నెల్లూరు

సినిమా చూపిస్తా మామా..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మ్‌నగర్‌లో డింగ్‌డాంగ్ సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ నూతన వధువులా ముస్తాబై ఉంది. కారణం మరికొద్ది సేపటిలో అక్కడ నూతన నటీనటుల ఎంపిక జరగబోతోంది. నెత్తిన కౌబోయ్ టోపి, చేతిలో స్మోకింగ్ పైప్ కూలింగ్ గ్లాసెస్, బ్లాక్ సూట్లో జంబులింగం. తను తీయబోయే ‘హాంఫట్’ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ అతనే. ఆ సినిమాకి కోడైరెక్టర్ కోటిలింగం.
‘‘ఏరా పది అవుతున్నా ఒక్కళ్లు వచ్చినట్లుగా లేరు. మన ప్లానుకు ఫుల్‌స్ట్ఫా పడినట్లయింది నిరాశగా’’ అన్నాడు కోటిలింగం.
‘‘ఖచ్చితంగా వస్తారు. నేటి తరంలో ఉన్న సినిమా క్రేజ్ ఇంతా అంతాకాదు. చూస్తూ ఉండు’’ అన్నాడు ధీమాగా జంబులింగం.
పొట్టిగా, లావుగా, నల్లగా ఉన్న వ్యక్తి ఎవరో తరుముతున్నట్లుగా హడావుడిగా లోపలికి వచ్చాడు. వస్తూనే అక్కడున్న కుర్చీలో కూర్చుని ‘‘టేబుల్‌పై ఉన్న పేపర్తో విసురుకుంటూ ఏ.సి.లేదా ఇంత వేడిగా ఉంది చిరాకుగా’’ అడిగాడు ఆ ఆగంతకుడు.
అయ్యా! తమరు... అర్ధోక్తిలో ఆగిపోయాడు కోటిలింగం.
‘‘నన్ను చూస్తే తెలవడం లే.. హీరో వేషం కట్టడంకోసమొచ్చా..’’ అన్నాడు దర్పంగా.
‘‘ఎవరూ.. తమరే! వ్యంగ్యంగా’’ అంటూ అతన్ని ఎగా..దిగా చూసాడు కోటిలింగం.
‘‘ఏటట్టాసుత్తావ్..దిష్టి తగలగలదు నాకు’’ అన్నాడు అతను.
‘‘మీ పేరు చెప్పలేదు. గుర్తుచేస్తున్నట్లుగా’’ అడిగాడు జంబులింగం. ‘‘నా పేరు చప్పడిముక్కు..అని ముక్కుని తడుకుకొని..కాదు కాదు ముకుందం’’ అన్నాడు అతను.
‘‘సరేలే ఏ పేరైతేనేమి.. మేము పేరుమార్చేస్తాము. శ్రీదేవి ముక్కుని సరిచేసి నెంబర్‌వన్‌స్థాయిలో నిలబెట్టాము. నల్లని వాణిశ్రీని రంగులద్ది కలర్ఫుల్గా చూపించాము. డబ్బు వుండాలే కాని తిమ్మిని బమ్మిని చేయగలం’’ అన్నాడు కోటిలింగం.
‘‘డబ్బు ఎంతైనా పర్వాలేదు ప్రొడ్యూసర్‌ని, హీరోని నేనే అవుతా అన్నాడు’’ ముకుందం.
‘‘సెలక్షన్స్ అయ్యాక మిమ్మల్ని పిలుస్తా. మరి అడ్వాన్సు నసిగాడు’’ కోటిలింగం. ‘‘చెక్కు మీద సైన్ చేసి అంకె మీరేసుకోండి అని ఇచ్చాడు’’ ముకుందం.
‘‘నెట్‌క్యాష్ తీసుకుంటాము, చెక్కులు తీసుకోము అనుమానంగా చెక్కును చూస్తూ’’ అన్నాడు జంబులింగం.
‘‘జేబులోంచి ఓ పదివేలు తీసి ఇస్తూ ప్రస్తుతానికి ఇది ఉంచండి
