శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తెలుగు తమ్ముళ్లల్లో రగులుతున్న అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 9: ‘‘పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నాం.. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాం.. అప్పటి అధికారపక్షాన్ని ఎదిరించి పోలీస్ కేసులు సైతం భరించాం.. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఎదురుచూశాం, అయితే ఆ సంతోషం కొద్దిరోజులకే ఆవిరైపోతోందని’’ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారితో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలం నుండి పార్టీ జెండా మోస్తున్న తమను కాదని ప్రస్తుతం కొత్తగా వస్తున్నవారు పదవులు ఎగరేసుకుపోతున్నారన్నది ప్రస్తుతం జిల్లా టిడిపి కార్యకర్తల మనోగతం. 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా పార్టీలో అనేక మార్పులతో అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. అవకాశం కోసం కాచుక్కూర్చున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్దగా కష్టపడకుండానే పార్టీలో చేరడమే కాకుండా పదవులను సైతం పొందడం విశేషం. చాట్ల నరసింహారావు నిన్నటిదాకా ఆనం వారి అనుచరుడిగా ఉంటూ ఎన్నికలైన వెంటనే మంత్రి నారాయణ అనుచరుడిగా కొత్త అవతారం ఎత్తి వెంటనే ఆసుపత్రి కమిటీ చైర్మన్ బాధ్యతలు చేపట్టేశారు. అలాగే ఇటీవల పార్టీలో చేరిన ఆనం సోదరులు జిల్లా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. తరచూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా మంత్రి నారాయణపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన ఈగ వాలకుండా చూసే పనిలో పడ్డారు. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు అప్పజెప్పటంతో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి గత ఎన్నికల్లో ఓటమి చెందేదాకా పార్టీనే అంటిపెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న గూటూరు కన్నబాబుకు రిక్తహస్తమే మిగిలినట్లయింది. ఇక తాజాగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ టిడిపిలో చేరడంతో ఆ నియోజకవర్గంలో పార్టీల పరిణామాలు వేగంగానే మారిపోయాయి. గత ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టుకొని చివరకు ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ తరచూ పర్యటిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ జ్యోత్స్నలత పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. వైద్య వృత్తిని కూడా పక్కనబెట్టి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు పార్టీ ఎటువంటి దారి చూపుతుందో కాలమే నిర్ణయించాలి. నిన్నటిదాకా తమను ఇబ్బందులకు గురిచేసిన ఇతర పార్టీల నేతలు ప్రస్తుతం తమ పార్టీలోకి వస్తుండడం, పార్టీ వారికి రెడ్‌కార్పెట్ వేయడం మంచి పరిణామమే అయినా ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న కార్యకర్తలను, నేతలను విస్మరిస్తూ కొత్తవారికి అందలం అందించడం భావ్యంగా లేదని జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చీ రాగానే పదవులు పొందే సంస్కృతిని పార్టీ అధిష్ఠానం పునరాలోచించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు నగరస్థాయి నేతలు ఈ విషయంపై బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్తవారి వల్ల పార్టీకి మేలు జరుగుతుందో లేదో కానీ ఇప్పటిదాకా పార్టీలో ఉంటూ పార్టీనే నమ్ముకొని నడుస్తున్న వారికి మాత్రం అన్యాయమే జరుగుతోందనే సగటు టిడిపి కార్యకర్తల మనోవేదన.

తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలి
* ఎజెసి రాజ్‌కుమార్ పిలుపు
నెల్లూరు, ఏప్రిల్ 9: తెలుగు భాషాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన ఉగాది పురస్కార వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో తెలుగు భాషపై అభిమానం పెంచాలని, అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు మర్చిపోలేదని, వాటిని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతిఒక్కరూ స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ ప్రాచీన భాషగా తెలుగు భాషను గుర్తిస్తే రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషాభిమానులు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకునేందుకు కృషి చేయలని పిలుపునిచ్చారు. తెలుగు భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు రచయితల సంఘాలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ ఏడాది ఉగాది పురస్కారాన్ని గుత్తికొండ సుబ్బారావుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఆదిత్య, కృష్ణమూర్తి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, జివి సాంబశివరావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జయప్రకాష్, పాతూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరినీ ఈ సందర్భంగా సత్కరించారు.

