నెల్లూరు

మధ్యతరగతి అనురాగం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి పనులు చక్కదిద్దుకుంటూ కుటుంబాన్ని శ్రీవారి సంపాదనతో నడిపించుకొస్తున్న గణపతి గారి భార్య రమ. గణపతి వృత్తిరీత్యా చిరుద్యోగం చేస్తున్నప్పటికీ అతని విద్యార్హత ఇంజనీరింగ్. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి ఉద్యోగం కంటే పెళ్లి చేసుకోవడం చాలా సులభం అని గ్రహించి పెళ్లి చేసేసుకున్న తెలివైనవాడు గణపతి. పెళ్లి అయితే కట్నం వస్తుంది, దాంతో ఎలాగోలా బతికేయొచ్చు అనుకున్న గణపతి తెలివిని చూసి అతని మిత్రులు ముక్కున వేలేసుకున్నారు. కానీ గణపతికి ఇచ్చిన కట్నం పెళ్లి ఖర్చులకు పోను మిగిలింది అప్పులకే సరిపోయింది. సరే అప్పులయినా తీరిపోయాయిగా అని గణపతి అనుకుంటుండగానే భార్య నెల తప్పింది. భార్యను పుట్టింటికి పంపేశాడు. చదువుకు తగిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తే రోజూ పస్తులుండాల్సి వస్తుందని గ్రహించిన గణపతి ఒక రైసుమిల్లులో గుమస్తా పనికి చేరాడు తప్పనిసరి పరిస్థితుల్లో. గణపతి అమ్మ, నాన్న ముసలోల్లేమీ కాదు. నలభై ఆరేళ్ల వయస్సున్న వాళ్ల నాన్న ఇంకా ఏదో ఒక పని చేస్తూనే వున్నారు. భార్య వచ్చేలోపు గణపతి తన జీతం మరియు తండ్రి జీతం రెండింటితో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, కొంచెం వెనకేస్తున్నాడు. సంవత్సరం తిరగక ముందే భార్య, బిడ్డతో సహా ఇంటికి వచ్చేసింది. గణపతి ఇంట్లో ఇప్పుడు మొత్తం ఐదుగురు అయ్యారు. రెండు జీతాలు చాలట్లేదు. కాబట్టి గుమస్తా పనిచేస్తూనే అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలకు వెళ్తుండేవాడు. అత్తతో రమ ఎంతో ప్రేమగా ఉంటూ పనులన్నీ చేసేది. అత్తగారు కూడా కోడలిని కూతురిలా చూసుకొనేది. అలా రెండు, మూడు సంవత్సరాలు రెండు చిన్న జీతాలతో నెట్టుకొచ్చారు. ఒకరోజు గణపతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. నెలకు జీతం నలభై వేలు. గణపతి ఆనందానికి అవధులు లేవు. రమ అయితే ఎగిరి గంతేసింది. అప్పుడే మొదలయింది అసలు కథ.
వారం పదిరోజులు గడిచాక ఒకరోజు గణపతి వాళ్లనాన్న గణపతిని పిలిచి ‘‘నేనింక పనిచేయలేను, వయసయిపోయిందిరా’’ అని అన్నాడు. గణపతి నీ ఇష్టం నాన్నా అంటూ, రమ వైపు చూశాడు. రమ కోపంగా ‘‘అందరం తిని కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది మామయ్యా’’ అని దెప్పిపొడుస్తూ పడక గడిలోకి వెళ్లి తలుపేసింది. గణపతి మట్టిపాములా అక్కడి నుంచి పడక గదిలోకి కదిలాడు. అప్పటి నుంచి రమ గణపతిని వేరుకాపురం పెడదామని నసపెట్టింది. గణపతి మనసులో ‘‘ ఒక్కగానొక్క కొడుకుని, అమ్మానాన్న ని ఎలా వదిలి వెళ్లాలి’’ అనుకుంటూ నిద్రపోయాడు. గణపతికి మనశ్శాంతి లేదు. రోజూ ఇంట్లో ఏదో ఒక గొడవ. ఏం చేయాలి? అని ఆలోచించిన గణపతి ఒకరోజు వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి ‘‘నాన్నా! ఇక్కడి నుంచి ఆఫీసుకెళ్లి రోజూ జర్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేనూ, రమ ఆఫీసువాళ్లు ఇచ్చే