నెల్లూరు

రాగబంధాలు( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి తలుపు తీసుకొని దొడ్లోకి వెళ్ళిన సుజాత బాతురూము తలుపుసందుల నుండి తెరలు తెరలుగా వస్తున్న పొగను చూచి - బాత్‌రూము తగలబడి పోతుంది - అని గావుకేక పెట్టింది. బాత్‌రూం తగలబడడమేందే, నీతెలివి తెల్లార - అంటూ పరుగెత్తుకవచ్చిన భర్త వాసు, తలుపు సందుల నుండి దట్టమైన పొగలు రావడం చూచి ఆశ్చర్యపోయి తలుపు గట్టిగా లాగాడు. బయట గోల విని తలుపు తీసుకొని బయటకు వచ్చాడు రాఘవరావు, కట్టె ఊత పొడుచుకుంటూ, గట్టిగా దగ్గుకుంటూ, బాత్‌రూమంతా పొగ నిండిపోయి వంట యిల్లులా ఉంది. వాసుకు కథంతా అర్థమైపోయి చుట్ట మానుకోలేక దొంగచాటుగా తాగుతున్న తండ్రివైపు కొంచెం కోపంగా ఎంతో బాధగా చూచాడు. 34చుట్ట తాగొద్దని డాక్టర్లు ఎంత గట్టిగా చెప్పినా నీవు చుట్టను మానుకోలేకపోతున్నావు నాన్నా. అసలు నీకీ చుట్ట ఎట్లావచ్చింది?22 అంటూ చుట్టూ చూశాడు. మేనకోడలు చిన్ని పక్కనున్న మల్లెపందిరి వైపు చెయి చూపి సైగ చేసింది. వాసు తొంగి చూచేసరికి గుబురుగా ఉన్న మల్లెపందిరి చాటున నక్కి కూర్చున్న చింటు కనపడేసరికి, వాసుకు కొడుకు మీద దిక్కు తెలియని కోపం వచ్చి వెదవ ఎంత పని చేశావు? ముసలాయన త్వరగా చావాలని చూస్తున్నావా?అంటూ చెవి పట్టుకొని చెయ్యెత్తాడు. వెంటనే రాఘవరావు చింటును దగ్గరకు లాక్కొని వాడి తప్పులేదురా. అలవాటైన ప్రాణం తట్టుకోలేక తపన పడుతుంటే చింటూ చూడలేక నన్ను బాత్‌రూంలోకి తీసుకెళ్ళి చుట్ట, అగ్గిపెట్టె నా చేతిలో పెట్టి - గబాగబా నాలుగు గుక్కలు తాగు జేజనాయనా! వాళ్ళు చూస్తే ఊరుకోరు అన్నాడు. నాకు పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. తీరిగ్గా, తృప్తిగా నాలుగు గుక్కలు తాగేసరికి ప్రాణం హాయిగా ఉంది. ఇంతలో బయట ఈగోల. ఇక లాభం లేదని బయటకు వచ్చాను అన్నాడు.
తన పథకం మధ్యలో విఫలమైనందుకు చింటు ముఖం వాడిపోయింది. ఇది విఫలం కావడానికి ప్రధాన కారణం చిన్ని అని వాడి అనుమానం. ఆ అమ్మాయిని నమిలి మింగేయలన్నంత కోపం వచ్చి ఉరిమి చూశాడు. అది గమనించిన సుజాత నవ్వి నీకు మీ జేజనాయన మీద ఎంత ప్రేమో, దానికి వాళ్ళ తాతమీద అంతే ప్రేమారా. ఆయన కోర్కె తీర్చాలని నువ్వు, తాగితే ఆయనకు ప్రమాదమని అది ఇద్దరు ఆరాటపడ్డారు.22
