నెల్లూరు

పిడికెడు బూడిద (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందాపురంలో గోచిగూడాలో ‘‘డింగ్ డాంగ్’’ ఆశ్రమం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వెలిసింది. తెల్లారేసరికి ఆ ఆశ్రమం చుట్టూ జనసమూహం. ‘ఈయన నిజమైన స్వామిజీయేనా?’ పిన్ని అనుమానంగా అడిగింది అనసూయ ఆశ్రమంలోకి అడుగుపెడుతూ.
‘అవు మల్లా. ఎన్నిసార్లు అడుగుతావ్. నీ దిమాక్ కరాబ్ అయ్యిందా. జరా ఈ స్వామిజీ హిమాలయాల్లో శివుడి నుదిటి నుండి రాలిన విభూతిలో నుంచి పుట్టాడంట. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. సమజ్ అయ్యిందా. లెంపలేసుకో. కండ్లు పోతాయి అనుమానమొచ్చినందుకు’ అని ఆ పిన్ని లెంపలు వేసుకుంటూ చెప్పింది.
వచ్చిన వారు స్వామిజీ లీలలు కధలుగా చెప్పుకొంటున్నారు.
లోపల స్వామిజీ ఓ ఎతె్తైన ఆసనంలో పులిచర్మంపై బారెడు గడ్డం, నుదిటిన విభూతి రేఖలు, ఓ చేతిలో జపమాల, రెండవ చేతిని కమండలము పైన ఆనించి ఉంచాడు. కాషాయ వస్త్రాలలో ఉన్న జంబులింగం.
(బూడిద స్వామి) ఆ ప్రక్కనే కోటిలింగం వింజామరలు వీచుతూ.
‘జమ్భారే జమ్భారే డుమ్భారే డుమ్భారే భస్మాయాస్వాహా’ అంటూ వచ్చిన భక్తులనెత్తిన విభూది జల్లుతున్నాడు జంబులింగం.
రకరకాల సమస్యలతో సతమతమవుతున్న ఎందరో భక్తులు.
‘సామి.. పెళ్లి అయ్యి ఐదేళ్లు అయినా మా ఆడది నీల్లోసుకోలేదు’ ఫిర్యాదు చేశాడు ఓ పాతికేళ్ల కుర్రాడు.
‘ఐదేళ్లు ఆ వాసనను ఎలా భరించావయ్యా!’ ఆశ్చర్యంగా అడిగాడు కోటిలింగం.
ఏందబ్బాయో ఎకసెక్కాలు పడుతున్నావ్. నేను నీ అత్తకూతురు. నేటి సన్యాసి గుడ్డలేసిన నీ బుద్ధి మారలేదే? విసురుగా అంది ఆ యువకుని భార్య.
మీ ఇద్దరూ నోరు తెరవండి అని నోట్లో గుప్పెడు విభూది పోసాడు జంబులింగం.
రాగి చెంబులో ఈ విభూది కలిపి రాత్రికి మంచం క్రింద పెట్టుకోండి. మీకున్న నాగ దోషం తొలగిపోతుంది. ఏడాదికి పిల్లలు పుడతారు. యిదిగో ఈ ఉంగరం. దీనిని ఎప్పుడూ చేతి నుంచి తీయక’ అని ఉంగరం అతని చేతికి పెడతాడు జంబులింగం.
‘ఆ కనబడే హుండీలో పదివేలు వేసేసి వెళ్లండి’ అని చెప్పాడు కోటిలింగం.
‘స్వామీ నే ప్రేమించిన అమ్మాయి నన్ను అసహ్యించుకుంటోంది’ ఓ 15 సంవత్సరాల అబ్బాయి ఆవేదనతో చెప్పాడు.
తమ్ముడూ ఆ అమ్మాయి వయసెంత అనుమానంగా అడిగాడు కోటిలింగం.
‘ఓ 25, 30 ఉండచ్చు’ అన్నాడు ఆ పిల్లవాడు. ‘మా ఫిజిక్స్ మేడం ఫిజిక్ బాగుంటుందని లైన్ వేసా’ ఉత్సాహంగా చెప్పాడు ఆ పిల్లవాడు.
పిదప కాలం పిదప బుద్ధులును అని బుగ్గలు నొక్కుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్లు.
