నెల్లూరు

మొక్కుబడి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2015 నవంబర్ 16వ తేదీ సోమవారం భారీ వర్షాలని టివీలో హెచ్చరికలు. ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణం చేయరు. ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రాప్రగడ గారు తన హరివంశంలో జడివానను వర్ణించిన తీరు మహా అద్భుతం. అది కేవలం వర్ణన మాత్రమే అనుకున్నాను. కాని నేడు అది నిజమైంది. కాని.. ఆరోజు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను. ఒక్కసారి గతంలోకి వెళితే..అది 1980 సంవత్సరం నవంబర్ 16వ తేదీ ఆదివారం ముప్పది ఐదు సంవత్సరాలైనా మరచిపోలేని రోజు. కావలి జవహర్‌భారతి కళాశాల.. చరిత్ర అధ్యాపకుడు మా ఓ.యల్.మాస్టారు (ఓ. లక్ష్మీనరసింహారావు గారు) ఇంటర్ మొదటి సంవత్సరంలో చెప్పిన పాఠం శాతవాహన సామ్రాజ్యం.. అలనాటి ‘్ధన్యకటకం’ నేటి ఆంధ్రుల హృదయపురి ‘అమరావతి’ నగరవైభవం. ఆ మహానగరాన్ని కళ్లారా చూడాలనే ఆతృతతో నేను.. నా మిత్రుడు, బొల్లినేని మోహన్‌రావు ఇద్దరమూ ప్రయాణమై అమరావతి చేరుకున్నరోజు. మా ఇద్దరి కోరిక ఒకటే ఎప్పటికైనా అమరావతి ఆంధ్రుల రాజధాని కావాలని అమరలింగేశ్వరుణ్ణి, కృష్ణమ్మను కోరుకున్నరోజు. నేడు నా మిత్రుడు లేడు. అందని లోకాలకు చేరుకున్నాడు. ముప్పది ఐదు సంవత్సరాలు తరువాత ఇదేరోజున (2015 నవంబర్ 16వ తేది) మా కలని నిజం చేసిన అమరలింగేశ్వరుణ్ణి, కృష్ణమ్మను దర్శించుకొని మొక్కుబడి చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నాను.
నీ ప్రయాణం ఎలా సాగుతుందో.. నేను చూస్తానంటూ వరుణుడు తన వేగాన్ని పెంచాడు. ఇలాంటి సమయంలో ప్రయాణం అంటే నా భార్య బాధపడుతుంది. ఎలాగైనా నేనొక్కడినే ప్రయాణం చేయటానికి నిర్ణయించుకున్నాను. ఈ విషయం నా భార్యకు చెప్పాను. స్వతహాగా ప్రయాణం అంటే అంతగా ఇష్టం ఉండని నా ఇల్లాలు నా ప్రయాణానికి అడ్డు చెబుతుందేమో అనుకున్నాను. నేను కూడా నీతో వస్తాననగానే ఆ క్షణమే.. అమరలింగేశ్వరుణ్ణి చూసినంత ఆనందం.. ఇది కలా? నిజమా? అనుకొని నన్ను నేను గిచ్చుకున్నాను. ఆ దృశ్యం చూసిన నా భార్య ‘‘ ఏమండోయ్! ఇది కలకాదు..నిజమే!’’ అన్నది. ఈలోగా.. నా కుమార రత్నం వింటి నుండి సంధించిన బాణంలా.. బయట నుండి దూసుకొచ్చాడు. ‘ఎక్కడికి ప్రయాణం.. ఏంటి సంగతి?’ అంటూ ప్రశ్నల వర్షం.. అమరావతి ప్రయాణం అనగానే రెక్కలగుర్రంలాగా ఎగిరాడు.
తెల్లవారుజామున నాలుగున్నరకు ప్రయాణం. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. మూడు గంటలకు ‘అలారమ్’ పెట్టాను. రాత్రి ఒంటిగంటకు మెలకువ వచ్చింది. కలత నిద్ర. ఇంక నిద్రపట్టలేదు. వర్షాన్ని చూస్తూ.. అలాగే మేలుకున్నాను. ఈలోగా నాతో నీకేం పని అంటూ.. ‘అలారమ్’ కుళ్లుకుంటూ మోగింది. ప్రయాణానికి కావలసినవన్నీ ముందుగానే సర్ది ఉంచాము. వర్షం అంతకంతకూ.. పెరుగుతూనే ఉంది. మూడుగంటలా నలభై నిమిషాలకు బస్‌స్టాండ్ చేరుకోగానే, బస్సు మా కోసమే ఆగి వున్నట్లు సిద్ధంగా ఉంది. కందుకూరు నుండి శింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు ఇరవై నిమిషాలలో చేరుకున్నది. పదిహేను నిమిషాలు రైలు ఆలస్యం.. కొద్ది నిమిషాలలో రైలు ఒకటో నెంబరు మీదకు వస్తుందని అనౌన్స్‌మెంట్... ప్లాట్‌ఫామ్ చివరికి వచ్చి పట్టాలవైపు తొంగిచూశాను. అల్లంత దూరంలో చీకటిని చీల్చుకుంటూ.. మిణుగురు పురుగు తనవైపు పరుగు తీస్తున్నట్లుంది. హమ్మయ్య.. ఎలాగైతేనేం చేరుకున్నాం! ఎక్కడమే మీ వంతు అన్నట్లు రైలు ఆగింది.
