నెల్లూరు

మహిళా దినోత్సవం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైమ్ చూస్తే 7 గంటలైంది. ‘ఏమిటి ఇవాళ ఇంత నిద్రపట్టేసింది’ అనుకుంటూ బ్రష్ తీసుకుని బాత్‌రూంలోకి పరిగెత్తింది. ఫ్రిజ్‌లోంచి పాలు తీసి కాఫీ కలుపుకుని తాగింది. పనిమనిషి లక్ష్మి రోజూ 6 గంటలకే వస్తుంది. ఇవాళ ఇంకా రాలేదేంటబ్బా.. అనుకుంటూ గబగబా కుక్కరు పొయ్యిమీద పెట్టింది. ఇంతలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భర్త వినయ్ తిరిగి వచ్చాడు. అతనికి కూడా కాఫీ కలిపి ఇచ్చింది.
‘ఏంటీ! మేడమ్‌గారు ఇప్పుడే నిద్రలేచినట్లున్నారు’? అన్నాడు.
‘మెలకువ రాలేదండీ’.
‘ఏం! నీ కుడిభుజం రాలేదా?’ హాస్యమాడాడు వినయ్.
‘మీకేం బాబూ..! ఎన్నైనా చెప్తారు. పేపర్ చదివి ఆఫీసుకు వెళ్లడమే కదా మీ పని. నాకు బోలెడు పనులున్నాయి. వీలైతే కాస్త వంటలో సాయం చేయొచ్చు కదా?’ అడిగింది సుధ.
‘బాబోయ్! ఆ వంట తంటా నాకొద్దు తల్లీ! కావాలంటే బాటిల్స్‌లో నీళ్లు పోయడం లాంటి పనులైతే ఓకే’ అని ఆఫర్ ఇచ్చాడు వినయ్.
‘అయ్యో! అంత శ్రమ మీకెందుకండీ. ఆ పనులేవో మేం చూసుకుంటాం’ అని కోపంగా కిచెన్‌లోకి నడిచింది సుధ.
ఇంతలో సెల్ మోగింది. ఎవరా అని చూస్తే పనిమనిషి లక్ష్మి. ‘దీనికేమొచ్చిందో’.. అనుకుంటూ ఫోన్ ఎత్తింది.
‘అలో అమ్మగారండీ! నేను లక్ష్మినండి’.
‘నీ నెంబరు చూస్తే నాకు తెలీదా. ఏంటి ఇంకా రాలేదు?’ అడిగింది సుధ. ‘మరేనండి ఇవాళ మన పండుగట కదమ్మా’.
‘మన పండుగేంటే’ విసుగ్గా అడిగింది.
‘అదేనమ్మగారూ! ఆడోళ్ల దినమట కదా! అందుకని మా పక్కింటి సుబ్బులు పనికి వెళ్లొద్దే., ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామని అంది అమ్మగారూ’.
‘నిన్న చెప్పి చావొచ్చుకదే. ఇప్పుడు చెబితే నాకెంత ఇబ్బందో నీకు తెలీదా?’ కోప్పడింది సుధ.
‘తెలుసమ్మగారూ! అది పనిచేసే ఇంటి అమ్మగారు ఆడోళ్ల దినం కాబట్టి మేం బయట భోంచేస్తాం. నువ్వు పనిలోకి రావద్దే.. అని రాత్రి చెప్పిందట. ఇది నాతో పొద్దున్న చెప్పింది. ఇవాల్టికి ఎలాగో సర్దుకోమ్మా. రేపు పొద్దునే్న వచ్చేస్తాగా’ అని మరోమాటకి ఆస్కారం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది లక్ష్మి.
అప్పుడే టీవీలో ‘మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ప్రకటన వస్తోంది.