క్వార్టర్స్‌లో ఉంటాం. కాదనకు నాన్నా’’ అని అడిగేశాడు. వాళ్ల నాన్న నవ్వి ‘‘నాయనా! నువ్వు పుట్టకముందు నేను మీ అమ్మే ఉండేవాళ్లం, నువ్వు పుట్టాక పెంచి ఇంతవాన్ని చేశాం, నీకిప్పుడు రెక్కలొచ్చాయి. నువ్వెడికైనా వెళ్లు. మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషం’’ అని అంటూ మనసులో బాధతో ఆశీర్వదించి పంపాడు. గణపతి, రమ ఆఫీసుక్వార్టర్స్‌లో చేరారు. చేరాక వాళ్ల లైఫ్‌స్టైలే మారిపోయింది. వచ్చే జీతం నలభైవేలు అదృశ్యమైపోతూ ఉంది. కళ్లు మూసి తెరిచేటప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. రమ ఇప్పుడు ఆ క్వార్టర్స్ అన్నింటికీ కలిపి మహిళా మండలి అధ్యక్షురాలు. బస్సు ఊర్లు తిరిగిన చందంగా గణపతి ఎదుగూబొదుగూలేక ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకి బస్‌ట్రిప్‌లు చేస్తున్నాడు. రమ ఇంట్లో పిల్లవాన్ని చూసుకుంటూ మహిళామండలి దాకా ఎదిగి ఏదో సాధించినట్లుగా భావించి గణపతిపై చులకన భావం పెంచుకుంది. గణపతి మాత్రం భార్య గీచిన గీతదాటే వాడు కాదు. ఒకరోజు రమ గణపతితో ‘‘ ఏవండీ! అత్తామామా ఎలా ఉన్నారో చూసొద్దాం’’ అంది. గణపతి ఆనందంతో అలాగే వెళ్దాం అన్నాడు. తర్వాత రోజు సొంత ఊరికి వెళ్లారు. అక్కడ గణపతివాళ్ల ఇళ్లే లేదు. ఊళ్లో విచారిస్తే ‘‘ మీ నాన్న గారికి ఆరోగ్యం బాగా లేక ఇల్లు అమ్మి ఆసుపత్రిలో ఉన్నాడు’’ అని చెప్పారు. రమ, గణపతి బాధపడి ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి నుండి ఇంటికి వచ్చేశారు. గణపతి నాకు ఆఫీసులో అర్జెంటు వర్కు ఉంది అని రమతో చెప్పి ఆఫీసుకెళ్లాడు. ‘‘సర్లేండీ! ఆసుపత్రి పేరు కూడా తెలియదు. తర్వాత చూద్దాంలెండి, వెళ్లిరండి’’ అంటూ ఓదార్చి ఊరుకుంది.
కొన్ని రోజులు గడిచాయి. పిల్లవాడిని ఏదో ఒక స్కూళ్లో చేర్చాలని అనుకున్నాడు గణపతి. ఫ్రెండ్‌కు తెలిసిన స్కూల్లో అయితే బాగా చెప్తారని వివరాలు తెలుసుకొని వచ్చి రమకి చెప్పాడు. అప్పుడు రమ నేనెవరు మహిళా మండలి అధ్యక్షురాల్ని. మీరెవరు పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మన పిల్లాడు ఎలాంటి స్కూల్లో చదవాలి..అని బీరాలు పలికి ఇంటి నుంచి 30కి.మీ. దూరంలో ఉన్న స్కూళ్లో చేర్పించారు. అప్పటి నుంచి రమ పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఉదయానే్న లేచి పిల్లాడికి క్యారియర్ కట్టాలి. మధ్యాహ్నం గణపతికి భోజనం ఏర్పాటుచేయాలి. సాయంత్రానికి మళ్లీ పిల్లాడు వచ్చేస్తాడు. స్నానం చేయించి అన్నీ పనులు చేయాలి. ఇంక మీటింగులెప్పుతు, బాతాఖానీ ఎప్పుడు కొట్టాలి. అదే పెద్ద బాధయిపోయింది రమకి. అప్పుడంటే పిల్లాడ్ని చంకలో వేసుకొని వెళ్లిపోయేది. సాయంత్రం అయ్యేదాకా మీటింగులో ఉండి నిదానంగా వెళ్లి వాడికి బొమ్మలు ఇచ్చి పనులు చేసుకొనేది. ఇప్పుడలా కాదే వాడిచేత హోంవర్కు చేయించాలి, కాసేపు చదివించాలి. పనులన్నీ చేయాలి. రెండు నెలలకే అలసిపోయింది రమ. పనిమనిషిని పెట్టుకుందామంటే గణపతికి నచ్చదు. ఎలా? అనుకుంటూ ఆలోచనలో పడింది. అత్తామామని మనింట్లో ఉండనిచ్చి ఉంటే ఇప్పుడీ బాధ ఉండేదికాదు కదా అని బాధపడి ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అనుకుంది. గణపతి రాగానే ‘‘ ఏవండీ! అప్పుడెప్పుడో ఆసుపత్రికెళ్దామన్నారు, అత్తామామా ఎలా ఉన్నారో? రేపు వెళ్దామా’’ అంది రమ. అప్పుడు గణపతి ‘‘నిన్నటిదాకా లేని ప్రేమ ఇవాళ ఎలా వచ్చింది అత్తామామ మీద, ఓహో ఇంట్లో పనిచేయలేనప్పుడు గుర్తొచ్చారా...’’ అన్నాడు. కసిరినట్లు మాట్లాడేసరికి రమ ఆశ్చర్యపోయి ‘‘అదికాదండీ! పాపం అత్తామామా ఎలా ఉన్నారోనని’’ అంది. గణపతికి కోపం వచ్చి చెంప చెల్లుమనిపించాడు. రమ ఎదురుతిరిగి ననే్న కొడతావా నేను మహిళామండలి అధ్యక్షురాల్ని ఏమనుకుంటున్నావో’’ అంది. గణపతి అప్పుడు ‘‘సరే నువ్వు మహిళామండలి అధ్యక్షురాలివి, నిజమే! మహిళల సమస్యల్ని తెలుసుకోవాల్సిన నీకు మా అమ్మపడే ఇబ్బందులు తెలియలేదా, భవిష్యత్‌లో మనిద్దరి పరిస్థితి కూడా ఇంతేగా, ఆలోచించాలిగా’’ అన్నాడు. రమ ‘‘నేనేం చేశాను’’ అంది. ‘‘నువ్వేం చేయలేదు డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగావు అదే నువ్వు చేసిన పాపం అందుకే నీ బుద్ది ఇలా ఏడ్చింది’’ అన్నాడు గణపతి. రమకి హృదయం చలించింది. ఆపుకుందామనుకున్నా ఆగలేదు. గట్టిగా ఏడ్చేసింది. భర్తని కౌగిలించుకుంది. ‘‘ననే్నం చేయమంటారు, నాకు బుద్దొచ్చింది ఇంక వేరుగా ఉందామని అనను’’ అంటూ లెంపలేసుకుంది. గణపతి రమ తలను నిమురుతూ ‘‘కొడుకుగా నా తల్లిదండ్రుల సమస్యలు కలిగిన ఇంట్లో కాలు కింద పెట్టనివ్వకుండా సౌకర్యాలు కల్పించి క్షేమంగా ఉంచాను తెలుసా నీకు’’ అన్నాడు. నాకు చెప్పకుండా ఇంత చేశారా అంది రమ. అప్పుడు గణపతి ‘‘రమా! నీకు పెద్దవాళ్ల అవసరం తెలియాలనే అలా చేశాను. అవసరం వచ్చేవరకు మనిషి విలువ తెలియడం లేదు నేటితరానికి. నేను మధ్యతరగతి కుటుంబంలో పెరిగి, ఎన్నో కష్టాలు అనుభవించి ఈస్థాయికి వచ్చాను కాబట్టి నా తల్లిదండ్రుల మీద కొంచెమైనా కనికరం కలిగింది. మనం ఆరోజు ఊరి నుంచి వచ్చాక హాస్పిటల్‌కి వెళ్లి వాళ్లని రక్షించుకోగలిగాను. అదే నీలా ఉన్నతస్థాయిలో పెరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకొనేందుకే భయంగా ఉంది అని గణపతి జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు. రమ ‘‘ ఉన్నతస్థాయి వారంతా అలాగే ఉండాలని సిద్ధాంతం లేదండీ, నేను అలా తయారయ్యాను అనంది.. అంతేగానీ అందరికీ ఆపాదించకండి’’ అంటూ భర్త చేతులు పట్టుకుని ఏడ్చింది. అప్పుడు గణపతి సరేలే నీ పెంపకం అలాంటిదని నువ్వే ఒప్పుకుంటే నేను చేయగలిగేది ఏముంది . కానీ ‘‘రమా! లోకజ్ఞానం తెలుసుకొని గౌరవప్రదమైన కుటుంబ వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత నా భార్యగా నీపై ఉంది’’ అంటూ కౌగించుకున్నాడు. రమ అప్పటి నుంచి అత్తామామలని తల్లిదండ్రుల్లానే చూడసాగింది. అంతా కలిసిమెలసి కుటుంబంలో చక్కగా జీవించసాగారు.
డబ్బు ఎంత ఉన్నప్పటికీ అనురాగాలు, మమకారాలు, ఆప్యాయతలు లేకపోతే మనిషి జీవించడు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది అనురాగం. ఆప్యాయత...