రైలు పెట్టంతా వర్షపు నీరు.. పెట్టంతా ఖాళీగా ఉంది. మాతో పాటు మేమెక్కిన బోగీలో ఒక వృద్ధజంట మాకెదురుగా కూర్చున్నారు. ఐదు నిమిషాల తరువాత పెద్దాయన తన సెల్‌ఫోన్ మీట నొక్కగానే ‘‘కల నిజమాయలే.. కోరిక తీరెలే..’’ అలనాటి పాతమధుర గీతాన్ని వినిపిస్తున్నాడు. నా భార్య నావైపు చూసి ఫక్కున నవ్వింది. నేను, నా కుమారుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాము. వృద్ధజంట మావైపు అదోరకంగా చూశారు. మమ్ములను తప్పుగా అర్థం చేసుకున్నారని గ్రహించి.. మా ప్రయాణం గురించి, మొక్కుబడి గురించి వారికి చెప్పగానే విషయం గ్రహించిన వారు కూడా మా నవ్వుతో జత కలిపారు. అప్పటివరకు వర్షంతో తడిసిన రైలుపెట్టే మా నవ్వుల జల్లుతో తడిసి ముద్దయ్యింది. ఈలోగా రైలు ఒంగోలు చేరుకుంది. అప్పటివరకు ఖాళీగా ఉన్న రైలుపెట్టె కొంత భర్తీయైనది.
ఒంగోలులో మధ్య వయస్సు ఉన్న ఒక వ్యక్తి మాకెదురుగా కూర్చున్నాడు. నన్ను తదేకంగా చూస్తున్నాడు. ఈలోగా.. అతనే ‘‘మాష్టారూ.. మీది కందుకూరు దగ్గర చిన్నపవని గ్రామం కదా!’’ అన్నాడు. అవునన్నాను. ‘‘మాష్టారూ...! నేను మీ కథలు చదివాను... ఇదే నెల ఒకటవ తేదీన ‘కలనిజమైన వేళ’ కథ చదివిన తరువాత మీకు ఫోన్ చేశాను. కథ కిందిభాగంలో మీ ఫొటో చూసి నిన్ను గుర్తుపట్టాను. నీ ఫోన్ నెంబరు కూడా ఫీడ్ చేసుకున్నాను’’. ‘‘చాలా సంతోషమండీ! రెండు నిమిషాల ముందు మిస్‌డ్ కాల్ ఉంది, ఈ నెంబరు నీదేనా?’’ అన్నాను. ‘‘అవును మాష్టారూ.. మీ ఫోన్ రింగ్ కాగానే మీరే అనుకొని నిర్ణయించుకున్నాను’’ అన్నాడు.
‘‘మీదేవూరు సార్.. మీరేం చేస్తుంటారు?’’ అని అడిగాను. ‘‘మాష్టారూ! నాది కావలి. జవహర్‌భారతి కళాశాలలో చదివాను. మీరు రాసిన కథ కూడా జవహర్‌భారతి కళాశాల నుండి ప్రారంభవౌతుంది’’ అన్నాడు. ఈలోగా అతనికేదో గుర్తుకు వచ్చినట్లుగా.. ‘‘గురువుగారూ.. ఈరోజు నవంబర్ 16వ తేదీ కదా! మీరు రాసిన కథ కూడా 1980 నవంబర్ 16వ తేదీ నాటిదే కదా..! ఇంత వర్షంలో మీ ప్రయాణమేమిటి’’ అని అడిగాడు. ‘‘సార్! ముప్పది ఐదు సంవత్సరాల తరువాత మా కలను నిజం చేసిన అమరలింగేశ్వరుణ్ణి, కృష్ణమ్మ తల్లికి మొక్కుతీర్చుకోవటానికి అమరావతి ప్రయాణం’ అని చెప్పాను. అతని నోట నుండి మాట రావడం లేదు. ‘‘ఏంటి సార్... అలా ఉన్నారు?’’ అన్నాను. ‘‘గురువు గారూ! ఇలాంటి సందర్భం నేను సినిమాల్లో చూశాను, కల్పిత కథలలో చదివాను. స్నేహానికి కొత్త నిర్వచనం ఇచ్చిన నిన్ను కలుసుకోవడం నా అదృష్టం’’ అన్నాడు. నా పట్ల అతను చూపిన అభిమానానికి చేతులెత్తి నమస్కరించాను. చీరాల స్టేషన్ రాగానే నా వద్ద సెలవు తీసుకొని వెళుతూ.. ‘‘గురువు గారూ..! మరోసారి మనం కలుద్దాం..’’ అంటూ వెళ్లాడు.