ఎసిబిని ఆశ్రయించిన వ్యక్తిపై దాడి
* ట్రాఫిక్ పోలీసుల పాత్రపై అనుమానాలు
నెల్లూరు, ఏప్రిల్ 9: తనను లంచం డిమాండ్ చేసిన ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టించిన బాధితుడిపై కొందరు మహిళలు, పురుషులు కలసి దాడి చేసిన సంఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ట్రాఫిక్ పోలీసులు వెనక ఉండి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సేకరించిన సమాచారంతో పాటు బాధితుడి కథనం మేరకు.. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ప్లాట్‌ఫాంపై చెప్పుల దుకాణం నిర్వహించే మహ్మద్ యూసఫ్ అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నార్త్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఎన్.రామారావు ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. యథావిథిగా తన దుకాణం వద్ద వ్యాపారం చేసుకుంటున్న యూసఫ్‌పై పక్కనే పండ్ల వ్యాపారం చేసుకుంటున్న కొందరు మహిళలు దాడి చేసి కొట్టారు. దాడి చేసే సమయంలో ‘నీకెందుకురా.. పోలీసోల్ని పట్టించేంతవాడివా’ అంటూ అతడిని దుర్భాషలాడుతూ కొట్టారు. దీంతో తిరిగి ఎసిబి అధికారులకు సమాచారమిచ్చి వారి సూచన మేరకు 3వ నగర పోలీసులను యూసఫ్ ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న 3వ నగర సిఐ రామారావు, ఎస్సై రామకృష్ణలతో కూడిన బృందం దాడికి పాల్పడిన మహిళలను పోలీస్‌స్టేషన్ తరలించారు.
పోలీసుల ఎదుటే బాధితుడిపై దాడి
దాడికి పాల్పడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఒక మహిళ యూసఫ్‌ను తిడుతూ వారి ఎదుటే కాలితో కొట్టడం విశేషం. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకునే మహిళలు తమకు సంబంధం లేని వ్యక్తిపై ఇంతగా దాడి చేయడం వెనుక ట్రాఫిక్ పోలీసుల పాత్రపై ఎసిబి అధికారులకు అనుమానం ఏర్పడింది. తాము ఏదైన మాట్లాడడమో, చర్యలు తీసుకోవడమో జరిగితే తిరిగి తమకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని భావించి కొందరు నార్త్ ట్రాఫిక్ సిబ్బందే సదరు మహిళలను ఉసిగొల్పి దాడి చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. బాధితుడు సైతం ఇదే సందేహాన్ని అధికారుల ఎదుట ప్రస్తావించడం గమనార్హం. దాడి సంఘటనను తెలుసుకున్న ఎసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ సంఘటనా స్థలానికి వచ్చి సదరు పండ్ల వ్యాపారులను మందలించడంతో పాటు ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారించారు.

