నెల్లూరు

కర్ణపిశాచి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు ఉదయం తెలతెలవారుతుండగా దుర్గంపల్లి గ్రామంలో అడుగుపెట్టింది డెబ్బయ్యేళ్ల ముసలిది. తల నెరిసి ముగ్గుబుట్టలా ఉంది. కళ్లు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. ముక్కు బయటికి పొడుచుకు వచ్చినట్లు పొడుగ్గా ఉంది. బోసినోరులా కనిపిస్తుంది గానీ, సూదంటురాళ్లలాంటి గట్టి పళ్లున్నాయి. బుగ్గలు లోపలికి లాక్కుపోయినట్లు దవడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అస్తిపంజరానికి కోక, రవికె తొడిగినట్లు చాలా బక్కచిక్కి ఉంటుంది. ఆమె సంకలో జోలె. చేతిలో సోది చెప్పే బుర్ర ఉంటాయి. ఆమే సోది సుబ్బమ్మ.
అందరూ సోదె సుబ్బమ్మను చూడగానే సోది కోసం ఎగబడతారు. ఈమె చెప్పే సోదె వాళ్లకు రాబోయే సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుంది. దాన్ని అనుసరించి తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. ఆమెను ఇంటికి పిలిచి తమకున్న రాగులో, జొన్నలో, పెసలో, మినుములో పెట్టి సోది చెప్పించుకుంటారు. ఆమె ఉండేది అక్కడికి మూడు మైళ్ల దూరంలో ఉన్న ఉదయగిరి గ్రామంలో. ఈమె దుర్గంపల్లెలోనే కాక ఉదయగిరి చుట్టుప్రక్కలనున్న అనేక గ్రామాలకు వెళ్లి సోది చెబుతుంది. నెలకొకసారి ఒక్కో ఊరికి వెళుతుంది. వెళ్లిన ఊళ్లో వరుసగా పదిరోజుల పాటుండి వాళ్లకు సోది చెప్పి సంభావనలు తెచ్చుకుంటుంది. మళ్లీ మరుసటి నెలలో ఇంకో ఊరికి వెళుతుంది.
సోది సుబ్బమ్మ తన చుట్టూ మూగిన వాళ్లను చూసి చెప్పింది. ‘‘ఈరోజు నేను సోది చెప్పడానికి మీ ఊరికి రాలేదు. నిన్న కర్ణపిశాచి చెప్పిన సలహామేరకు మిమ్మల్ని గొప్పవాళ్లని చేయడానికి మీ ఊరికి వచ్చాను’’ ఉంది.
ఊళ్లో అందరికీ సోదిసుబ్బమ్మ మీద చాలా నమ్మకం. సోది చెప్పేటప్పుడు చేటనిండా రాగులు ఆమె ముందుపెడతారు. ఆమె ఒక చేయి రాగులు మీద పెట్టి వేళ్లతో రాగుల్ని కలియపెడుతూ, మరో చేత్తో సోదె బుర్ర తీగలు మీటుతూ ఎక్కడికో వెళ్లిపోయి రాగయుక్తంగా సోదిచెబుతుంది. ఆ కుటుంబంలో ఎప్పుడో చనిపోయిన పూర్వీకుల ఆత్మల్ని తనలో ఆవాహన చేసుకుని సోది చెప్పించుకునే వాళ్ల సందేహాలకు సమాధానం చెబుతుంది. సమస్యల పరిష్కారాన్ని కూడా ఆత్మలు సోది సుబ్బమ్మ ద్వారా చెబుతాయి.
