నెల్లూరు

బంగారు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. ఏదో స్టేషన్‌లో ఆగినట్లుంది రైలు. వేసవికావడంతో బాగా దాహంగా అనిపించింది. బెర్త్‌పై లేచి కూర్చుని వాటర్‌బాటిల్ మూతతీశాను. కొంచెమే నీళ్లున్నాయి. ఆ కాసిని తాగి అప్పుడే నిద్ర లేచి నా వంక చూస్తున్న ఎదురుబెర్తు ఆవిడకు, కొంచెం నా పెట్టె చూడమని చెప్పి, భుజానికి బ్యాగు తగిలించుకుని, మంచినీళ్ల సీసా పట్టుకుని కంపార్ట్‌మెంట్ డోర్ దాకా వచ్చాను.
భుజానున్న బ్యాగు.. చేతిలో ఉన్న బాటిల్‌ను బ్యాలన్స్ చేస్తూ బోగీకి అటూ ఇటూ ఉన్న కమ్ములను పట్టుకుని ఒకసారి ప్లాట్‌ఫాం అంతా కలయచూశాను. ఎవరైనా పిల్లాడు కనిపిస్తాడేమో మంచినీళ్లు తెచ్చిపెట్టమందామని. ఎవరూ కనిపించలేదు.
అదేదో జంక్షన్ అనుకుంటా.. ట్రైను చాలాసేపే ఆగేలా ఉంది. ఎందుకంటే నా కంపార్ట్‌మెంట్‌లో నుంచి దిగిన వాళ్లు చాలా నింపాదిగా నీళ్లు పట్టుకుంటూ, టీ తాగుతూ సిగరెట్లు, బీడీలు ఊదేస్తూ కనిపించారు. పైగా, ఆ స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వస్తున్న వారు కూడా నెమ్మదిగా బోగీలు వెతుక్కుంటూ, వస్తున్నారే తప్ప హడావుడి పడిపోవడం లేదు.
ఈ పరిస్థితి చూశాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. మెల్లగా ఫ్లాట్‌ఫాం మీదికి దిగి చల్లని తాగునీరు అని బోర్డున్న వైపు వడివడిగా అడుగులేశాను.
ఆ కాస్త దూరంలోనే రెండుసార్లు వెనుదిగిరి రైలు కదిలిపోతుందేమోనని ఆత్రంగా చూశాను కూడా.
అక్కడికి చేరేసరికి.. నెత్తిమీదికి చెంగు కప్పుకున్న ఒక మహిళ చంకలో పిల్లాడితో, చేతిలో పిల్లతో వచ్చింది. ‘‘ఓరు.. నిమిషం ఇరింగమ్మ.. కొంచెం కుళందైలకు కుడికర్తకు తన్నీవేనుమ్..’’ అంటూ అరవంలో మాట్లాడింది. నన్ను వెనక్కి జరిగేలా చేసి ట్యాప్ తిప్పింది. ముందు తాను నీళ్లు తాగింది. తర్వాత చంకలో ఉన్న చంటిపిల్లాడికి చేతితో నీటిని పట్టుకుని తాగించింది. పక్కనే కొంగు పట్టుకుని ఉన్న పిల్లకి మూతికడిగి, ముక్కు తుడిచి, దానికీ నింపాదిగా నీళ్లు తాగిస్తోంది. నాకు ఓ వైపు రైలెక్కడ కదిలిపోతుందో అనే దిగులుతో చాలా ఇదిగా ఉంది. ఈవిడేమో వాళ్లింటి పెరట్లో మాదిరిగా పిల్లల సంరక్షణలో పడింది. చివరికి విసుగొచ్చి ‘‘రైలు కలంబు పోగదు..’’ అంటూ ఏదో నాకు వచ్చిన తమిళంలో చెప్పి, ఆవిడ మీద నుంచే బాటిల్ పంపు కింద పెట్టి నీళ్లు పట్టుకుని నా బోగీ వైపు వడివడిగా అడుగులేశాను. ఒక్క ఉదుటున వచ్చి నా బోగీలో పడి హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను. రైలు ఇంకా కదల్లేదు గానీ.. నాకు కొద్దిగా కంగారు తగ్గింది.