- యర్రాబత్తిన మునీంద్ర,
నాయుడుపేట
చరవాణి : 8331844527

స్పందన

మనసు మంచిదేతై కథ బాగుంది
గత వారం మెరుపులో ప్రచురించిన మనసు మంచిదైతే కథ చాలా బాగుంది. అవ్వారు శ్రీ్ధర్‌బాబు గారి కథ చదివి చాలా కాలామైనా ఈ కథను చదివిన తర్వాత ఆ భావం తొలగింది. రొటీన్‌కు భిన్నంగా మరీ ఉపోద్ఘాతంలా కాకుండా నిడివి తక్కువున్న కథలో మంచి సందేశాన్ని చొప్పించడం శ్రీ్ధర్‌బాబు ప్రత్యేకం. ఇక ఈ కథలో ఏమీ తెలియని అమాయకపు సాయిలమ్మ, రాములమ్మ సంభాషణలు ఆకట్టుకున్నాయి. చివరకు కథను ముగించిన తీరు బాగుంది. నిజంగా మనసు మంచిదైతే అంతకన్నా కావాల్సింది ఏముంది ఈ సమాజంలో.
- రాజోలు కార్తీక్, సూళ్లూరుపేట
- జంపని రమ్యశ్రీ, డి ఆర్ డబ్ల్యు కళాశాల, గూడూరు

వర్షపు జాడల కవితలు బాగున్నాయి
మెరుపులో ప్రచురించిన ప్రకృతి ప్రకోపం, స్పందించిన హృదయాలకు అభివందనం కవితలు రెండు విభిన్న శైలిలో సాగినా దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. చెట్లు అంతరించిపోతున్నాయనే బాధతో రచయిత కుర్రా ప్రసాద్‌బాబు రాసిన ప్రకృతి ప్రకోపం కవిత ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది. ఇక వేదం సూర్యప్రకాశం గారు రాసిన స్పందించిన హృదయాలకు అభివందనం కవిత కూడా ఈ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందా అనే ధోరణిలో వున్నవారికి ఇంకా ఉంది..కాబట్టే చెన్నై మహానగరం నిలబడింది అని చెప్పకనే చెప్పింది. నిజంగా చెన్నపట్టణంలోని వరదబాధితులకు సాయపడిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు.
- ఇల్లేందు శైలజ, కస్తూరిబావి సందు, తిరుపతి
- కొరివి సాయిబాబు, నెల్లూరు