వడదెబ్బకు వ్యక్తి మృతి
నెల్లూరు, ఏప్రిల్ 9:స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డులోని రైల్వే డిఎస్పీ కార్యాలయం ఎదుట ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని శనివారం 3వ నగర పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామానికి చెందిన చాపలపల్లి ఆనందరెడ్డి (40) అనే వ్యక్తి నెల రోజుల కిందట బేల్దారి పనుల నిమిత్తం నగరానికి వచ్చాడు. శనివారం ఎండ తాకిడికి అనారోగ్యానికి గురై మరణించి ఉంటాడని మృతుడి భార్య సుప్రజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ నగర ఎస్సై జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కార్యకర్తలకు అండగా టిడిపి
* ఎమ్మెల్సీ సోమిరెడ్డి భరోసా
వెంకటాచలం, ఏప్రిల్ 9: ఇటీవల కృష్ణపట్నం పోర్టు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చవటపాళెం గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు లంకేపల్లి రఘురామయ్య, ఎస్సీ కాలనీ చెందిన పార్టీ కార్యకర్త తలపాక రాజీవ్‌గాంధీ మృతి చెందారు. కాగా శనివారం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చవటపాళెం గ్రామానికి విచ్చేసి మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుందని, వారి శ్రేయస్సు కోసం తమ యువనాయకుడు నారా లోకేష్‌బాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తలకు ప్రమాద బీమా వచ్చేందుకు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ యువ కార్యకర్త రాజీవ్‌గాంధీకి చిన్నపిల్లలు ఉండటంతో ఈ విషయాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకునివెళ్లి ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని ఆయన వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడ ఉన్న స్థానిక రైతులను ఆయన పలుకరించి వరి దిగుబడి గురించి ఆరా తీశారు. రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఆయన వెంట చవటపాళెం ఎంపిటిసి సభ్యులు ఎం కోదండయ్యనాయుడు, ఉప సర్పంచ్ కందిమళ్ల శ్రీనివాసులునాయుడు, నాయకులు ఎం శ్రీనివాసులు నాయుడు, మల్లికార్జున్, ఇర్లపల్లి రామయ్య, కె భాస్కర్, వెంకయ్య, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యదర్శి ఆరుముళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలి
* రైతుల ఆందోళన
మనుబోలు, ఏప్రిల్ 9: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మండల పరిధిలోని మడమనూరు గ్రామంలోని ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద రైతులు శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం నుంచి 3.2 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఈ కేంద్రానికి కేవలం ఒక మిల్లర్‌ను మాత్రమే కేటాయించారని, ప్రస్తుతం ఆ మిల్లరు గ్యారెంటీ పరిమితి అయిపోవడంతో కొనుగోలు చేయడం నిలిపి వేశారన్నారు. దీంతో తాము పండించిన ధాన్యం పొలాల్లోనే ఉంచుకుని పడిగాపులు కాస్తున్నామన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు పుట్టి 10 వేల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దళారుల చేతిలో మోసపోవద్దని, ప్రభుత్వం ఎన్ని టన్నుల ధాన్యమైన కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా ప్రచారం చేస్తు రైతులను అవహేళన చేస్తోందని అక్కంపేట సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులకు గోతాలు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. కల్లాల్లో ధాన్యం నిల్వ చేయడం వల్ల తేమ శాతం తగ్గిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై నిర్వాహకులను వివరణ కోరగా తమను తహశీల్దారు ఇకపై రైతులకు గోతాలు ఇవ్వవద్దని చెప్పడంతో నిలిపివేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట, మడమనూరు, పర్లపాడు, వీరంపల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఘనంగా సంగమేశ్వరునికి గ్రామోత్సవం
కోట, ఏప్రిల్ 9: మండలంలోని గూడలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భృంగిసేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దివంగత అల్లారెడ్డి శ్యామసుందరరెడ్డి కుటుంబీకులు ఉభయకర్తగా దేవతామూర్తులకు భృంగిసేవ, గ్రామోత్సవం చేయించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం దేవాతామూర్తులకు రావణసేవ, గ్రామోత్సవం జరుగుతుందని ఉత్సవ కమిటీ వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి తారకేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

నీటి గుంతలో పడి చిన్నారి మృతి
ఓజిలి, ఏప్రిల్ 9: మండలంలోని పునే్నపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వరదారెడ్డికండ్రిగ గ్రామంలో శనివారం నవీన్ (3) అనే చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బిడ్డ మృతి చెందడంతో తల్లి రేణుక బోరున విలపించింది.

కన్నులపండువగా శ్రీవారి కల్యాణం
ముత్తుకూరు, ఏప్రిల్ 9: మండలంలోని కప్పలదొరువు గ్రామంలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమం ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త వేణుంబాక వెంకటశేషాద్రిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. కల్యాణం అనంతరం పల్లకీసేవ మహోత్సవం నిర్వహించారు. తదుపరి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎనిమిది సంవత్సరాలుగా ఆలయంలో కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.

వైభవంగా సింహ వాహన సేవ
సంగం, ఏప్రిల్ 9: సంగంలోని కామాక్షీదేవి సమేత సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సింహ వాహనంపై సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజల తరువాత ప్రారంభమైన ఉత్సవం శనివారం వేకువజాము వరకు గ్రామ పురవీధులలో అంగరంగ వైభవంగా సాగింది. పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

బిలకూట క్షేత్ర నాథుడికి ఏకాంత సేవ
బిట్రగుంట, ఏప్రిల్ 9: బోగోలు మండలం బిలకూట క్షేత్రంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అనంతరం 16 రోజుల పండుగ శుక్రవారం రాత్రి వేదపండితులు జరిపారు. శనివారం స్వామివారికి ప్రధాన అర్చకులు వేదగిరి వెంకట లక్ష్మీనరసింహచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారికి పొంగళ్లు పెట్టారు. నెల్లూరుకు చెందిన గొర్రెపాటి సుగణమ్మ, కుమారులు మల్లికార్జునరెడ్డి, రామకోటారెడ్డి మధ్యాహ్నం అన్నదానానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయింత్రం ఆలయం ఆవరణలోని సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామివారికి భక్తుల సమక్షంలో ఊంజల సేవను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, అంజిరెడ్డి, స్థానిక నేతలు, భక్తులు పాల్గొన్నారు.