నెల్లూరు

గెలిచిన మనసు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ కథల్లో సస్పెన్స్ అద్భుతంగా ఉంటుందండీ’’ అంది రాగిణి, నన్ను ఆరాధనగా చూస్తూ.
చిన్నగా నవ్వాను.
‘‘సాధారణంగా స్ర్తిలు క్రైం సాహిత్యం అంతగా చదవరేమో! కానీ, నేను మాత్రం మొదటి నుంచీ మీ కథలూ, నవలల్నీ రెగ్యులర్‌గా చదువుతున్నాను. మొదటిసారిగా మీరు రాసిన ‘వెంట్రుకతో ఉరి’ అనే కథని వెదకి పట్టుకుని చదవటానికి నేనెంత కష్టపడ్డానో చెబితో మీరాశ్చర్యపోతారు. అది సుమారు పాతికేళ్ల క్రితం ‘గలభా’ అనే మాసపత్రికలో అచ్చయిన కథ. దానిని గురించి మీరొక ఇంటర్వ్యూలో చెప్పగానే.. నేను స్వయంగా హైదరాబాద్‌కి బయల్దేరాను. పత్రికల వారిని కలిసి, ఫోన్లు చేసీ నానా హైరానా పడి చివరికి ఆ కథని ఒక రచయిత దగ్గర సంపాదించగలిగాను. అదీ మీ మీద నాకున్న అభిమానం...’’ అంది రాగిణి. తన కృషికి నా నుండి ఏదో మొప్పు ఆశిస్తున్నట్టుగా నా కళ్లలోకి చూస్తూ.
‘‘గుడ్’’ అన్నాను.. కాఫీ కప్పు ఆమె ముందు పెడుతూ.
‘‘మీరు కాఫీ తాగరా?’’ అంది రాగిణి కప్పు అందుకుని సిప్ చేయబోతూ.
‘‘లేదు.. నాకు ఎలాంటి అలవాట్లూ లేవు..’’ అన్నాను..తలకి చుట్టుకున్న మఫ్లర్ సరి చేసుకుంటూ.
ఈదురుగాలి కిటికీలో నుండి దూసుకువస్తున్నపుడల్లా రాగిణి చిగురుటాలా వణికిపోతోంది. కానీ, తను ఆ బాధని పైకి వ్యక్తపరచడం లేదు.
‘‘మీరొక్కరే ఉన్నారింట్లో... మీ భార్యాపిల్లలూ?...’’ అడిగింది చుట్టూ చూస్తూ.
‘‘బ్రహ్మచారిని... నాకెవరూ లేరు..’’ అన్నాను.
‘‘ఓహ్.. మీ కథల్లో లీలగా కనిపించే శృంగారం అంతా ఊహాజనితమేనా?’’ అంది అదోలా చూస్తూ.
‘‘లేదు.. కొంత ప్రాక్టికల్ కూడా...’’
‘‘అంటే? మీరు స్ర్తిలతో సంబంధాలు కలిగి ఉన్నారా?’’ అంది - ఏ భావమూ వ్యక్తం కానీయకండా.
‘‘సంబంధం అంటే.. ఏమీ ఉండదు.. ఒక అనుభవం నుంచి ఒక ప్రేరణ.. అంతే.. ఆ చిన్న ఎక్స్‌పీరియన్స్ నుండి ఏదో ఒక కథ పుడుతుంది’’ అన్నాను.
‘‘అంటే.. వారంతా డబ్బు తీసుకుని.. మీతో గడపడానికి వచ్చేవారా?’’
‘‘అదేంలేదు.. శారీరక సంబంధానికి డబ్బు కంపల్సరీగా చెల్లించాల్సిన అవసరం ఏమీ ఉండదు’’.
రాగిణి కప్పు టీపాయ్‌పై పెట్టి కాసేపు వౌనంగా ఉంది.
‘‘నేను ఎన్నోసార్లు నా అడ్రస్ క్లియర్‌గా తెలియబరుస్తూ మీకు ఉత్తరాలు రాశాను.. వాటికి మీ నుండి సమాధానాలే రాలేదు. ఆడపిల్ల ఉత్తరంలో అడ్రస్ రాశాక కూడా ..మీరు కామ్‌గా ఉండిపోయారంటే..మీకు కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయని అర్ధమవుతోంది...’’ అంది రాగిణి.