మా సంభాషణ నా కుమారుడు ఆసక్తిగా విన్నాడు. నా కథల గురించి నా భార్యకు తెలుసు. నా కథలకు ప్రథమ శ్రోత నా ఇల్లాలు. నా కుమారుడు వయసు ప్రభావం చేత జోకులు పేలుతుంటాడు. మా సంభాషణ వాడ్ని ఆలోచింపచేసింది. నాకెదురుగా కూర్చున్న పెద్దాయన నావైపు చూసి..‘‘నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. రూపాయి అగరుబత్తి దేవుని ముందు వెలిగించి, కోటిరూపాయలు కోరుకొనే ఈ రోజుల్లో నిస్వార్థంతో నీవు తీర్చుకొనే మొక్కుబడి అభినందనీయం’’ అన్నాడు. ఆ వృద్ధ దంపతుల ఆశీర్వాదం తీసుకొన్నాము. వారు బాపట్లలో దిగివెళ్లారు. పగటిపూట రైలు ప్రయాణం పొద్దుపోవడం కాస్త కష్టమే..అప్పటివరకు ప్రయాణం బాగా జరిగింది. ప్రక్కనున్న ప్రయాణికులు కలుపుగోలుతనం కలవారైతే ఫర్వాలేదు, కాని మూతిబిగించుకొని కూర్చునే రకాలైతే మరీ ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే పుస్తకాలే మన నేస్తాలు అనుకొని ‘‘తెలుగువెలుగు’’ మాసపత్రిక చదవడంలో నిమగ్నమయ్యాను. నా కుమారుణ్ణి అష్టమవ్యసనం (సెల్‌ఫోన్) బంధించింది. నా భార్య కొంచెం రెప్పవాల్చింది. ఈలోగా తెనాలి చేరాము.
అప్పటికే రేపల్లె-గుంటూరు ప్యాసింజర్ సిద్ధంగా ఉంది. అల్పాహారం తీసుకొని అక్కడ నుండి గుంటూరు చేరుకున్నాము. అచ్చట వర్షం లేదు. బస్‌స్టాండ్ చేరుకోగానే అమరావతి బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. నేను ఉదయం బయలుదేరేటప్పటి నుంచి తలనొప్పి మొదలైంది. నన్ను తరచూ బాధించే నొప్పి, ఉదయం ప్రారంభమై సాయంత్రానికి గానీ తగ్గదు. ముప్పది ఐదు సంవత్సరాల తరువాత మరలా అమరావతి మహానగరాన్ని చూడబోతున్నానే ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బస్సు ఎక్కగానే.. నా మిత్రుని జ్ఞాపకాలే నా కళ్లముందు మెదులుతున్నాయి.
ఒరే..! నీ కలల సామ్రాజ్యాన్ని కొద్ది నిమిషాలలో చేరుకోబోతున్నామంటూ.. నన్ను ఆటపట్టించిన మధురస్మృతులు నా హృదయమందు చిగురించి, మొగ్గై పరిమళాలు వెదజల్లుతున్నాయి... ఆ పరిమళాల మత్తులో తేలియాడుతుండగానే.. ‘ఏమండీ!’ అనే పిలుపుతో ఉలిక్కిపడ్డాను. ఇంక పది నిమిషాలలో నా స్వప్ననగరిని చేరుకోబోతున్నాను. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలతో నవ్యాంధ్ర రాజధాని ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కొన్న్దిరోజుల ముందు రాజధానికి శంకుస్థాపన జరిగింది. నవ వధూవరులులా రాజధాని నగరం కళకళలాడుతుంది.
ఉదయం పది గంటలకు అమరావతి చేరుకున్నాము. ఉదయం మొదలైన తలనొప్పి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సమ్మెటతో తలమీద బాదినట్లుంది. ఆ సమయంలో నేను పడే బాధ నా భార్యకు తెలుసు. బస్టాండ్‌లో దిగి ఆలయం వద్దకు సమీపిస్తున్నాము. ఆలయానికి సమీప భాగంలో పూజాసామాగ్రి విక్రయిస్తున్నారు. ఆ పక్కనే కాషాయ వస్త్రాలు ధరించి విభూది రేఖలతో మన ప్రాచీన ఆయుర్వేద వైద్యపితామహుడు చరకుడిలా ఉన్నాడు. ఒక పెద్ద పట్టామీద ఆయుర్వేద మందులతో తలనొప్పికి, కీళ్లనొప్పులకు ఆయుర్వేద మందులు ఇవ్వబడును అంటూ అనౌన్స్ చేస్తున్నాడు. నేరుగా అతని దగ్గరకు చేరుకున్నాము. ఎందుకంటే సాధ్యమైనంత వరకు నేను అల్లోపతికి దూరంగా ఉంటాను.
నేను పరిచయం ఉన్న వ్యక్తిలా ‘రండి కూర్చోండి! విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నావు’గా అన్నాడు వైద్యుడు. ‘నా బాధ నీకెలా తెలిసిందయ్యా?’ అని ప్రశ్నించాను. ‘నాడి చూసి రోగం చెప్పేవాడు వైద్యుడు. ముఖం చూసి రోగం చెప్పేవాడు ఘన వైద్యుడు’ అన్నాడు. ‘ఓ ఘన వైద్యపితామహా నా తలనొప్పికి మందివ్వవయ్యా’ అని అడిగాను. ‘ఇదిగో.. ఇది ఒక దివ్యమూలిక నుండి తీసిన చూర్ణం. దీనిని కొంచెం నీటిలో కలుపుకొని తాగు’అని చూర్ణపు పొట్లాం ఇచ్చాడు.
