలుచోట్ల ఇప్పటికే ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇదిలాఉంటే వివిధ శాఖల ప్రభుత్వ యంత్రాంగం అంతా అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ప్రకటించడంతోపాటు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా పక్షం రోజుల్లో మళ్లీ పొంగుతున్న వాగులతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గూడూరు-విందూరు మార్గమధ్యంలో కైవల్యా నది పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కొద్దిరోజుల క్రితం వాన తెరిపివ్వడంతో వరి నారుమళ్లు వేసుకున్న రైతులంతా ఇప్పటి వర్షాలతో అవి దెబ్బతినిపోతున్నాయని వాపోతున్నారు. విద్యుత్ అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేశారు. అయితే ఇప్పటివరకు ఈదురుగాలుల తీవ్రత ఏమంతగా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో మాత్రమే పరిశీలన చేసి సరఫరా పునరుద్ధరిస్తున్నారు.

భారీ వర్షాలతో రూ. 1750 కోట్ల నష్టం
* జిల్లా కలెక్టర్ జానకి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 30: రోహన్ తుఫాన్ అనంతరం కురిసిన భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు కలెక్టర్ ఎం జానకి వెల్లడించారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో భాగంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ నష్టాలకు సంబంధించిన నివేదికలను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఇదిలాఉంటే మరలా భారీ వర్షాలతో ఉప్పెన పొంచి ఉన్నందున ఫైర్ సిబ్బంది, ప్రకృతి విపత్తుల సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోందన్నారు. నమోదయ్యే వర్షపాతం 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఉంటుందన్నారు. వివిధ శాఖల ప్రభుత్వ యంత్రాంగం అంతా అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఎవరికీ సెలవులు మంజూరు కాబోవన్నారు. విఆర్‌ఎల నుంచి ఆర్డీఓ వరకు అందరూ తమతమ కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలన్నారు.

రెండువైపులా వాహన రాకపోకలు పునరుద్ధరణ
మనుబోలు, నవంబర్ 30:ఎట్టకేలకు జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాల రాకపోకలను సోమవారం పునరుద్ధరించారు. ఈనెల 16వ తేదిన వరద ఉద్ధృతితో జాతీయ రహదారిపై ఉన్న 4 బ్రిడ్జీలు కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఒకవైపు మాత్రమే వాహన రాకపోకలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు బ్రిడ్జిల పక్కన పొలాల్లో డైవర్షన్ రోడ్డు నిర్మించి వాహనాల రాకపోకలను సజావుగా వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించడంతో పనులు చేపట్టారు. అప్పటి నుండి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి డైవర్షన్ రోడ్డును నిర్మించారు. దీంతో రెండువైపులా సజావుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ధ్వజం
కోట, నవంబర్ 30: ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా వచ్చిన వరదలకు జిల్లా ఆతలాకుతలమై భారీ నష్టం సంభవిస్తే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ధ్వజమెత్తారు. మండలంలోని గూడలి గ్రామంలో వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను, కోతకు గురైన రోడ్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బీభత్సంతో జిల్లాలో వందలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. వేలాది ఎకరాల్లో వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయని, 6 వేల హెక్టార్లకు పైగా ఆక్వాసాగు నాశనమైందన్నారు. అనేక రహదారులకు, చెరువులకు గండ్లు పడ్డాయని ఆమె తెలిపారు. అయితే ప్రభుత్వం వరద బాధితులకు బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనె సరఫరా చేయడం తప్పా, నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. నిరుపేదలు వర్షాల కారణంగా గత 20 రోజుల నుంచి పనుల్లేక అల్లాడిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు తక్షణమే పరిహారం అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. గూడలి, శ్యామసుందరపురం, వంజివాక గ్రామాల్లోని చేనేత కార్మికుల మగ్గాల గుంటల్లోకి నీరు రావడంతో వారు జీవనోపాధి కోల్పోయారని వారిని ఆదుకోవాలని అన్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. పొర్లుకట్టల మరమ్మతులను సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఇంత ప్రమాదం సంభవించిందని పలువురు రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పనబాక కృష్ణయ్య, పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తుఫాన్ పట్ల అప్రత్తమంగా ఉండాలి
* సబ్ కలెక్టర్ సూచన
గూడూరు, నవంబర్ 30: తుఫాన్ ప్రభావంతో రాగల రెండు రోజుల్లో గూడూరు డివిజన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డివిజన్ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా కోరారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తమ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. , అలాగే వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరకులు సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెవెన్యూ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.