‘‘స్వయంగా నేనే అక్కడికి వచ్చి చిక్కుల్లో ఇరుక్కోవడం దేనికి? అవసరమా? ఇప్పుడు నువ్వే నా వద్దకు వచ్చావుగా..’’ అన్నాను.. నా ముఖంలో ఏ భావమూ కనబడనీయకుండా.
రాగిణి నవ్వింది.
‘‘నాకు మీరనుకునే ‘ఆ’ ఉద్దేశ్యమేమీ లేదు. నేను మీ అభిమానిని. మీ వద్ద బోలెడు ప్లాన్స్ ఉన్నాయి... అవి ఎవరి బుర్రకూ తట్టనివి. నాకు మంచి సహాయం కావాలి.. అందుకే మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చాను’’ అంది.. మాటలు తడబడకుండా...
‘‘ ఏమిటది?’’ అన్నాను సిగార్ వెలిగించుకుంటూ..
‘‘నేనొక మర్డర్ చేయదలచుకున్నాను. అది కూడా ఇప్పుడే.. ఇక్కడే.. నాగురించి ఎలాంటి క్లూస్ దొరక్కూడదు... చెప్పండి? ఎలా ఈ పని చేయాలి’’ అంది జంకూబొంకూ లేకుండా.
‘‘అంటే.. నువ్వు హత్య చేయదలచుకున్నది ననే్ననా’’? అడిగాడు. లోపల ఎక్కడో చిన్న భయం కదిలాడింది.
‘‘ఇంత చిన్న విషయం మీకు తెలియకపోతేనే ఆశ్చర్యం. మరో గంటలోగా నేను వెళ్లిపోవాలి. త్వరగా ఉపాయం చెప్పండి? ఎలా ఈ హత్య చేయాలి?’’
‘‘ఓకే.. చెబుతాను..కానీ, ననె్నందుకు హత్య చేయాలనుకుంటున్నావ్?’’ అడిగాను.. లేచి అటూ ఇటూ తిరుగుతూ.
‘‘సింపుల్.. మీ కథలు చదివి ఇన్‌స్పయిరయ్యాను. మా బావతో నా భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాను. మీ కథ ‘‘కిటికిలో కిలాడి’’లో చెప్పినట్లుగానే.. అతడిని తరచూ కలుస్తున్నాను. కానీ, నా భర్త ఈ గుట్టును కనిపెట్టాడు. అతడు నిన్నరాత్రి బాగా తాగి నాతో ఒక్క మాట చెప్పాడు..‘‘రాగిణి.. ఇది మన ముగ్గురికీ సంబంధించిన విషయం. నేను మీ బావను చంపగలను. నిన్ను కూడా చంపగలను. మీ ఇద్దరినీ చంపి, నేనూ చావగలను, కానీ..చిన్న విషయానికి ఇన్ని హత్యలు అవసరమా? ముగ్గురం చావడం అనవసరం కదూ...అందుకే నాకు ద్రోహం చేసిన నువ్వు చచ్చిపో.. నేను మరో పెళ్లి చేసుకుంటాను.. కథ సుఖాంతమవుతుంది’’ అన్నాడు చాలా కూల్‌గా.
నేను భయంతో వణికిపోయాను. నన్ను క్షమించమని నా భర్తను కోరాను. కానీ అతను నన్ను కనికరించలేదు. ఈ విషయం మా బావకి చెప్పాను. తను కూడా నన్ను చచ్చిపోమ్మనే చెప్పాడు. నేను బ్రతికుంటే నా భర్త తనని చంపేస్తాడని అతని భయమట.
ఇప్పుడు నా బ్రతుకు రెంటికి చెడ్డ రేవడి అయ్యింది. ఇటు భర్తా, అటు ప్రియుడూ ఇద్దరినీ కోల్పోయాను.. ఇద్దరూ ననే్న చచ్చిపోమ్మంటున్నారు... నాకీ దుర్గతి పట్టడానికి కారణం మీ కథలు. అందుకు బాగా ఆలోచించి.. మీ ఇల్లు వెదుక్కుంటూ వచ్చాను.