‘ఓహో.. లక్ష్మి చెప్పే ఆడోళ్ల దినం ఇదా!’ అనుకుని సుధ పనిలో మునిగిపోయింది.
‘ఏంటోయ్! లక్ష్మీ ఫోన్‌లా ఉంది. ఏమంటోంది?’ అడిగాడు వినయ్.
‘ఇవాళ ఉమన్స్ డే సెలబ్రేషన్స్‌ట. అందుకని రాదుట. అది చెప్పడానికి ఫోన్ చేసింది’.
‘నిన్ను చీఫ్ గెస్ట్‌గా రమ్మనలేదా?’ పళ్లికిలిస్తూ అడిగాడు వినయ్.
‘మీకు ఇబ్బందని నేనే కుదరదన్నానులెండి’ మరోమాటకు అవకాశమివ్వకుండా సమాధానం చెప్పింది సుధ.
గబగబా టిఫిన్ రెడీ చేసి, వంట చేసేసింది. పిల్లలకి, వినయ్‌కి క్యారేజీలు పెట్టి వాళ్లందరినీ పంపేసరికి 9.30 అయింది. వెంటనే తను కూడా రెండు ఇడ్లీలు తిని ఆఫీసుకి బయలుదేరింది.
వినయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుధ ఎస్‌బిఐలో ఉద్యోగి. వారిద్దరి ఆఫీసులు వేర్వేరు రూట్లలో ఉండటంతో సుధ రోజూ ఆఫీసుకి బస్సులోనే వెళ్తుంది. బస్టాపులోకి వచ్చేసరికి రోజూ టైమ్‌కి వచ్చే బస్సు ఈరోజు అరగంట ఆలస్యంగా వచ్చింది. లేట్‌గా వస్తానని చెప్దామని మేనేజర్‌కి ఫోన్ చేస్తే ‘బిజీ టోన్’ వచ్చింది. పక్కసీటులో కూర్చునే తన ఫ్రెండ్ శైలజకి ఫోన్‌చేసి విషయం చెప్పింది.
ఇంతలోనే బస్సు వచ్చింది. ఆఫీస్ టైమ్ కావడంతో అది నిండు గర్భిణిలా ఉంది. కాలు పెట్టడానికి కూడా చోటులేదు. బ్యాంక్‌కి వెళ్లడానికి అదొక్కటే బస్సు కావటంతో ఎలాగోలా ఎక్కేసి లోపలికి వెళ్లింది సుధ. అక్కడ లేడీస్ సీట్లలో ఇద్దరు మగవాళ్లు కూచుని ఉన్నారు. ఇద్దరూ వెకిలి కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వుతున్నారు. ఇదిచూసి సుధకి వళ్లు మండిపోయింది. వారి దగ్గరికి వెళ్లి ‘ఏయ్ మిస్టర్! ఇవి లేడీస్ సీట్లు కదా! మీరు కూర్చున్నారేంటి. లేవండి’ అని అడిగింది. వాళ్లు వినిపించుకోనట్లుగా నటించారు.
బ్యాంక్‌కు చేరేసరికి 10.30 అయింది. గబగబా సీటులో కూర్చుని అటెండర్ రామును పిలిచి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురమ్మంది.
‘రిజిస్టర్ సార్ దగ్గర ఉందమ్మా’ అని చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయాడు.
‘ఎందుకు కంగారు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని?’ పలుకరించింది శైలజ.
‘ఏం లేదు. ఇవాళ పనిమనిషి లక్ష్మి సడన్‌గా హ్యాండిచ్చింది. దాంతో లేటయింది. బాస్ మూడ్ ఎలా ఉంది?’.