గూడూరును ముంచెత్తిన భారీ వర్షాలు
* పలు ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు
* భయాందోళనలో ప్రజలు
గూడూరు, నవంబర్ 30: ఇటీవలి వరకు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన గూడూరు డివిజన్ ప్రజానీకం తిరిగి గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గత వారంలో కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తిరిగి గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ భారీ వర్షాలు ఏం కొంప ముంచుతాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగ్గా తిరిగి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తమకు ఏ విధమైన నష్టం కలిగిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం వేకువఝాము నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి. గూడూరు-విందూరు మార్గంలోని కైవల్యానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించి పోయాయి. అలాగే బాలాయపల్లి మండలం నిండలి వద్దనున్న ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో కూడా సోమవారం సాయంత్రం నుండి రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. ఇప్పటికే డివిజన్‌లో గతంలో కురిసిన వర్షాలకు చెరువులు తెగి పోవడం, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వచ్చిన నీరంతా సముద్రం పాలయ్యే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు గండ్లు పడిన చెరువులకు రింగ్‌బండ్‌లు కూడా వేయకపోవడంతో కురుస్తున్న వర్షపునీరు అంతా వృథాగా పోతోంది. రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన జిల్లాకు ఉండటంతో ప్రజలు ఈ వర్షాలు ఏ ముప్పు తెచ్చి పెడతాయోనని ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక పోవడంతో వర్షపునీటితో కలసి డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద రెండు అడుగుల మేర వర్షపునీరు చేరడంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన ఎపిఐఐసి చైర్మన్
తడ, నవంబర్ 30: మండల పరిధిలోని అక్కంపేట ప్రియదర్శిని కళాశాల సమీపంలోని ప్రభుత్వ భూములను ఎపిఐఐసి చైర్మన్ కిష్టయ్య సోమవారం పరిశీలించారు. మండల పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. పరిశ్రమలు స్థాపించుకునే వారికి ఇక్కడ స్థలాలను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్డీవో బాబయ్య ఉన్నారు.

అయ్యప్ప దేవస్థానంలో విశేష పూజలు
వేదాయపాళెం, నవంబర్ 30: వేదాయపాళెం వద్దనున్న అయ్యప్ప ఆలయంలో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మండల పూజలలో భాగంగా స్వామివారికి ఉదయం గణపతిపూజ, కలశపూజ, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీవేలి ఉత్సవం, సాయంత్రం పూలంగి సేవ, మహాదీపారాధన, మెట్ల పూజ నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సోమవారం స్వామివారికి నిర్వహించిన విశేష పూజలకు ఉభయకర్తలు గడ్డం రత్నయ్య, సుజాతమ్మ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పిటి రంగరాజన్, సభ్యులు శేషగిరిరావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

కన్నబాబు త్యాగం చేయాలి
* పార్టీ అధినేత చంద్రబాబు సూచన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 30: తెలుగుదేశం ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గూటూరు కన్నబాబు ఆ పదవిని త్యాగం చేయాలని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇన్‌చార్జి త్యాగం చేసినా తగిన ప్రాధాన్యత ఇస్తామే తప్ప, అన్యాయం జరగబోదని కూడా హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు సిఎం చంద్రబాబును సంప్రదించారు. జిల్లాకు చెందిన ప్రధాన రాజకీయ కుటుంబంలో కొనసాగుతున్న ఆనం సోదరులు తెలుగుదేశంలోకి పునఃప్రవేశంపై చర్చ సాగింది. ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతంలో చేసిన అభివృద్ధి దృష్ట్యా ఆయనకు సానుకూలత ఉందని, అందువల్ల పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్‌చార్జి ఇచ్చినట్లైతే పార్టీ మరింత పటిష్ఠమవుతుందనే బాబు అభిప్రాయంపై కన్నబాబు జవాబిస్తూ మీ ఆదేశం శిరోధార్యమని పేర్కొన్నారు. అయినాసరే నీకు తగిన ప్రాధాన్యత ఉంటుందని, అన్యాయం జరగబోదని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఆనం వివేకా విషయమై ఆయనను ముందుగా స్వాగతిస్తామని, పార్టీలో స్థానం సంగతి తరువాత చెబుతామని పేర్కొన్నారు. ఆయనతోపాటు వచ్చే మాజీ మేయర్ భానుశ్రీ, కార్పొరేటర్ పిండి సురేష్‌లపై కూడా అభ్యంతరాలు చెబుతుండగా బాబు వారించారు. అందరినీ స్వాగతించినా మన పార్టీలో వారికి ఇష్టానుసారం కొనసాగడం కుదరదు కదా! తేడా వస్తే ఆ తరువాత తేలుద్దామనేలా భరోసా ఇచ్చారు. ఇదిలాఉంటే ఆనం సోదరులు బుధవారం విజయవాడలో చంద్రబాబును కలవనున్నారు. అదే సందర్భంలో పార్టీలో చేరిక ఉంటుందనే సమాచారం వస్తుండగా, కేవలం ఆ రోజున మంతనాలు మాత్రమే ఉంటాయని, మరో రోజున ప్రవేశ ముహర్తం ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలాఉంటే చంద్రబాబును కలసిన వారిలో టిడిపి ఆత్మకూరు ఇన్‌చార్జి గూటూరు కన్నబాబుతోపాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎంఎల్‌సిలు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ ఉన్నారు.