ఈరోజు సుబ్బమ్మ చెప్పిందేమిటంటే తానొక కర్ణపిశాచాన్ని వశపరచుకున్నానని, అది వ్రేలెడంత ఉంటుందని, అది అదృశ్యరూపంలో ఉండి తన చెవిలో ఎన్నో రహస్యాలు చెబుతుందని చెప్పింది సోది సుబ్బమ్మ. అది ఇప్పుడు తనకు చెప్పిన రహస్యం, ఇక్కడ చుట్టుపక్కలనున్న దుర్గంపల్లి అడవుల్లో, ఆ పల్లెలో నివసించిన పూర్వీకులు అశేషమైన ధనరాసుల్ని పూడ్చిపెట్టారని చెప్పింది. ఆనాటి రాజుల రాజ్యపరిపాలనలో దుర్గంపల్లె వాసులు సైనికులుగాను, సైన్యాధ్యక్షులుగాను పనిచేశారని, అప్పుడు రాజులు వీళ్లకిచ్చిన కానుకల్ని శత్రువుల కంటపడకుండా భూమిలో దాచారని, భూమిలో నిక్షేపితమైన సదరు ధనరాసుల్ని అంజనం వేసి తెలుసుకుంటానని, వాటిని పెకళించి తీసుకొని బాగుపడమని, అందులో నాల్గవ వంతు తనకిస్తే చాలని అంది సోది సుబ్బమ్మ.
సోది సుబ్బమ్మ ప్రతిభ తెలిసి ఉండడం వల్లనయితేనేమి, ఆనాటి జీవన విధానంలో బంగారునగల్ని, నాణేలను, కుండల్లో పెట్టి దాయడం సహజం కాబట్టి, తమ పూర్వీకులు ఆనాటి రాజుల కాలంలో సైన్యంలో పనిచేసింది నిజమే అయినందున ఆమెను నమ్మారు. తమకు నిధులు చూపిస్తే ఆమె అడిగినట్లు నాల్గవ వంతు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
ఇక అంతే, సుబ్బమ్మ తన పని ప్రారంభించింది. ఆరోజు రాత్రి మొదటగా శరభయ్య ఇంట్లో పనిమొదలుపెట్టింది సోది సుబ్బమ్మ. నట్టిల్లు అలికించింది. ముగ్గులు పెట్టించింది. ముగ్గుల మధ్య కోడిని బలిచ్చి రక్తతర్పణం చేసింది. ఆ తరువాత ముగ్గు మధ్య అరిటాకు పరచింది. జోలెలోంచి ఒక డబ్బా బయటకు తీసి అందులో ఉన్న నూనె దాని మీద రాసింది. పదేళ్ల పిల్లగాని, పిల్లవాడు గాని రావాలని పిలిచింది. ఒక పిల్లవాడు వచ్చాడు. తన దగ్గరున్న నూనెను వాడి కళ్లమీద పూసింది. ఏం కనిపిస్తుందో చూడమంది. వాడేం కనబడలేదని చెప్పాడు.
మళ్లీ ఇంకొకడ్ని పిలిచి కళ్లకు అదే నూనెపూసి చూడమంది. వాడూ ఏం కనబడలేదని చెప్పాడు. ఇలా నలుగురిని పరీక్షించిన మీదట అయిదవ వాడుగా గోచిమాత్రమే పెట్టుకొని ఉన్న వాడి మీద ఆమె దృష్టిపడింది. వాడ్ని దగ్గరకు రమ్మని పిలిచింది.
‘‘వాడెందుకు సుబ్బమ్మ తల్లీ వాడు పుట్టుగుడ్డోడు’’ అన్నారంతా.
‘‘వాడు గుడ్డోడయితే నేమి? చెముటోడయితే నేమి? వాడు దుష్టనక్షత్రంలో పుట్టి ఉంటే వాడికీ కనిపిస్తుంది. చూస్తావా తైలం తడాఖా’’ అంటూ గుడ్డిపిల్లవాడు గురవడ్ని దగ్గరకు పిలిపించుకుంది. వాడి కంటికి నూనెలాంటి తైలం పూసింది.
తరువాత ‘‘ఏమైనా కనిపిస్తుందా’’ అంటూ వాడ్నడిగింది.