నా సీటు వైపు వస్తుంటే అటువైపు బాత్‌రూం వద్ద ఎవరో బిచ్చగాళ్లనుకుంటాను, గుంపుగా వచ్చి కూర్చున్నారు. వాళ్ల వెనకాలే మురికి ఓడుతున్న దుస్తులతో ఓ మహిళ కూడా తల మీదుగా చెంగు కప్పుకుంటూ వచ్చి అదే బోగీలో చేరింది. నేను నేరుగా వెళ్లి నా బెర్త్‌పై కుర్చున్నా. మా ఎదురు బెర్తు ఆవిడ నన్ను చూసి పలకరింపుగా నవ్వి, మళ్లీ దుప్పటిని తన మీదుగా లాక్కుని కళ్లు మూసుకుంది. నేను మంచినీళ్ల బాటిల్‌ను బాస్కెట్‌లో పెట్టుకుని బ్యాగు తీసి తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడానికి ఉపక్రమించాను. ఇంతలోగా.. రైలు మెల్లగా కదిలింది. కొద్దిసేపటికి బాగా వేగం పుంజుకుంది. చల్లని గాలికి లయబద్ధంగా సాగుతున్న రైలు కుదుపులకు కళ్లు మెల్లగా మూతపడ్డాయి.
అంతలోనే.. హఠాత్తుగా పెద్ద అరుపులు వినపడ్డాయి. కంపార్టుమెంట్‌లో ఒక్కసారిగా ఏదో కలకలం మొదలైంది. బోగీకి అటు చివరన ఉన్న టీసీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ‘ఏందబ్బా’ అని తొంగిచూశా. ఆ బిచ్చగాళ్ల ముఠాలోని ఆడవాళ్లు, మరో ఆడమనిషిని జుట్టుపట్టుకుని ఈడ్చి ఈడ్చి కొడుతున్నారు.
ఈ హడావుడికి కంపార్ట్‌మెంట్‌లోని లైట్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి వెలిగాయి.
జరిగిందేమిటో నాకు అర్ధంకాలేదు. నా ఎదురుగా అప్పర్ బెర్త్ మీదున్న ఓ పత్రికావిలేఖరి తన బ్యాగు చూడమని నాకు చెప్పి హడావుడిగా కిందకు దిగి, గొడవ జరుగుతున్న చోటికి వెళ్లాడు. కొద్దిసేపటికి అల్లరి సర్దుమణిగింది. నేను మెల్లగా లేచి బాత్‌రూం వైపు వెళ్లాను. అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం, నన్ను అటు నడిపించింది.
బిచ్చగాళ్ల గుంపంతా మరో బోగీలోకి వెళ్లిపోగా.. ఒక్కావిడ మాత్రం మోకాళ్ల మీద తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. మాసిపోయిన ముదురు నీలం రంగు చీర, కొంగు మాత్రం తలమీదగా కప్పుకుని ఉండటంతో నాకు ముఖం కనిపించలేదు. అవును.. ఇందాకట నేను మంచినీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు బిచ్చగాళ్ల వెనుక వచ్చిన మహిళ ఈవిడేననుకుంటాను. ఇటు తిరిగి చూస్తే, పత్రికావిలేఖరి బోగీ తలుపు దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు.
‘‘ఏంటండీ.. ఏమిటీ గోల’’ అన్నానే్నను వెనుక నుంచి. తనెం చేయబోయిందంట... చితకబాదినారు. ‘‘ఈ మధ్య రైళ్లలో ఈ బిచ్చగాళ్ల గోల మరీ ఎక్కువైపోయింది’’ అన్నాడు.
‘నిజమే కదా’ అన్నట్లు తలపంకిస్తూ, బాత్‌రూం వైపు వెళ్లా, తిరిగి వస్తుంటే, హఠాత్తుగా నా చీర చెంగును ఎవరో పట్టి గుంజినట్లు అనిపించింది. అటు చూశాను ఆ బిచ్చగత్తే.. నా వంక దీనంగా చూస్తోంది.