ఇంటికెళ్లి పంపిస్తాను’’ అన్నాడు ముకుందం.
‘‘గుమ్మందాకా వెళ్లి మళ్లీ వెనకకు వచ్చి ఇంతకూ హీరోయిన్ ఎవరు.. కుతూహలంగా’’ అడిగాడు ముకుందం.
‘‘తమరు ఎవరంటే వారే.. వినయంగా చెప్పాడు’’ కోటిలింగం.
‘‘అయితే అనుష్కాని బుక్ చేయి. ముందుగానే సెప్పెసుంచు లేదంటే కాలు షర్టు లేదంటది’’.
‘‘కాల్షీట్లు కొచ్చిన తిప్పలా..అని మనసులో అనుకొని అవన్నీ మేము చూసుకొంటాము. మీరు బయలుదేరండి’’ అన్నాడు జంబులింగం.
ముకుందం వెళ్లిపోయాడు.
‘‘గురువు గారూ ఇంతకీ సినిమా కథ ఏం రాసారూ..కుతూహలంగా’’ అడిగాడు కోటిలింగం.
‘‘నాలుగు తెలుగు, ఓ నాలుగు ఇంగ్లీషు సినిమాలలోమ్చి నాలుగు బిట్లు కాపీకొడితే అదే ఓ సినిమా. పాటలకి కూడా కస్టపడక్కరలేదు. పాత పాటలే రీమిక్స్’’ అన్నాడు జంబులింగం.
‘‘కొంపదీసి మనం సినిమా తీస్తున్నామా గురువుగారూ అనుమానంగా అడిగాడు’’ కోటిలింగం.
‘‘ లేదురా అన్నాడు’’
‘‘అయితే మనకెందుకీ సినిమా గోల అన్నాడు’’ కోటిలింగం.
గుమ్మంలో అలికిడైతే అటుచూసారు.
(నుదుటిన పట్టిన చెమటని ఎడమ చేతితో లాగి వీళ్ల మొహాన్ని పడేట్లుగా విసురుతూ లోపలికొచ్చింది ఓ మహిళ)
మళ్లీ చెమటను ఎడమచేతితో తీసి కోటిలింగానికి కొట్టింది.
‘‘ఏయ్.. ఏయ్.. ఎవరు నువ్వు పో..పో.. బయటికి చీదరింపుగా’’ అన్నాడు కోటిలింగం.
నోట్లో ఉన్న అడ్డ చుట్టని బయటకు తీసి, తుపుక్కున రెండు వేళ్ల సందుల్లోంచి ఉమ్మేసి.. ‘‘ఏటిరా నన్ను పొమ్మంటుండావ్.. అందరికి సినిమా సాన్సు అని పేపర్లో ఎందుకేసినావేటి.. మేమేమన్నా అల్లాటప్పా గాళ్లమా. పేగు ఎండేస్తా జాగ్రత్త! అంది’’
అపర భద్రకాలిగా విరుచుకుపడిన అట్ల పుల్లమ్మ నోటికి భయపడి అమ్మా కూర్చో ఎవరో అనుకోని అలా అన్నా కూర్చో అంటూ కుర్చీ చూపాడు.
‘‘ఏటి నన్ను అమ్మా అంటుండావ్ నువ్వు, నీ వయసెంత, నా వయసెంతా.. నే పైటేసి పదిరోజులు కూడా కాలేదు నీకు అమ్మలా కనబడుతున్నానేమ్మిరా సచ్చినోడా, నీ జిమ్మాడా’’ అంటూ తిట్లవర్షం కోటిలింగంపై కురిపిస్తున్న ఆమెకు అడ్డుపడుతూ..‘‘మా వాడు తెలియక అలా అన్నాడు పాపా.. దేనికి ఇక్కడకు వచ్చావు..నీతో పెద్దవాళ్లు ఎవ్వరూ రాలేదా..అటూ ఇటూ చూస్తూ అన్నాడు’’ జంబులింగం.
***
‘‘ఆళ్లు దేనికి... నాకేటికి భయం.. నానే ఎల్పోయోచ్చిసినా..టార్‌ను ఐపోదామని..మెలికలు తిరుగుతూ..చూపుడు వేలుకి చీర చుడుతూ’’ అంది. ‘‘నీ సిగ్గు చిమడా.. ఏమి నటనే..నిన్ను చూస్తేనే అందరికీ టార్..నసిగాడు’’ కోటిలింగం.