ఈ మాటలు చెబుతున్నంత సేపూ రాగిణి నా వంక తీక్షణంగా చూస్తూనే ఉంది. నేనెలాంటి పొరపాటు చేసినా.. ఆమె ఏదో ఒకటి చేయగలదని నాకు తెలుసు. అందులోనూ.. రాగిణి వద్ద ఏ ఆయుధాలు ఉన్నదీ పసిగట్టే ఛాన్స్ లేదు. ఆవిడ బురఖా వేసుకుని ఉంది.
అరగంట క్రితం ఆవిడ నా ఇంట్లో ప్రవేశించినప్పుడు. తన పేరు రాగిణిగా చెప్పడం వల్ల నాకామె పేరుమాత్రమే తెలుసు.
సోఫాలో కూర్చుని గట్టిగా ఊపిరిపీల్చి వదిలాను.
‘‘అయితే, నన్ను చంపుదామనే వచ్చావన్న మాట.. సరే.. నన్ను చంపాక నీ గమ్యం ఏమిటి?’’ చాలా నింపాదిగా అడిగాను.
‘‘మరికొన్ని కథలు చదువుతాను.. వాటి ప్రకారం నా భర్తనీ, నా బావనీ ఏ ఆధారమూ దొరక్కుండా చంపేస్తాను. అంతటితో నా పగ చల్లారుతుంది. అప్పుడు ఏవైనా మత్తుమందు తీసుకుని సముద్రంలో దూకి చచ్చిపోతాను’’ అంది రాగిణి - ఎలాంటి భావమూ ముఖంలో కనబడనీయకుండా.
‘‘అంటే.. మొత్తం నీతో కలిపి నాలుగు హత్యలు చేయాలని నీ ఆరాటం కదూ?’’!
తలూపింది ఆమె.
నాకు అప్పుడప్పుడూ ఇలాంటి కలలూ వస్తుంటాయ్. అవి కలలే అయినా ఒక్కోసారి కలవరపెడుతుంటాయ్.. కంగారు పెడుతుంటాయ్ కూడా.. అలా నిజంగా జరిగితేనో.. అనే భయం కూడా నాకు లేకపోలేదు... ఒక్కసారిగా ఈ కల నుంచి తేరుకుని ఉలిక్కిపడ్డాను. అబ్బో ఒక్కోసారి మనం రాసే కథలే కలలో వచ్చి పలు రకాలుగా కలవరపెడుతుంటాయి అనుకుని కలలో భయపెట్టిన రాగిణి పాత్రను ఊహించుకుని చిన్న నవ్వు నవ్వి తేరుకున్నాను.
పోస్ట్‌లో వచ్చే ఉత్తరాలు కూడా ఒక్కోసారి యాంగ్జయిటీని కలిగిస్తుంటాయ్. అన్నట్టు మీకు ఆ గులాబీ కవరు గురించి చెప్పి తీరాల్సిందే...
అయితే.. అప్పుడప్పుడూ ఆ గులాబీ కవరు ఉత్తరం గురించి కొంత ఉత్కంఠ అనేది కలుగుతూనే ఉంది.
అయినా ఆ విషయాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తూపోయాను.
వారం రోజులు గడిచిపోయాయ్... మరునాడు పోస్ట్‌లో మళ్లీ అదే రంగు ఉత్తరం.. అదే దస్తూరీ..
కవరు చించి చదవసాగాను.