‘‘అమ్మా, నేను దొంగను కాను. నా పరిస్థితి బాగాలేక ఇలా హఠాత్తుగా రైలు ఎక్కాల్సి వచ్చింది. పక్కనే చంద్రగిరి స్టేషనే మాది.. రెండు రోజులైంది అన్నం తిని. అందుకని వారిని తినటానికి ఏదైనా ఉంటే ఇమ్మన్నాను. ఒకాయన ఈ అన్నం ఉన్న పొట్లం ఇచ్చాడు. అదిచూసి గుంపులోని ఆడవాళ్లు నా మీద పడి కొట్టారు’’ అంది.
ఆ మాటలు వింటూ ఆమెనే చూస్తున్న నాలో తెలియని అలజడి.. జ్ఞాపకాల తెరల్లో ఏదో కదలిక. ఆ ముక్కు.. సోగకళ్లూ.. ఉంగరాల జుట్టూ.. బుగ్గసొట్టలూ.. ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఇంకాస్త పరిశీలనగా చూశాను. ఆవిడ అలాగే నిస్తేజంగా నా వంక చూస్తోంది. నా మనస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అమ్మా, ‘‘నువ్వు.. మీరు బంగారువా..’’ అన్నా అంతే ఈసారి ఉలిక్కిపడటం ఆమె వంతయింది. నీరసంగా అలాగే పైకి లేచింది.
‘‘అవును, అది నా ముద్దుపేరు.. మీరెవరు?’’ అంటూ చాలా అణుకువగా అడిగింది.
‘‘నేను.. మీ వంటావిడ మంగమ్మ గారి అమ్మాయిని’’ అన్నాను. వణుకుతున్న స్వరంతో, అప్పటికే కళ్లల్లో ఉబుకుతున్న నీటిని ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేశా. అసంకల్పితంగానే మురికిగా ఉన్న ఆవిడ చేయి పట్టుకున్నాను.
‘‘నువ్వా, శైలజ’’ అందావిడ.
నేను తలూపాను.
వెంటనే ఆవిడను మెల్లగా నడిపించుకుంటూ వచ్చి, నా బెర్త్ మీద కూర్చొబెట్టాను.
‘‘మంచినీళ్లు తాగుతారా’’ అన్నాను.
అప్పటికే తన బెర్త్ మీద కూర్చున్న విలేఖరి నన్ను వింతగా చూస్తున్నాడు.
నేను వెంటనే చూపు తిప్పేసుకుని, ‘‘మీరు.. ఇక్కడ ... ఇలా ’’ అంటూ మరోమాట పెగలక, నసిగా.
‘‘చేసిన పాపానికి నేను అనుభవిస్తున్న శిక్ష శైలజ..’’ అందావిడా నిర్వేదంగా.
వెంటనే పక్కనే ఉన్న బ్యాగు తీసి రెండు అరటిపండ్లు ఆవిడకిచ్చాను. తీసుకోలేదు. నీరసంగా వెనక్కి తలానించి కూచుని కళ్లు మూసుకుంది. నాకు ఇంక కన్నీళ్లు ఆపుకోవడం చాత కాలేదు. ఆవిడ చేతి మీద చేయివేసి గట్టిగా పట్టుకున్నాను.
మనసు పొరల్లో.. ఏవేవో జ్ఞాపకాలు..
వెంకటరామయ్యగారనే పెద్ద డాక్టర్ ఇంట్లో అమ్మ వంట చేసేది. లంకంత ఇల్లు. పెద్ద చావిడి, ఖరీదైన సోఫాలు, ఉయ్యాల బల్ల, అందమైన పూల కుండీలతో, అసలా ఇల్లే కళకళలాడిపోతూ ఉండేది. ఇంటినిండా ఎప్పుడూ బంధువులు ఉండేవారు. వెండిపళ్లాలు, గ్లాసులు, గినె్నలు, పక్కనే అల్మారానిండా ఖరీదైన గాజు సామాను, ఇంటి ముందు ఆవరణంలో రెండు ఖరీదైన గుర్రపుసార్టులు, తోటనిండా రకరకాల పూలు.. అసలా ఇల్లే ఓ పాతకాలపు నగ మాదిరిగా ఆ ప్రాంతంలోని ఇళ్లన్నింటిలోనూ ప్రత్యేకంగా హుందాగా కనబడుతూ ఉండేది.