ప్రయాణ బడలికలో ఉన్న మేము దేవాలయ ప్రాంగణమందున్న మండపంలో కూర్చొని, కృష్ణాజలాన్ని గ్లాసులో తీసుకొని చూర్ణం కలుపుకుని తాగాను. పది నిమిషాలకు నా తలనొప్పి మటుమాయమైంది. ఆశ్చర్యం ఉదయం మొదలైన నొప్పి సాయంత్రానికి కాని తగ్గదు. ఇలాంటి ఘన వైద్యుడు ‘రామ-రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛ చెందినపుడు ఉండివుంటే హనుమంతునికి సంజీవిని పర్వతం తేవలసిన అగత్యం ఉండేది కాదేమో!’ అని నా భార్యతో అన్నాను. ‘నిజమేనండి నేను నమ్మలేకున్నాను’ అని నా భార్య అంది. మనం ఒక్కసారి ఆ ఘనవైద్యుని కలిసి కృతజ్ఞతలు చెప్పివద్దామని నా భార్యతో అన్నాను. ముగ్గురమూ అతను ఉండేచోటుకు వెళ్లాము. ఘనవైద్యుడు అక్కడ లేడు. అక్కడే పూజాసామగ్రి అమ్ముతున్న కొట్టు యజమానిని అడిగాము. ఇక్కడ మీరు చెప్పే వైద్యుడు లేడే అన్నాడు. వేరేచోటుకేమైనా వెళ్లి ఉంటాడేమోననుకొని ఆప్రాంతమంతా ముగ్గురమూ అరగంట వరకు వెతికినాము, ఎక్కడా అతని జాడలేదు. ‘ఏమండీ.. పది నిమిషాల క్రితం ఇక్కడున్న వ్యక్తి అన్నీ సర్దుకొని ఎక్కడికెళతాడు? ఒకవేళ వెళ్లినా మనమింతగా వెదికినా కనపడకుండా ఉంటాడా!’ అని అన్నది నా ఇల్లాలు. ‘మీరిక్కడే ఉండండి నేను బస్టాండ్ దగ్గర వెతికి వస్తానన్నాను.’ ‘ఏమండీ నీకింకా అర్థంకాలేదా! ఒక్కసారి ఆలోచించండి’ అని ప్రశ్నించింది నా ఇల్లాలు. ఆ క్షణమే నా రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. సాక్షాత్తూ! అమరలింగేశ్వరుడే వైద్యుని రూపంలో నా బాధ తీర్చాడని ఆనందపరవశమైనాము. మహాకవి పోతన గారు తన భాగవతములోని గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుడు మొసలి బారినుండి తనని కాపాడమని వేడుకునే వరకు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడలేదు. అడగనిదే అమ్మకూడా అన్నం పెట్టదంటారు కాని దైవ దర్శనానికి ముందే భగవంతుడు నన్ను కరుణించాడు.
ముందుగా మేము కృష్ణమ్మ దగ్గరకు చేరుకున్నాము. అచ్చట వీచే గాలిలో బౌద్దనామస్మరణ వినపడుతున్నది. ప్రతి రాయిలోనూ అమరలింగేశ్వరుడున్నాడు. ‘మిత్రమా... నువ్వెక్కడున్నావురా? నన్ను చూసిన కృష్ణమ్మ నిన్నుకూడా అడిగిందిరా! బరువెక్కిన హృదయంతో బాధను దిగమింగినా .. కన్నీరు ఆగదు కదా! నా కన్నీటి జల్లు కృష్ణమ్మను తాకగానే తన అలల సవ్వడితో నన్ను ఓదార్చింది మిత్రమా! ఒరే.. మన కల నిజమైంది. ఈరోజు మన మొక్కుబడి తీరింది. ఎక్కడున్నా నీ ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంటూ నా మిత్రునికి ఘనమైన నివాళి అర్పించాను.
‘అమరావతి’ పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం. అందుకేనేమో చరిత్రపుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. బౌద్ధచైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు రాజధాని. భవిష్యత్తులో చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ దేశాలకు దీటుగా నిలవాలని, రాజధాని నిర్మాణంలో అశేషాంధ్రులు పాలుపంచుకోవాలని, తెలుగుజాతి వైభవ పతాకం మరలా రెపరెపలాడాలని.. అమరలింగేశ్వరుడిని కోరుకుని తిరిగి ప్రయాణమయ్యాం.

