నెల్లూరు

మట్టిపొరలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడం, పిల్లలకు ఉచిత సలహాలివ్వడం మాలాంటి పెద్దలకు అలవాటు. పెద్దవాళ్లు తామెంతో తెలివిగల వాళ్లలా ప్రవర్తిస్తుంటారు. కాని వాళ్లలో కొద్దిమంది మాత్రమే విజ్ఞానవంతులు. ఈ పెద్దలంతా ఎంతో చిత్రంగా, తమకు తాముగా పరిమిత పరిధులను, సమూహాలను నిర్మించుకుంటారు’’.
ఏడో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘జవహర్‌లాల్ నెహ్రూ’ వ్రాసిన ‘పిల్లలకో ఉత్తరం’ అనే పాఠ్యాంశాన్ని తరగతి గదిలో ఆదర్శపఠనం చేస్తున్నాను.. మధ్యమధ్యలో విద్యార్థులంతా పుస్తకంలో చూస్తున్నారా.. లేదా అని గమనిస్తుండగా దించిన తల ఎత్తకుండా కూర్చున్న రసూల్ కంటబడ్డాడు..‘‘రెండు రోజుల నుంచి బడికిరాలేదు ఎందుకనిరా!’’ అనడంతోనే ఒడిలోని పుస్తకం కిందపెట్టి చటుక్కున లేచి చేతులు కట్టుకున్నాడు. వాడి ముఖంలో దుఃఖపు ఛాయలు కనిపించాయి తనేదో చెప్పబోతుండగా చుట్టూవున్న నలుగురు పిల్లలందుకొని ‘టీచర్ మరీ! వీడే!’ అంటుండగానే క్లాస్ అంతా గడబిడగా గోలందుకుంది. పాఠం అయిపోయిందాకా పరామర్శలు పనికిరావులే అనుకొని గొంతు కాస్తపెంచి ‘ఏయ్.. పిల్లలు! మాటలాపి వౌనంగా అందరూ ఆ పేరా ఒక్కసారి చదవండి’ అన్నాను.
నా కళ్లు క్లాసంతా కలయజుస్తున్నా గాని మనసు మాత్రం గత సంవత్సరానికెళ్లింది. ఈ రసూల్ ఆరవ తరగతిలో ఎంత రఫ్‌గా ఉండేవాడు అందరూ తన అజమాయిషీలో ఉండాలి.. తను చెప్పింది చేయాలి, తను చేసింది చూడాలి పిల్లలంతా.. తనకనుకూలంగా లేని పిల్లల్ని కొట్టడం అది కుదరకపోతే మిగతా పిల్లల్ని వాళ్ల నుంచి వేరుచేయడం లాంటి పనులు చేసేవాడు ఇదంతా గమనించి వాడిని రెండుమూడుసార్లు మందలించినా ప్రయోజనం లేకపోయింది.
ఓ రోజు క్లాస్‌లోకి వెళ్లేసరికి రూమంతా రంగస్థలంలా ఉంది ‘ఏంటిరా! ఇది? అంటే! పిల్లలంతా కుడికంటి క్రింద రక్తం కారుతున్న వినయ్‌ని నా దగ్గరకు తీసుకొచ్చారు. కనుగుడ్డుకేమైనా ప్రమాదమేమోనని భయపడుతూనే నీళ్లు తెప్పించి కడిగి చూసిన తరువాత ఊపిరిపీల్చుకున్నాను. అప్పుడడిగాను ఏం జరిగిందిరా?’ అని ‘రసూల్ ఇనుపస్కేలుతో కొట్టాడు టీచర్’ పిల్లలంతా అదేమాట.
నాకు కోపం తారాస్థాయికి చేరింది. అదే స్కేలుతో రసూల్ అరచేతులపై నాలుగు తగిలించి ‘ఎందుక్కొట్టావురా వాణ్ణి? ఆ దెబ్బ కంటికి తగిలితే ఏమైయ్యేదిరా?’ అరిచినట్లు అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు సరికదా వీలైతే నా చేతిలో ఉన్న స్కేల్‌లాక్కొని తిరిగి కొట్టేటట్లు చూస్తున్నాడు. ‘చెప్తావా బయటకెళ్తావా!’ అనడంతోనే బయటకెళ్లి నిల్చున్నాడు. ఒక్క క్షణం ఏంచెయ్యాలో తోచిందికాదు.