‘‘ఏయ్ గుంటనక్క ఏటి సనుగుతున్నావ్ గదిమింది పుల్లమ్మ.
నేనేమి అనలేదు పాపా నువ్వు టార్ అవ్వాలంటే డబ్బులు ఖర్చవుతాయి అంటున్నా’’ అన్నాడు కోటిలింగం.
‘‘ఆ ఇసయాలు నాకు తెలుసులే ఆ అప్పిగాడు సెప్పిండు. అందుకే అట్లేసి పోగేసిన డబ్బు అంతా అట్టుకొచ్చేసినాను. ఇదిగో అంటూ బొడ్లో దోపిన చిక్కం తీసింది. అందులోంచి వెయ్యినోట్ల కట్ట తీసి కోటిలింగానికి ఇవ్వబోయి ఏ పో..అని ఓ కోర చూపు చూసి వెనక్కి తీసుకుని జంబులింగం చేతిలో పెట్టింది’’
‘‘సరే పాపా ఈరోజు నుంచి నీ పేరు ‘పలస్కా’. షూటింగ్ మొదలవ్వంగానే నీకు కబురేడతా గానీ ఇప్పుడెల్లిపో.. ఆనక పారొచైద్దువ్ గాని.. ఆమె యాసలోనే వెక్కిరిస్తున్నట్లుగా’’ చెప్పాడు కోటిలింగం.
‘‘ముయ్యరా ముండ్‌ఆకోడా.. ఇద్దో అబ్బియా ఈడితో నాకు సరిపడదు గాని నా డబ్బులు నాకిచై. ఇంకో దగ్గర టై చేస్తా.. విసురుగా డబ్బులు లాక్కోబోయింది’’. ‘‘వాడితో నీకేమిటి పాపా.. నేనున్నాను నిన్ను తారాపదంలో నిలబెడతా.. నీ కోసం డబ్బింగ్ చెప్పిస్తా.. వాడి మాటలు పట్టించుకోబోక.. నా చేతిలో పడ్డ హీరోయిన్లు టాప్ పొజిషన్లో ఉన్నారు. నిన్ను నువ్వు పోల్చుకోవటానికి వీలు లేని స్థితికి తీసుకుని వెళతా..’’ అని ఆశచూపి ఆమెని పంపాడు జంబులింగం.
తరువాత పోట్లకాయల పాపారావు వస్తాడు.
‘‘సార్..నన్ను అందరూ లంబాకాడా, లంబాకాడా అంటున్నారు. నా సత్తా చూపాలని ఇక్కడకు వచ్చా..మీరు ఎలాగైనా నా ఇమేజ్ పెంచి నాలో దాగిన అద్భుతమైనప నటుడిని వెలికితీయాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు’’ అన్నాడు పాపారవు.
‘‘మేము ఉన్నదే అందుకు..నీలాంటి వారి కష్టాలు తీర్చి మిమ్మల్ని సమాజం ముందు నిలబెడతాం’’ అన్నాడు జంబులింగం.
‘‘ అమితాబ్ బచ్చన్ని కూడా మొదట బొంగు అన్నారు.. తరువాత కింగు అన్నారు.. అవన్నీ పట్టించుకోబోక’’ అన్నాడు కోటిలింగం.
‘‘చిరంజీవి, రజనీకాంత్‌లను మొదట్లో మొహం అద్దంలో చూసుకోమన్నారు. ఇప్పుడు వాళ్ల స్టార్ తిరిగి మెగాస్టార్, సూపర్‌స్టార్‌లు అయ్యారు.నువ్వూ అంతే’’ అని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకొని పంపారు.
రాత్రి అయ్యేసరికి డబ్బులు లెక్క చూసుకొన్నారు.
‘‘రంగుల కలలు కంటూ రాత్రికి రాత్రి ఎర్రబస్సు ఎక్కి వచ్చే బకరాగాళ్లు ఉన్నంతకాలం మనలాంటి వాళ్లకి డోకా లేదు. హ్యాపీగా బతకొచ్చు’’ అన్నాడు కోటిలింగం.