‘ఇంతకీ మా ఫీజు ఎలా ఇస్తావ్?’ రహస్యంగా అడిగాడు కోటిలింగం. ‘ఇవిగో మా నాన్న జేబులో పట్టేసాను’ అంటూ జేబులోనుంచి తీసి ఇచ్చాడు. ‘ఇదిగో ఈ విభూదిని ఆమె కనబడగానే ఆమె మీద జల్లు. వచ్చి నీ వళ్లో వాలుతుంది’ అంటూ దోసిటిలో విభూదిని పోసాడు జంబులింగం.
ఇలా దేశంలో ఉన్న అన్ని సమస్యలు స్వామి ముందు వెళ్లబోసుకొని జేబులు ఖాళీ చేసుకుని బూడిద చేతులతో వెళ్లిపోయారు.
రాత్రి ఏడు గంటలయ్యేసరికి ఆశ్రమ ద్వారాలు మూసుకున్నాయి.
స్వామి వారు ధాన్యంలో ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి భక్తుల కోరికలు తీరుస్తారు.. అనే బోర్డు తలుపులకు తగిలించి ఉంది.
ఆశ్రమం లోపల..
‘ఒరే ఈ గెడ్డం.. ఈ విగ్గు.. అబ్బా ఒకటే దురద. చచ్చాననుకో’ వాటిని పీకి గిరవాటేసాడు జంబులింగం.
టీపాయ్ మీద.. బీరు సీసాలు, గ్లాసులు, లెగ్గుపీసులు ఉన్నాయి.
ఇద్దరూ ఫ్రెషప్ అయ్యి టీపాయ్ దగ్గర చేరారు.
నోటిలో సురపానీయాన్ని పోసుకుని, ఎడమ చేతితో కోడి లెగ్గును కొరుకుతూ ‘మనం ఎంత అదృష్టవంతులంరా. మన చుట్టూ ఫిగర్లు, క్యాషుకి క్యాషు, మనం వాళ్లకు ఇచ్చేది పిడికెడు యాష్’ అన్నాడు కోటిలింగం సంబరంగా.
‘వాళ్లకి దొరికామో మనం స్మాష్’ అన్నాడు భయంగా జంబులింగం.
‘మ్యాజిక్ నేర్చుకొన్నావుగా మానేజ్ చేయలేవా?’ అన్నాడు కోటిలింగం.
‘మన వాళ్లలో చాలామంది సోమరిపోతులు, అత్యాసాపరులు ఉన్నారు. వారి కోరికలు కొండవీటి చెంతాడంత. తీరే మార్గాలు తాటాకు చేదంత. అందుకే మనలాంటి స్వామిజీల వెంట గొర్రెల మందలా పడతారు. ఇలాంటి వెర్రి జనం ఉన్నంతకాలం పిడికెడు బూడిద జల్లి ధన, మాన, ప్రాణాలను హరించే అడ్డగాడిదలు వీధికొక్కడు పుట్టుకొస్తున్నారు’ ఆవేశంగా అన్నాడు జంబులింగం.
‘ఒరేయ్ నువ్వు అలా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. కూటి కోసం కోటి విద్యలు మన బతుకుతెరువు మనది. ఆలోచనలు మాని ఓ పెగ్గు వెయ్యి మనసు కుదుటపడతది’
‘నువ్వెన్నైనా చెప్పు వాళ్లు వివేకంతో ఉంటే మన పని అవుట్’ అన్నాడు జంబులింగం.
‘వాళ్లకు అంత వివేకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఆశ్రమాలు, రకరకాల స్వామీజీలు ఉండరు’
‘నాటి స్వామీజీలకు కాంత, కనకాలు ఎంతో దూరం. నేటి స్వామిజీలకు వాటి మీద మమకారం. శంకలు మాని ఇటు ఓ చూపు చూడు.. మన శరీరం తేలికపడుతుంది’ అంటూ టీపాయ్‌ని చూపించాడు కోటిలింగం.
గోచిగుడాల బూడిద స్వామీజీని దర్శించిన వారికి గోచీ కూడా మిగలలేదు. ప్రజలలో ఆత్మవిశ్వాసం, మనోబలం ఉంటే ఇలా ఆశ్రమాల చుట్టూ, బాబాల చుట్టూ తిరగరు. వారిలో ఉన్న మూఢనమ్మకాలు బ్రతికి ఉన్నంతకాలం మన చుట్టూ గుండు స్వాములు, జుట్టు స్వాములు, బండస్వాములు, బక్కస్వాములు, గోచీ స్వాములు, దిగంబర స్వాములు ఇలా రకరకాల పేర్లతో, రకరకాల గేటప్పులు, సెటప్పులతో వెలుస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.