ఆ రోజు క్లాసు అయ్యిందనిపించుకొని మరుసటి రోజు రెండు పాత న్యూస్‌పేపర్లు పట్టుకొని క్లాస్‌లోకి వెళ్లాను. రూమంతా రెండు వర్గాలుగా కనిపించింది. ‘రసూల్! ఇట్రా!’ అన్నాను. అనుమానంగా, ఆశ్చర్యంగా నావైపు చూశాడు. ‘ఈ పేపర్‌లో ముఖ్యమైన వార్తలున్నాయి నువ్వు చదువుదువుగానీ రా!’ అన్నాను. నా చేతిలోని పేపర్‌ను చూస్తూ లేచివచ్చాడు.
‘పిల్లలూ! ఇప్పుడు రసూల్ రెండు విషయాలు చదువుతాడు అందరూ శ్రద్ధగా వినండి తరువాత ప్రశ్నలడుగుతాను’ అంటూ ఏమేమి చదవాలో చూపించాను. వాడు నిదానంగా చదివినా స్పష్టంగా చదివాడు తరువాత ఆ సంఘటనలను విపులంగా వివరించి ‘ఇప్పుడు చెప్పండి! వందమందిని చంపి తానూ పోయిన ఆత్మాహుతి బాంబర్ మీ ఫ్రెండా! లేక తాను చనిపోయినా మరో ఏడెనిమిదిమందిని బ్రతికించిన అవయదాత మీ ఫ్రెండా!’ అడిగాను. ‘అవయవదాతే మా ఫ్రెండ్’ ముక్తకంఠంతో అన్నారంతా. ‘రసూల్ మరీ నీకూ!’ అనగానే ‘ఈయన్న చచ్చిపోయిండుగా టీచర్!’ పేపర్‌లోని అవయవదాత ఫొటో చూస్తూ అన్నాడు. ‘అవును నాన్నా, ఆ అబ్బాయి చనిపోయాడు కాని తన అవయవాలతో పునర్జీవమందుకున్న వారి రూపంలో బ్రతికే వున్నాడు అంతటి అదృష్టం ఎందరికి ఉంటుందో చెప్పు’ పాఠ్యపుస్తకం చేతికి తీసుకుంటూ అన్నాను.
‘అలా మనం కూడా ఇవ్వాలనుకుంటే చచ్చిపోవాలా టీచర్’ వినయ్ అడిగాడు. ‘్ఛఛ! అలాకాదు నాన్నా! ప్రతిరోజూ ఎన్నో విధాలుగా ఎంతోమంది చనిపోతుంటారు కదా! వారి దేహాన్ని కాల్చివేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తుంటాము అవునా! అప్పుడు రోగులకు ఉపయోగపడవలసిన అవయవాలు వృధాగా మట్టిలో కలిసిపోతాయి కదా’ రసూల్ భుజంపై చేయివేసి వాడి ముఖంలోకి చూస్తూ అన్నాను. ‘నిన్న నా కన్ను పోయింటే అలా ఎవరైనా ఇచ్చేవాళ్లా టీచర్’ రసూల్‌ని చూస్తూ అడిగాడు వినయ్.
అప్పటిదాకా సన్నగా పడుతున్న చినుకులు ఊపందుకున్న గాలితో కలిసి కిటికీల్లోంచి తరగతి గదిలోకి చొరబడ్డాయి. ‘టీచర్ బుక్స్ తడిసిపోతున్నాయ్’ అంటూ కేకలు పెడుతూ నలుగురు పిల్లలు లేచి కిటికి తలుపులు మూసేశారు.
‘పిల్లలూ! ఈ తలుపులు తయారీకి కావాల్సిన చెక్క మనకు ఎక్కడ నుంచి వస్తుంది’ అని అడిగి మాటల్లో పడిన పిల్లల దృష్టిని నావైపునకు మళ్లించాను. ‘చెట్ల నుంచి వస్తుంది టీచర్’ వర్షం హోరుకన్నా గట్టిగా అరిచి చెప్పారందరూ ‘బ్రతికి వున్నప్పుడు గాలి, నీడతో పాటు పండ్లను ఇచ్చి చనిపోయాక ఎండవానల నుంచి అందరిని రక్షించే చెట్టులాగా మనం పరులకు మేలు చేయాలే కానీ హాని తలపెట్టకూడదు. శత్రువైనా ఆపదలో ఉంటే సహాయం చేసే సంస్కృతి మనది’ అంటూ ‘నేను సైతం’ అనే పాఠంలోకి తీసుకెళ్లాను.
