నెల్లూరు

ఎక్కడమ్మా చంద్రుడు? ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుబయట వెల్ల్లకిలా పడుకొని ఆకాశం వైపు ఆనందంగా చూస్తున్న పాండురంగానికి అసంఖ్యాక నక్షత్రాల మధ్య పుచ్చపువ్వులాంటి వెనె్నల వెదజల్లుతూ, పైకెగబాకుతున్న పూర్ణచంద్రుడు కన్పించేసరికి, చిన్నప్పుడు వాళ్లమ్మ పాడుతున్న పాట గుర్తుకొచ్చింది. ‘‘చందమామ రావే.. జాబిల్లిరావే! కొండెక్కిరావే-కోటివేలు తేవే’’ అంటూ ఏవేవిటో తెచ్చి మా అబ్బాయికివ్వవే అని పాడేది. ఆ వయసులో ఆ పాట తన గుండెలో గూడుకట్టుకొని గుడిలో విగ్రహంలా స్థిరపడిపోయింది. ఒకసారి అమాయకంగా అమ్మను అడిగాడు - చందమామ అంత మంచివాడా అమ్మా? కోటివేలు, బంతిపూలు, తేనెపట్టు, పాలుపెరుగు తెచ్చి యిస్తాడా - అని. ఆమె నవ్వింది. ‘‘అవును నాయనా! మన చుట్టు ఉన్న వాళ్లల్లో చాలామంది చందమామలాంటి వారు ఉంటారు.. వెనె్నల లాంటి నవ్వుతో చల్లని మాటలతో మనస్ఫూర్తిగా అందరి మంచికోరే చందమామల్లాంటి వాళ్లు ఉంటారు. అయితే మనం వాళ్లను వెతికి పట్టుకోవాలి’’ అంది.
చిన్నప్పుడే తండ్రి చనిపోగా తల్లి తానే తండ్రై, గురువై, తాను ముళ్లబాటలో నడిచి తనకు పూలబాట పరిచింది. తల్లికి మించిన దైవం లేదనే సూక్తిని సార్థకం చేసింది. తనకు తానుగా తన కాళ్ల మీద నడిచేదాకా తోడై నిలిచింది.
తల్లి చెప్పినమాట మనసులో నాటుకుపోయి, మనుషుల్లో చందమామలాంటి వాళ్లను వెతికి పట్టుకోవాలనే తపన బాల్యం నుండి ప్రారంభమైంది. బాల్యంలో తనకు తారసపడ్డ వాళ్లలో తనపై ప్రభావం చూపిన మొట్టమొదటి వ్యక్తి ప్రసాదరావు మాస్టారు. పాఠంతో పాటు ఎన్నో సూక్తులు, సామెతలు, ఎన్నో మంచి విషయాలు మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పేవాడు. పిల్లలందరికి ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు. కొంతమంది ఆడపిల్లలు కూడా వచ్చేవాళ్లు. వాళ్లలో ఆరతి చాలా బొద్దుగా, ముద్దుగా, చదువులో చాలా చురుకుగా ఉండేది. ఆ అమ్మాయికి రాత్రిపూట కూడా ట్యూషన్ చెప్పేవాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి మరీ బొద్దుగా, పొట్ట లావుగా తయారైంది. చదువు తలకే కాక పొట్టకు కూడ పట్టినట్లయ్యింది అనుకొనే వాళ్లు పిల్లలు. కాని ఒకరోజు ఆరతి బంధువులు ప్రసాద్ సార్ ఒళ్లు వాయకొట్టి పోలీసువాళ్లకు అప్పజెప్పేసరికి అసలు విషయం తెలిసిపోయి, ఈయనేమి చంద్రుడు, ఇంతపని చేశాడు, అనుకున్నాడు పాండురంగం.
