నెల్లూరు

పోలేరమ్మ మాను సాచ్చిగా.. (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమా... ఓమో.. ఇట్రామో అన్నాడు. యాందిరా నీది పొద్దునే్న నసై పొయ్యిండాది. నాగ్గాని పనిబాట గాని లేదనుకున్నావా యాందని అట్టగాదు లేమా.. నేను జెప్పేమాట ఓ పాలి ఇని పోదువు గాని ఇట్రా ఇట్టొచ్చి కూకోమో అని వాళ్లమ్మని నులక మంచం మీద కూకోబెట్టి నేల మీద కూలబడ్డాడు వీరాసామి. అందరూ వాణ్ణి ఈరిగా అని బిలస్తార్లే..
ఒరే అబయా సెప్పేదేదో చెప్పినావంటే నేను మీ అయ్యకు సద్దికూడు ఎత్తుకుబోవాలి. ఏదెట్టాబోయినా పరవాలే గాని సద్దికూడు ఆలెసికం అయిందంటే మాత్రం కుక్కబడ్డట్టు బడతాడ్రా మీ నాయన. అసలు ఇసియం యాందిరా అని అడిగింది నీలమ్మ.
అమా! మొన్నో పాలి నాయిన్నడిగినా. నాయినా టౌన్లోకి బోయి బండి మీద అరటి పండ్ల యాపారం జేస్తానన్నా. అబయా నీకు దెలవకుండా మనింట్లో యామన్నా పైసాలుగానుండాయా.. అయినా మట్టి బిసుక్కొనేవాళ్లం మనకి దేనికిరా యాపారాలు, యవ్వరాలు అని గసిర్నాడు. మనకుండేదేమో మూడు గుంటల కయ్యే గదా. దాన్లో మనం బతికేది ఎంత కష్టంగుండాది. పైకిబొయ్యే అప్పే గాని.. అదేమన్నా దిగబోతా వుండాదా. ఈ జనమలో తీరేటట్టు లేదు. అయితే ననే్నంజేయమంటావురా అన్నది నీలమ్మ బాధగా.
మన పక్కూరి పిలకాయలు ఫ్యాక్టరికీ పనికి బోతావుండారంట. ఏడేలిచ్చి, మద్దినాళ కూడు గూడా వాళ్లే బెడతారంట. నేను గూడాబోతే మన ఇబ్బందులు కొనే్నమయినా దీరబోతాయోమోనని నసిగినాడు ఈరిగాడు. నీ పిచ్చిగాన్రా అబయా.. మీ నాయిన మొదులే మొండోడు ఒప్పుకోబోతాడంటావా. అయినా అడగతాన్రా. పోలేరమ్మ మాను కాడుంటాడు గాబట్టి మెత్తబడ్తాడేమోనని సద్దికూడెత్తుకొని కయ్యి కాడికి బొయ్యింది నీలమ్మ.
ఎదవముండా ఇంత ఎంతబడే దాకా సద్దికూడుదేకుండా యాడడక్కదింటుండావని ఈడెగిరి ఆడబడ్డాడు నారప్ప. నీలమ్మ ఏం మాటాడకుండా పోలేరమ్మ మానుకాడ కూసున్నది. కాళ్లు గడుక్కొచ్చి గొంతుకూసున్నాడు నారప్ప. దోసిట్లో సద్దికూడు బోసింది. ఎట్టజెప్పాలబ్బా ఈ మనిషికి అని ఆలోచిస్తూ వుండాది. నంచుకొనుదేలా అని గట్టిగా అరిసే సరికి బిత్తరపొయ్యి ఊరేసిన పచ్చిమిరపకాయ బెట్టింది నీలమ్మ. సద్ది దాగి చేతులు కడుక్కుని వుండే నాలుగు మేకల్ని బీట్లోకి దోలినాడు.
అప్పుడు నీలమ్మ భయపడ్తా.. య్యో.. ఓయ్యో అని నసిగింది. చస్ బాడకోవ్ ముండా నిమ్మలంగా సద్దికూడు దాగి, ఇశ్రాయంగా బీడి ముక్క ఎలిగిచ్చుకుంటుంటే ఒకటే నస.. ఎదవ జనమ.. ఎదవ జనమని. పోలేరమ్మ మానకాడ వుండావు గాబట్టి బతికిపోయినావు.. లేకపోతే ఒక్క తన్ను తనే్నవాడ్ని అన్నాడు. అదిగాదయ్యా మన పక్కూరి పిలకాయలు ఫ్యాట్టరికీ బోతావుండారంట. ఏడెలిచ్చి మద్దినాళ కూడు గూడా బెడతారంట. మన ఈరిగాడు గూడా బోతానంటా వుండాడు అన్నది నీలమ్మ భయం..్భయంగా.
ఈయనిప్పుడే ఫ్యాట్టరీలకి బొయ్యి గవనేర్ అవబోతాడంటనా. ఏంబళ్లా, మనకు బోదు మన కట్టానికి బోదు. గంజినీల్లు దాగినా మన బతుకు ఈణ్ణే వుండాదని మూతి మూడు వంకరలు దిప్పి గుర్రుగా జూసినాడు నారప్ప. అప్పటిదాకా గమ్మునుండిన నీలమ్మ ఈ మొండి ముండా కొడుకుల మద్దెన నేను సత్తా వుండా తల్లే. నాకన్నా సావురాక పోయిందే అంటూ సోకాలు మొదలు బెట్టింది నీలమ్మ. ఏమనుకున్నాడో యామొ గాని కాసేపటికి నా మాటలు మీ బోటి బేఫా ముండలకు సైయించవు గాని మీ సావు మీరు సావండి అంటూ కయ్యలోకి బుసలు గొడుతా బోయినాడు నారప్ప. నీలమ్మేమో కళ్లు తుడుచుకుని, జుట్టు ముడేసుకుంటూ కొడుకు దగ్గరకి బరిగెత్తింది.