రాఘవరావుకు కళ్లు చెమ్మగిల్లాయి. నా మీద మీకెంత ప్రేమరా అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు.
రాఘవరావుది బహుకుంటుంబం. ప్రశాంతమైన జీవితం.
అనుక్షణం కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండే భార్య లక్ష్మణ, భరత, శతృజ్ఞుల లాంటి తమ్ముళ్లు, అడుగుదాటని కొడుకులు, కోడళ్లు, రెక్కలు విచ్చుకుంటున్న పసిమొగ్గల లాంటి మనుమలు, మనుమరాళ్లు, మాయమర్మాలు లేని మరదళ్లు, ఆప్యాయత పంచే బంధుమిత్రులతో పూత, కాయలతో పూర్ణ గర్భిణిలాంటి పూతోటలా ఉండేది రాఘవరావు సంసారం. చిన్న సంసారం చింతలు లేని సంసారమంటూ, పెళ్ళి చేసుకున్న వాడల్లా వేరు కాపురం పెట్టి, ఆఖరుకు మిగిలిన తల్లిదండ్రులను అనాధాశ్రమములో చేర్చే ఆధునిక నాగరికతను లోకానికి ఘనంగా చాటుకుంటున్న ఈ కాలంలో, ఇంతమంది మూడుతరాల వ్యక్తులు ఒక రాగబంధంతో ముడివేసినట్లు, ఎలాంటి ఈర్షాద్వేషాలు లేకుండా, ఒకరి కోసం మరొకరు అన్నట్లు కలిసిమెలిసి కాపురం చెయ్యడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండేది. ప్రపంచమంతా ఇట్లా ఉంటే ఉమ్మడి కుటుంబాల నిలయమై విశ్వ కుటుంబం ఏర్పడదా అని అనుకుండేవాళ్ళు.
అన్నదమ్ములలో రాఘవరావు ఉద్యోగం చేస్తే పెద్ద తమ్ముడు వ్యవసాయం, రెండవ తమ్ముడు వ్యాపారం, మూడవవాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవారు. ఎవరెంత సంపాదించిన, ఎవరికెంత ఖర్చయినా అంతా రాఘవరావు చేతిమీదుగానే జమాఖర్చులు జరిగేవి. అందరు ఒక శరీరంలోని వివిధ అంగాలుగా వ్యవహరించేవాళ్లు. అందరి అవసరాలు అడగకుండానే తీర్చేవాడు రాఘవరావు. ఒక తమ్ముడు పేదింటి అమ్మాయిని ప్రేమించినా కట్నకానుకాలు ఆశించకుండా అంగరంగ వైభోగంగా పెళ్లి చేశాడు. మరొక తమ్ముడి కొడుకు డాక్టరు కోర్సు చదవాలని పట్టుబడ్తే, గవర్నమెంటు సీటు రాకపోయినా, 50 లక్షలు డొనేషన్ కట్టి డాక్టరును చేశాడు. వ్యాపారంలో అనుకోకుండా నష్టపోయిన తమ్ముడికి మళ్లీ పెట్టుబడి పెట్టి నిలబెట్టాడు. వాళ్లేకాదు మరదళ్లు, కోడళ్లు కూడ అమ్మనాన్నలను మరిచిపోయి వాళ్ళనే