సాయంత్రం అయితే చాలు, ఆ మేడ మీద అర్ధచంద్రాకారపు వరండాలోని రంగురంగుల లాంప్‌షేడ్స్ అన్నీ వెలుగుతూ ఆ మేడకు నవరత్నాల హారం వేసినట్లు కనిపించింది.
ఇంతటి సిరిసంపదల మధ్య అపురూపంగా పెరిగింది బంగారు. ఆ అమ్మాయి అసలు పేరు గీతమాలిని. వెంకటరామయ్య గారి ఏకైక మనుమరాలు.
కారు ప్రమాదంలో కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు ఒకేసారి పోవడంతో వెంకటరామయ్య గారికి, బంగారే ప్రాణాధారమైంది. ఆరోజు బంగారు ఇంట్లోనే ఉండిపోవడంతో గండం నుంచి బైటపడింది.
ఇంక ఆయన ఆ మనుమరాలిని ఏడు మల్లెల ఎత్తుగా పెంచారు. ఆమె కోసం గుర్రపుసార్టును ప్రత్యేకంగా చెన్నై, బెంగళూరు నుంచి తెప్పించారు. బంగారు ఆ గుర్రపు సార్టుల్లోనే యువరాణిలా స్కూలుకు వచ్చేది. బంగారు ప్రతి పుట్టినరోజుకు మిఠాయిలు, గులాబీ పూలను స్కూలంతా పంచిపెట్టేది. అమాయకత్వానికీ అందానికీ కరుణకూ ఆ అమ్మాయి ప్రతిరూపం.
ఇంగ్లండులో లాయర్ కోర్సు చదువుతున్న మామయ్య గౌరవ్‌కే ఇచ్చి పెళ్లి చేయాలన్నది తాతగారి సంకల్పం. అయితే, ఇంగ్లండు నుంచి మామయ్య వచ్చేలోపల బంగారు జీవితానికి గ్రహణం పట్టింది.
పొరుగింటి అబ్బాయి రావణ్ రూపంలో వచ్చిన రాహువు చందమామలాంటి ఆ అమ్మాయి జీవితాన్ని మింగేశాడు. తాతగారి గారాబం, ప్రేమతో ఎండ కనె్నరుగని రాజకుమారిలా పెరిగిన బంగారు రావణుడు లాంటి రావణ్ మాయమాటలకు మోసపోయింది. ఏడువారాల నగలూ, బీరువాలోని డబ్బూ తీసుకుని ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తాతగారి గుండె పగిలింది. అంతపెద్ద డాక్టర్ వీధిముఖం చూడ్డం మానేశారు. మంచం పట్టారు. ఇంట్లో కళాకాంతీ నశించిపోయాయి.
మా అమ్మ కూడా ఏదో అంత ఉడకేసి అక్కడ పడేసి, వంటింటి గడప మీద తల పెట్టుకుని తనలో తనే కుమిలిపోయేది. వెండి కంచంలో వేడన్నంలో పాలూ పంచదారా వేయించుకుని ఆనందంగా తినేసి ఒక్క పరుగున వెళ్లిపోయే బంగారు కాలిపట్టీల గలగల, గాజుల చప్పుడు మా అమ్మను వెంటాడేవంటా, ఎప్పుడూ చెబుతూ కళ్లు నీళ్లు పెట్టుకునేది.
కొద్దిరోజుల తర్వాత బంగారు ధ్యాసతో తాతగారు పోయారు. బంగారు ఎక్కడుందో ఎవరికీ తెలియదు.