‘‘పలకరింపులెందుకులే.. గుర్తుపట్టారుగా.. అయినా మీరింత పిరికివారని నేననుకోలేదు సుమా. జాంపండులాంటి అమ్మాయి... నిత్యామీనన్‌లాంటి నిగనిగలాడుతోంది. వలచి వచ్చి మీ ఎదురుగా నిలబడితే.. చిలకలా అందుకుని ఆకలి తీర్చుకోవాల్సిందిపోయి.. చేతకానీ వాడిలా చూస్తారా? మీ షాపుకే వచ్చాను.. మీరే ఈ ఇందుముఖిని గుర్తించలేకపోయారు.. మరోసారి ప్రయత్నించండి.. తెల్లని పాల నురగలాంటి సోయగం, తెల్లని గులాబీ రేకుల్లాంటి లేత యవ్వనం, తెల్లని మల్లెపువ్వులాంటి కోర్కెల పరిమళం.. అంతకుమించి తెల్లకాగితం లాంటి నా పరువం.. వీటికి సూచనగా తెల్లనిదేదో ఒకటి ఒంటిపై ధరించి వస్తా.. కమాన్ క్యాచ్ మీ..’’
ఉత్తరం కవరులోకి నెట్టేసి, టేబుల్ సొరుగులోకి గిరాటేశానా కవర్ని...
హూ... కవిత్వం ఒలకబోస్తే కరిగిపోవడానికి నేను సాదాసీదా మనిషినేం కాదు.. రచయిత ముందా కుప్పిగంతులా?
ఎవరో కావాలని చేస్తున్న పని ఇది. వ్యాపార శత్రువులా? దొంగ మొగుడు సినిమాలో చిరంజీవిని రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, అల్లురామలింగయ్య - పతనం చేయడం కోసం భానుప్రియని ఎరవేస్తారు.. అలా ఎవరైనా నన్ను వ్యాపారపరంగా దెబ్బతియ్యాలని చూస్తున్నారా? నన్ను ఏదోక విధంగా డీస్టర్బ్ చేయడానికి ఈ పన్నాగం పన్నుతున్నారా?
ఇలాంటి వాటికి లొంగేటంత బలహీనుణ్ణి, పిచ్చివాణ్ణి కాదు.. అనుకుంటూ ఆ విషయాన్ని అంతటితో మరచిపోయాను.
రెండు రోజుల తరువాత...
సాయంత్రం వేళ నా షాపు రద్దీగా ఉంది. సుమారు పాతికమంది ఆడవాళ్లు, ముగ్గురు యువతులు, కొంతమంది బామ్మలు - బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వర్కర్లు వాళ్లకి కావలసినవే చూపిస్తున్నారు. ఇంతలో ల్యాండ్ ఫోన్ మోగిన శబ్దం విని, ఫోన్ అందుకున్నాను.. అవతలి నుంచి మా బావగారు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ గురించి చెబుతుంటే ఊ..కొట్టసాగాను.
మధ్య మధ్యలో ఫోన్ పక్కనపెడుతూ కస్టమర్లకి బిల్లులు రాసి, క్యాష్ తీసుకుంటున్నాను. పది నిమిషాల తరువాత చటుక్కున గుర్తొచ్చింది.. రెండు నిమిషాల క్రితం షాపింగ్ చేసి వెళ్లిన వాళ్లలో ఒకరు తెల్లచీర, ఒకరు తెల్లని చూడీదార్ ధరించి ఉన్నారన్న విషయం.
గబుక్కున కూర్చీలోంచి లేచి, బయటికి వెళ్లి చూడాలన్న ఆతృత అణచిపెట్టేశాను. ఇలాంటి విషయాల్ని కంటిన్యూ చేయకూడదు.
యాంగ్జయిటినీ ప్రదర్శించకూడదు. అసలు ఆ అమ్మాయి గురించే ఆసక్తి లేనప్పుడు.. మళ్లీ ఆమె కోసం పరుగెత్తడమెందుకు? సరైన ఆలోచన కాదని విరమించుకున్నాను.
వ్యాపారంలో పడి ఆ విషయం అంతటితో వదిలేశాను.
మరునాడే మళ్లీ ఆవిడ ఉత్తరం అందుకున్నాను... ఈసారి ఉత్తరంలో ఏం ఉంటుందో అనే ఉత్కంఠతో గబగబా కవర్ చించి లోన ఉన్న కాగితాన్ని బయటకు లాగి చూశాను.
ఒకే ఒక్క వాక్యం ఉంది అందులో...
‘‘వెరీగుడ్.. కీప్ ఇట్ అప్..’’
ఆ వాక్యం వెనుక అంతరార్థం ఏమిటో బోధపడక ఆ లెటర్‌కేసి అలాగే చూస్తూండిపోయాను.