ఆ తరువాత రోజు క్లాస్‌కెళ్లేసరికి రసూల్, వినయ్ జంటగా కూర్చొని కనిపించారు. పిల్లలదెంతటి పసిడి మనసు! ఉగ్రవాద సంస్థలు ఇలాంటి అమాయకులను చేరదీసి, శిక్షణ ఇచ్చి ఛాందసులుగా, దేశద్రోహులుగా మార్చేస్తాయి కాబోలు అనిపించింది. ఆ తరువాత రసూల్‌లో మంచి నాయకత్వ లక్షణాలు కనిపించాయి. పిల్లలందరిని తన చేతలతో ఆకట్టుకొనేవాడు చదువులోనేకాక సహ పాఠ్యకార్యక్రమాల్లోనూ బాగా ముందుంటున్నాడు. అప్పటి నుండి వాడు బడి మానేసింది ఇప్పుడే!.
మళ్లీ ఒక్కసారి క్లాసంతా కలయజూసి ‘వినయ్ కూడా బడికి రాలేదేమిట్రా!’ అన్నాను. ‘వాళ్ల నాన్న లారి గుద్ది చచ్చిపోయిండు టీచర్’ పిల్లలు చెప్పిన విషయం నా చెవులు జీర్ణించుకోనేలోపు ‘మేడమ్ మిమ్మల్ని హెచ్‌ఎం గారు పిలుస్తున్నారు’ అటెండర్ చెప్పాడు. ‘‘పిల్లలు మీకు నెహ్రూగారు ఉత్తరం రాశారు కదా, అలా మీకు నచ్చిన పెద్దలకు మీరొక ఉత్తరం రాయండి. నేనిప్పుడే వస్తాను’ అని చెప్పి ఆఫీస్‌రూమ్ దగ్గరకు వెళ్లాను.
‘సార్ పిలిచారట’ హెచ్‌ఎంతో పాటు అక్కడున్న ఇద్దరు నావైపు దృష్టి సారించారు. సార్ ఏదో చెప్పబోయేలోపు ‘‘ఏంది అయివారమ్మా నువ్వు పిల్లోళ్లకి చదువు చెప్తండావా తగులాటలు నేర్పుతుండావా’’ ఆ ఇద్దరిలో ఒకావిడందుకొని అంది. ‘‘మీరుండండి, నేను మాట్లాడుతున్నా కదా’’ హెచ్‌ఎం వాళ్లను అనునయిస్తూ ‘‘మేడమ్ వీళ్లు రసూల్ తల్లిదండ్రులు. ఆ అబ్బాయి టీసి ఇవ్వమని అడుగుతున్నారు’ కొంచెం నసిగినట్టు అన్నాడు. ‘ఎందుకు సార్! పిల్లాడు బుద్దిగా చదువుకుంటుంటేను’ నా మాట పూర్తికాకమునుపే ‘నువ్వు మా ఇంటవంట లేని బుద్దులన్ని నేర్పుతుండావు’ మళ్లీ గట్టిగా అందావిడ ‘నువ్వుండమ్మ నేను మాట్లాడుతున్నా కదా’ అంటూ ఆమెను గదమాయించి -
‘మేడమ్ మన స్కూలులో చదివే వినయ్ వాళ్ల నాన్న చనిపోయాడట వాళ్ల ఇళ్లు వీళ్లింటి దగ్గరేనట, శవ సంస్కారాలు జరుగుతుండగా రసూల్ వాళ్లింటికి వెళ్లి శవాన్ని పూడ్చిపెట్టొద్దూ హాస్పిటల్‌కు పంపిస్తే అవయవాలు తీసి శరీరాన్ని మళ్లీ మనకు అప్పగిస్తారు అంటూ అంబులెన్స్‌కు ఫోన్ చేశాడట. వాళ్లొచ్చి విషయం అడిగి వాళ్లు కాదనడంతో వాళ్లు వీళ్లు అందరూ కలిసి వచ్చి వీళ్లిద్దరిని తిట్టిపోశారట’ అని జరిగింది చెప్పారు హెచ్‌ఎం.