ఆ తర్వాత ఓ పదేళ్లకనుకుంటాను.. ఓ సాయం సంధ్యవేళ చేతిలో పిల్లాడితో చంకలో పాపతో ఇంటి గుమ్మం ముందు నిలుచుంది. నేను అప్పుడే నా కొడుకు ప్రసవానికని అమ్మ దగ్గరకు వచ్చి, తిరిగి మా అత్తారింటికి వెళుతున్నాను. బంగారును చూసి నాకు నోట మాట రాలేదు. బికారిలా ఉంది. వార్థక్యంతో నడుం వంగిపోయి.. కళ్లు మసకబారిపోయిన స్థితిలో ఉన్న మా అమ్మ ఆమెను చూసి కొయ్యబారిపోయింది. వెంటనే తేరుకుని అక్కడే కూలబడిపోయి నాయనా.. బంగారూ.. అంటూ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఈ హడావుడికి గుమ్మంలోకి వచ్చిన ఇంగ్లండు మామయ్య గౌరవ్ ఆమెను చూసి నిశే్చష్ఠుడైపోయాడు.
బంగారుతో మధురమైన జీవితాన్ని గడపాలనుకున్న ఆయన అప్పటికే మరొకరికి భర్త అయిపోయాడు. పిల్లలూ పుట్టారు. అయినా ఆ గుండెలో ఎప్పుడూ తన చిన్నారి మేనకోడలి అందమైన బొమ్మ చిరంజీవిగా ఉండిపోయింది.
కొంతసేపటికి తేరుకున్న మామయ్య ‘రా లోపలికి’ అంటూ పేలవమైన స్వరంతో ఆహ్వానించాడు. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీటిని కనపడకుండా దాచుకోవడానికి అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాయిలా నిలిచిపోయిన బంగారును మా అమ్మ లోపలికి తీసుకెళ్లింది. మా అబ్బాయిని ఒళ్లో పెట్టుకుని కూర్చున్నా, ఇంతలోపల గుడికి వెళ్లిన మామయ్య భార్య ‘నిమీలిత’ రావడం.. బంగారును పరుషంగా నిందించడంతో పిల్లలను తీసుకుని గడపదాటిన ఆమె మళ్లీ ఇదే కనిపించడం.
ఆ ఇంటికే యువరాణి అయిన బంగారు ఆరోజు అలా బికారిలా నడిచి వెళుతుంటే మా అమ్మ, నేనూ చూడలేకపోయాము. నా చేతిలో ఉన్న బంగారు చేయి మెల్లగా కదిలింది. ఒక్కసారి ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాను.
‘‘ఇంతకీ నువ్వెలా ఉన్నావు శైలజ’’ అంది.
‘‘పిల్లలకు పెళ్లిళ్లయిపోయాయి. ఇదిగో మా పెద్దాడు సుబ్రహ్మణ్యం ఇంటికే వెళుతున్నా’’ అని చెప్పాను.
‘‘మరి మీ పిల్లలో’’ అన్నానేను.
‘‘పట్టెడన్నం పెట్టలేక ఎవరికో పెంపకానికి ఇచ్చేశాను. ఇద్దరూ చెరోదారీ అయిపోయారు. పదోతరగతైనా పూర్తి చేయకపోవడంతో చిన్న ఉద్యోగమైనా వెతుక్కునే అవకాశం లేకపోయింది. నీకు తెలుసా, నేను పాచిపనులు కూడా చేశానే శైలజా’’ అంటూ బావురమంది.
మెల్లిగా మళ్లీ కళ్లు తుడుచుకుంటూ, ‘‘వయస్సు వేడిలో, తాత్కాలిక వ్యామోహంలో నేను వేసిన అడుగు, నన్ను అధఃపాతాళానికి తోసేసింది. ఎంతో ప్రేమించినట్లు నటించిన నయవంచకుడు రావణ్ నా దగ్గర డబ్బులు కాజేసి, పిల్లల తల్లిని చేసి వదిలేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనదారి తాను చూసుకున్నాడు. ఇప్పుడిక ఒంట్లో శక్తి లేదు. పక్క ఊళ్లో ఓ సంపన్న కుటుంబీకులు నడుపుతున్న ఆశ్రమంలో తలదాచుకుంటున్నాను.