- మోపూరు పెంచల నరసింహం
- ఘాలి లలిత, నెల్లూరు
చరవాణి : 9346393501

స్పందన

నిజంగా మనసు గెలిచింది
ప్రసిద్ధ రచయిత కోలపల్లి ఈశ్వర్ గారి కథ అంటే ఓ లెక్కుంటుంది. ఆయన అంటే మాకు అంత అభిమానం. ఆయన ఏ కథను రాసిన అందులో అంతర్లీనంగా ఓ భావన దాక్కుని ఉంటుంది. గత వారం మెరుపులో ప్రచురించిన గెలిచిన మనసు కథ కూడా ఈ కోవలోకే వస్తుంది. చాలాకాలం తర్వాత అన్ని రసాలు గల కథను చదివాను అన్న భావన కలిగింది. కథలో ఒక రచయిత ఎన్ని రకాల భావాలు కలిగి ఉంటాడు, నిత్యం తన ప్రయాణంలో తన రచనలే తనకు మిగిలేది తప్ప మరొటి కాదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. కథలో రచయిత తాను రాసిన కథ తననే భయపెట్టడం, అలాగే మరో గులాబి కవర్ ట్విస్టు వంటి ఆసక్తికర విషయాలతో కథ సాగిన తీరు సూపర్.
- సాక్షి రాంబాబు, కనిగిరి
- అన్నబొట్ల శ్రీరామ్, గుప్తాపార్కు, నెల్లూరు

మానవ తప్పిదం
గతవారం మెరుపులో గౌతమి గారు రాసిన మానవ తప్పిదం కవిత చదివిన తర్వాత నేటి సమాజంలో మన చేస్తున్న తప్పులే మన జీవనానికి పెనుముప్పుగా మారుతాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రకృతిని ఎన్నిరకాలుగా మానవుడు నాశనం చేస్తున్నాడో ఫలితంగా అంతకు అంత తీరన బాధను భవిష్యత్ తరాలకు మిగులుస్తున్నాడు.
- రావి అనంతబాబు, అద్దంకి
- సాకే రమాదేవి, ఒంగోలు
ప్లెమింగో కవితలు బాగున్నాయి
గతవారం మెరుపులో ప్రచురించిన నేలపట్టును నెమరువేసుకుంటూ కవిత చాలా బాగుంది. చాలా మధురంగా సాగిన ఈ కవిత నేలపట్టు సంగతులు, పక్షి యొక్క లక్షణాలను ఆవిష్కరించింది. అలాగే ఈ ఊహ నిజమేనా అనే కవిత కూడా పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశాన్ని చక్కగా తెలిపింది.
- జి శ్రీనివాస్, గూడూరు
- లక్ష్మీప్రియ, అల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