మినుము రైతును ముంచిన వర్షాలు
* లబోదిబోమంటున్న అన్నదాతలు
ఆత్మకూరు, నవంబర్ 30: భారీ వర్షాలతో చేతికొచ్చే దశలో ఉన్న మినుము పంట కాస్తా మొలకెత్తడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. సరిగ్గా రెండు వారాల క్రితం వరకు ఇదే మినుము కర్షకులంతా నీటి తడి కోసం వెంపర్లాడారు. ఇదే సందర్భంలో ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం వారం రోజుల వ్యవధిలోనే చుట్టుముట్టింది. అప్పటివరకు మండుటెండలతో బెట్టకొట్టి ఉన్న పంట కాస్తా భారీ వర్షం తెచ్చిన తంటాతో ఒక్కసారిగా ఉరకెత్తింది. కొద్దిపాటి తడితో సాగు సమస్య పరిష్కృతమయ్యే దశ నుంచి అదే నీరు ముంచెత్తి పంట కోల్పోయే దుస్థితి ఏర్పడింది. ఎడతెరపి లేకుండా ఐదారురోజులపాటు కురిసిన వాన వల్ల మినుము పంటలో కాయలన్నీ బాగా తడిసి ముద్దయ్యాయి. ఎండి ఉన్న కాయకు ఒక్కసారిగా అవసరానికి మించి నీటి తడి సోకడంతో మొలకెత్తిపోయింది. ఎంతో ఆశలు పెట్టుకున్న పంట కాస్తా చేతికందకనే కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. మెట్ట రైతాంగం మినుము సేద్యంపై ప్రత్యేక ఆసక్తి కనబరచగా, వారికి రిక్తహస్తమే మిగిలినట్లైంది. తొలకరి వేళలో కురిసిన ఓ మోస్తరు వర్షంతో ఉత్సాహంగా మినుము సాగుకు పూనుకుని తుది విడతగా కురిసిన కుంభవృష్టితో అంతా పోగొట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో మినపప్పు ధర ఆశాజనకంగా పెరిగి ఉండటంతో మినుము పంటపై రైతులంతా ప్రత్యేక శ్రద్ధ చూపారు. చివరికి అసలు కూడా దక్కక పంట చేతికి రాకపోవడంతో దిగాలు పడిపోయారు. పంట చేలో వర్షపునీరంతా నిలిచిపోయింది. మొత్తమీద అనూహ్యంగా భారీ వర్షం నమోదు కావడం వల్ల ప్రధానంగా మెట్ట రైతాంగంలోని వివిధ రకాల పంటలు సాగుచేసిన వారందరిలోనూ కలవరం రేపుతోంది. పెసర పంటలో ఎండిన దశలో ఉన్న కాయలు కాస్తా నీటి చుక్క అతిగా తగలగానే మొక్క నుంచి కోయకనే పప్పు బద్ద రెండుగా పగిలిపోయాయి. అందులో నుంచి మొలక రావడంతో రైతన్న పెట్టుబడి, శ్రమ అంతా వృధాగా మారింది. ఆత్మకూరు, వింజమూరు మండలాల్లో ఎక్కువగా రైతులు నష్టపోయారు. ఈ రెండు మండలాలకు సరిహద్దుగా ఉన్న పడకండ్ల పంచాయతీ పరిధిలోని గండ్లవీడు, బొటికర్లపాడు తదితర గ్రామాల్లో రైతులంతా భారీగానే నష్టపోయారు. గత ఏడాది పొగాకు సాగులో నష్టాలు చవి చూసిన రైతన్న ఈ సంవత్సరం మినుము పంటతోనైనా ఆర్థిక పరిస్థితి సరిదిద్దుకుందామని ఆశించి నిలువునా కుంగిపోయారు. అనంతసాగరం మండలంలోని వివిధ గ్రామాల్లో మిరప సాగు చేస్తున్న రైతుల కంట్లో కారం కొట్టేలా ఇప్పటి భారీ వర్షం నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు సర్వేలు నిర్వహించి పంట నష్టంపై గణాంకాలు సేకరిస్తున్నారు. పరిహారం అసలు రైతుకు ఎంతమాత్రం దక్కుతుందనేది సందేహాస్పదమే. లాభం దక్కకపోగా అసలు మొత్తంలో ఏ కొద్దిగానో మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ రాజకీయ పలుకుబడి ఆధారంగానే నివేదికలు, సిఫారసులతో పరిహారం లభించనుండటం పరిపాటి. అనావృష్టిలో మొక్కవోని ధైర్యంతో మెట్ట రైతాంగం మినుము సాగుకు ఉపక్రమించారు. తీరా, అతివృష్టి కాస్తా పంట పొట్టన పెట్టుకోవడం ఎంతైనా బాధాకరమైన పరిణామం.