మనసు మరల చందమామ వేటలో పడింది. స్కూలు వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రజానాయకులు, అధికార్లు - ప్రజలే దేవుళ్లని, వాళ్ల సేవకే తమ జీవితాలను అంకితం చేశామని, నేటిబాలలు రేపటి పౌరులై ప్రజాసేవకే అంకితం కావాలని తమ ఉపన్యాసాలతో విద్యార్థులకు ఉద్బోధించారు.
ఇంతకంటే మంచి చంద్రులెవరుంటారు అనిపించింది పాండురంగానికి. జనవాడుక వినేసరికి ఒక్కొక్కరి జాతకం అత్యంత అమోఘంగా కన్పించింది. ప్రజాదేవుళ్లకు పెట్టిన నైవేద్యాలన్ని వాళ్లే మింగేస్తున్నారు. దేశ సంపద ఎంత మింగినా వారి చిరుబొజ్జలకు చింతాకంత తృప్తి కలగడం లేదు. వీరు నలుగురి మేలు కోరే చందమామలే కాదు, భూలోక యమకింకరులనిపించింది పాండురంగానికి.
తను కాస్త పెద్దై, కాలేజీలో కాలు పెట్టేసరికి కొత్త ప్రపంచం తలుపులు తెరచుకొని రంగుటద్దాలలో కన్పించసాగింది. కాలేజి పిల్లల కట్టుబొట్టూ, నడక, నడత, వేషం, భాష కాలం కంటే ఒకడుగు ముందుకేసి ప్రేమికులదినం, ముద్దుల దినం, కౌగిళ్ల దినం లాంటి నవనాగరికతా చిహ్నాలతో కొత్తలో కొన్ని సృష్టిస్తున్నారు.. అది తెలిసీ తెలియని వయస్సు అయినా అనేక ఆకర్షణ వికర్షణల మధ్య గాడితప్పక గూటికి చేరి, యూనివర్శిటీ క్యాంపస్‌లో కాలుపెట్టిన వారిలో పాండురంగం ఒకడు.
అదొక విచిత్ర ప్రపంచం. అధ్యాపకులు పాఠాలు తప్ప అన్ని చెప్తారు. విద్యార్థులు చదువు తప్ప అన్ని నేర్చుకుంటారు. కుల సంఘాలు, పార్టీ యూనియన్లు, హక్కులు, హర్తాళ్లు గురించి ఆలోచిస్తారే కాని, బరువు, బాధ్యతలు, సంస్కృతీ సాంప్రదాయాల లాంటి అనాగరిక విషయాల గురించి ఆలోచించరు. విజ్ఞానం వెర్రితలలు వేసి తలకు రోకలి చుట్టమంటుంది. తలనెరిసిన మేధావులు తలక్రిందులుగా నడిస్తే తప్పేముందంటారు. ఈ విలక్షణ వాతావరణంలో చందమామలను వెతకడం ఆమం కట్టలో ఇత్తడి పెంకులు వెతకడమే.
ఈ వైవిధ్యభరితమైన వాతావరణం నుండి పాండురంగం మనిషితనం కోల్పోకుండా బయటపడడం తల్లి పెంపకంలోని గొప్పతనమని చెప్పవచ్చు. పాండురంగానికి నిరుద్యోగ జీవితం బతుకు పాఠాలు బీరు పోకుండా నేర్పింది. ఉత్తర దక్షిణాలు సమర్పించిన వారికి ఉద్యోగాలు, సమర్థులైన వారికి ఉద్యోగాలు రాకపోతే నిప్పులాంటి మనుషుల తప్పుకాదు. అది వారి తలరాతే. విధాత వ్రాసే తలరాతలను కూడా నేటి నేతలు కబ్జా చేశారు.