తల్లిదండ్రుగా భావించుకునే వాళ్లు. పిల్లలనుకన్నప్పుడే గుర్తు. పెరిగేటప్పుడు అందరు తమ పిల్లలుగానే భావించుకొనేవాళ్లు. ఒక్క ఎర్ర మార్కు కూడా లేకుండా సంతృప్తిగా సర్వీసు పూర్తిచేసుకున్న రాఘవరావు ఒక శుభముహూర్తాన పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం, ఎంత చిన్నదైనా ఒక వ్యసనం ఉండాలి అంటారు పెద్దలు. అట్లాగే రాఘవరావుకు కూడ ఉద్యోగం అనే వ్యాపకం, చుట్ట తాగడం అనే వ్యసనం కాస్త ముందు వెనుకగా ఏర్పడి వయసుతోపాటు వర్థిల్లుతూ వచ్చాయి. చుట్ట తాగడం ఇంట్లో కాకుండ బయట నిర్వహిస్తున్నందువలన ఇంట్లోవారు కూడ అంత పట్టించుకోలేదు.
కాని పదవీ విరమణానంతరం ఈ అగ్నిహోత్రం ఇంట్లోనే వెలిగించవలసిరావడం, వయసు పైబడడంవలన దగ్గు రావడం, డాక్టరు దగ్గరకు పోవడం జరిగింది. డాక్టరు పరీక్ష చేసి, ఊపిరితిత్తులలో నెమ్ము చేరిందని, పొగ తాగడం పూర్తిగా నిషేధించకుంటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. కుటుంబ సభ్యులందరు ఆయనమీద ప్రేమాభిమానాలతో గట్టి నిఘా పెట్టి కట్టడి చేశారు. ఎప్పుడైన ఒక చుట్ట తెప్పించుకుంటే, నిర్ధాక్షిణ్యంగా తీసిపారేసి ఆయన ఆరోగ్యం ఆయనకేకాక, కుటుంబ సభ్యులందరికి ఎంత ముఖ్యమో క్లాసు తీసుకునేవారు. ఇక లాభం లేదనుకుని ఆ ప్రయత్నం విరమించుకుని కొడుకు కొడుకు చింటు, కూతురి కూతురు చిన్నితో ఆడుకుంటు కాలక్షేపం చేయసాగారు. వారిద్దరు ఆయనకు చెరోపక్క చేరి కథలు చెప్పించుకుంటూ, పొంతన లేని ప్రశ్నలు వేసి ఆయనను తికమక పెట్టేవారు. కాని ఆయన ఎంతో ఓపికగా వాటికి సమాధానం చెప్పి వాళ్లను సంతృప్తి పరచి నిద్ర పుచ్చేవాడు. కుటుంబ సమస్యలు ఏవొచ్చిన కూలంకుషంగా చర్చించి అందరికి సంతృప్తికరంగా తగిన పరిష్కారం సూచించేవాడు. పెద్దవాళ్ల ఆలోచన, యువత ఆచరణ, పిల్లల ఆప్యాయతలతో ఆ కుటుంబం పూత, కాయలు, పండ్లతో ప్రకృతికి హారతి పట్టిన వృక్షరాజంలా ఉండేది.
రాఘవరావు అంపశయ్యమీది భీష్మునిలా చావుకు ఎదురు చూచి ఒకనాటి ఉషోదయాన స్వర్గస్తుడయ్యాడు. తల్లివేరు కూలిపోయిన వృక్షంలా ఆ కుటుంబం తల్లడిల్లింది. ఒక మంచి మనిషి అస్తమించాడని బంధుమిత్రులు బాధపడ్డారు. భారమైన హృదయాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