- మోపూరు పెంచల నరసింహం - ఘాలి లలిత
చరవాణి : 9346393501

పుస్తక సమీక్ష

ప్రతి ఇంట్లో ‘మనీప్లాంట్’

నెల్లూరు జిల్లాల్లో కవితలు రాసేవారికి కొదవలేదు. అందులోనూ ఆడవాళ్ల సంఖ్యా తక్కువేం కాదు. తామేమీ తీసిపోమంటూ చాలామంది మహిళలు తమ కలంబలాన్ని విదులుస్తూ పతాక శీర్షికకు ఎక్కుతున్నారు. ముందువరుసలోనే ఉన్నారు. అటువంటి వారిలో బాలభవన్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభద్రాదేవి ఒకరు. ఆమె స్వతహాగా న్యాయవాది అయినప్పటికీ కిటికీ పక్కనున్న మనీప్లాంట్ మొక్కను చూస్తుండగా కవిత రాయడానికి ఆమెలోని భావావేశం ప్రేరణగా నిలిచింది. అదే పుస్తకానికి శీర్షికై కూర్చుంది. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు మనీ చుట్టూ తిరగడం, మానవ సంబంధాలు మృగ్యం కావడం వంటి అంశాలు కవితా వస్తువులుగా తీసుకున్న సుభ్రదాదేవి అభినందనీయురాలు.
మనీ లేని ఇల్లులేనట్టే మనీప్లాంట్ కూడా దాదాపు అన్ని ఇళ్లల్లో ఉంటుంది. ఆ మొక్కను చూస్తూనే రచయిత సుభద్రాదేవికి మినీ కవిత రాయాలనిపించడం శుభసూచకం. కవితలు ఇష్టపడేవారు కూడా ఈ ‘మనీప్లాంట్ ’కూడా అందరి ఇళ్లల్లో ఉంచుకుంటారు. తన కవితాసంకలనానికి మనీ ప్లాంట్ పేరు పెట్టాలనే ఆలోచనే ఎంతో హృద్యంగా ఉంది. అందులోని కవితలన్నీ సరళభాషలో ఉండడం వల్ల మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తున్నాయి.
11-12-13 శీర్షిక కింద
మనసు ఉండాలే కాని...
ఈ జగతిలో తట్టిలేపేవి ఎన్నో...
అంకెలు పువ్వుల్లా
సొగసు నివ్వడం ఎప్పుడైనా చూశామా
అది 11-12-13
ఇది చదివినప్పుడు మనస్సు హాయిగొలుపుతుంది. మనకూ కవిత్వం రాయాలనిపిస్తుంది. సంతోషం వచ్చినా, దుఖం దిగమింగుకున్నా కవిత్వం వస్తుందని రచయిత చెప్పక చెప్పారు. నిజంగానే ఈ పుస్తకంలో కవితలు చదివినప్పుడు నాకూ ఓ కవిత రాయాలనిపించింది.
పిచ్చినాన్న కవితలో
‘‘నాన్న జాగ్రత్త అంటూ
కళ్లుమూసిన అమ్మని చూసి
నాన్న జీవం లేని కళ్లల్లో .. వౌనం
అమ్మ బదులు కర్రని ఊతంగా
చేసుకున్నాడు పిచ్చినాన్న ’’
చూడానికి సాధారణ పదాలే అయినప్పటికీ ‘పిచ్చినాన్న’ కవిత చదువుతున్నప్పుడు కళ్లు చెమర్చాయి.
చివరగా ఆకాశంలో అతిథులు, ఎందుకిలా, మంచుపూలు,సౌందర్యమహలు, అగ్నివస్త్రం, ఆటబొమ్మ, రైలు ప్రయాణం, విశ్వగానం, తీరం ఆవల, భావగీతం వంటి కవితా శీర్షికలు కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.