ఆ మరుసటి దినం నుంచే ఫ్యాట్టరికీ బోవాలనుకున్నాడు ఈరిగాడు. ఫ్యాట్టరి వాళ్లిచ్చిన గుడ్డలేస్కొని, టక్కు జేస్కొని బోతావుంటే నీలమ్మకు కొడుకు గవనేర్ లాగానే గనిపిస్తావుండాడు. నారప్ప కూడా కొడుకును చూసి కుశాలగుండాది గాని బయటబళ్లే.
ఓ రోజు ఫ్యాట్టరీలో పక్క వూరి పిలగాడు వెంగట్రెడ్డి, ఈరిగాడితో మాట్లాడుతూ.. మా చుట్టాలు రొయ్యల గుంటలు బెట్టి లచ్చ్ధాకారులై పోయినారబయా. వాళ్లకి నిన్నమొన్నటి దాకా తినేదానికి కూడు గూడా సదరంగా లేదు. ఈ రోజు వోళ్లు బండ్లేసుకుని భలే దర్జాగా బతకతుళ్లా. నేను గాని ఈ సమ్మత్సరం ఎట్టైనా గాని రొయ్యల గుంట బెడ్తామనుకుంటుండా. యో వెంగట్రెడ్డా అంత డబ్బు ఎట్టాదేబోతావు. గుంటలు గొట్టేదానికి కొక్కులారికి ఇరైయేలు. రొయ్యి పిల్లలకేమో ముప్పైయేలు గానుంటే సాలబయా. మేతగావలంటే అప్పిస్తార్లే. యాభై యేలు గానుంటే గుంటబెట్టొచ్చంటావ్ ఆలోచిస్తా అన్నాడు ఈరాస్వామి.
ఆపట ఈరిగాడు ఎవరికి సెప్పకుండా సుట్టాల దగ్గర, తెలిసినోళ్ల దగ్గర యాభైవేలు అప్పుజేసి పోగేసినాడు. వోళ్లమ్మకాడికి వచ్చి ఇసియం అంతా జెప్పినాడు. మూడు నెల్లు జాలమ్మా లచ్చ్ధాకారులై పోతామన్నాడు. నీలమ్మ ఆలోసన్లో బడింది. ఆ ముండాకొడుకుకి గాని జెప్తే బడనీడు గాని, ఏదైతే అదైనాది గాని జేసెయ్యిరా అన్నాది. ఈరిగాడు ఆ నాలుగు మేకల్ని గూడా దీస్కపొయ్యి ఒకటి సగంగా అమ్మేసి కొక్కులారీ వోళ్లతో మాట్లాడి దీసుకొచ్చేసినాడు. రేత్రికి రేత్రే గుంటలు కొట్టిచ్చినాడు.
పొద్దునే్న కయ్య సాయిబోయిన నారప్ప గుంటలు జూసేసరికి గుండెలు బగిలిపోయి ఆడ్నే కూలబడిపోయినాడు. సుట్టుపక్కలోళ్లు పరిగెత్తుకొచ్చి జూసేసరికి మడిసి కదిల్తె గదా. నారప్ప అయిపోయినాడనుకున్నాడు. ఎవరో నీళ్లు జల్లేసరికి నెమ్మదిగా కదిలి లేచి పడిపోబోయి.. దబాయించుకుని ఉలుకుపలుకు లేకుండా సక్కాబోయినాడు. అప్పట్నించి ఎవర్తో మాట్లాడేవోడు గాదు నారప్ప.
ఈరగాడు ఫ్యాట్టరీకి బోవడం గూడా ఆపేసినాడు. గుంటలకాడ్నే వుంటా, రొయ్యలకు మేత ఏసుకుంటా కనిపెట్టుకొని ఉంటాండాడు. రోజులేమో సరసరామని జరిగిపోతా వుండాయి. రొయ్యపిల్లలు గూడా బాగానే ఎదగతావుండాయి. ఇంకో పదిరోజుల్లో బట్టి అమ్మెయొచ్చనుకున్నాడు. భలే మజాగా ఉండాది ఈరాసామికి. పద్దినాల్లో లచ్చ్ధాకారులైపోతామని, కట్టాలు దీరబోతాయని కలలు గంటావుండాడు.
మరుసటిరోజు మద్దివేళ ఉన్నట్టుండి రొయ్యలకు ఏం జబ్బు చేసిందోగాని అన్నీ చచ్చిపొయ్యి తేలిపోయినాయి. ఒక్కసారిగా కూలిపోయినాడు ఈరిగాడు. కళ్లముందు అప్పులోళ్లు, వడ్డీలు గనిపించి బిత్తరబెట్టేసినాయ్. కలవరపోయిన ఈరిగాడికి యామిజెయ్యాలో దెలవలా. పోలేరమ్మ మానుకాడికి బొయ్యి దండం బెట్టుకుని పంచెతో ఆ చెట్టుకు ఊరేసుకున్నాడు.
సందేళ కైయ్యి సాయి బోయిన నారప్పకు గుంటలో రొయ్యలు దేల్తావుండేసరికి గుండె గబాలుమన్నాది. కొడుక్కోసం జూసినాడు. యాడా కనబళ్ళా. పోలేరమ్మ మాను సాయి సూస్తుడు గదా ఏలాడతా వుండాడు ఈరిగాడు. నారప్ప గుండెలు బాదుకుంటూ పరిగెత్తిబోయి గుడ్డనప్పించి ఈరిగాడ్ని దించినాడు. సుట్టూజూస్తే ఎవరూ లేరు. కొడుకు శవాన్ని భుజానేసుకొని ఏడస్తాబోలోవుండాడు నారప్ప. ఒరేయ్ అబయా ‘కూసొని బొడుకోవాల్రా... దబామని ఎనక్కిబడితే తలకాయ బగలతాదిరా అన్నా’ యిన్నారా నామాట, అదే జరిగినాది గదరా అంటా ఎక్కిఎక్కి ఏడస్తా ఇంటి సాయి బోతావుండాడు.
‘ఈ ఘోరం జూళ్లేక సూరీడేమో పడమట కొండల సాయి బరిగెత్తేబోతావుండాడు.