వెంటనే ఫోన్ మోగింది. మళ్లీ బావగారేమోననుకుని - ఈ టెన్షన్‌లో కొంచెం చీరాగ్గా ‘హలో’ అన్నాను.
‘హలో’! ఒక అపరిచిత మృదుస్వరం ‘‘మీ కథల్లో రొమాన్స్, శృంగారం ఎక్కువగా ఉంటాయ్.. అమ్మాయి, అబ్బాయి కొంచెం వీలు దొరకగానే సరసానికి దిగినట్టు - ఆ తర్వాత శృంగార ఘట్టం మధ్యలోనే ఆగిపోయి, ఇది తప్పు అని ఇద్దరూ తెలుసుకున్నట్టు - రాసిన కథలే ఎక్కువ... ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతాయా అసలు? మీరు ఇవన్నీ స్వయంగా చూసి, లేదా అనుభవించి రాసినవా? లేక కేవలం ఊహా కల్పితాలా? రచయితలు నిజజీవితంలోనూ ఇలాంటి బలహీనతలను కలిగి ఉంటారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికే మీకు ఉత్తరాలు రాశాను.. రాస్తున్నాను మరి.
కానీ, మీరు నిజజీవితంలో ఏ కల్మషమూ లేని వారని తెలుసుకున్నాను. మీ నిగ్రహం నాకు నచ్చింది. మిమ్మల్నిక ఇబ్బందిపెట్టే ఉత్తరాలు రాయను... బై... ఆఖరుగా మీ మనోనిబ్బరానికి నా అభినందనలు...’’
ఫోన్ పెట్టేసిందావిడ.
నేను తృప్తిగా ఫీలయ్యాను.. నాలోని రచయితకూ, నా వ్యక్తిత్వానికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. అది చాలు నాకు. నాకు నేను ముఖ్యం- చిల్లర బలహీనతలకు లొంగదు నా మనసు.
కుడిచేత్తో ఎడమ భుజం మీద తట్టుకున్నాను.. ‘శభాష్’ అంటూ.
అది గమనించి - మా షాపులోని సీనియర్ సేల్స్‌మేన్ సప్పరం పెంచలయ్య - ‘‘ఏంటి సార్ - ఏదైనా విశేషమా?’’ అని అడిగాడు నా ముందుకొచ్చి.
ఇలాంటివి ఎలా చెప్పను? ‘‘ఆ.. అవును పెంచలయ్య గారు! నేను రాసిన ‘గెలిచిన మనసు’ అనే కథకి భూమి వీక్లీలో ఫస్ట్‌ప్రైజ్ వచ్చింది’’ అని చెప్పాను.
‘‘త్వరలో మాకు మురళీకృష్ణ స్వీట్స్ వస్తాయయితే’’ అంటూ ఆనందించి అభినందించాడు.
‘గెలిచిన మనసు’ పేరుతో మరో కథ రాయటానికి సిద్ధమైంది నా మనసు.

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు
చరవాణి : 8008057571

పుస్తక సమీక్ష

భావ పరంపర ఒడి..
మనసు తడి!
ప్రతులకు:
శ్రీమతి పాతూరి అన్నపూర్ణ
1156/28-1
ప్రశాంతినగర్
నవలాకుల గార్డెన్స్
నెల్లూరు - 524002
సెల్.నం.9490230939
పేజీలు : 99 - వెల : 100

కళ్లు చెమర్చడం అంటే
ఏమిటో తెలిసింది
నీతో స్నేహం చేసాక!
ఓ ఆర్ద్రతా వీచిక మనసుకు తగిలి
వౌనంగా ఉన్న హృదయాన్ని మీటి
రాగాలను పలికించిందంటూ..స్నేహాన్ని అక్షరాల్లో అందంగా ఆవిష్కరించిన పాతూరి అన్నపూర్ణ గారు తన ఐదో గ్రంథంగా ‘మనసు తడి’ కవితా సంపుటిని పాఠకలోకానికి అందిస్తున్నారు.