‘‘నా కూతురు భార్గవిని పెంపకానికి తీసుకున్నవాళ్లు పక్క ఊరికి వచ్చారని తెలిసి, దాన్ని చూద్దామని వెళ్లా, అక్కడి పరిస్థితి చూసినాక నాకు జీవితంపై ఆశే నశించింది శైలజా. డబ్బున్న మారాజులు. పోనీలే అదైనా బాగుంటే అదే చాలు..’’ అంది నిర్వేదంగా.
ప్రేమలు, పెళ్లిళ్లూ, ఇంట్లో నుంచి పారిపోవడాలూ.. ఇవన్నీ కొత్తేమీ కాదు. అయితే, బంగారు జీవితాన్ని ఇంతటి దారుణమైన మలుపు తిప్పిన రావణ్ లాంటి రాహువులతోనే అందమైన చందమామలాంటి జీవితాలకు గ్రహణం పడుతుంది. ఆడపిల్లలు ప్రేమమోజుతో గడపదాటే ముందు ఒక్కక్షణం విజ్ఞతతో ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది.
రైలు కూతకు ఆలోచనలు ఆగిపోయాయి. కిటికీలోంచి చూస్తే పక్క స్టేషన్ వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. గబగబా పర్సు తీశాను. కొంత డబ్బులు తీసి బంగారు చేతిలో బలవంతంగా పెట్టి గుప్పెట మూశాను. ఉలిక్కిపడిన బంగారు చేతిలోని డబ్బులు తిరిగి నా చేతిలో పెట్టేసి, పిలుస్తున్నా వినకుండా గబగబా కంపార్ట్‌మెంట్ చివరిదాకా వెళ్లిపోయింది. రైలు ఆగగానే దిగింది. ఆ చిన్న పల్లెటూరి స్టేషన్ గుడ్డి దీపాల వెలుతురులో మసకబారిన చిత్రంలా వెళ్లిపోతున్న ఆమెను కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాను.
‘‘పూలబాటగా భ్రమిసేరు, ముళ్లబాటన నడిచేరు, సింగారం చిందులువేసే అమ్మాయిల్లారా, జరభద్రం’’

- ఆలకుంట రెడ్డి ప్రసాద్,
వాల్మీకిపురం, చరవాణి : 9848672587

మనోగీతికలు

కాలం - మహత్యం
ఏం తెచ్చానని ఈ ఆరాటం
ఏం తీసుకుపోతున్నానని
ఈ పోరాటం
ఎంతకాలం ఊపిరితీస్తానో
నిఖ్ఖచ్ఛిగా తెలియని
ఈ అయోమయ అవస్థలో
ఉన్నదంతా నాకే కావాలని,
అనుకున్నదంతా అనుభవించేయాలి
ఈ తపన, ఆశకు అంతులేదిక్కడ
ఎక్కడి నుండి వచ్చానో తెలియదు
ఎక్కడికి పోతున్నానో తెలియదు
అయినా ఈ రాకపోకల మధ్య
ఎన్నో అనుబంధాలని, అనురాగాలని
అమానవీయ దృక్కోణ చిత్రాలని
వాటేసుకొంటున్నాను,
వాడేసుకుంటున్నాను
నేను చేస్తున్నది, చూస్తున్నది, న్యాయం అనుకుంటున్నాను
నాణానికి అవతల వైపు అంతా అబద్ధం అనుకుంటున్నాను
ధర్మం అనే మాటను
నా హృదయాంతరంలో ఉరివేసి
అర్థంపై మమకారంతో, కామాన్ని కావల్సినంతగా తీర్చుకుంటూ