- కె.రవిశేఖర్, నాయుడుపేట
చరవాది 9849388182

స్పందన

నవ్వులు పూయంచిన
భద్రిరాజు కార్టూన్లు
చాలాకాలం తరువాత మెరుపులో ప్రచురించిన కార్టూన్లు చాలా బాగున్నాయి. సహజంగా నవ్వులుపువ్వులు పూయించాయి. కార్టూనిస్టు భద్రిరాజు నుంచి మరిన్ని కడుపుబ్బనవ్వించే కార్టూన్లు రావాలని ఆశిస్తూ.
మంజుల, ముత్యాలపేట, గూడూరు
షేక్. ఫయాజుల్లా, లాయర్‌పేట, ఒంగోలు

జీవితమంటే కవిత సూపర్
జీవితమంటే ఏమిటో అని చాలా చక్కగా వివరించిన ఆడేరు చెంచయ్య గారికి ధన్యవాదములు. రెండు ముక్కల్లో చాలా వివరణాత్మకంగా జీవితం గురించి చెప్పిన తీరు బాగుంది. చివరగా కష్టాలను దాటుకొని సుఖాల తీరం చేరడమే కదా జీవితమంటే అనే ముగింపు సూపర్.
- పామంజి లత, గాంధీబొమ్మ, ఆత్మకూరు
- గాలి రామాంజనేయ ప్రసాద్, అద్దంకి