ప్రకాశం జిల్లా రచయతల సంఘం స్వర్ణోత్సవాల వేదికపై విరబూసిన కవితలు

తెలుగు వెలుగు
నట్టింట్లో ఊగే ఉయ్యాలలకు
అమ్మలు, అమ్మలగన్న అమ్మలు
జో..హారుూ..అంటూ లాలి పాడుతూంటే
చిట్టి గువ్వలు తెలుగు రెక్కల పొత్తిళ్లలో
వెచ్చగా బజ్జునేవి
ముద్ద పప్పు, నెయ్యి,
ఆవకాయ, మీగడ పెరుగుల
అన్నం ముద్దలు స్వర్గాన్ని తలపించేవి
ఉగాది రుచులు, కోయిల గానం
పులివేషాల దసరా దరువులు
పాడిపంటలు పసిడి రాసులై,
భోగి మంటలు, గంగిరెద్దులు
సంక్రాంతులై
తెలుగు వెలుగులు విరజిమ్మేవి
హాయిని గొలిపే ఆనాటి జోలపాట
ఇప్పుడు వృద్ధాశ్రమంలో కుమిలిపోతోంది
పిజ్జాలు, బర్గర్‌లే కాదు
రకరకాల రోగకారకాలు రసాయనాలుగా
అన్నపూర్ణ అమృతహస్తపు
జాడను చెరిపివేస్తోంది
తెలుగు పండుగ జ్ఞాపకాలు
ఇప్పుడు నెమరువేతనే
మునుపటిలా
మళ్లీ తేనెలూరే తీయతీయని తెలుగుపలుకు
పసిడి పల్లకీలో ఊరేగుతుందో లేదో
జిలుగు వెలుగుల తెలుగుతేజం
విరబూస్తుందో లేదో...

- యస్. సుమిత్రాదేవి, కొత్తగూడెం
చరవాణి : 7207550867

వాట్ ఏ యాప్..!
వాట్సప్
నీకు హ్యాట్సాఫ్
ఎవ్వరూ చేయలేని పని
నువ్వు చేస్తున్నావు...
భాషల్ని బతికిస్తున్నావ్
సరికొత్త బంధాలను
పెంచేస్తున్నావ్...
అది సరే కానీ,
కుటుంబ సంబంధాలను
కూల్చేస్తున్నావ్ మరి...!
మనసులోని భావాలను
పంచుకునే వేదిక
మనసులోని కుళ్లును
వెదజల్లును హాయిగా..
పెళ్లాం ఉండేది పక్కలోనే
నువ్వు మాత్రం గుండెపైన...
వాట్సప్ నీకు హ్యాట్సాఫ్...
విశ్వమూలాల్లోని
రహస్య వార్తల్ని
క్షణాల్లో చేరవేస్తావు...
తప్పుడు సమాచారంతో
తిప్పల్లో పడేస్తావు...
రెండు నాలుకలే డేంజర్
అనుకుంటే
ఏంటమా...
నీకు ఒళ్లంతా నాలుకలే...
వాట్సప్ నీకు హ్యాట్సాఫ్...
మనిషి మెదడులో పుట్టిన
టెక్నాలజీ బేబివి..
మనిషిని మనిషితో విడదీసే
ఇన్విజిబుల్ వైరస్‌వి...
నీ జన్మ సక్రమమే...
నిన్ను అక్రమంగా మార్చింది
మనిషే
నిన్ను భస్మాసురున్ని
చేసిందీ మనిషే...
మనిషీ..!
నువ్వొక అర్ధంకాని ఏప్ వి..!!

- శ్రీనివాస్ గుండారపు, ముంబయి
చరవాణి : 9930901090

అమ్మ
కమ్మనైన కధకు నిర్వచనం అమ్మ
చల్లనైన మనసుకు నిదర్శనం అమ్మ
అనుబంధానికి, ఆత్మీయతకు, అనురాగానికి నిలువెత్తు సాక్షం అమ్మ
కొమ్మ అయిన నిలువలేదు
అమ్మ లేకుండా
కరుణా హృదయానికి కరదీపిక అమ్మ
అమ్మ అంటే ఆదిశక్తే కాదు, పరాశక్తి కూడా
మనుష్య ఆరాధ్య దేవత అమ్మ
రాక్షసులు, దేవతలు చేత
పూజింపబడే అమ్మ
ఓంకారమైన, మమకార, ఉపకార,
సహకారాల ఆదియే (మొదలు) అమ్మ
ప్రకృతి పుట్టక అమ్మతో
బిడ్డలలో జీవనజ్యోతి, వెలుగు దివిటి అమ్మ
కలుషాలకు కల్మషాలకు లొంగనిది అమ్మప్రేమ
రూపురేఖలు, సుగుణాలను లెక్కచేయక
ప్రేమించేది అమ్మప్రేమ
ఆడదంటే ఆట వస్తువుకాదు,
అనురాగశక్తి కూడా
అలుపెరగని ఉద్యమకారిణి అమ్మ
కల్పవృక్షం అక్షయపాత్ర అమ్మ
అన్ని ఫలాల సమ్మేళనమే అమ్మ
బిడ్డ నిజాయితీ మొదలు అమ్మతో
బిడ్డలు దొంగ అయిన, దొరైనా హేతువు అమ్మతో
నిరంతరం పూజింపబడేదే అమ్మ
గృహానికి దీపం అమ్మ
అక్షర ఆరంభం అమ్మతో
బాధలో జ్ఞప్తికి వచ్చేది అమ్మప్రేమ
రాముడినైన, రావణుడినైన తయారుచేసేది
అమ్మప్రేమ
ఆకాశానికి ఎక్కిన, అగాధంలోకి దిగిన పిలిచేది అమ్మనే
మమత, సమత, మానవతా భావాలను
బోధించే తొలి గురువు అమ్మ
కొలత లేనిదే మాతృప్రేమ.