15వ రోజు పెద్ద ఖర్మ. బంధువులు, మిత్రులు, హితులు, పరిచితులు అందరు ఉదయానే్న ఇంటి దగ్గరకు చేరి విషణ్ణ హృదయాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామం గ్రామమంతా అక్కడే ఉంది. అది ఆ ఒక్క కుటుంబానికే కాదు; అందరికి సంబంధించింది అన్నంత ఆపేక్షతో తలా ఒక పనిలో లీనమైపోయారు.
10 గంటల కల్లా పనులన్ని ముగించుకొని పిండ ప్రదానం చేయడానికి ఊరికి ఉత్తరంగా పొలంలోనికి వెళ్ళారు. జనసందోహంతో అది ఒక ఉత్సవంలా ఉందికాని కర్మలా లేదు. ఇస్తర పరచి, అన్నిరకాల పిండివంటలతో తలా మూడుసార్లు ఇస్తరనిండా పెట్టి, ఆ ఇస్తర జనానికి కొద్దిదూరంలో ఉంచి, అందరు కాకుల కోసం చూస్తున్నారు. చుట్టూ చెట్లమీద కాకులు అరుస్తున్నాయి. విస్తర చుట్టు తిరిగిపోతున్నాయిగాని మెతుకు ముట్టడం లేదు.
ఆయన కోర్కెలేమన్నా మిగిలిపోయాయేమొ ఆలోచించి తీర్చండి, లేకుంటె కాకులు ముట్టవు అంటూ కొందరు వృద్ధులు తమ అనుభవాలను వివరిస్తున్నారు. ఆత్మీయులు, ముఖ్యమైన బంధువర్గమంతా ఒకరి తరువాత ఒకరు వెళ్లి విస్తరలోని పదార్థాలను మరలా ఒకసారి మార్చి, ఆ విస్తరను దూరంగా పెట్టి వచ్చారు. కాని పరిస్థితిలో మార్పు లేదు. ఇంతలో ఒకరు - పెద్దాయనకు ప్రాణం లాంటి చింటు, చిన్ని ఏరి? కనపడలేదు - అన్నారు. వారిద్దరు జనంలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకుంటూ చూస్తే వారిద్దరు పరిగెత్తుకుంటు వస్తున్నారు. ఎక్కడున్నారురా ఇప్పటిదికా - అంటు ఉరిమి చూశాడు వాసు. అదేమి పట్టించుకోకుండా వారిద్దరు పరుగెత్తుకెళ్ళి చెరి మూడు పిడికిళ్ళు అన్నం విస్తరలోకి మార్చారు. చింటు తన చేతిలోని వాటిని భద్రంగా విస్తరలో ఒక పక్కన పెట్టారు. దండం పెట్టుకొని ఇద్దరు ఇవతలకు రాగానే కాకులు ఒక్కసారిగా మూక ఉమ్మడిగా ఇస్తర మీద వాలిపోయాయి.
చింటు పెట్టింది ఏమిటా అని చూస్తే - రెండు చుట్టలు. పెద్దవాళ్ల కోరిక పిల్లలకు మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటె వారుకూడ ఒక విధంగా పిల్లలేకాబట్టి.
ఆప్యాయతకు అద్దం పట్టిన ఆ దృశ్యం చూసి, పొడిబారిన హృదయాలు కూడా కరిగి కన్నీరుగా మారాయి.

- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి
చరవాణి : 9490227114

పుస్తక సమీక్ష

తేనెలూరే మధుపత్రాలు
ప్రతులకు
యు శైలజ, కేరాఫ్ యుఆర్‌ఎస్‌కె విహార్,
ఫ్లాట్ నెం.311, దండు అపార్ టమెంట్‌స, పద్మారావునగర్,హైదరాబాద్.
సెల్ : 70328 34460

కవిత రాయడానికి చాంతాడన్ని డిగ్రీలు అక్కర్లేదు. కేవలం మనసులో పెల్లుబికె హృదయ తరంగాల్ని అక్షరీకరణ చేయగలిగే సామర్ధ్యం ఉంటే చాలు. అలా తన మనసులోని భావాలకు చక్కటి అక్షర రూపం ఇచ్చిన ఆధునిక కవయిత్రి ఉప్పులూరి శైలజ. పెరసం (పెన్నా రచయితల సంఘం) ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నట్టు ఆలోచనలు అందరికీ వస్తాయి. కాని వాటిని పదునైన పదాలుగా మార్చి మనలో ఆలోచనలు రేపేవాళ్లే కవులు. అలాంకి కోవలోకి వస్తారు శైలజగారు. సమాజాన్ని చదువుతూ తన కంటికి కన్పించేదేదైనా చైతన్యం కలిగించిందంటే అది కవితారూపంలో కాగితాన్ని చేర్చే సామర్ధ్యం ఈమె సొంతం. తెలుగుభాషపై మమకారంతో నిరంతరం సాహితీసేద్యాన్ని చేస్తూ స్వయం కృషితో కవితా సంపుటి తీసుకురావడం అభినందనీయం. రాజమహేంద్రవరానికి చెందిన ఉప్పులూరి శైలజ తండ్రి, భర్త, మరిది సహకారంతో రచనా వ్యాసంగాన్ని చేపట్టి అభ్యసనంతో అందులో ఆరితేరి విభిన్న రచనలు చేస్తూ పదిమందికీ సంతోషాన్ని కలగజేయడమే కాకుండా అనేక అవార్డులు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు. గృహిణిగా క్షణం తీరిక లేని కుటుంబ బాధ్యతలు మోస్తూ సాహితీ వ్యాసంగం చేయడం కష్టసాధ్యం. అయినా తెలుగుభాషపై మమకారంతో లెక్కకు మించి కవితలు, కథలు, సాహితీ ప్రసంగాలు చేసిన శైలజగారి సాహితీ కృషి అభినందనీయం.
ఆమె కవితల్లో అనేక సామాజికాంశాలు సున్నితంగా స్పృశించారు. వాగ్దేవికి నీరాజనం కవితలో వీణాపాణికి అంగపూజను పోలినట్టు తెలుగుభాషతో పుష్పాలు సమర్పించిన తీరు అమోఘం
కవిత్వం రాయాలనుకునేవారంతా తొలుతగా రాసేది అమ్మమీదే. అనురాగం, ఆత్మీయత, ప్రేమతత్వం నిండి ఉండే చల్లని తల్లి అమ్మను వర్ణించడానికి ఏ భాషలోనూ అక్షరాలు సరిపోవు. అలానే శైలజ గారు కూడా అమ్మను తలుస్తూ రాసిన కవిత వెనె్నల్లో చల్లని కాంతిలా సాగింది అమ్మపథం. నాన్న మనస్సు నవనీతం అనే కవితలో జీవితానికి మార్గదర్శనం చేసే నాన్న మనస్సు నవనీతం అని హృద్యంగా చెప్పారు.
‘అడుగుజాడలు’ కవిత చదువుతున్నప్పుడు గురజాడ కళ్లెదుట కదలాడారు. 3గురజాడ నవశక్తి2 స్వరూపాలు పరిశోధనాత్మక కవితలా ఉంది.
3ఆమూలగది2 కవిత ధారలో శ్రీశ్రీ ప్రభావం కన్పిస్తోంది. 3నావూరు తిరిగి రావాలి2 కవిత మళ్లీమళ్లీ చదవాలనిపించేలా ఉంది.
మానసిక వికలాంగులను అమ్మచంకన చిన్ని పాపలు అనడం హృద్యంగా ఉంది. సాహితీ సార్వభౌములు, యోగినివా? అభాగినివా, 3అయిలాన్ తిరిగిరావూ, 3మన్నించు మహాత్మా, 3నీవు నేను, 3వర్షపు చినుకు2 3స్వేచ్ఛా విహంగాలు2 కవితలు రచయిత్రి కలం నుంచి చాలా చక్కగా ఆవిష్కృతమయ్యాయి. శైలజగారిలో కవితావేశం, భావావేశం, కావాల్సినన్ని అక్షర పద బంధాలు ఉన్నాయి. కాని కొద్దిపాటి ఓర్పు, నేర్పు ఉంటే వాటిని సక్రమ రీతిలో అమర్చితే అంత్యప్రాసతోకాని, ఆది ప్రాసతోకాని, అక్షర పదాడంబరతో కాని (కుటుంబ చిత్రంలా) కవితలు ఇంకా రాణిస్తాయని నా అభిప్రాయం.