మేరా బేటా బతికాడు కథ బాగుంది
చివరి వరకు సస్పెన్స్‌గా సాగిన మేరా బేటా బతికాడు కథ చాలా బాగుంది. కథలో చివరిగా బాలుడు చనిపోయాడు అనుకునేలోపే బాలుడు బతికి బయటపడడం కథకు ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. పోట్లూరి గారి కథలు ఇదివరకు చాలా చదివాను. మళ్లీ మెరుపులో చదవడం ఆనందదాయకం.
- పొత్తూరు అనుపమ, గూడూరు

అలరించిన మెరుపు
గత వారం ఆసక్తికరమైన కథ, సందేశాత్మకంగా సాగిన కవిత, నవ్వించే కార్టూన్లతో మెరుపు మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది.
- జి. శ్రీనివాస్, బుచ్చిరెడ్డిపాళెం
- కరీముల్లా, కావలి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

బాల్యకవచం
సహకరించని సామాజిక నేపధ్యం
దరిచేర్చని సహవాసపు భావాంతరాలు
వ్యవస్థీకృతమైన పాలక అవ్యవస్థ
మైలపడిన మానవత్వాలు
నామమాత్రపు ఆలంబనలు
భరోసాలేని బలహీనపు పరిష్వంగాలు
భయవిహ్హలంబైన జీవన వలయాల మధ్య
---
వాడిన పగడపుపూలు పెదాలపై
వసివాడని ఓ చిరు వసంతం
మూడు శిశిరాల లేత ప్రాయంలో కేరింతలు కొడుతోంది.
ఆ చిరు దరహాసపు లోగిళ్లలో
విరిసిన ఆ చిన్మయానందపు నిర్భయలోకంలో
--
కడుపులో చల్ల, కళ్ల ముందు ఓ ఆనందహేల
కొసవేలికో పట్టుకొమ్మ
అక్కడ కాలాలు మూడుకావు
వర్తమానం ఒక్కటే అక్కడి కాలమానం
ప్రవర్థమానం ఒక్కటే కొలమానం
భూత భవిష్యత్తులు దులుపేసుకొన్న బూజులు
---
భయపెట్టే విధి లిఖితాలు
అక్కడ ప్రభావించలేవు
జాలిపరుల గాలిచూపులు
అక్కడ పనిచేయవు
దైవశాసనాలకు సైతం అక్కడ గుర్తింపులేదు
ఆలోచనల ఆచూకీ అక్కడేమాత్రం దొరకదు
విడిచేసిన క్షణాల నెమరింపు అసలుండదు
భరోసాల తలంపుకానీ
భావోద్వేగాల పొడమరలు గానీ
అక్కడ కనిపించవు
భయాందోళనల పదఘటనల
అలికిడి అక్కడ అరణ్యరోదనమే
తనువును మనసును కప్పేసిన
ఆ బాల్యకవచం
ఎంతటి దుర్బేద్యమో కదా!
లలితమైన ఆ లావణ్యపు
పసితత్వం
ఎంతటి అమోఘమో కదా!
అందుకే అది ఒక
చింతలు లేని, చీకట్లు తెలియని
ఓ క్రాంతిపథం.
అవ్యక్తమైన చిద్విలాసపు
చిదానందాల పరంధామం

- కె.రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778988

భలే మోసగాడు
భలే మోసగాడు
బజారున పడ్డాడు
డబ్బేడబ్బు
మోసం చేయడం వీడికున్న జబ్బు
ఎక్కడ చూసినా అప్పే
డబ్బిచ్చినోడికి ఇక ముప్పే
మోసం మీద మోసం
మోసం చేసి తెచ్చుకున్నాడు పాపం
బాకీ అడిగితే కోపం
ఆపై వచ్చేస్తుంది రోషం
నీ డబ్బులు ఎక్కడకెళతాయని వెటకారం
తలతిక్క సమాధానం
అప్పిచ్చినోడికి చెంప ఛెళ్లుమంది
గూబ గుయ్ అన్న శబ్దం వెటకారం
ఆ తర్వాత అప్పిచ్చిన వాడికి భయం భయం
కోర్టుకెళ్లినా మోసగాడిదే విజయం
నా వద్ద ఏమీ లేవని కోర్టులో సమాధానం
ఐ.పి.పెట్టాడు
అప్పిచ్చినవాడు మంచం పట్టాడు రోగంతో
అప్పిచువాడు రోగి అని తేలిపోయింది
జాగ్రత్త బాబోయ్ జాగ్రత్త
అప్పిస్తే ఇక అంతే
కలికాలం రోజులివి
జాగ్రత్త..తస్మాత్ జాగ్రత్త