సమస్త జీవరాశుల్లో ప్రత్యేకముగా ఉన్న మనిషి అనే నేను మానవత్వాన్ని, కృతజ్ఞతని ఏనాడో మర్చిపోయాను
అన్ని నాకే తెలుసు అనే అహంభావం
నరనరాల్లో జీర్ణించుకుపోయిన నేను
చావుపుట్టుకల రహస్యం
ఇంతవరకు చేధించలేదు
ప్రయత్నిస్తూనే ఉన్నాను
ఓడిపోతూనే ఉన్నాను
ఊపిరితీయడం ఆపివేసిన మరుక్షణం
చింకిచాపమీద, ఇంటి ఆరుబయట
ఆఖరికి ఇంకా ఎంతసేపు
పారవేయలేదా..ఇదేనా నా జీవితం
నా ముత్తాత, తాత, తండ్రి, తల్లి, స్నేహితులు
ఎందరో మరెందరో నా కళ్లముందే కనిపించకుండా పోయారు
ఖాళీ చేతుల్తో గోడ మీద ఫొటో మిగిల్చి
రేపు నేను కూడా అంతేకదా, వైరాగ్యం జూలు విదిల్చి
మరీ మరీ హెచ్చరిస్తున్నా నాకేం కాదులే, పోయినవాళ్లు
తెలియక పోయార్లే అని మనసును మాయచేస్తున్నా
కాదు కాదు మనస్సే నన్ను మళ్లీ మళ్లీ మాయచేస్తుంది
ఎన్నో వేల ప్రవచనాలు, మరెన్నో అనుభవాల సారాలు
అయిన నేను నేర్చుకున్నది శూన్యం
మనం అనే మాటను ఏనాడో పాతరేసి
నేను, నా భార్య, నా పిల్లలు, నా వరకే
అంతా నా అనుకున్న వాళ్లకే
ఇంతచేస్తున్నా నాతో తోడు వచ్చేదెవరు
ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికి వెతికి వేసారను
అదే ప్రశ్న నాకైతే నేను ఎవరికి తోడు వెళ్లాను
నేను చేసిన కర్మల తాలూకు పాపపుణ్యాలను బేరీజు వేసుకొంటూ
ఇది అంతా ఆ పైవాడి ఆట అని తెలిసుకొనే లోపు ఇంద్రియాల
పటుత్వాన్ని నిగ్రహానిగ్ర శక్తిని
బలవంతంగా లాగేసుకొని
ఈ బ్రతుకు ఇక చాలులే అని అంటూ బలవంతంగా నా ఊపిరికి ఉరితాడు బిగించి
కాయం నుండి వేరుచేసి కాడులో కట్టెను చేస్తుంది
కాల్చి బూడిద చేస్తుంది
నా అనే వాళ్లకు పంచింది
ఏదీ ఏదీ నాతో రాలేదు, రాదు కూడా
వెలుగుతున్న జ్ఞానజ్యోతి కాంతిని ఒడిసిపట్టుకొనే వరకు
అందరికి అన్ని తెలిసినా అంతా అయోమయం..అదే కాలమహత్యం
దైవం వేరే ఎక్కడో కాదు
- కాలమే దైవం

- గర్నెపూడి వెంకటేశ్వరరావు
మార్టూరు, 8341169772

నేనంటే నేనే
నేను పుట్టాను అని తెలుసుకునే లోపే
నేనూ పుట్టాను అంది
రోజురోజుకి నేను ఎదుగుతున్నాను
అనుకుంటూంటే లేదు లేదు
నువ్వు తరుగుతున్నావు అంది
నేను ఎక్కడికి పోతే అక్కడికి
నీడలా నేనున్నానని హెచ్చరిస్తూంటుంది
నా మనసుకి అది ఒక్కొక్కసారి ఇదంతేలే
అనిపిస్తుంది.