- గౌతమి
9347109377

స్పందన

సలీవన్ పురస్కారం బాగుంది
మెరుపులో గొప్ప కథను అద్భుతంగా మలిచిన రచయిత్రి పెండ్యాల గాయత్రి గారికి అభినందనలు. సలీవన్ పురస్కారం కథను చదివిన తర్వాత చాలాకాలం తర్వాత మంచి అనుభూతి చెందాను. కథ నిడివి చాలా పెద్దది అయినా కథలోని సందేశం ఎంతో విలువైనది. కథలోని పాత్రలను కూడా గొప్పగా ఆవిష్కరించిన తీరు బాగుంది. రచయిత్రికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ..
ఉప్పులూరి హేమంత్‌కుమార్, అల్లూరు
కంచి విష్ణుప్రియ, ముంగమూరుడొంక, ఒంగోలు
రావినూతల సరస్వతి దేవి, సన్నిధివీధి, శ్రీకాళహస్తి

మనసును తాకిన సైకత విలాపం
సైకత విలాపం గురించి ఇంత గొప్పగా రాయొచ్చా అనే విధంగా కవితను మనకు అందించారు రచయిత్రి దువ్వూరు సుమలత గారు. ఇంతకు ముందు కూడా ఆమె కవితలను మెరుపులో చదివాము. చాలాకాలం తర్వాత మంచి భావమున్న కవితను అందించారు. సముద్రం, ఇసుక మధ్య ఉన్న బంధం ఎంత బలీయమైనదో వివరించారు. ప్రతి పదం కూడా కవితలోని భావం గొప్పతనాన్ని తెలిపేందుకు పోటీపడింది.
- మంత్రి ఉమామహేశం, బలిజవీధి, తిరుపతి
- రాచమాను ఉపేంద్రసాయి, నాయుడుపేట

దేశాభివృద్ధికి నేను సైతం
మెరుపులో ముసులూరు నారాయణ గారు దేశాభివృద్ధికి నేను సైతం కవిత చాలా బాగుంది. చేయి చేయి కలిపి స్వార్థం అనే కలుపుని పీకేస్తే దేశం నిర్మలవౌతుంది. స్వచ్ఛవౌతుంది. ఎంతో గొప్ప కవితను ప్రతి ఒక్కరిలో చైతన్యం రగిల్చేలా అందించిన రచయితకు అభినందనలు.
- అనంత పద్మసాయి, కావలి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

మనం భారతీయులం
ఎగురుతున్న మువ్వనె్నల జెండా
ఎర్రకోట మీద రెపరెపలాడుతుంది
పేదవాడికి ప్రాణం పోయాలని
ప్రజాస్వామ్యాన్ని పదిమందికి పంచాలని
సమానత్వమే కేంద్రంగా
సాగిన రాజ్యాంగం
అందించిన ఫలాల రసాలను
అందుకోలేక పోతున్నది ప్రజాజీవనం
తెల్లదొరల బానిసత్వం నుండి బయటపడి
నల్లదొరల స్వార్థంలో ఇరుక్కుపోయాం
అమర వీరులు సాధించిన స్వాతంత్య్రం
అసుర గణాల చేతికి చిక్కి అల్లాడుతోంది
తన గుడ్లను తానే తినే పాముల్లా
తమ వాళ్లను తామే దోచుకుంటున్నారు.

కుల మతాల కతీతమైన రాజ్యాంగాన్ని
కట్టగట్టి అటకమీద బెట్టి
కుల గజ్జిని లోకమంతా అంటించి
మనుషుల హృదయాలను
కలుషితం చేస్తున్నారు
స్వేచ్ఛా వాయువులు మన
నాసికాపుటాలు చేరి
ఏడుపదుల వసంతాలు తాకుతున్నా
ఏదీ మనకు నిజమైన స్వేచ్ఛా?
నిద్రాణమై వున్న మీ ఉత్తేజాన్ని
ఉరకలెత్తించండి
నిదురిస్తున్న ఆవేశానికి నీరుపోయండి
రాజ్యాంగం యిచ్చిన హక్కుల కోసం
నిలదీయండి
మేము చాతుర్వర్ణ సంజాతులం కాదని
మనమంతా భారతీయులమని నినదించండి
మన దేశ కీర్తిని దిగంతాలకు
వ్యాపింప చేయండి
మన జాతీయపతాకానికి గౌరవం పెంచండి
సమ సమాజ స్థాపనకై యువతరం