‘ఇవాళ చాలా హాట్‌గా ఉన్నారు. ఇప్పుడే వచ్చి అందరినీ కరిచి, సారీ.. అరిచి వెళ్లారు. నిన్ను కూడా అడిగారు. ఏదో చెప్పాలే! తొందరగా వెళ్లి నీ కోటా అట్లు, సారీ.. తిట్లు తినిరా!’ అంది శైలజ.
నెమ్మదిగా మేనేజర్ రూం దగ్గరికి వెళ్లి డోర్‌మీద కొట్టి ‘మే ఐ కమిన్ సార్?’ భయపడుతూ అడిగింది సుధ.
ఆయన లాప్‌టాప్‌లోంచి నెమ్మదిగా తల పైకెత్తి చూసి నవ్వుతూ ‘రండి మేడమ్’ అని ప్రసన్న వదనంతో ఆహ్వానించారు.
అమ్మో! ఇవాళ భూకంపం రావడం ఖాయమనుకుంటూ లోపలికి నడిచి ‘రిజిస్టర్ సార్!’ అడిగింది.
ఆయన ‘ఓ ష్యూర్’ అని అందించారు.
ఎప్పుడు లేట్‌గా వచ్చినా అరగంట క్లాస్ పీకే ఈయనకి ఏమైందబ్బా? కొంపదీసి మహిళా దినోత్సవమని ఊరుకున్నారా? అని ఆలోచిస్తూ గబగబా సంతకం చేసి బయటికి రాబోయింది.
‘సుధగారూ! చిన్న మాట’ అని ఆపారు మేనేజర్.
‘ఏంటి సార్?’ అడిగింది.
‘మరేం లేదు. ఇవాళ మన క్యాషియర్ రమణ గారు, క్లర్క్ శ్యామ్ గారు సెలవు పెట్టారు. కొంచెం మీరు క్యాష్ కౌంటర్ చూసుకోండి. మీరింకా రాలేదని అందాకా రాణిని చూడమన్నాను. మీకు తెలియనిదేముంది, ఆమె డల్ కదా? మీరైతే బాగా హ్యాండిల్ చేయగలరు!’ అని సుధ మొహాన ఒక ప్రశంస పడేసి ఆమె సమాధానం కూడా వినకుండానే కంప్యూటర్‌లోకి తలదూర్చేశారాయన.
ఇక చేసేదేమీ లేక బయటికి వచ్చి సీటులో కూలబడింది సుధ.
‘ఏంటి? మొహం అలా పెట్టావు. ఇంకా పావుగంటకీ రావనుకుంటే గోడకి కొట్టిన బంతిలా అప్పుడే వచ్చేశావు. కొంపదీసి లీవ్ పెట్టి వెళ్లిపొమ్మన్నారా?’ అని ఆత్రంగా అడిగింది శైలజ.
‘అంత అదృష్టం కూడానా తల్లీ! అవసరం ఆయనది కదా, అందుకని మెత్తగా మాట్లాడి పంపేశారు’ చెప్పింది.
‘ఏంటట?’ అడిగింది శైలజ.
‘ఆయన అస్మదీయులు రమణ, శ్యామ్ సెలవుట. వాళ్ల డ్యూటీ అప్పగించడానికే నాపై కరుణాకటాక్షాలు’ అంది సుధ.
‘అదా సంగతి! ఇప్పుడే అనుకుంటున్నా, అయ్యగార్లు ఇంకా ఊడిపడలేదేమిటా అని’ అంది శైలజ వెటకారంగా.
బాస్ పురుష పక్షపాతి. ఆఫీసులో ఆయన కాక ఇద్దరే మగవాళ్లు. స్వజాతి మమకారంతో ఆయన ప్రతి విషయానికి తిట్టేస్తుంటారు.
సరే ఇంక తప్పదు కదా అనుకుంటూ క్యాష్ కౌంటర్‌లో కూచుంది సుధ. ముందు రెండురోజులు సెలవు కావడంతో జనం బాగా ఉన్నారు. గబగబా పనులన్నీ క్లియర్ చేసేసరికి లంచ్ టైమైంది.
బాక్స్ తీసుకుని డైనింగ్ హాల్‌లోకి వెళ్లింది. అప్పటికే లేడీసంతా బాక్స్‌లు ఓపెన్ చేసి తింటున్నారు.