ఏ అదృశ్య శక్తో హృదయాంత రాళంలో దిగబడి.. భావ పరంపరను మథనం చేసి.. అక్షర రూపంగా ఆవిర్భవించి.. పుడమి నెర్రెల నుండి.. కొత్త మొక్క ఉదయించినట్లు.. మేఘాల మాటున మెరుపు మెరిసినట్లు కవితా సృష్టి కురుస్తుందని సవినయంగా స్వయంగా ప్రకటించుకున్న కవయిత్రి అన్నపూర్ణ కవితా వస్తువు కోసం అనే్వషణ కొనసాగిస్తూ.. చుట్టూ వున్న సమాజంలోని భిన్నత్వాన్ని పరికిస్తూ.. ఏకత్వ దారాన్ని చుట్టుకు పోతాననడం ఆమె ఉత్తమ అభిరుచికి నిదర్శనం.. ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతిబింబం!
కవిత్వం నీడ నాలో పరుచుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఊపిరి పోస్తుందన్న ఆమె.. చైతన్యం సిరా ఉన్నంతవరకు.. అక్షరం కాలాన్ని జయిస్తూనే వుంటుందనీ..ఎన్నో కవిత్వపు సంతకాలకు..నా ఇల్లు చిరునామాగా మారుతుందనడంలో కవిత్వం పట్ల ఆమెకున్న మక్కువను మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు..
అన్నపూర్ణ గారి కవిత్వంలో.. నిరాశ నిస్పృహలకు తావివ్వని ఆశావహ దృక్పథం ఉట్టిపడుతుంది. తమ అంతరంగంలో గూడు కట్టుకున్న అనంత భావాలకు భావుకత జోడించి పదబంధాలను అందంగా ఆవిష్కరించడంలో ఆమె దిట్ట అనే విధంగా ఈ కావ్యంలోని కవిత్వం మనకు కానవస్తుంది. హృదయాలను కదిలించేలా..మనసు తడితో ఆమె ఆయా కవితల్లో పొందుపరిచిన పంక్తులు మనల్ని ఆకట్టుకుంటాయి! అడుగడుగున మనల్ని తట్టి లేపుతాయి. బాధ్యతల్ని గుర్తు చేస్తాయి..చైతన్య పథాన నడిచేలా దిశా నిర్దేశం చేస్తాయి.. బాల్యం జాడలను గుర్తుకు తెస్తాయి. రెప్పల వెనక దృశ్యాలతో సంభాషిస్తూ ఆమె పేర్కొన్నట్లు పదే పదే పరామర్శిస్తాయి! క్షణ క్షణం వేగిరపడుతున్న ఆమె ఆలోచనలను అక్షర శిల్పాలుగా మార్చి మనం సేదతీరేలా ఈ కావ్యంలోని కొన్ని కవితల్ని తీర్చిదిద్దారు.
యుగాలు మారుతున్నా.. తరాలు మారుతున్నా.. మహిళల తల రాతలు మారడం లేదనీ..ఓ కవితలో వాపోయారు. తన నీడను చూసి తనే ఉలిక్కిపడటం.. గొంగళి పురుగులా ముడుచుకుపోతున్నది ఆత్మవిశ్వాసం..ఏ మృగత్వం నాశనం చేస్తోందన్న భయం వెంటాడుతోందన్న భావం స్ఫురించే విధంగా ‘హృదయంతో ప్రేమించాలి’ కవితను రూపుదిద్దారు. మగశిశువుకు జన్మనిచ్చిన ప్రతి తల్లి నైతికతను చనుబాలతో రంగరించి పోయాలని హితవు పలికారు. అ, ఆలు దిద్దడమే కాదు.. అమ్మతనానికి మొక్కడమూ నేర్పాలని సూచించారు.
‘ఈ తెలుగు మనదిరా’ కవితలో.. తెలుగు మనదిరా! ఈ వెలుగు మనదిరా! కమ్మనైన తెలుగు భాషని కలనైనా మరువకుండా రేపటి వారసుల చేతికి అందిద్దామనీ..తెలుగు భాషా పల్లకిని మోసే బోయాలను తయారు చేద్దామని పిలుపునిచ్చిన తీరు బాగుంది.