తన కంటికి అడవి కనిపిస్తుందని చెప్పాడు గుడ్డి గురవడు. వాడు పుట్టినది మొదలు దేన్నీ చూడకపోయినా వాడి జ్ఞాన నేత్రం తెరచుకుని అన్నీ కనుక్కోగలుగుతున్నాడు. ‘‘వీడు దుష్ట నక్షత్రంలో పుట్టిన బిడ్డ, వీడికి మాత్రమే నిధులు కనిపిస్తాయి’’ అని అక్కడున్న అందరికీ చెప్పింది సోదె సుబ్బమ్మ. అంతేగాక వాడికి అంజనంలోది తప్ప మరేది కనిపించదని, అది కూడా కొద్దిసేపేనని మళ్లీ వాడు గుడ్డివాడుగా మారిపోతాడని చెప్పింది. తరువాత వాడు అడవిలో చెట్టునిండా కాయలున్న ఒక వెలగచెట్టు కనిపిస్తుందని చెప్పాడు. ఇంతలో వాడు ఉన్నట్లుండి పెద్దగా అరిచాడు. కారణం, ఆ చెట్టుకింద బండమీద ఒక ముసలిది దుడ్డుకర్ర పట్టుకుని కూర్చొని ఉందంట. ఆ చెట్టుకు పడమటి వైపు అడవి మామిడి చెట్టు, తూర్పువైపు గొట్టిచెట్టు, ఉత్తరము వైపున నీటిచలమ, దక్షణం వైపున కుంకుడు చెట్టు ఉన్నట్లు చెప్పాడు.
అప్పుడు సోదె సుబ్బమ్మ అందరూ వింటూండగా కర్ణపిశాచిని కేకేసి పిలిచి చెవి దగ్గర చేయిపెట్టి, ‘ఆ..ఆ..’ అంటూ ఏదో రహస్యం మాట్లాడింది. తరువాత కుర్రవాడ్ని తను అంజనం వేసిన అరిటాకులోకి చూడమంది. అందులోకి చూసిన కుర్రాడు ముసలిది కూర్చున్న బండ కింద చాలా మట్టి కుండలున్నాయని చెప్పాడు.
సోది సుబ్బమ్మ ఆనందంగా, ‘శరభయ్యా నీ పంట పండిందయ్యా, బంగారు నాణేలతో కూడిన మట్టికుండలున్నాయయ్యా, రేపటినుంచీ నువ్వు అడవిలోకి వెళ్లి ఆ పిల్లవాడు చెప్పిన గుర్తులు ప్రకారం ఆ వెలగచెట్టు ఎక్కడ ఉందో కనిపెట్టు. నేను దగ్గరుండి ఆ బంగారు నాణేలున్న కుండల్ని బయటకు తీయిస్తా, రహస్యం ఊరుదాటి బయటికి పోకూడదు జాగ్రత్త’ అంటూ హెచ్చరించింది.
సోదె సుబ్బమ్మ మీద విపరీతమైన నమ్మకమున్న శరభయ్య ‘అలాగే తల్లే, నువ్వు సెప్పినట్టు సేత్తా, నీవొంతు నీకిస్తా’ అన్నాడు. తెల్లవారినుంచి ఆ చెట్టు వెతికే పనిలో పడ్డాడు.
మరుసటిరోజు రాత్రి పొట్టెయ్య ఇంట్లో ఇదేవిధంగా పూజలు చేసి, కోడిని బలిచ్చి అంజనం వేసింది. నిన్న చూసిన గుడ్డిపిల్లవాడ్నే పిలిపించింది. వాడి కళ్లకు మళ్లీ తైలం రాసింది. వాడ్ని మళ్లీ ఏంచూశావని అడగడం మొదలుపెట్టింది. వాడు చెప్పడం మొదలుపెట్టాడు.
ఒక ఊటి చెట్ల పొద కనిపిస్తూ ఉందని, పొద మధ్యలో ఒక పెద్దసర్పం చుట్టచుట్టుకుని పడగ పైకెత్తి ఆడుతోందని చెప్పాడు. ఆ పొదకు అన్నివైపులా హద్దులు చెప్పాడు గుడ్డి గురవడు. ఇంకా బాగా చూడమంది సోది సుబ్బమ్మ. ఆ ఊటిగుట్ట అడుగున పాముచుట్ట కింద గుడ్డతో మూతులు కట్టిన బిందెలు కనిపిస్తున్నాయని చెప్పాడు.
అందరూ గుడ్డిగురవడు చెప్పేది ఆశ్చర్యంగా వింటున్నారు. సోదిసుబ్బమ్మ వైపు చూస్తున్నారు. సోదిసుబ్బమ్మ చెవిదగ్గర చేయిపెట్టి కర్ణపిశాచితో మాట్లాడింది.