‘ఏం కూర?’ అడిగింది శైలజ.
‘సొరకాయ’ అని చెప్పి లక్ష్మి ఫోన్ సంగతి వాళ్లకి చెప్పింది సుధ. అందరూ పగలబడి నవ్వారు. ‘పోనే్ల.. మనకెలాగూ గతిలేదు. వాళ్లనైనా సెలబ్రేట్ చేసుకోనీ!’ అన్నారంతా.
అప్పుడు శైలజ అందుకుంది. ‘మహిళా దినోత్సవమనేనా, మన మగమహారాజులు సెలవు తీసుకున్నారు’ అంది అక్కసుగా.
ఇక ఆడవాళ్ల బాధలు, మగవాళ్ల పెత్తనాల గురించి చెప్పుకుని, లంచ్ ముగించి వెళ్లారు. క్యాష్ అంతా లెక్కచెప్పి బ్యాంకులోంచి బయటపడేసరికి ఏడయింది. ఇవాళ బాగా అలసటగా ఉంది. బస్సులో వెళ్లలేనేమో అనుకుంటూ, స్కూటర్ మీద తీసుకెళతారేమోనని భర్త వినయ్‌కు ఫోన్ చేసింది సుధ.
నాలుగు రింగుల తర్వాత ఫోన్ ఎత్తాడు వినయ్.
‘హలో డియర్! నీకు నూరేళ్ల ఆయుష్షు. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నువ్వే చేశావు’ అన్నాడు.
‘ఆఁ ఏం లేదండీ! బాగా అలసటగా ఉంది. వచ్చి నన్ను తీసుకెళతారేమోనని అడుగుదామని’ అని నీరసంగా అడిగింది.
‘అయ్యో! అలాగా. సారీ డియర్! నేను రాలేను. నా ఫ్రెండ్ ఉదయ్ అమెరికా నుంచి నెలరోజుల క్రితం వచ్చాడని చెప్పాకదా. వాడు పొద్దున ఇక్కడకు వచ్చాడట. హోటల్‌లో దిగాడట. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. అందుకే సెలవుపెట్టి వాడితో ఉన్నాను’.
‘ఓ అలాగా! సరేలెండి. నేను ఇవాళ్టికి ఆటోలో వెళ్లిపోతాను’ చెప్పింది సుధ.
‘మరి బ్యాంకు దగ్గరికి ఆటోలు రావుకదా?’.
‘చూస్తాలెండి’
‘ఇవాళ బాగా లేటయింది. మరి లక్ష్మి రాలేదు కదా. పిల్లల సంగతేంటి’. అడిగాడు వినయ్.
‘పక్కింటి పిన్నిగారికి ఫోన్ చేసి చెప్పాలేండి, వాళ్లింట్లో కూచోపెట్టుకోమని’ చెప్పింది.
‘దట్స్ గుడ్. మరి నువ్వేమనుకోనంటే ఒక చిన్న రిక్వెస్టు. ఉదయ్ ఫ్లైట్ రాత్రి 11 గంటలకట. అందుకని రాత్రి మనింటికి డిన్నర్‌కి రమ్మన్నాను. పర్వాలేదా’ అనునయంగా అడిగాడు.
ఓహో! డియర్ సంబోధన ఇందుకా?.. మనసులోనే అనుకుంది సుధ.
‘అమ్మో నా వల్లకాదు. బ్యాంక్‌లో అసలే పని ఎక్కువై అలిసిపోయి ఉన్నాను. ఏదైనా హోటల్‌కి తీసుకెళ్లండి’ అంది.
‘నిజమే. నేను కాదనడం లేదు. కానీ వాడు ‘హోటల్ తిండి తినీతినీ విసిగిపోయాడు. ఇంటి వంట తినాలని ఉందిరా. అందులో మీ మిసెస్ వంట బాగా చేస్తుందని మన ఫ్రెండ్స్ చెప్పారు’ అన్నాడు. అలా అన్నాక కూడా పిలవకపోతే ఏం బావుంటుంది చెప్పు! నినే్నమీ ఇబ్బంది పెట్టంలే. మేము కబుర్లు చెప్పుకుని తొమ్మిదింటికి వస్తాం. వాడు పదింటికల్లా వెళ్లిపోతాడు. ఈ ఒక్కరోజుకి కష్టపడు. కావాలంటే రేపు నేను హెల్ప్ చేస్తాను’ అని బతిమాలాడు వినయ్.