రసూల్ తండ్రి అందుకొని ‘ఏదో చిన్నబిడ్డ తెలిసిదెలవక ఏదేదో అన్నడూ వాళ్లందరికి సర్ది చెప్పుకుంటుంటే మా బేటాగాడు ఆడికొచ్చి రోగులకు ఉపయోగపడేవాటిని మట్టిలో కలపడం తప్పు అని మాట్లాడి మల్ల గలాట పెద్దది చేసిండు’ అన్నాడు.
‘పరువుగా బతికేటోళ్లం వానికి తగులాటలు తగిలించిన్రు ఎన్నడూలేంది నా బేటాని చావు దెబ్బలు గొట్టిన’ ఏడుపందుకుంది రసూల్ తల్లి. ‘నువ్వు ఏడవకమ్మ! ఏదో పొరపాటు జరిగిందిలే’ అన్నాడు సోషల్ టీచర్. ‘మా పిల్లోనికి ఈ సదువులు ఏం వద్దులే అయ్యవారు. వాళ్ల నాయిన్తోపాటు కిరానాకొట్లో కూర్చుంటే బతికిపోతడు’ కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఆవిడ. ఇంతలో పిఎస్ టీచర్ కల్పించుకొని ‘ఇంత చిన్న విషయానికి పిల్లాణ్ణి బడిమాన్పిస్తారా!’ అంటూ రసూల్‌ని పిలిచి ‘ఒరేయ్! ఇక నుంచి మీ అమ్మానాన్న చెప్పింది విను. దేనికి ఎదురు చెప్పకు సరేనా!’ అన్నాడు రసూల్ తలపై చెయ్యి ఉంచి. వాడు సరేనన్నట్లు తలాడించి వాళ్లమ్మానాన్నలకు ఏదో చెప్పాడు. వాళ్లిద్దరు పిఎస్ టీచర్‌కి నమస్కరించి, నావైపు ఒక చూపు విసిరి వెళ్లిపోయారు.
‘ఇలాంటి తెలిసితెలియని వాళ్లని తగిలించుకోకూడదు మెడమ్ ఆ తలనొప్పి మనం తట్టుకోలేము’ అన్నాడు మరో టీచర్. ‘అస్సలు ఖర్చులేనిది, అత్యంత తేలికైనది ఏదైనా ఉంది అంటే అది ఉచిత సలహా మాత్రమే. ఇచ్చేవాళ్లే తప్ప ఆచరించేవాళ్లుండరు అని అనుకున్నాను.. కానీ ఒక మంచి సలహా పిల్లల్ని ఇంత ప్రభావితం చేస్తుందని ఊహించలేకపోయాను సార్!’ అని ఇక వెళతాను అన్నట్లు హెచ్‌ఎం గారికి సైగ చేసి అక్కడ నుండి క్లాస్‌రూమ్‌కి వచ్చేశాను.
రసూల్ నా దగ్గరకు వచ్చి ‘టీచర్! ఈ పెద్దోళ్లందరూ పిల్లలు సెప్పేది ఏది వినరుగాని కలెక్టర్‌లు, డాక్టర్లు చెప్పింది చేస్తారుకదా!’ అన్నాడు. అవును అన్నట్లు చిన్నగా నవ్వి, ఎందుకు అన్నట్టు కళ్లెగరేశాను. వాడు నా కళ్లలోకి సూటిగా చూస్తూ ‘నేను బాగా చదువుకుని కలెక్టర్‌ను అయ్యి అందరూ అవయదానం చేసేలాగా ఆర్డర్ వేస్తే తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టు దృఢంగా చెప్పాడు. వాడి మాట తరగతి గదంతా ప్రతిధ్వనించింది.
ఇక ఢోకాలేదు నేను నాటిన విత్తనంలో జీవం ఉంది. అది బిగుసుకున్న మట్టిపొరలను చీల్చుకొని వచ్చి మొలకెత్తడానికి కొంతకాలం పడుతుంది. అందాకా ఓపిగ్గా నీళ్లు పోయాలి అనుకుంటూ రసూల్ భుజం తట్టి చొరవ, ధైర్యం పిల్లలందరిలోనూ రగిలించాలనే సంకల్పంతో గాలి పీల్చుకున్నాను గుండెలనిండా..