-గౌతమి, 9347109377

స్పందన

సంస్కారం నేర్పిన కథ
ఈరోజుల్లో అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు చెలరేగిపోయే అల్లరిమూకల వున్న ఈరోజుల్లో ఓ మంచి వ్యక్తి చివరివరకు తోడుగా నిలబడడం అన్న కథాంశంతో సాగిన సంస్కారం కథ చాలా బాగుంది. చివర్లో ఇచ్చిన కొసమెరుపు కథకు ప్రాణం పోసింది. రచయిత కటారి రామయ్యకు ధన్యవాదములు
- ఈమనిగంటి చంద్రశేఖర్, ఆత్మకూరు
- రావి పద్మావతి, శ్రీకాళహస్తి

నేటి పరిస్థితిని వివరించిన కరువు
గత వారం మెరుపులో రచయిత పొన్నూరు వేంకట శ్రీనివాసులు గారు ఎంతో వ్యథతో రాసిన కరువు కవిత నేటి పరిస్థితులను చక్కగా కళ్లకు కట్టింది. కథకు తగ్గ బొమ్మను వేసిన కార్టూనిస్టుకు అభినందనలు. నీటి కోసం మహిళల పాట్లు, రైతుల కడగండ్లను వర్ణించిన తీరు బాగుంది. చివరగా ఈ దేశంలో అన్నింటికీ కరువే.. ఒక్క అమలుకాని ప్రభుత్వ పథకాలకు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు తప్ప అంటూ ముగించడం సూపర్.
- అయితా చంద్రశేఖర్, రేబాల, బుచ్చి
- గాలి స్వర్ణలత, గూడూరు

మేఘమా కురిసిపో,
తలుపు సూపర్
మేఘమా కురిసిపో అంటూ వర్షం మేఘాల్ని వేడుకున్న కవి హృదయబాధను చాటిన కవిత మేఘమా.. కురిసిపో కవిత చాలా బాగుంది. అలాగే తలపు కవితలోని పదబంధాలు హృదయాంతరంగాల్లో నిలిచిపోయాయి. రచయితలు మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్, ప్రసూనాశరత్ గార్లకు అభినందనలు
- గార్ల పద్మావతి, నాయుడుపేట
- చెలికం రామయ్య, కందుకూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

ప్రతులకు
గోవిందరాజు సుభద్రాదేవి
120, ద్వారకా టవర్స్, టెక్కేమిట్ట, నెల్లూరు-3
చరవాణి : 9848627158

మనోగీతికలు

దైవత్వం
అది ఒక అనంతం
మూర్త్భీవించిన ఏ ప్రతిమల
రూపాలకో అది పరిమితం కాదు
అది ఒక క్రియాశీలత్వం
ముక్కు మూసుకుని జపం చేసే
ఏ వౌని వౌనపు స్తబ్దతో కాదు
అది అనవరతం అనువర్తితమయ్యే
విలువల ఆచరణాత్మక శుభసంకల్పాల
సమన్వితం
విశ్వగోచరమైన సమస్త రూప సంచయం
దాని అధీకృతం

తినలేని విగ్రహాలకు
తినమంటూ పెట్టే నైవేద్యాలలో లేదు దైవత్వం
అర్థించే ఆకలికి అందించే అన్నంలో వుంది దైవత్వం
మోయించుకెళ్లే మేనాలోని బలుపులో లేదు దైవత్వం
కుంగిన వెన్నుకు దన్నుగా నిలిచే కర్రలో వుంది దైవత్వం
షడ్రుచుల మధ్య తలమునకలయ్యే జిహ్వలో లేదు దైవత్వం
పొడిబారిన నాలుకను తడిపే గుక్కెడు నీళ్లల్లో వుంది దైవత్వం
బదలాయింపులతో కోరే ప్రతిఫలాల్లో లేదు దైవత్వం
కొండొకచో తృప్తిని కోరే ఉదారతలో వుంది దైవత్వం
వంచనే మెట్లుగ ఎక్కే అందలంలో లేదు దైవత్వం
విధివంచితుల చింతలుబాపే ఆపన్నహస్తాలో వుంది దైవత్వం
అవకాశాల గాలంతో విసిరే మోసాల వలలో లేదు దైవత్వం
మార్గం చూపి కలల సాకారానికి
సహకరించే స్నేహహస్తంలో వుంది దైవత్వం
కలవరపరచే అలజడుల మధ్య లేదు దైవత్వం
శృతి సవ్వడుల మధ్య రసమయ జగతిని
సృష్టించే సంగీతంలో వుంది దైవత్వం
సమధర్మపు సహజీవనుల
అంతరంగాల లోగిళ్లే దైవత్వాల ముంగిళ్లు
బాధను మరిపించి బంధాలతో మురిపించి
ప్రేమతో మైమరపించే
చిరునగవుల పెదవులే దైవత్వపు ఆనవాళ్లు
అందుకే అది ఒక కారుణ్యపథం
ఆధిక్యతలు అరమరికలు లేని
సమరసభావాల ఓ సంగమ సాగరిక..