ఇక కాదనక తప్పలేదు సుధకి. ఉసూరుమంటూ బయలుదేరింది. బస్టాపు దాకా వచ్చేవరకు ఆటో దొరకలేదు. ఆటో ఎక్కాక ఇంట్లో కూరలు లేని విషయం గుర్తుకొచ్చింది. దారిలో ఆపి కూరలు, రాకరాక ఆయన ఫ్రెండ్ భోజనానికి వస్తే స్వీటు లేకపోతే ఏం బావుంటుందని గులాబ్‌జామ్ ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి వెళ్లింది. పక్కింటి పిన్నిగారింటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చి వాళ్లకి స్నానం చేయించింది. గబగబా కూర, చట్నీ, సాంబారు, స్వీటు, హాట్ సిద్ధం చేసింది. వంట అయ్యేసరికి 9 గంటలయింది. పిల్లలకు భోజనాలు పెట్టేసింది. అంతలోనే భర్త వినయ్, అతని ఫ్రెండ్ ఉదయ్ రానే వచ్చారు. ‘రండి ఉదయ్ గారూ! బావున్నారా? కుశల ప్రశ్నలడిగింది సుధ.
‘బావున్నానండీ! మీరు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు.
‘బాగానే ఉన్నానండీ’ చెప్పింది సుధ.
‘ఏరా వినయ్! పిల్లలు ఏరి?’ అడిగాడు ఉదయ్.
అబ్బాయ్ వరుణ్‌ని, అమ్మాయి సాహితిని పిలిచాడు వినయ్.
వాళ్లు రాగానే ‘హాయ్ కిడ్స్’ అని వాళ్లిద్దరినీ దగ్గర కూచోబెట్టుకుని బిస్కెట్లు, బొమ్మలు ఇచ్చాడు వినయ్. తను చిన్నప్పుడు చేసిన అల్లరి చెప్పి వాళ్లని కాసేపు నవ్వించాడు.
10 గంటలకు భోజనాలు పెట్టింది సుధ. ఐటమ్స్ అన్నీ ఎంతో బావున్నాయని, ఇలాంటి భోజనం తిని ఎన్నో రోజులైందనీ అన్నాడు ఉదయ్. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకి బయలుదేరాడు. అతన్ని ఫ్లైట్ ఎక్కించి వస్తానని వినయ్ కూడా వెళ్లాడు. కిచెన్ అంతా సర్దుకుని వచ్చి చూసేసరికి పిల్లలు నిద్రపోతూ కనిపించారు. పాపం చూసిచూసి పడుకున్నట్టున్నారు అనుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూచుంది సుధ. టైమ్ చూస్తే 11.30 అయింది. పొద్దున ఆరింటికి లేస్తే ఇప్పటికి తీరుబాటయింది అనుకుంటూ టీవీ ఆన్ చేసింది. అందులో ‘మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వస్తున్న ప్రకటన వెక్కిరిస్తున్నట్లు కనిపించింది. ఈరోజంతా తాను పడిన పాట్లు గుర్తొచ్చి ‘మహిళలకు ఉత్సవాలా?’.. అంటూ నిట్టూర్చింది పాపం సుధ.