- ఇనకొల్లు మస్తానయ్య
కందుకూరు, చినపవని (గ్రామం)
8096881006

నల్లధనంపై యుద్ధం

యుద్ధం అనివార్యం
యుద్ధం అనివార్యం
నల్లధనంపై మల్లయుద్ధం అనివార్యం
అంతర్గతంగా కానీ..
బహిర్గతంగా కానీ..
మన జాతి మూలాల్ని పెకలించే
శత్రు మూకల్ని తుత్తునియల్ని చేయడానికి
యుద్ధం అనివార్యం

మెరుపుదాడులు
యుద్ధవ్యూహంలో ఒక భాగం..
వ్యూహాత్మక దాడులు
జాతి పరిరక్షణ తంత్రంలో ఒక విధానం

యుద్ధం ముగిసేంత వరకు
జన నష్టం, ధన నష్టం అనివార్యం
విజయం సాధించేముందు
కఠిన సమస్యల ఉత్పన్నం..సామాన్యం

సరిహద్దు ఆవలే కాదు..
సరిహద్దు ఈవల.. సర్జికల్ స్ట్రైక్‌తో
లెక్కల్ని తప్పుకుని చుక్కల్ని తాకిన నల్లధనం
ఒక్క ఉదుటున గంగలోకి దుముకుతుంటే..
రాబందుల వౌనాక్రందనలు..
శ్రమజీవుల కళ్లలో..
ఆనందాల్ని నింపుతున్నాయి

పెద్దనోటు రద్దుతో
బడుగుజనం పడ్తున్న బాధల కంటే..
కాళ్లక్రింద నేల కదుల్తున్న నల్లకుబేరులు
నలుపు-తెలుపుకై పడ్తున్న నానావస్థలు
పతాక శీర్షికలవుతున్నాయి...