‘పొట్టెయ్యా, రాజుల కొలువులో మీ తాతల ముత్తాతలు పెద్దపెద్ద ఉద్దోగాలు సేసేరయ్యా, ఊటిగుట్ట కింద శానా లంకెబిందెలు బూడ్సిపెట్టి ఉన్నారయ్యా, ఎప్పుడెప్పుడు నన్నీ సెరనుంచి విడిపిస్తారా అని అయి ఎదురు సూస్తున్నాయి. పొట్టెయ్యా రేపట్నించి ఆ గుర్తుల పెకారం ఎతుకు. ఊటిగుట్టను కనిపెట్టు. దగ్గరుండి బంగారు బిందెల్ని బయటికి తీయిస్తా’’ సూచనలతోబాటు హామీ కూడా ఇచ్చింది సోదె సుబ్బమ్మ.
వామనుడిలా నాలుగడుగులు పొడుగుండే పొట్టెయ్య ఇప్పుడు సంతోషంతో తాటి చెట్టంత పెరిగిపోయినట్లయ్యాడు.
‘‘అట్టాగేనమ్మా, నేనూ, నా పెళ్లాం, నా కొడుకులూ, కూతుళ్లూ, కోడళ్లు, అల్లుళ్లు, నా ముసిలి అబ్బా, అమ్మా కూడా రేపట్నించి అడివిలో పడతామమ్మా, ఆ లంకె బిందెలుండే స్థలం కనిబెడతామమ్మా’’ అంటూ సోదె సుబ్బమ్మకు దండం పెట్టి చెంపలేసుకున్నాడు పొట్టెయ్య.
మొత్తం ఇరవైఒక్క ఇండ్లలో ఒక్కోరోజు ఒక్కో ఇంట్లో అంజనం వేయడం మొదలుపెట్టింది సోదె సుబ్బమ్మ. నిధుల రహస్యం చెప్ప సాగింది. తెల్లవారింది మొదలు పనీపాటలు వదిలేసి తమ పూర్వీకుల నిధులున్నచోటు కనిపెట్టడానికి అడవిలో ఆ గుర్తులు ప్రకారం గాలిస్తున్నారు ఊళ్లోవాళ్లు. సోదె సుబ్బమ్మ పని హాయిగా ఉంది. రోజూ కోడికూర, మర్యాదలు, అడుగులకు మడుగులొత్తే పల్లెవాసులు. ఇలా ఇప్పటికి పది ఇండ్లలో అంజనం వేసి చెప్పింది.
పల్లెటూరివాళ్లకు ఏదైనా అనుమానం వచ్చిందంటే అది బలపడుతుందేగాని అంత తేలిగ్గాపోదు. ఈ నిధుల వేటలో తమకు అపకారం జరుగుతుందని వాళ్లకి అనుమానమొచ్చింది. దానికి కారణం, సుబ్బమ్మ మొదటిసారిగా అంజనం వేసి నిధుల రహస్యం చెప్పిన శరభయ్య చెట్టు మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. వాడికి కట్టుకట్టి వైద్యం చేయిస్తున్నారు. పొట్టెయ్యను అడివిలో పాము కరిచింది. చావు బ్రతుకుల మధ్య ఎలాగో ఆకుపసర్లు పోసి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బ్రతికి బట్టకట్టాడు. ఎర్రయ్య పదేళ్ల కూతురు కొండమీద చీపురు పుల్లలేరుతూ జారి బండమీద పడింది. తలకు పెద్ద దెబ్బతగిలి కట్టు కట్టుకుని ఇంట్లో మూలికలు తింటూ ఉంది. ఇలా సుబ్బమ్మ అంజనం వేసిన ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడ్డవాళ్లే.
ఊళ్లోని వాళ్లంతా ఈ విషయమై చర్చించుకొని తమ పూర్వీకులకు ఇప్పుడిప్పుడే నిధులు బయటకు తీయడం ఇష్టం లేనట్లుందని అనుకున్నారు. ఈ విషయం సోదె సుబ్బమ్మకు కూడా చెప్పారు. కాని సుబ్బమ్మ ఒప్పుకోలేదు. ఇంతకష్టపడింది ఇందుకా అంది. సోదె సుబ్బమ్మ తన పబ్బం గడుపుకోవడానికి యలా చేస్తుందని పసిగట్టారు అంతా.
ఆడవాళ్లు చేటలు, చీపుర్లు తీసుకుని తరుముకొనేసరికి ఊరొదిలిపెట్టి పారిపోయింది సోదె సుబ్బమ్మ తన కర్ణపిశాచితో సహా.