- కూచిమంచి పద్మావతి,
చరవాణి : 9000323764

పుస్తక సమీక్ష

వెంకయ్యస్వామికి భక్తి సమర్పణ ‘శ్రీ స్వామిపూజ’

నెల్లూరు జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకయ్యస్వామి. ఆయన అవధూతగా తనవుచాలించినా దేశ దేశాల ప్రజల మనస్సుల్లో కొలువైన స్వామి వెంకయ్యస్వామి. ఆయన సంచరించిన స్థలం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామం. ఆ గ్రామంలో ఆయన కొలువైన ఆలయం నిర్మాణం, నిర్వహణ అద్భుతమని చెప్పక తప్పదు. ఎంతో మహిమాన్విత మైన స్వామిని ఆరాధించి వృద్ధిలోకి వచ్చినవారెందరో ఉన్నారు. వెంకయ్యస్వామి ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే నిత్యధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యోత్సవ, వారోత్సవ,పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ సేవలూ జరుగుతున్నాయి. ఆశ్రమ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో వెంకయ్యస్వామి ఆలయం వృద్ధి చెందింది. ఆయన మహిమలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆయన్ని సదా కొలుచుకునేవారికి ఆయన మహిమలు నిత్యఅర్చన విధి విధానాలు పుస్తక రూపంలో అందించాలన్న కోరిక ఆయన భక్తుడు అల్లు భాస్కర్‌రెడ్డికి కలిగింది. కలిగిందే తడవుగా చిన్న పుస్తకాన్ని ముద్రించి భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. సాధారణంగా దేవీ దేవతా మూర్తులు ఆరాధన, స్తుతి, పూజావిధానాది పుస్తకాలు మార్కెట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. కాని వెంకయ్యస్వామి వైభవంపై అనేక పుస్తకాలు, సిడిలు వెలువరించినప్పటికీ నిత్యపూజ అర్చనపై పుస్తకం రావడం భక్తుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. సన్నిధి ప్రచురణల కేంద్రం ద్వారా ఈపుస్తకం భక్తులకు అందుబాటులో ఉంది. ఇందులో స్వామివారి దండకం, స్తుతి, షోడస ఉపచార పూజ, అధాంగ పూజ, అష్టోత్తర నామాలు, మంగళ హారతి తదితర అంశాలు కూలంకషంగా ఉన్నాయి. ఈ పుస్తకం భక్తులు చేతిలో ఇమిడిపోయే చిన్న పుస్తకం కావడం గమనార్హం. భక్తులు పుస్తకాన్ని జేబులో ఉంచుకుని తమకు తోచినప్పుడు స్వామివారి కీర్తిని స్తుతించుకోవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
-గౌతమి
9347109377

ప్రతులకు
సన్నిధి ప్రచురణలు
పబ్లిషర్ అల్లు భాస్కర్‌రెడ్డి
నెం:8, కావేరి ఎస్టేట్
మినీ బైపాస్‌రోడ్డు, నెల్లూరు
ఫోన్: 9885267879

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

చిరుకవిత

గాలిపటం
విహరించే విహంగాలలో
ఒకటవ్వాలని
వినువీధిన తారాడే మబ్బులను
ముద్దాడాలని
తళతళలాడే తారలనందుకోవాలని
శూన్యాకాశంలో స్వేచ్ఛగా విహరించాలని
ఆశగా పరుగెత్తుతుంది పతంగం
గమ్యాన్ని చేరుకోలేననే అధైర్యం లేదు
దారం తెగుతుందన్న భయం లేదు
మనసులో వున్నది తపన
వెనకడుగు వేయని పట్టుదల
కానీ ఆధారం మాత్రం
ఆ దారం ఒక్కటే
మరి మనం
సర్వాంగ సంభరితులం
అండదండలన్నీ పుష్కలం
అయినా
మదినిండా అయోమయం
ఆలోచనలన్నీ అస్తవ్యస్తం
గమ్యం తెలియని ప్రయాణం
ఒడిదుడుకుల జీవితం
బ్రతుకంతా ఊగిసలాట
భ్రమలలోనే వెతుకులాట
ఎంతకాలం ఇలా సాగుదాం?
ఇకనైనా మేలుకుందాం
గాలిపటాన్ని ఆదర్శంగా చేసుకుందాం
గాలివాటపు పయనాన్ని
మార్చుకుందాం..!

- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
చరవాణి : 90520 48706

మనోగీతికలు

ఉగాది వెళ్లిపోయిందా..!
కోయిలల కుహూ కుహూ రాగాలు
కోడిపుంజుల మెల్కొలుపులు
కనపడలేదు.. వినపడలేదు
కరవు కోరల్లో మోడువారిన చెట్లు
కూలీనాలీ లేక మాడే కడుపులు
వీటిని చూస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

ఊగేందుకు ఊరు ముందర చెట్లు లేవు
ఆడేందుకు ఊరవతల గట్లు లేవు
ఊరపిచ్చుకల అలికిడి లేదు
ఊరకుక్కల అరుపులు తప్ప
ఉదయాస్తమానాలు లేవు
ఉరుకులు పరుగులు తప్ప
వీటిని గమనిస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

వేప పువ్వు కోసం వెంపర్లాట
మామిడి పిందె కోసం దోబూచులాట
చింత పులుపు కోసం కోతాట
వెలగపండు కోసం వెయ్యిపాట్లు
వీటిని చూడకనే ఉగాది వెళ్లిపోయిందా!