- పాలపర్తి శ్రీనివాసకుమార్, కావలి
చరవాణి : 88860 86635

నవోదయం
నల్లబెల్లం, నవాసారంతో
తయారయ్యే నాటుసారా అలవాటు
నీ జీవితానికి గుదిబండ. ఈ మత్తు మహమ్మారి
నీ శరీరంలో అవయాలతో పాటు
నీ కుటుంబాన్ని చిద్రం చేస్తుంది
సరదాకో, స్నేహితుల కొరకో
సంబరాల కొరకో ఏర్పడ్డ అలవాటుతో
నీ జీవితంలో చీకట్లు కమ్ముకోనియకు
ఇకనైన మేలుకో.. ‘‘నవోదయం’’ ఆసరాగా
నీ జీవితంలో వెలుగులు నింపు.
నాటుసారా మంటల్లో
నీ జీవితాన్ని బుగ్గిపాలు చేయకు
నాటుసారా భూతం కబంధహస్తాలను
వదిలించుకుని నీ ఆలు, బిడ్డల జీవితాల్లో
వసంతాలు నింపు..నలుగురిలో నీ కుటుంబాన్ని
నవ్వులుపాలు చేయకు. ‘‘నవోదయం’’తో
నీ జీవితానికి కొత్త ఉదయాన్ని ఇవ్వు.

- మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్
బుచ్చిరెడ్డిపాళెం. చరవాణి : 9490455599.
పుణ్యం కట్టుకోండి..!
కమ్మని కారుణ్యాన్ని పంచాల్సిన
కన్నతల్లి గర్భాశయం
ఇంకో ‘అమ్మ’ తనలో ఉందని తెలుసుకొని
కాలకూట విషాన్ని ఎగజిమ్మింది
ఏ పాపం చేశానని
ఎండముఖం చూడకుండానే నా బ్రతుకు
బుగ్గిపాలవుతూ ఉంది,
బురదలో పారవేయబడుతూ వుంది
నవమాసాలు మోసి
నాజుకైన జీవితమందించాల్సిన ‘‘నమ్మకం’’
నరకయాతన పెట్టి నన్ను చంపుతూ వుంది
కాదు..కాదు..చంపిస్తూ వుంది
ఇందులో నా తప్పేమైనా వుందా?
తప్పనిసరైనా..తప్పుకోవలసి వస్తుంది
ఒకవేళ... ఆ గండం గడిచి గట్టెక్కి
ప్రపంచ ప్రాణవాయువు పీల్చినా
పొత్తిళ్లలో ఉండాల్సిన నేను
పొదలమాటున పోరాడాల్సి వస్తుంది
ఆకలికి తట్టుకోలేక నా దగ్గరకొచ్చిన కుక్కలు
నేను ముందు... నేను ముందు అని
తన్నుకుచచ్చేలోపు... నాకు కాలం కలిసొచ్చి
ఏ ధర్మదేవతో నన్ను చూస్తే
యముడితో పోరాడి గెలిచిన ‘సావిత్రి’లా
నిమ్మలంగా బ్రతికే నీడ దొరుకుతుంది
‘‘అమ్మా’’ ఆప్యాయత అందకపోయినా
ఆదరించే హృదయాలు అక్కునజేర్చుకుంటాయి
తలరాతలు మార్చాల్సిన తల్లులూ
మీరుజేస్తున్నది తప్పో..
ఒప్పో ఒకసారి తలపోయండి
ఏ తప్పూ చేయని నన్ను..
ఏకంగా హత్య చేయడం ఆపండి
ఎదగాల్సిన మా ఎదల్లో
ఎంతోకొంత జీవరసం పోసి
పుణ్యం కట్టుకోండి.. పుడమిపై ‘‘పారాడ’’నివ్వండి.

- పచ్చా పెంచలయ్య, చరవాణి : 9912822341

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- కె.రవిశేఖర్