ఈ ప్రపంచంలో మంచికి కొంచెం కొసప్రాణముండటంతో పాండురంగానికి ఒక గవర్నమెంటు ఆఫీసులో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం దొరికింది. పాండురంగానికి అనుభవం నేర్పిన పాఠం యేమంటే, యమకింకరులు చచ్చిన వాళ్లకు వారికి విధించిన శిక్షలను మాత్రమే అమలుచేస్తారు. వీళ్లు మాత్రం బతికున్న వాళ్లను రకరకాల శిక్షలతో అన్యాయంగా శిక్షిస్తారు. అన్ని ఆఫీసుల్లో అదే వ్యవస్థ. పాలకులు అవినీతి మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంటారు. అధికారులు గడువు మేరకు అన్ని పనులు చేస్తూనే ఉంటారు. పాలితులు పనులేమి కావడం లేదు, ఉరేసుకుని చావాల్సిందే అంటారు. ఉరెందుకు? మేమున్నాం కదా! (చట్టబద్దంగా చంపడానికి) అంటారు అధికార్లు, అనధికార్లు. కాని కారుచీకట్లలో కాంతి కిరణంలా పాండురంగం పై ఆఫీసరు మాత్రం చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్నారు. అటు దరఖాస్తుదారులకు, ఇటు సిబ్బందికి ఇబ్బంది కలుగకుండా బండి సాఫీగా నడుపుతూ, సమర్థుడు అనిపించుకున్నారు. ఇంత కాలానికి ఒక చందమామ దొరికిందని సంబరపడ్డాడు పాండురంగం.
ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. ఏసీబీ వారు దాడిచేసి ఆఫీసరు గారి అక్రమాస్తులు మార్కెటు రేటు ప్రకారం వందకోట్లకు దాటిపోయిందని తేల్చేశారు. ఈ ఒక్కడు కూడా జారిపోయేసరికి పాండురంగానికి నీరసం వచ్చేసింది. మనుష్యుల మధ్య సంబంధాలను పచ్చనోట్లలో, ఆస్తి విలువల్లో కొలవాల్సిందే కాని అనుబంధాల తూకంలో తేల్చలేమని తెలుస్తూనే ఉంది. విద్యాసంస్థలు విద్యను కేజీలలో తూకమేసి లక్షలకమ్ముతున్నారు. వైద్యులు శవాలకు వైద్యం చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు. వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కల్తీ సామ్రాజ్యంతో కోట్లకు పడగలెత్తుతున్నారు. రవాణాశాఖ తమ శక్తి మేరకు పరలోకానికి పంపిస్తున్నారు. ఆధ్యాత్మికత వెర్రితలలు వేయడంతో దేవుళ్లందరు ఆత్మరక్షణలో పడ్డారు. ఆడతనం అభద్రతా భావంతో నలిగిపోతూ ఉంది. అందరిని అదుపుచేయాల్సిన అధికారగణం ముడుపుల మత్తులో మొద్దునిద్రపోతుంది. ప్రభుత్వం తమ సంసారాన్ని చక్కబెట్టుకోవడంలో తమమునక్కలౌతుంది. ఈ తప్పు ఏ ఒక్కడిదో కాదు, తిలాపాపం తలా పిడికెడు. ఈ ఆలోచనలతో పాండురంగానికి నిద్రపట్టేది కాదు. తన బాధంతా కవితారూపంలో అనేక సమావేశాల్లో చదివి వినిపించాడు. ‘ఎక్కడమ్మా చంద్రుడు? చక్కనైన చంద్రుడు.. ఎక్కడమ్మా చంద్రుడు? ఒక్కడైనా కానరాడు / కోట్లకున్నోళ్లు తప్ప - కూటికి లేనోళ్లు తప్ప / మందు, విందు, పొందులతో చిందులేసే