- పొట్లూరి సుబ్రహ్మణ్యం
చరవాణి : 9491128052

స్పందన

జయలలితకు
కవితల నివాళి
గతవారం మెరుపులో ప్రచురించిన కవితలన్నీ తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అక్షర నివాళి అర్పించాయి. ప్రతి కవితలోని పదాలన్ని పూలజల్లుల్లా ఆమె వీరత్వాన్ని, గొప్పతనాన్ని చాటుతూ నివాళులర్పించాయి. రచయితలు శ్రీనివాసరావు గారు, మోపూరు పెంచలనరసింహం గారు, ఎస్‌వికె ప్రసాద్ గారు కవితల రూపంలో ఆమెకు నివాళి అర్పించడం ముదావహం. రచయితలకు ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా జయలలిత ఫొటో, కార్టూను కూడా బాగా కుదిరాయి. మంచి కవితలను ప్రచురించిన మెరుపు వారికి అభినందనలు.
- జ్ఞానవేలు, గూడూరు
- పళని చంద్రన్, తడ
- కాత్యాయిని, ఉదయగిరి

ఓ రోజు ఇలా.. కథ బాగుంది
ఓ రోజు ఇలా.. కథ చాలా బాగుంది. రచయిత అల్లుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఓ రోజూ చాలా బాధాకరంగా, దుర్భంగా గడవటం సహజమే. అలాంటి అంశంతో కథ రాయడం బాగుంది. తాగుడుకు బానిసైన గురునాధం జీవితంలో ఓ రోజు ఎలా గడిచిందో వివరించిన తీరు బాగుంది. రచయిత కావేరిపాకం రవిశేఖర్‌కు అభినందనలు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. మరిన్ని కథలను రచయిత నుంచి ఆశిస్తూ...
- ఘాలి పుష్పలత, తిరుపతి
- హేమ సుందరాచారి, గిద్దలూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

సందర్భ కవిత

లక్ష్య శస్త్ర చికిత్స
నా సంతానంలో వీడు నా నాల్గో ఖర్మ
నా సంసారంలో వీడే ఉగ్రవాది! అన్నాడో నాన్న.
మొదట మొండి, పిదప పిడివాది, తర్వాత వితండవాది, ఆ తర్వాత తీవ్రవాది..ఇప్పుడో ఉగ్రవాది...
చిరగని బట్టలతో చెరగని క్రాపుతో
యాభైమందిని ఏకధాటిగా కొట్టేసే
సినిమా హీరో ఆదర్శం మొదలు
వీధి రౌడిగా, ముఠానాయకుడి మొదలు
రాజకీయ రౌడీగా, సాయుధ పోరాటాన్ని నమ్మి
అనేక అవతారాలతో అవధులు మించిన ఆదర్శవాదం
మోతాదుకు మించిన మతాభిమానం
పట్టాలు తప్పిన బండిలాంటి జీవనంలో
విసిగి తృణప్రాయమైన ప్రాణం
అనుశాసనైన జీవన అతిక్రమణ ఫలితం
కొరవడిన లక్ష్యశస్త్ర చికిత్స ఫలితం
స్వార్థపర విచ్ఛిన్నవాద ధోరణులకు వూతం
నాలుగు ఉగ్రవాదదేశాల సూక్ష్మరూపాల్ని
నా యింట్లో సందర్శిస్తున్నానన్నాడానాన్న!
అణచివేత విధానం, ఆధిపత్యపోరు, ఆర్థికావసరం
మతోన్మాదం, మాదక ద్రవ్యాలు, బలహీనతల ఆసరా వెరసి ఉగ్రవాదం, నరమేధం, మారణ హోమం
ఒక ప్రదేశం, ఒక దేశం, ఒక నామం కాదు
లష్కర్ ఎ జాంగ్వి, లష్కర్ ఎ తోయిబా
ఖలిస్తాన్, తాలిబాన్, ముజాహిదీన్
ఇసీస్, సిమీస్, ఆల్‌ఖయిదా
పేరేదైతేనేం - ఉగ్రవాద ఊడల విస్తరణ...
అహింసాపరమోధర్మోపదేశ
దేశ క్షేమానికి క్షామం వాటిల్లితే
శాంతి దౌత్యం విఫలమైతే
తప్పదు యుద్ధము తప్పదు బంధునాశనమనుకున్నప్పుడు
ముదిరిన మొండివ్యాధికి శస్త్ర చికిత్స
కీలెరిగి వాత వీలెరిగి చేత
లక్ష్యమెరిగి ఉగ్రవాదులపై దాడి..
తీవ్రవాదంపై దాడికైనా.. తిమిరంతో సమరానికైనా వ్యవస్థ ఆర్థిక నేరాల వ్యాధిగ్రస్థమైతే
లక్ష్యేతర అవయవాల నష్టం వాటిల్లకుండా
దాడికి లక్ష్యదాడి, వ్యాధికి లక్ష్య శస్తచ్రికిత్స
సదా సముచితం.