ఈ దేశ ఆర్థిక భద్రత కోసం..
రెండు గంటల పాటు
‘వందే’మాతరం గీతం ఆలపిస్తూ
బ్యాంక్‌ల ముందు బారులు
తీరిన జనాన్ని చూస్తుంటే...

ఈ దేశ భద్రత కోసం
ఇరవై నాలుగు గంటలపాటు
క్షణం..క్షణం అప్రమత్తమై...
మండుతున్న అగ్నికణాలై
పహారా కాస్తున్న సైనికుల వరుసను తలపిస్తోంది..

జాతి జనుల గుండెల్లో
వెలుగు నింపే.. ఈ యుద్ధానికి
ఓర్పుతో ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలి..

- కుర్రా ప్రసాద్‌బాబు
ఒంగోలు, చరవాణి : 9440660988

మనోగీతికలు

అర్ధరాత్రి నిర్ణయం
ఆనాటి అర్ధరాత్రి దేశస్వాతంత్య్ర ప్రకటన
దిశదశలా స్వాతంత్య్ర నగారా మోగించింది
స్వేచ్ఛావాయువులు భారతపౌరుల ఊపిరులకు
కొత్త శ్వాసను పరిశుభ్రంగా
అందించాయి హాయిగా!
‘నవంబరు ఎనిమిది’ అర్ధరాత్రి ప్రధాని ప్రకటన
నవనాడులనూ కృంగదీసింది సామాన్యులకు
పేదలు, చిరు, మధ్యస్థ వ్యాపారులకు రెక్కాడితేగానీ, డొక్కనిండని రోజుకూలీలకు
బడుగు రైతులకు
పెళ్లిళ్లకై తెచ్చిన పచ్చ- ఎర్ర ఐదొందలు
వెయ్యినోట్లు చెల్లవని తెల్సి
అల్లల్లాడాయి పెళ్లిళ్ల ఇల్లూ-వాకిళ్లూ- ఎరువులు తెచ్చుకోడానికని,
అప్పులు చేసి మరీ, తెచ్చిన చెల్లని నోట్ల కట్టలజూసి-బావురుమన్నారు రైతులు!
అత్యవసర బాధలతో వైద్యం కోసం పరుగెడితే చెల్లనినోట్లకు అందలేదు వైద్యం!
పరీక్ష ఫీజు కోసం తల్లిదండ్రులు పంపిన నోట్లకు
కాలం చెల్లిందని తెల్సిన విద్యార్థిలోకం
ఆందోళనకు గురైంది
నిత్యావసరాలకు బజారుకెళ్లి బేజారుపోయారు జనావళి
పొదుపు సొమ్ము విలువలేనిదని భయపడి
బలైనారెందరో ఆత్మహత్యలకు!

నల్లధనం నిలుపుదల కోసం సంచలనం
చేసేదిలానా?
నల్లకుబేరులకెపుడో ముందస్తు వార్తచేరి నిబ్బరం కల్గించిందిగా!?
రంగురంగుల రాజకీయ నేతలకు కాదిది
సంచలనం!
ముందస్తు సమాచారం చేర్చాల్సిన వారందరికి చేరనే చేరిపోయింది
సంచలన వార్త- ఘనకీర్తి కోసం అర్ధరాత్రి
ఈ నిర్ణయం...