అంతా యాంత్రిక జీవనమే
కృత్రిమ ప్రేమలు
కొలబద్దలు అనురాగాలు
నీకేమైనా ఇస్తే నాకేమొస్తుంది
వీటిని పరికిస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

వెళ్లింది మన్మథనామం
వచ్చింది దుర్ముఖి ఉగాది
దుర్ముహుర్తాలే వస్తాయో
దుష్టులే వస్తారో
దుర్మార్గులే తరలుతారో
దుఃఖాలే మిగులుతాయో
ఓ దుర్ముఖీ
దుష్టులను సంహరించు
దుఃఖాలను దూరంగా వుంచు
సుఖశాంతులను పెంపొందించు
అష్టైశ్వర్యాలను కలిగించు
అందరిని ఆనందింపు
గుర్తుగా గుర్తుంచుకుంటాం..!

- కటారి రామయ్య, సదుం
9704025771

ఇసకేరా
అన్నింటికి మూలం
ఇసకేగా అన్నిటికి మూలం
ఆ ఇసకలేనిదే నిర్మాణాలు శూన్యం
ఇసకను సులువుగా చూడకురా
ట్రక్కు ట్రక్కు ఇసకను కుప్పలు చేయరా
కుప్ప చేసి డబ్బులు కూడబెట్టరా
ఇసక రాశులున్నప్పుడే లక్షలు చేకూరునూ
అందుకే ఇసక విలువ తెలుసుకొని నడవరా!

వాగైనా వంకైనా ఓకేరా
కాలువైనా నదియైనా ఫరవాలేదురా
డ్యాములైనా, చెక్‌డ్యాములైనా సరేలేరా
కాలుష్యం గొడవ మనకొద్దురా
ఎవరెటు పోయినా మనకెందుకురా
వీలైతే సీనరేజ్‌లు ఎగరెయ్యరా
వీలైనంత స్విస్ బ్యాంకులో నిల్వచేయరా!
ఏదైనా ఏమైనా చేసి నీవు లీజు పట్టురా
లీజు రాకున్న రాజకీయం రగిలించుమురా
ఎవరైనా ఎదురొచ్చిన లెక్క చేయకుమురా
ధైర్యముతో తెగ దోపిడి చేయమురా
దోచేసి పెద్దమనిషిగా చలామణి కమ్మురా!

ఎల్లప్పుడు పదవిలో ఉంటేటట్లు చూసుకోరా
అది లేనప్పుడు
మన వారెవరైనా వుండేటట్లు చేసుకోరా
ఇసకే కదా అని నిర్లక్ష్యం చేయబోకురా
సోమరిగా నీవు నీ పనులు
పరులకప్పగించకురా
ఎంత నమ్మితే అంత మంచిదని నటించుమురా
అనవసరంగా అందరిని నమ్మవద్దురా
అడుగడుగున
సొంత లాభము చూసుకొమ్మురా
నమ్మకంగా నీ పనులు చక్కపెట్టుకొమ్మురా
లక్షలక్షలు కూడబెట్టిననాడే
జనం నిను గౌరవించురా
అది లేనప్పుడు నీవు గుడ్డికాసుకు లెక్కకాదురా
ఇసక ఉచితమనేది ఒక నాటకమురా
అధికారులు తనవారిని కాపాడే కపటనీతిరా!

ఉచితముగా ఏ వస్తువు వస్తుందిరా
కరెంటా? నీరా? తిండా? బట్టా? నీడా?
నిత్యావసర వస్తువులా?
ఏది ఉచిత వస్తువురా?
సరసమగు ధరకు వస్తువస్తే అది చాలురా
అన్నింటిని సామాన్యులు కొనక తప్పదురా
కొని స్థిమితంగా జీవించుమురా..!

- లక్కరాజు శ్రీనివాసరావు. అద్దంకి
చరవాణి : 9849166951
email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882
merupunlr@andhrabhoomi.net

- కూచిమంచి పద్మావతి