- వేదం సూర్యప్రకాశం, 9866142006

మనోగీతికలు

కాలంతో చెలిమి
ఆంగ్ల సంవత్సరాది క్యాలండర్‌లో
డిసెంబర్ తేదీలు ముగిసిపోతున్నాయి
గడిచిన వెతలను నెమరువేస్తూ
పద ఘట్టనలతో నిష్క్రమించబోతున్నాయి
ఉత్థాన పతనాలు చిరునామాలు కాగా
సుఖదుఃఖాల తోరణాలుగ
మనిషి బతుకును శాసిస్తున్నాయి
నూతనత్వం కోసం క్షణాలు పరుగెత్తుతున్నాయి
సియాచిన్ మంచుఖండాల కింద
సమాధియైన అమరజవానుల ఆత్మలు
దేశద్రోహులు గుండెల్లో తుపాకీ గుళ్లల్లే
నేటికీ నినదిస్తున్నాయి
జై భారతమాతా! అంటూ పహరా కాస్తున్నాయి

గలగలపారే గోదారమ్మ
బిరబిరా కదలిపోయే కృష్ణమ్మ
పుష్కరుడికి ఆహ్వానదీపాలు పంపాయి
స్నానాలతో, మొక్కులతో పునీతులను చేసాయి
ఆనందోత్సవ హేల అలఅలా నడిచిపోయాయి

ప్రపంచ పటంపై ఒలంపిక్ క్రీడల్లో
పతకాల పంట భారతీయుల విశ్వాసాన్ని
ద్విగుణీకృతం చేసి ‘సింధూర’ రాగం పలికించాయి
మోది, రాయబారితనం సాఫల్యం చెందాయి
పొరుగుదేశం చేసే దుశ్చర్యలను
ఉగ్రవాదం మాటున చేసే దుర్మార్గాలను
ఇకపై సాగనివ్వమని, హద్దులు మీరొద్దని
సరిహద్దుల్లో వీరజవానుల కవాతు ధ్వనులు
సర్జికల్ ఆపరేషన్స్ సంచలనం
హెచ్చరికలు పంపాయి..
విశ్వమాత, మదర్‌థెరిస్సాకు
మరింత గౌరవప్రద హోదానిచ్చి
పవిత్ర పీఠంపై పదిలంగా నిలబెట్టాయి..

తేనెతుట్టిపై తుంటరోడు రాయివిసిరినట్లు
నల్లధనంపై విసిరిన ప్రధాని (తూటా) రాయి
సామాన్యుడి జీవితంలో అసహనమనే కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టింది
గంటలు, రోజులు క్యూలో నిలబడ్డా
రెండువేలు రాని ఎటిఎంలు
కట్ల (ట్ట)ల పాములు పెద్దోళ్ల ఖాతాల్లో
బబ్బున్నాయి
అవినీతిపరుల ఖాతాలు వీడి, బీరువాల్లోనో, బాతురూముల్లో, గోడౌన్లలోనో హాయగా విశ్రాంతి తీసుకొంటున్నాయి
అవసరాల ‘వరద’ పేద ప్రజల జీవిత కాసారంలో
ఆందోళిత తుపాను రేపి, కల్లోల కంపనాలు సృష్టించాయి
నగదు రహిత లావాదేవీలంటూ
అందుబాటులో లేని అవమాన‘సహిత’ బతుకును
ప్రసాదించాయి.
‘కామన్‌మ్యాన్’ను రోడ్ల వెంట పడేశాయి...