సంక్షోభం సామాన్య జనులకేగా! పేరు ప్రతిష్ఠల కోసమేగా ప్రాపకం!
నల్లదొరలకెపుడూ ముందే ఉంటూనే వుంటాయ్ దొంగదారులు
నల్లధనం దొరకదెప్పుడూ..
బినామీలదే నేతల ఆదాయం లెక్కల్లో...
సామాన్యులు బ్యాంకుల వద్ద పనులొదులుకుని పడిగాపులు కాస్తూ ఉంటే,
అసామాన్యులు బ్రేకింగ్ న్యూస్‌లకు సామాజిక మీడియాలైవ్‌ల చూస్తూ..
సరదా కాలక్షేపాలతో.. శీతల గదుల్లో సోఫాల్లో సేదలు తీరుతూ విని ఆనందిస్తూ ఉంటే,
చేతికందీ - అందని కొత్తనోట్లకై
ఆకలి దప్పులనూ మరచి జనం,
ఈ అర్ధరాత్రి ప్రకటనకు..
ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ శాపనార్ధాలు పెడుతూ..!
‘లెజెండ్లు’ ఉలకరూ-పలకరూ-కడుపునిండిన భాగ్యవంతులు!!
ఎవరికేం పట్టెను తలచేందుకు సగటుమనిషి వెతలూ-కథలూ...??
మేధావులు-విద్యార్థులు-మహిళలు ప్రభుత్వ
ఆటలిక కట్టించాలి!!
ప్రజాస్వామ్యం ముసుగున, పెట్టుబడిదారులూ, భూస్వాములూ, నియంతలు...
సామ్రాజ్యవాదపు శక్తులుగా మారి, చేస్తున్న
దగాలకిక చెల్లెను కాలమని అంటూ
సామాన్యుల చేతనపరచి, ఏకపక్ష నిరంకుశ
నిర్ణయాలకిక భరతవాక్యం పలికిస్తామని
అజేయశక్తులుగా ఎదిగీ , మీ ఆటలు కట్టిస్తామని పూరించాలిక జనచేతన శంఖారావం!!

- చాకలికొండ శారద, కావలి
చరవాణి : 9440757799

నల్లధనమా..పారిపో
కుబేరుల ఇండ్లలో కులుకుతూ..
జాతి నవనాడులను నంచుకు తింటున్న
నల్లధనమా! నీ ఉరవళ్లను
నకిలీనోట్ల పరవళ్లను అవినీతి పోకళ్లను
ఊడ్చేసే - మొనగాడు వచ్చాడు
దేశం అవినీతితో, అలసిపోయింది
అవినీతిరహిత దేశంగా!
నల్లధనం మేటలను ఊడ్చేసి,
నకిలీనోట్లను అరికట్టి ఉగ్రవాదానికి
ఆర్థిక దన్నుగా, నిలుస్తున్న
హవాలగాళ్ల తోక కోసి, సున్నంబెట్టి ఉరుములేని పిడుగు లాంటి
లక్షితదాడిచేసి
ధీరుడుగా, వీరుడుగా!
ధీరోధాత్తుడుగా!
దేశాభివృద్ధికి, ఉరకలు వేస్తున్న
ఓ ప్రియతమ ప్రధాని.. మీకు
మా ధన్యవాదములు
అవినీతి, అకృత్యాలకు ఇన్నాళ్లు
నిశ్శబ్ధంగా! వౌనంగా! తలలు ఊపి.. ఊపి
దేశాన్ని, అతలాకుతలం చేశారు
తిరోగమనం వైపు నడిపారు
దేశ సౌభాగ్యం కోసం అసౌకర్యం ఎదురైనా
సహనంగా చిరునవ్వుతో సహకరిద్దాం
అవినీతి రహిత భారత్‌ను ఆవిష్కరిద్దాం
అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి
అందించే దిశగా అడుగులు వేద్దాం
భారతమాత కలలను సాకారం చేద్దాం

- కొడవలూరు ప్రసాద్‌రావు
8500757622

స్వేద సంతకం
మనిషి రంగురంగుల జీవితానికి
పునాది పచ్చనోటు
అవినీతి చక్రవర్తులు
నల్లకుబేరులు
పచ్చనోట్లకు
నల్లటి రంగుపూసి
మూటలు కట్టారు
రాత్రికి రాత్రే
విడుదలైన ఆ నిర్ణయం
ఆ నల్లటినోట్లకు
చెల్లుచీటి రాసేసింది
దొంగచాటుగా సరిహద్దు దాటి వచ్చే నకిలీ కరెన్సీని
నాలుక కరచుకునేలా చేసింది
ఓ క్రొత్త ఆవిష్కారం కోసం
ఈ విప్లవం
ఓ అదుపు కొరకు ఈ కుదుపు
అవినీతి మరకలంటిన నోట్లు
అడ్రస్సు లేకుండా పోతాయి
సామాన్యుడు స్వేద సంతకం చేసిన నోట్లు విజయగర్వంతో నిలుస్తాయి.

- మోపూరు పెంచల
నరసింహం
చరవాణి : 7386362476

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- ఇనకొల్లు మస్తానయ్య