జాగృతులు కావు..
దిశానిర్దేశాలు
మెరుపులో రవీంద్రబాబు రాసిన జాగృతులు కవిత నిజంగా ఎంత గొప్పగా సాగింది. ఒక విలక్షమైన భావాలు గల రచయిత రవీంద్రబాబు. గతంలో ఆయన కవితలు చదివిన తరువాత మళ్లీ ఈ కవితను చదివితే అబ్బా.. ఈయన ఇంతే ఎప్పుడూ గొప్పగానే రాస్తారనే భావనకు వచ్చేశాను. అసలు ఆయన రాసింది జాగృతులు కావు దిశానిర్దేశాలు. ప్రతి పదం సమాజానికి మార్గనిర్దేశనం.
- మంత్రి ఉమామహేశ్వరరావు, అద్దంకి

అమ్మో...కళ్లు...
నిజంగా కళ్లల్లో ఇంత కవిత్వం ఉందా? అని సిరిమామిళ్ల కోటేశ్వరరావు గారి కవిత చదివితేనే తెలిసింది. రచయితకు ఏదైనా కవిత్వానికి పనికొచ్చే వస్తువే. మెరుపులో ప్రచురించిన కళ్లు కవిత చదివిన తరువాత మన కళ్లల్లో ఇన్ని భావాలున్నాయి. మన కళ్లల్లో కుళ్లు లేకుండా ఉండాలనే భావనతో సాగిన కవిత బాగుంది.
- ఇసనాకుల మల్లికార్జున, రాపూరు

మనోగీతికలు

మేలుకో...!
నమ్మి నానబోస్తే
పుచ్చి బుర్రలైనట్టు
నిత్యం నువు మోసపోతూనే వున్నావు
బాగుపడతావు విను
నే చెప్పినట్టు
సకల సుఖాలు సమకూర్చిన
సతి ముఖం పసిడి పువ్వులా
పకపకా నవ్వు!
ఏది లోపించినా
మాడిన పెంకులా
చీకట్లనే రువ్వు
ప్రేమ నిలువదు ఎంత తపన పడ్డా నువ్వు!
కొడుకు పుట్టగానే
చంకలెగరేసి
కులముద్ధరిస్తాడని తలపోసి
పోతావు మురిసి మురిసి
నీకు అడ్డేలేదని అరిసి
చెప్పుకోలేని వడ్డీలకు
అప్పులు చేసి తిప్పలు పడి
చదివించి మంచి ఉద్యోగస్తున్ని చేసి
ఏనుగెక్కినంత సంబరంతో
మావాడికి మంచి అందమైన
తెలివైన మనసు, ధనము,
ఉద్యోగము వున్న
అమ్మాయి కావాలని
మా వాడికి ఎంత కట్నం యిచ్చినా
తక్కువేనని బిల్డప్పులు కొట్టి
ఒక్కమాట నిజం చెప్పని
పేరయ్యలను మేపి మేపి
స్వయంగా కొన్ని ఊర్లు తిరిగి
తిరిగి ఆపి
చివరకు కొన్ని కోల్పోయి
ఎలాగైతేనేం
పెళ్లి బ్రహ్మండంగా చేస్తావు
అమ్మాయి తండ్రి ఖర్చులతో..

కాలం గడిచే కొలది
కాళ్లకు అడ్డాలౌతుంటావు
ఓ శుభ సమయాన
అందరికీ చాకిరీ చేయలేక
ఆ మనిషి ఆరోగ్యం క్షీణిస్తుందని
కొడుకు తెల్లముఖం వేస్తే
నువు నల్లముఖం వేస్తావు
ఎవరి దయ వల్లో ఆస్తిహక్కు
చట్టం వచ్చింది
ఆపిల్ పండులా ఆస్తిని కోసి
అందిన వరకు పీడించి దోచుకుని
తమను చూడమంటే
కొడుకు కదా చూడాలి
ఒకవేళ పోనీలే అనుకున్నా
ఆయనకు ఇంటినిండా
మనుషులంటే చిరాకు
నడిచేటప్పుడే దయచేయండని
వృద్ధాశ్రమానికి దారిచూపి
చనగలు తిని చేయి
కడుక్కుంటుంది
పొద్దుపోయినా ఇంకా రాలేదని
కళ్లు కాయలు కాచేలా
ఎదురుచూసిన ముద్దుల కూతురు!