కనిపించే ఈ హరిత వర్ణంలో..నా జీవన చిత్రం రంగులద్దుకుంటూనే ఉంటుంది..చెట్టు ఆశీర్వదించే తల్లి మాత్రమే కాదు..జీవిత పాఠాలు నేర్పే గురువని..చెట్టును మరో కవితలో ఉన్నతంగా చిత్రించారు.
ఆలోచనలు మంచి ముత్యాల్లా వుంటే అవకాశాలు అంతర్మథనానికి తావివ్వవనీ.. ఎడారిలో ఎండ మావుల్లా కాక.. హిమవన్నగవులా మార్చుకుంటే బ్రతుకు సార్థకత అంటే తెలుస్తుందని ‘ఒక చిరునవ్వు చాలు’ కవితలో చక్కగా తెలియజెప్పారు.
తరాలెన్ని గడిచినా.. నువ్వు మాతోనే వుంటావు. మళ్లీ జన్మంటూ ఉంటే అక్కినేని గానే అవతరిస్తావని నటుడు నాగేశ్వర రావుకు అక్షరాంజలి ఘటించారు.
పెదాలు చిరునవ్వుల్ని పూయిస్తున్నా.. వాటి వెనకాల దాగున్న విషం.. మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతుందనీ.. ఎవర్ని చూస్తే కళ్లు తేజోవంతమవుతాయో అదే ఆత్మీయానుబంధానికి ప్రతీక అని.. అప్పుడు మాత్రమే మనిషికీ.. మనిషికీ మధ్య.. మమతల వారథి వెలుస్తుందని ఓ కవితలో చక్కగా చెప్పారు.
చదువుల పేరుతో.. బాల్యాన్ని బందీ చేస్తున్న సంగతిని ‘రెక్కలు తెగిన బాల్యం’ కవితలో ప్రస్తావించిన తీరు బాగుంది. మార్నింగ్‌వాక్ ప్రయోజనాలను ఇంకో కవితలో ఏకరువు పెట్టారు.
నిశ్శబ్దం ఒక్కసారి వరంలా లభిస్తుందనీ మనసు నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు.. కళ్లముందు సాక్షాత్కరించే పద చిత్రాలు అక్షరాలుగా ఆకృతిని సంతరించుకుంటాయన్న అన్నపూర్ణ గారి మాటలు అక్షరాల నిజం! ఇలా అనేక కవితలు ఈ గ్రంథంలో ఆమె ప్రతిభకు, సామాజిక చింతనకు పట్టం కట్టేలా వున్నాయి. వస్తు ఎంపికలో వైవిధ్యం ఉన్నప్పటికీ.. అభివ్యక్తిలో మున్ముందు శిల్పం విషయంలో ఇంకా శ్రద్ధ చూపిస్తారన్న విశ్వాసం ఉంది. ఆ దిశలో ఆమె అడుగులేస్తారని ఆశిద్దాం.

- దాస్యం సేనాధిపతి
సెల్.నం.9440525544

మనోగీతికలుఅశృతర్పణం
ఎంత పనిచేశావు నేస్తం
ఆరడుగుల అందాన్ని
అవనికి అర్పణ చేశావా..
సహజత్వపు అభినయాన్ని
సొంతం చేసుకున్నవాడివి
సహజ మరణం వరకు
వేచి చూడలేకపోయావా!
ఆధ్యాత్మిక ధోరణి వైనం చూసి
ఆవేశానికి లోను కావని
అర్ధాంతరపు చావును
ఆహ్వానించవనుకున్నాను
మెరుపు జాడ చూపక
ఉరిమిన పిడుగులా
వచ్చిన నీ మరణవార్త
మనసును అస్తవ్యస్తం చేసింది
చెట్టంత మనిషివి
చిగురుటాకువయ్యావెందుకు?
జీవితం ఆద్యంతాన్ని
చదివిన నువ్వు జారిపోయావెందుకు?
ఆత్మహత్య పిరికితనమన్న నీవు
దానినే ఆశ్రయించావెందుకు?