- పెండ్యాల గాయత్రి, కనిగిరి.
చరవాణి : 8985314974

స్పందన

వాస్తవానికి దగ్గరగా మకరందపు పూత
గతవారం మెరుపులో మకరందపు పూత కవిత వాస్తవానికి దగ్గరగా సాగింది. ఈ సమాజంలో మనుషుల మనసులు ఎలా ఉంటాయో విపులంగా వివరించారు. రచయిత చాలా లోతుగా పరిశీలన చేసి ఈ కవిత రాసినట్లు అనిపించింది. సహజంగా మనతో నిత్యం ఉండే మన మిత్రులు, ఆత్మీయులు, బంధువులు ఇలా అందరిలో మేకవనె్న పులులు ఉండనే ఉంటాయి. పైకి మాత్రం మన కోసం ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ లోపల వారికి కావాల్సిన ఆనందాన్ని వెతుక్కుంటూ కాలం గడిపేవారు చాలామంది సమాజంలో మనకు రోజూ తారసపడుతూ వుంటాయి. వాస్తవంగా ప్రతి మనిషిలో భిన్నపార్శ్వాలు ఉంటాయి. మనకు కనిపించే మనిషి వేరు. అతనిలో వుండే మరో మనిషి వేరు. మనం ఇలాంటి వారితో వాస్తవానికి దగ్గరగా కాకుండా వాస్తవంలోకి వెళ్లి నిశిత పరిశీలన చేసుకోవడం అవసరం.
- అనుపమ, కస్తూరిబా మెమోరియల్ ట్రస్టు, నెల్లూరు
- సాకె హేమంత్, కావలి

ఆభరణం విలువ వెలకట్టలేనిది
మెరుపులో ప్రచురితమైన ఆభరం కవిత చాలా విలువైనది. మనిషి ఎలా వుండాలో చెప్పిన తీరు సూపర్. తన చుట్టూ ఉన్న వారిలో నవ్వులు పూయించడమే కదా నిజమైన ఆనందం... అదే నిజమైన వ్యక్తిత్వానికి ఆభరణం. ఒక వ్యక్తికి తనదైన వ్యక్తిత్వమే అసలుసిసలైన ఆభరణం. గొప్ప వ్యక్తిత్వం ఉంటే ఆ ఆత్మసంతృప్తి వేరు.
- ఆశం సాయి, సూళ్లూరుపేట
- తన్మయజ్యోతి, ఒంగోలు

ప్ర.ర.స. స్వర్ణోత్సవ కథనం బాగుంది
మెరుపులో ప్రచురించిన ప్రకాశం జిల్లా రచయిత సంఘం స్వర్ణోత్సవాల కథనం బాగుంది. మూడురోజుల పాటు ఒంగోలులో నిర్వహించిన స్వర్ణోత్సవాల విషయాలను విపులంగా విశదీకరించారు. అలాగే అక్కడ విరబూసిన కవితల్లో కొన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు.
- మానస, ఒంగోలు, రాంబాబు, కనిగిరి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