దిక్కుతోచక చూస్తావు ఆకాశం
కనిపించే ప్రేమంతా మోసం
ఎవ్వరూ పాటుపడరు నీకోసం
నేడు మనుషుల పద్ధతులు మారాయి
స్వార్థపు బుద్ధులు దూరాయి
మనసులౌతున్నాయి బండరాయి
నీ కాళ్ల మీద నిలబడు
అప్పుడే కలుగు నీకు హాయి..!

జంజం కోదండరామయ్య,
జమ్మిపాళెం
చరవాణి : 8985938861

సచిన్ స్ఫూర్తితో..
నా చేతిలో వున్న బ్యాటుతో
అప్పుడప్పుడు ఫోర్లను లాగించేస్తాను
ఎప్పుడైనా సిక్సర్ కూడా కొట్టేస్తాను..

బ్యాటుతో ఆడేటప్పుడు
తదేక దృష్టితో చూస్తుంటాను
శ్వాసను సైతం బిగపడతాను..

స్కోరు ఒక్కోసారి తగ్గినా
ఆత్మ విశ్వాసాన్ని సడలిపోనివ్వను
విశ్వ ప్రయత్నాన్ని విరమించుకోను..

నేను బ్యాటు పట్టుకుంటే
సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి గుర్తొస్తుంది..
కపిల్‌దేవ్‌లోని కసి ఉసిగొల్పుతుంది..
అయినా..
నా దెబ్బతో అబ్బా అనిపించాలనే
అనుక్షణం ఆరాటపడుతుంటాను..

నేను బ్యాటుతో కొట్టేటప్పుడు
తలకు హెల్మెట్ పెట్టకోను
కాళ్లకు లెగ్‌ప్యాడ్స్ కట్టకోను
చేతులకు గ్లవుజులు వేసుకోను
ఎందుకంటే.. నా మీద నాకు నమ్మకం
ఏదొచ్చి తగిలినా ఎదురునిలుస్తాను
ఎటొచ్చీ చివరికి నేను గెలుస్తాను
ఎందుకో తెలుసా? నేను పట్టుకున్నది
మామూలు క్రికెట్ బ్యాట్ కాదు
అదొక ఫటాఫట్ దోమల బ్యాట్!

బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
చరవాణి : 9885481939

చిరు కవితలు

స్మృతిచిహ్నాలు
రంగురంగుల సినీ ఆకాశంలో
అర్ధాంతరంగా
తనకు తానుగా రాలిపోయింది
ఆ నక్షత్రం
కంటికి కనపడని ఆ విధి
మృత్యు వలను అల్లుతుందో
లేక మనసు సాలీడు స్వయంగా
అల్లుకుంటుందో
ఒంటరితనమో, అసంతృప్తో
ఏది ఏమైతేనేం
ఆ బలహీన క్షణంలో
ఆ కళాకారుడు తన ఊపిరిదీపాన్ని
ఊదేసుకున్నాడు
కీర్తిమంచుకొండను
కొన్ని కన్నీటిబొట్లను
ఈ లోకంలో వదిలిపెట్టి...!
(సినీనటుడు రంగనాథ్ మృతికి
అక్షర నివాళి)

మోపూరు పెంచలనరసింహం, నెల్లూరు
సెల్ : 9346393501

సరికాదెంత మాత్రము
జీవన గమనంలో కష్టనష్టాలతో కూడిన
ఒక్క సన్నివేశానికి కలత పడిపోయి
జీవితాన్ని చాలించాలనుకుంటే
సరికాదు అదెంత మాత్రమూ..!
అనేక సన్నివేశాల జీవితంలో
ఆనందాలు పంచు సన్నివేశాలు ఎన్నో ఉంటాయి..
మనోధైర్యంతో ముందుకెళితే
సుఖ, సంతోషాలకునెలవై తీరుతాయి..
సందేహం వలదు
ఒక సన్నివేశంలో కలత నిద్రకు కారణమయ్యే
వౌనమే..మరో సన్నివేశంలో
గాఢనిద్రకు తోడవుతుంది కదా!

కొండూరు వెంకటేశ్వరరాజు, చరవాణి : 9492311048

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- యర్రాబత్తిన మునీంద్ర