మరోసారి మింగేసే భూతంలా వుంటుంది
నా నడవడి కొరవడితే నన్ను గమనించుకో
అని భయపెడుతుంది
సంబరాలలో ఉంటే... కానీ కానీ ఇంకెన్నాళ్లు అన్నట్లు పరిహాసంలా చూస్తుంది
బాధాతప్త హృదయంతో ఉంటే
ఓర్చుకో ఓర్చుకో అన్నీ ఒకరోజుకి పోతాయి అని ఓదారుస్తుంది
నాకు పేద లేదు, రాజు లేడు, పెద్ద చిన్నా
తేడా లేదు నా వాదం సామ్యవాదం అంటుంది
ఎప్పుడూ, వదలదు, కదలదు, ఉలకదు, పలకదు ఆడిపోసుకున్నా అసలేమి అనదు
దానికి రోషము లేదు పాశమూ లేదు
పరమ నిర్దయతో కూడిన కఠినాత్మురాలు.
ఈ కాలగమనం ఎవరి కోసమూ ఎప్పటికీ ఆగదు నేనూ అంతే తగినకాలం కోసం
చూస్తున్నాను అంటుంది
ఎన్నో వసంతాలు వస్తూ వుంటాయి...
పోతూ ఉంటాయి - అది మీకు, నాకు కాదు.
నా నిత్యవసంతం వల్లకాడులోనే అంటుంది
అదే అదే మృత్యువు.

- వేదగిరి రామకృష్ణ, బాలాజీనగర్, నెల్లూరు
చరవాణి : 8121184689

స్పందన

బాపూజీ కవితలు బాగున్నాయి
గతవారం మెరుపులో జాతిపిత మహాత్మాగురించి ప్రచురితమైన జయహో బాపూజీ, బాపూజీ కవితలు రెండూ బాగున్నాయి. బాపూజీ రొటీన్‌గా సాగితే, జయహో బాపూజీ కాస్త ఆలోచింపజేసే విధంగా వుంది. బాపూజీ సేవలను కొనియాడుతూనే మనం ఎలా ఉండాలో చెప్పకనే చెబుతూ మనందరి చేత ప్రతిజ్ఞ చేయించిన రచయిత కొడవలూరు ప్రసాద్ గారు అభినందనలు. కవితలోని ప్రతివాక్యం గాంధీ గారి గొప్పతనాన్ని కీర్తించింది.
- అంజలి, డికెడబ్ల్యు, నెల్లూరు
- రాంప్రసాద్ సూరిశెట్టి, బలిజవీధి,తిరుపతి

మమతానురాగం కథ బాగుంది
మెరుపులో ప్రచురితమైన మమతానురాగం కథ బాగుంది. కథలో చెప్పదలచుకున్న విషయాన్ని రచయిత ఆడేరు చెంచయ్య గారు సంక్షిప్తంగా వివరించిన విధానం బాగుంది. మమత, అనురాగ్ కలయిత, ఉద్యోగాలు పొందడం, ప్రేమించుకోవడం, పెళ్లిచేసుకోవడం... ఇలా కథ చాలా రొటీన్‌గా సుఖాంతమైంది. కథలో ఎటువంటి మలుపులు, ఆసక్తికర సంఘటనలు లేవు. రచయిత తాను చెప్పదలచుకున్న విషయం చెబితే చాలు అనుకున్నట్లు కథను రాశారు. అయితే కథను కుదించి పాఠకులకు అందించిన తీరు బాగుంది. చివరికి కథ సుఖాంతం దిశగా పయనించింది.
- పుప్పాల పవన్‌కుమార్, కందుకూరు
- రమణయ్య తంజావురు, సూళ్లూరుపేట

విశ్వచైతన్యం, శ్రద్ధాంజలి
కవితలు బాగున్నాయి
గతవారం మెరుపులో మోపూరు పెంచల నరసింహం గారు రాసిన విశ్వచైతన్యం, హస్తిమోహన్‌రాజు గారు రాసిన శ్రద్ధాంజలి కవితలు రెండూ బాగున్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు రచయితలు తమ కవితల ద్వారా వెళ్లగక్కిన ఆవేదన అర్ధమవుతుంది. రచయితలకు ధన్యవాదములు.
- యల్లటూరి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు
- రసజ్ఞ, కావలి
రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- ఆలకుంట రెడ్డి ప్రసాద్