- డా.మున్నంగి రాహేలు
ఒంగోలు,
చరవాణి : 98481 27005

మనోగీతికలు

కాల్‌సర్పం
అభాగ్యుల హద్దుమీరిన
కోరికలను
అనుకూల పుట్టలుగా
మలచుకుని
సగటు మనిషి స్వేద
రుధిరాలను
క్షీర సమానముగా తలచి
పీల్చుకుని
కాలయముని చందాన
ఆబాలగోబాలాన్ని
కబళించి తెగబలిసిన
కాల్‌మనీ సర్పం
రాజకీయ వృక్షశాఖలను
ఆద్యంతం ఆసరాగా చేసుకుని
ఆకసానికి ఎగబ్రాకుతూ
ప్రదర్శిస్తున్నది తన దర్పం
చట్టాల కట్టెలకు సైతం
ఈ విషపన్నాగం దడవని వైనం
ప్రమాదం పొంచి ఉన్నదని
పసిగట్టి
తమాషాగా విదేశీయానం..

ఎవడో ఏదో చేస్తాడని
నమ్ముకుంటే
అవని జనులకు మిగిలేది శూన్యం
ఆమ్యామ్యాలకు
ఆలవాలమైన ఈ దేశంలో
అమాయకుల బ్రతుకులు దైన్యం.

- అల్లాడి వేణుగోపాల్,
నెల్లూరు

అశృతర్పణం
ఎంత పనిచేశావు నేస్తం
ఆరడుగుల అందాన్ని
అవనికి అర్పణ చేశావా..
సహజత్వపు అభినయాన్ని
సొంతం చేసుకున్నవాడివి
సహజ మరణం వరకు
వేచి చూడలేకపోయావా!
ఆధ్యాత్మిక ధోరణి వైనం చూసి
ఆవేశానికి లోను కావని
అర్ధాంతరపు చావును
ఆహ్వానించవనుకున్నాను
మెరుపు జాడ చూపక
ఉరిమిన పిడుగులా
వచ్చిన నీ మరణవార్త
మనసును అస్తవ్యస్తం చేసింది
చెట్టంత మనిషివి
చిగురుటాకువయ్యావెందుకు?
జీవితం ఆద్యంతాన్ని
చదివిన నువ్వు జారిపోయావెందుకు?
ఆత్మహత్య పిరికితనమన్న నీవు
దానినే ఆశ్రయించావెందుకు?
ఆరేళ్లు ఒంటరితనాన్ని
అనుభవించిన నువ్వు
అర క్షణం ఆలోచనకు
తావివ్వలేకపోయావెందుకు?
నీవు ఇక లేవన్న నిజాన్ని
జీర్ణించుకోలేకపోతున్నాము
అందరికీ మారదర్శివనుకున్న వేళ
అర్ధాంతరంగా మార్గాన్ని
మార్చుకున్నావే..
ఇది ఎంతవరకు సమంజసం?
దీనికి లేదిక మాకు సమాధానం
గుండెల దాగిన మా అభిమానం
చివరకు నీకు చేస్తున్నది అశృతర్పణం.
(నటుడు, రచయిత, కవి
రంగనాధ్‌కు అక్షర నివాళి)

- శింగరాజు శ్రీనివాసరావు, సంతపేట, ఒంగోలు,
చరవాణి : 9052048706

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- మోపూరు పెంచల నరసింహం - ఘాలి లలిత