గాంధీ వర్ధంతి సందర్భంగా

ఇది మా నవత
మహాత్మా! నీవు మాలో లేకున్నా
మాతో రాకున్నా రాలేకున్నా
నీ కథ మా ఎద కాన్వాసుపై మాసిపోని చిత్రం
ముక్కంటికి మూడుకళ్లు దైవత్వం అనుకుంటే
నీ స్వాతంత్య్రానికి మూడుకళ్లు
ఆత్మపరిశుద్ధత, హిందూముస్లిం సఖ్యత, ఖద్దరు.
మనిషి శివుడవడమే నీ మానవత
మానవుడు మారీచుడవడమే మా నవత
హరిజనులకు ఆలయ ప్రవేశం.. సమాన గౌరవం
నీ అభిమతం
హత్యాకాండతో ఉచ్ఛజాతి దురహంకార ప్రదర్శన
కొందరి అమానుషత్వం
స్వదేశీ వస్తు విక్రయం విదేశీ వస్తు బహిష్కరణ
నీ అభిమతం
అప్రాచ్యుల అనుకరణ, విదేశీ దుస్తులకు విధేయత
మా అభిమాతం
స్వాతంత్య్ర సముపార్జనా భగీరథ ప్రయత్నంలో
సత్యాగ్రహమే నీ ఆయుధం
ఆర్జించిన స్వాతంత్య్రాన్ని అట్టి పెట్టుకోవడం
హెర్క్యూలియన్ టాస్కు మాకు
సత్యంతో నిత్యం ప్రయోగం నీ శాస్త్రం
సురాధిపత్యం కోసం అనునిత్యం హింసే మా అస్త్రం
శత్రు వాత్సల్యమే నీ మానవత
విషపూరిత రాజకీయ మైత్రియే మా నవత
మద్యపాన నిషేధంతో మానవ మస్తిష్కాన్ని
మరమ్మతు చేయాలనుకున్నావు కాని
మధుపాన శాలలను తెరిచాం నీ పేర
మధుపారుూలను పెంచాం ఊరూరా
ఇది మా నవత
సమతా, మమతా, మానవతా దృష్టితో
చెప్పాలనుకున్నది చెప్పావు
తలబొప్పి కడితే కనువిప్పు కావడం మానవత
తలబొప్పి కట్టినా కాని కనువిప్పు కాకపోవడం
మా నవత.

- వేదం సూర్యప్రకాశం,
చరవాణి : 9866142006

మనోగీతికలు

నిష్టుర సత్యం
ఓ మనిషి ఆగి చూడు లోకాన్ని
ఆగాక తిరిగి చూడు నీ గతాన్ని
ఎంత దూరము పయనించావో
ఎన్ని అనుభవాలు దాటొచ్చావో
తెలిసోస్తుంది, నీకు తెలివొస్తుంది

తప్పులెన్నో చేసుంటావు
తప్పటడుగులే వేసుంటావు
దారితప్పి నడిచుంటావు
దారిలోకి తిరిగొచ్చుంటావు
చెప్పుడు మాటలు విని చెడివుంటావు
మంచి మాటలు విని మారుంటావు
ఆశలు చూపి, బాసలు చేసి
అరచేత వైకుంఠం చూపుంటావు
అనిపించిందా? నీకు సిగ్గనిపించిందా.

అవసరాలకు వేడుకుంటావు
కాళ్లావేళ్లా పడి వుంటావు
కాలం కర్మం కలిసొచ్చాక
కాళ్లు పట్టి లాగుంటావు
దిక్కులేని నాడు దిక్కయినవారిని
దిక్కులేక చేసుంటావు
నీ దిక్కున్న చోటికి పొమ్మనుంటావు
అనిపించిందా! ఛీ యిదా నాబ్రతుకనిపించిందా!
కాళ్ల సత్తువ నాడు కండకావరం
కుప్ప కూలిననాడు జ్ఞానోదయం
కలిగొచ్చిందా! నీకు కనువిప్పయిందా!

ముందుగనే వుండాలి
ముందుచూపు అన్నది
కాలిన పిదప చేతులకు ఆకులెందుకన్నది
అనిపించిందా, నీ తలతిరిగిందా!
వృద్ధాప్యవేదాంతం, శ్మశాన వైరాగ్యం
యిదే మనిషి బాగోతం
అనిపించిందా? నీకు బుద్దొచ్చిందా!

- బాలు, నెల్లూరు, చరవాణి : 9866140700

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882

merupunlr@andhrabhoomi.net

- పెండ్యాల గాయత్రి