- కె.రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778988

ఎండ మా(న)వులు
ఏమున్నది, ఏమున్నది
కనుమరుగున గతమన్నది
నడుస్తున్నది కలికాలం
తీరుమారిన కాలచక్రం
భానుడు చూస్తే రగులుచుండెను
వాగులు వంకలు వణుకుచుండెను
ఎండలు చూస్తే మండుచుండెను
వెనె్నముకలు సైతం ఎండుచుండెను
అవని అడుగుకు జలములు జారెను
కరువు కోరలు విషము జిమ్మెను
సమస్త జీవులు సతమతమాయెను
గుక్కెడు నీటికి వలసలాయెను
దూరపు కొండలకు పయనమాయెను
ఎండిన పంటలు ఏడుస్తుండెను
మూగజీవులు ఘోషిస్తుండెను
పచ్చని పొలములు హంగులు మరిగెను
అలసిన బ్రతుకులను అరువుకు అమ్మెను
విలాస నీడలు వ్యసనాలాయెను
స్వార్థపు సొగసులు ఏలుచుండెను
అరణ్య కాంతులు తరుగుచుండెను
విశ్వప్రగతి అంధకారం కాకముందే
కాలుష్య కల్మషాన్ని తరిమేద్దాం
పచ్చని ప్రకృతికి పాటుపడదాం
ఎండమా(న)వుల జీవితానికి
స్వస్తి పలుకుదాం!

- హస్తిమోహన్‌రాజు
చరవాణి : 8008511316

మనుగడ విరగడే!
పచ్చలు పొదిగిన చీరలా సుందర వనాలు
ముత్యాల హారాల్లా నదీనదాలు
మణికిరీటంలా గిరీంద్ర కూటములు
అమృత హస్తాల్లా సాగరోత్తుంగ తరంగాలు
ఉఛ్వాస నిశ్వాసాల్లా పిల్లతెమ్మెరల పవన మాలికలు
బ్రహ్మాండమంతటిలో విశ్వసుందరి మన ధాత్రీ జనయిత్రి
కనుక రత్న మణిమాణిక్య ఐశ్వర్య గర్భమున అవనీజనని
అమ్మల... అమ్మమ్మల... కన్నయమ్మ మన నేలమ్మ తల్లి
ప్రపంచం పంచభూతాల కవచం
ఇవి తరువులు కావు ప్రాణవాయువుకు ఆధరువులు
ఇవి జలాలు కావు చలనేంధన ద్రవాలు
ఇవి మట్టి కణాలు కావు మన ఆస్తి చర్మాణువులు
ఇది అగ్ని కాదు మనకు సత్తువ నిచ్చే ఆకలి
ఇది ఆకాశం కాదు మన ఆలోచనా ప్రకాశం
పర్యావరణం మన దేహావరణం
స్వార్థంతో దేనిని చీకాకు పరచినా మన మనుగడ విరగడే!
(జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)

- చిరమన వెంకట రమణయ్య, 9441380336

email: merupunlr@andhrabhoomi.net
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- మోపూరు పెంచల నరసింహం - ఘాలి లలిత