సంగీత చక్రవర్తి సరిక్రొత్త రాగాల మాంత్రికుడు
సలలిత రాగ సుధాకరుడు బాలమురళీగానం
మూగవోయి, కర్నాటక సంగీత రాగాలు
కన్నీళ్లు కార్చాయి
మహానేత, కమ్యూనిస్టు ప్రజల అధినేత కాస్ట్రో
ఉద్యమాల యోధులు, రాజకీయ దురంధరుడు
మృత్యుదేవత ఒడిలో కొలువుదీరాడు..

గానగంధర్వుడు బాలు కీర్తికిరీటంలో
మరొక ఘన సత్కార పగడం మెరిసింది..

తమిళనాట ఆరాధ్యదేవత పురచ్చితలైవి
జయలలిత, పోరాటాల వీరవనిత,
ఎఐఎడిఎంకె సామ్రాజ్ఞి సెలవు సెలవంటూ
హఠాత్తుగా నిష్క్రమించి
తంబి జీవితాలలో విషాదఛాయలు నింపే
సందట్లో సడేమియాలా ‘వర్ధ’ తుపాను
మళ్లీ వాళ్లపైనే జలఖడ్గం విసిరింది
వేలాదిమంది కన్నీరు కారంగ, నిరాశ్రయులను చేసి
జనవరిలోకి అడుగుపెట్టబోతున్నారు

కలిమిలేములు, కష్టసుఖాలు, భావోద్రేకాలు,
సాదకబాధకాలతో నిమిత్తం లేకుండా
క్యాలండర్‌లలో నూతన సంవత్సరం వైపునకు రోజులు పరుగులుదీస్తున్నాయి
స్థితప్రజ్ఞుడిలా కాలపురుషుడి
అడుగులు పడుతూనే వున్నాయి
మరికొన్ని సంఘటలకు నాందీగా, నాటికి, నేటికీ, ఏనాటికీ కాలంతో మనిషి చెలిమి
కొనసాగుతూనే ఉంది.

- లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి
చరవాణి : 9849166951

నా నువ్వు - నీ నేను
నాకు నువ్వు, నీకు నేను
నువ్వు లేక నేను లేను నిజం కదా
నన్ను చూస్తేనే నీలో భావావేశం పొంగుతుంది
నీలో అది మొదలవగానే మొగ్గలాగా ముడుచుకున్న నేను నీకు అనుకూలంగా మారిపోతాను
అప్పటి వరకూ శే్వతవర్ణంతో ఉన్న నాకు
నీ స్పర్శతో నాలో ఎన్ని రంగులో
ప్రాచీన కాలం నుండీ మనిద్దరిలో ఎన్ని మార్పులు
దళసరిగా చుట్టలకట్టలా ఉన్న నా రూపం
ఎంతో నాజూకుగా
పలు ఆకారాలుగా రూపాంతరం చెందాను
తాటిచెట్టులా మొద్దుగా వున్న నువ్వు కూడా
పొడవుగా హీరోలా తయారయ్యావు
ఏ ముహూర్తాన ఆ బ్రహ్మ మన జంటను
సృష్టించాడో గానీ
తరతరాలుగా మనది విడదీయరాని
బంధమయ్యింది
ఎన్ని జంటలు మనల్ని చూసి కుళ్లుకుంటున్నాయో
నువ్వు లేకపోతే నాకు ఉనికే లేదు
నేను లేకపోతే నీకు అర్థమే లేదు
ఆదినుండి పలు పేర్లతో పిలువబడ్డ మనకు
ఈ లోకం శాశ్వతమైన పేర్లు పెట్టింది
కలమని నీకు, కాగితమని నాకు.

- దువ్వూరు సుమలత, నెల్లూరు
చరవాణి : 9494799248

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- పొట్లూరి సుబ్రహ్మణ్యం