- శింగరాజు శ్రీనివాసరావు
9052048706
నడుం బిగించండి

కలత
రంగురంగుల చీరకట్టి
రవిక ముడి బిగించిన చిన్నది
రంగవల్లి తీర్చిదిద్దవచ్చి
రంకేసినట్లు నిలుచుంది గుమ్మాన
పాలు పితుకుతున్న పామరుడు
పరికిణిని చూచినవ్వి, నివ్వెరపోయెను
గేదె దూడ పాలు కోసం లాగుతుంటే
గుర్రుమన్న ముదుసలి పలుపువిప్పెను
పొదిమ నుంచి పాలు ఏరై ప్రవహిస్తుంటే
ఆకలిగొన్న లేగదూడ కన్నీరు ఆవిరాయెను
అది చూచి చిన్నదాని మనసు కలతచెంది
వంకలో వడివడి అడుగు లేయసాగింది
వయస్సు మీద పడిన ఆ చిన్నది
ఒంటరిగా మనసుతో మాటాడుకుంటు
వయ్యారాలు ఒలకబోస్తు, నవ్వుతూ
వెనుదిరిగి చూసింది సవ్వడి విని
అది, యాసమాటల పలకరింపు
ఎవరూ? అటు మాటున దాగింది
ఎవరవో నీవు ధైర్యం వుంటే ఎదురురా,
ఎదలో గుబులు, ముచ్చెమటలు
కొంగుమడచి తుడిసిన ముఖంలో
కొంటెదాని మొగములో భయం విరజిమ్మే
కాసింత ధైర్యం పుంజుకొనెను
కోమలీ కునుకుతీస్తున్నావా!
కలత చెందావా! అన్న ఓ చిరునవ్వు.

- బందిల మోహన్, చరవాణి : 9490463061

ఏమి అనుభవించావని?
ఒక జ్ఞాపకం వెంటాడుతూ ఉంది
ప్రత్యక్షంగానో పరోక్షంగానో
వ్రాసుకున్న కవిత్వమూ వెంటాడుతూనే ఉంది
హృదయంమీది గాయపడ్డ సందార్భాలు
చైతన్యం కోల్పోయి పడున్నాయి
ఏమి అనుభవించకుండానే నిష్క్రమిస్తున్నాం
ప్రేమబంధాల విలువలు ఎవరికి తెల్సు
మరచిపోని కలలు
బ్రతుకు సముద్రంలో ఆటుపోట్లుగా
కళ్ళముందు కదలి వస్తున్నాయి

అందరూ దూరమయిపోతున్నారు
దగ్గరితనాన్ని మర్చిపోయి కదుల్తున్నారు
కట్టుకున్న వారధుల్ని కూల్చుకుని
గమ్యాన్ని చేర్చే రైలుబోగీల్ని విడగొట్టుకుని
పునః నిర్మించుకోవడానికి సిద్ధపడకుండానే
మనసుల్లో కూరుకు పోయిన విషాదాన్ని
పక్కకు నెట్టలేక బతికిపోతున్నారు
కలలు బూడిదై కన్నీళ్ళలో కలిసిపోయాయి
ఎటుచూసినా అస్తిపంజరాల గుట్టలే
ఆత్మీయుల రాకకోసం ఎదురుచూపులు లేవు
బరువెక్కిన హృదయ ఆలింగనాలే అన్నీ

అంతా కరిగిపోయిన చరిత్రల వెక్కిరింత
అయినా కొనసాగుతూనే ఉందీ ప్రపంచం
మనల్ని మనం దహించుకుంటూ పోవడమే
పోరాటం చేయక తప్పదు
పోరాడీ ఒరిగిపోకా తప్పదు

చివరాఖరికి పవిత్ర గ్రంథాలన్నీ
రక్తపు మడుగులో తేలుతాయి
ఎగిరే శక్తిలేక అసహాయంగా ...

- ఖాదర్ షరీఫ్, చరవాణి : 9441938140

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- పిడుగు పాపిరెడ్డి