వాళ్లు తప్ప / వేడినెత్తురు రుచిమరిగిన గోముఖ వ్యాఘ్రాలు తప్ప / ఎక్కడమ్మామ చంద్రుడు? ఒక్కడైనా కానరాడు. ఇట్లా సాగింది కవిత. శ్రోతల చప్పట్లతో ప్రశంసల వర్షానిక తడిసిముద్దయిన పాండురంగం ఆనందపడకపోగా - తన కవిత్వానికి స్పందించారో లేక అందరం అంతే, చంద్రుడనే వారు ఎవరూ లేరు, రారు అని ముక్తకంఠంతో ఒప్పుకున్నారో తెలియక విచారవదనంతో తలదించుకున్నాడు.
ఉద్యోగానికి, ఉన్నతమైన ఆలోచనలు తోడుకావడంతో కట్నకానుకలు ఆశించకుండా ఒక కులమింటి కోతికి తాళికట్టు జీవిత ప్రయాణంలో ఒక తోడు తెచ్చుకొన్నాడు. ఒకరికి ఇద్దరు కాగానే మేమున్నామంటూ మరో యిద్దరు వచ్చిచేరారు. ఒక మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా, పౌరుడిగా తన బాధ్యతలను నిర్వర్తించి ఒక శుభముహూర్తాన పదవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకుంటున్నాడు పాండురంగం.
పాండురంగం ఆధ్యాత్మికవేత్తకాదు, అవధూతకాదు. కాని అంతరంగం మాత్రం కల్మషం లేకుండా, అన్యులసొమ్ము ఆశించకుండా, సొంతకాళ్లపైన నిలబడి, మానవతా సంబంధాలను పటిష్టపరచుకుంటూ బతకాలనే మనిషి అదే పాండురంగంలోని బలహీనత. అందువలననే జీవితంలో ఒక చందమామనైనా కనిపెట్టాలనే తపన. పాండురంగంలో బలపడి అవస్థపెడుతూ వచ్చింది. పట్టు వదలని విక్రమార్కునిలా సాధించాలని శోధిస్తున్నాడు కాని, పదవీవిరమణ వరకు ప్రయత్నంచ చేసినా, మంచి కోరే ఒక్క చందమామను కూడా పట్టుకోలేకపోయాడు
అందుకే ఆరుబైట పడుకొని - ఎక్కడమ్మా చంద్రుడు? అని మనసు విలపిస్తుంటే, గతాన్నంతా జల్లెడ పట్తూ, స్వగతంలో విచారపడుతున్నాడు. ఉన్నట్టుండి ఉషోదయపు తొలి కిరణాలు తొంగి చూసినట్లు, బోధివృక్షం క్రింద గౌతమునికి జ్ఞానోదయమైనట్లు ఒక్కసారి ఉళిక్కిపడిలేచి కూర్చున్నాడు. ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుండగా మంచంలో ఉన్న పండు మొదుసలి అమ్మదగ్గరకెళ్లి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ‘‘ఏం నాయనా ఇప్పుడొచ్చావు?’’ అంది, బొక్కినోటిలోని బోసినవ్వుతో.
‘‘చందమామ దొరికిందమ్మా.. కోటివేలు, బంతిపూలే కాదు, కోటి వెలుగులు విరజిమ్మె చందమామ దొరికిందమ్మా’’ అన్నాడు.
‘‘ఎక్కడా? ఎవరు?’’ అంది ఆశ్చర్యంగా..
‘‘ఎక్కడో ఏంది? ఇక్కడే. నువ్వే ఆ చందమామవు. ఇంట్లో చందమామను పెట్టుకొని దేశమంతా వెతికాను. ప్రతి మనిషికి తల్లిదండ్రులే చక్కనైన, స్వచ్ఛమైన చందమామలు’’ అన్నాడు పాండురంగం దృఢంగా, నిశ్చలంగా.

- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి
చరవాణి : 9490227114

సందర్భ కవిత

నీటి కరువు
ఏడుకొండల ఎంకన్నా
ఎట్టా తీరేను దాహం
మాకు ఎట్టా తీరేను శోకం

గోదావరి ఎండింది
కృష్ణమ్మ ఇంకింది
తుంగభద్ర తుళ్లింది
కొల్లేరు కొల్లపోయింది

ఏవీ నాటి దివిసీమ ఉప్పెనలు
ఎక్కడ తుఫానుల బీభత్సాలు
ఏమైరి తల్లడిల్లిన ప్రజానీకం
ఏవీ వానలే వద్దంటూ
మొరపెట్టిన దినాలు

పొంగి పొరలిన వాగులెక్కడ
పొర్లిపారిన వంకలెక్కడ
నిండిన చెరువులెక్కడ
నీడనిచ్చే చెట్టెక్కడ

బోర్లన్నీ ఎండిపోయె
చెట్లన్నీ మోడువారె
పొలాలన్నీ నెర్రెలు చీలె
పశువులన్నీ బక్క చిక్కె
నీటి కరువు వచ్చింది
నిలువునా ముంచింది

దేశమంతా నీటికొరత
బిందెడు నీటి కోసం
బహుదూరపు ప్రయాణాలు
చుక్క నీటి కోసం చేపల్లా గిలగిలలు

నీరు లేక పనులు సాగక
రైతులంతా వలసబాట
ధాన్యాగారాలన్ని
గింజలు లేక వెలవెల
ఏడుకొండల ఎంకన్నా
ఆదుకో నీవన్నా
నీటికొరత తీర్చన్నా..
నీవె దిక్కన్నా..
తీర్చుకుంటాం నీ మొక్కన్నా..!

- కటారి రామయ్య, సదుం
చరవాణి : 9704085771

స్పందన

నిజంగా సినిమా చూపించారు
మెరుపులో ప్రచురించిన సినిమా చూపిస్తా మామ కథ నేటి సమాజంలో సినిమా పట్ల మోజుతో సర్వస్వం కోల్పోతున్న యువతకు చక్కటి చంపపెట్టు. యువతకు సినిమాపై ఉండే మక్కువను ఆసరాగా చేసుకుని రకరకాల సంస్థలు వెరైటి పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసి సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని డబ్బులు బాగా వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేయడం సర్వసాధారణం. ఇలాంటి పలు సంఘటలను క్రోడికరించి రాసిన కథ చాలా చక్కగా సాగింది. ముఖ్యంగా కథలోని పాత్రలు దేనికవే పోటీపడి నటించాయి. డింగ్ డాంగ్ సంస్థ, కోటిలింగం, జంబులింగం వంటి పదాల ప్రయోగం హాస్యభరింతంగా ఉంది. సందేశాత్మక కథను అందించిన రచయితలు ఘాలి లలిత, మోపూరు పెంచలనరసింహం గారికి ధన్యవాదములు
- కె.వి.రాఘవాచార్యులు, డైకస్‌రోడ్డు,నెల్లూరు
- ఆర్.హేమలత రాజశేఖర్, కనిగిరి
- ముమ్మిడివరం వేణుగోపాల్, పుత్తూరు

ఎండమానవులు కవిత బాగుంది
గతవారం మెరుపులో హస్తి మోహన్‌రాజు గారి రాసిన ఎండమానవులు కవిత చాలా అర్ధవంతంగా సాగింది. భానుడి ధాటి నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశంతో అందించిన కవిత చాలా బాగుంది.
- పద్మావతి, సూళ్లూరుపేట

దైవత్వం కవిత గురించి ఎంత చెప్పినా తక్కువ
రవీంద్రబాబు గారి కవిత అంటేనే ఓరకమైన ప్రత్యేకతను సంతరించుకుంటుందనేది మా భావన. కవితలో వాడిన ప్రతి వాక్యం మనకు హితబోధ చేస్తూనే వుంది. ముఖ్యంగా తినలేని విగ్రహాలు పెట్టే నైవేద్యంలో లేదు దైవత్వం...అర్థించే ఆకలికి పెట్టే అన్నంలో వుంది దైవత్వం.. ఇలా ప్రతి లైను ఎంతో గొప్ప సాగింది. ఇంత గొప్ప కవిత అందించిన రవికి మా అభినందనలు
- ఉమామహేశ్వరరావు, మాళవ్యనగర్,గూడూరు

రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

అమ్మా! క్షమించు..!
కడుపులో కాయగానున్నప్పుడే
కానె్వంటు సీటుకై కాపుకాశావు
పుట్టి చేతనబడిననాడే
పలక చేతికందించావు
అడుగులు సరిగా పడకముందే
అలవిమాలిన భారం వీపున వేశావు
ఒడిలో పడుకోవలసిన వయసులో
పుస్తకాల గుట్టల మధ్య పవళించాను
నన్ను వున్నతంగా చూడాలనే నీ ఆశ
నాకు బాల్యాన్ని శూన్యం చేసింది
ఇసుకలో పడి లేచి ఆడుకొని వుంటే
ఒడిదుడుకులను తట్టుకోగలిగే వాడినేమో!
నలుగురు స్నేహితులతో కలసి నడిచివుంటే
ఓటమి గెలుపుల వొత్తిడి చవిచూసిన
వుండేవాడినేమో!
అడుగడుగునా నీ చేయి అడ్డుపడకుంటే
నాకు తగిలే దెబ్బలు నేనే కాచుకోవడం
నేర్చుకుని వుండేవాడినేమో!
పుస్తకానే్న నమ్ముకున్న జీవితం
లోకాన్ని చదవలేకపోయింది
నిన్నటి దాకా ముందున్న నేను
ఈరోజు వెనుకబడిపోతానని భయంగా వుంది
నీ మనసులో పెంచుకున్న కోరికలను
మధ్యలోనే తుంచివేస్తానని అనుమానంగా వుంది
నలుగురిలో నిన్ను తలదించుకునేలా
చేస్తానేమోనన్న భీతిగానూ వుంది
పోటీతత్వాన్ని పెంచుకున్నానే గానీ
పోరాట పటిమ నేర్చుకోలేకపోయాను
‘‘తప్పెవరిది?’’ అని ప్రశ్నించను
తట్టుకోవడం నేర్వని హృదయాన్ని శపిస్తున్నాను
జీవచ్ఛవంలా నీ ముందు నిలువలేక
జీవితేచ్ఛనే చంపుకుంటున్నాను
నన్ను క్షమించవమ్మా!
ఒక మెట్టు జారాననే తలవంపులు నీకు తేలేక
తలతుంచుకుని వెళ్లిపోతున్నాను
క్షమిస్తావు కదూ!
మరు జన్మకూ నీ బిడ్డనే కావాలని వుంది
అప్పుడైనా నీ ఒడిని గుడి చెయ్యమ్మా!
బడికి బలిచేయక బాధ్యత నేర్పించమ్మా!

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706

ఓ భారతం..!
ఓ భారతం! నీ కీర్తి అంబరం!!
మహామహుల శ్వాసతో ప్రాణం పోసుకున్న నీవు
ప్రపంచానికి సాంప్రదాయం నేర్పే పాఠానివైనావు

పచ్చని పసిరికలలో పలకరించే నీవు
పరిశ్రమలలో అగ్రరాజ్యాలతో పోటీగా నిలిచావు
విజ్ఞానవంతులను బిడ్డలుగా కలిగిన నీవు
శాస్తవ్రిజ్ఞానంలో నీ ప్రాధాన్యత నలుదిశల
చాటి చెప్పావు

పట్టణ పేర్లలోను, పల్లె కొమ్మల్లోను,
ప్రజల ఫలాలలోను
రూపాంతరం చెందిన మహావృక్షమై నిలిచావు
ప్రపంచ దేశాలలో నిన్ను నీవు, నీకు నువ్వు
ప్రత్యేకంగా చూపుకుంటూ
నీ చరిత్రను చాటుకున్నావు

నిన్న, నేడు, రేపు నీ కీర్తి
అద్భుతం, అమోఘం, గణనీయం

- యస్.రమ్య
పల్లిపాడు, చరవాణి : 99591 38791

మినీ కవితలు
కళ్లజోడు
అతని కళ్లు
నెత్తికెక్కాయి
కళ్లజోడు పెట్టుకున్నాడు
తలపైన!

ఆమె వచ్చింది
ఆమె కోసం
ఎదురుచూశాను..
వచ్చింది అతనితో
జంటగా!

కాలుజారింది
కనె్నపిల్ల కాలు జారింది
బాత్‌రూంలో
కన్నతండ్రికి ఆనందం
కాలు విరగనందుకు.

- జి.విజయకుమార్,
రీడ్స్‌పేట,చిత్తూరు

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882
merupunlr@andhrabhoomi.net

- పిడుగు పాపిరెడ్డి