ఆరేళ్లు ఒంటరితనాన్ని
అనుభవించిన నువ్వు
అర క్షణం ఆలోచనకు
తావివ్వలేకపోయావెందుకు?
నీవు ఇక లేవన్న నిజాన్ని
జీర్ణించుకోలేకపోతున్నాము
అందరికీ మారదర్శివనుకున్న వేళ
అర్ధాంతరంగా మార్గాన్ని
మార్చుకున్నావే..
ఇది ఎంతవరకు సమంజసం?
దీనికి లేదిక మాకు సమాధానం
గుండెల దాగిన మా అభిమానం
చివరకు నీకు చేస్తున్నది అశృతర్పణం.
(నటుడు, రచయిత, కవి
రంగనాధ్‌కు అక్షర నివాళి)

- శింగరాజు శ్రీనివాసరావు, సంతపేట, ఒంగోలు,
చరవాణి : 9052048706

కాల్‌సర్పం
అభాగ్యుల హద్దుమీరిన
కోరికలను
అనుకూల పుట్టలుగా
మలచుకుని
సగటు మనిషి స్వేద
రుధిరాలను
క్షీర సమానముగా తలచి
పీల్చుకుని
కాలయముని చందాన
ఆబాలగోబాలాన్ని
కబళించి తెగబలిసిన
కాల్‌మనీ సర్పం
రాజకీయ వృక్షశాఖలను
ఆద్యంతం ఆసరాగా చేసుకుని
ఆకసానికి ఎగబ్రాకుతూ
ప్రదర్శిస్తున్నది తన దర్పం
చట్టాల కట్టెలకు సైతం
ఈ విషపన్నాగం దడవని వైనం
ప్రమాదం పొంచి ఉన్నదని
పసిగట్టి
తమాషాగా విదేశీయానం..

ఎవడో ఏదో చేస్తాడని
నమ్ముకుంటే
అవని జనులకు మిగిలేది శూన్యం
ఆమ్యామ్యాలకు
ఆలవాలమైన ఈ దేశంలో
అమాయకుల బ్రతుకులు దైన్యం.

- అల్లాడి వేణుగోపాల్,
నెల్లూరు

మానవ తప్పిదం
వర్షం వర్షం వర్షం
ఎడతెరిపిలేని వర్షం
ప్రకృతి విలయం
కనిపించని పక్షుల సంచారం
...
ఎడతెరిపిలేని వర్షం ధాటికి
మానవుడే విలవిలలాడాడు
మూగజీవాలు ఎక్కడ దాక్కొన్నాయో పాపం
ఆహారం లేక ఎలా విలవిల లాడాయో
గూడు తడిసి కూడు లేక అలమటించే
అభాగ్యుల ఆకలి కేకలు కూడా అంతే
...
చినుకు చినుకు పడి
వడి వడిగా కదులుతూ వరదగా నేల తాకుతూ
సముద్రంలో కలిస్తేనే అందం... ఆహ్లాదం
నేలంతా కాంక్రీటుతో నిండిపోతే
వర్షం నీటి ప్రవాహానికి ఉందా మార్గం
అందుకేనేమో ప్రకృతికి వచ్చింది ఆగ్రహం
ఊళ్లకు ఊళ్లు ముంచెత్తింది.
మానవుడికి ఇది గుణపాఠం కావాలి
ఇకనైనా మానవుడు మేల్కొనాలి
ప్రకృతి కన్నా గొప్పవాడిని కాదన్న
అహంకారాన్ని పక్కన పెట్టాలి
...
కాలువలు కబ్జా చేయడం మాని
చెరువులు ఆక్రమించడం మాని
నీటి ప్రవాహానికి దారి చూపిస్తే
మానవుని మనుగడకు అదే దారి చూపిస్తుంది
మటి టరోడ్డుంటే నేల తల్లి
నీటిని తనలో దాచుకుంటుంది
అంతా కాంక్రీటు అయతే చేసేదిలేక
మనిషి కన్నీళ్లు దిగమింగుకోవాలి
ఇది మానవుడికి కనువిప్పు కావాలి.

- గౌతమి, నెల్లూరు, 9347109377
email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- కోలపల్లి ఈశ్వర్