నెల్లూరు

నాకొక వరం కావాలి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పు తెలవారడానికి తొందర పడుతూ ఆకాశం కెంజాయ రంగు పులుము కొంటూ తెల్లబారుతోంది. అప్పటికే వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గు వేయడానికి వంగింది ఉష.
కళాత్మకమైన చేతుల్లోంచి ముగ్గుపిండి రంగులు జాలువారుతు ముగ్గుల్లో రంగులు పూలై విరబూసాయి. ముగ్గు ముగించి తదేకంగా చూసింది. నాలుగు ప్రక్కలనుండి చూశాక, తృప్తిగా పారిజాతం చెట్టు విదిల్చిన పూలు తీసుకొని లోపలికి నడిచింది ఉష.
సునీల్ అప్పటికే వేప పుల్ల నములుతూ బావిగట్టు మీద కూర్చున్నాడు. పిల్లలిద్దరు మంచంమీద అలాగే పడుకొన్నారు. వాళ్ళనలాగే చూసి స్నానానికెళ్ళింది.
తలారా స్నానం చేసి వచ్చి పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి కొత్త బట్టలు తొడిగింది.
తను పట్టు చీర కట్టుకొని పూజ చేసేసరికి సునీల్ తయారైవచ్చాడు. సునీల్‌కి కాఫి ఇచ్చి, పిల్లలకి పాలు కలిపిచ్చింది.
వీధి చివర ఆంజనేయస్వామి గుడిలో నుండి శ్రావ్యంగా మంగళవాయిద్యాలు వినబడుతున్నాయి. పండుగ రోజు అందరు కలసి గుడికెళ్ళడం ఆనవాయితీగావుందా ఇంట్లో. సునీల్, ఉష పిల్లల్ని తీసుకొని గుడికెళ్ళి ఆర్చన చేయించివచ్చారు.
రాగానే వంట ప్రారంభించింది. సునీల్ పొలం దాక వెళ్ళివస్తానని బయలుదేరాడు. పిల్లలిద్దరు కొంచెంసేపు చదువుకొని ఆటల్లో మునిగిపోయారు. శెలవు రోజుల్లో పిల్లలతోపాటు పెద్దలకి సంతోషమే.
సునీల్ పొలంనుండి వచ్చేసరికి భోజనం సిద్దంచేసింది. మామిడికాయ పప్పు, వడియాలు, అప్పడాలు, పులిహోర, దోసకాయ పచ్చడి, సాంబారు, పాయసం, గారెలు అన్ని ఘుమఘుమలతో నోరూరిపోతుంది.
సునీల్ భార్యవంక చూశాడు. ఉష ముఖం కళకళలాడుతోంది. భర్త, పిల్లలు భోజనం చేస్తుంటే ఆనందంగా వుంది.
ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి తృప్తి. పల్లెటూర్లో ఉన్న తమకు ఎంతో సంతృప్తి. ఆరోగ్యం, ఆస్తి అన్ని వున్నాయి. తన భర్త కష్టించే రైతు. తమది ప్రశాంతమైన జీవితం.
‘టెన్షన్స్’ లేవు. హడావుడి లేదు. అధికారుల అదలాయింపులు లేవు. బి.పి, షుగర్స్ లేవు.
పంటలమీద వచ్చే ఆదాయం పోను తమ కింద కొంతమంది రైతులు బ్రతుకుతున్నారు. తాము తిని ఇంకొంతమందికి సహాయం చేయగల్గుతున్నారు.
పట్టణాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఆనందంగా వుంటున్నారు. ట్రాఫిక్, నీళ్ళు, అద్దె ఇళ్ళ సమస్యలతో సతమతమవుతూ ఆరోగ్యాలు పోగొట్టుకొంటున్నారు.
చిన్న పిల్లల్ని, తల్లితండ్రుల్ని చూసుకోలేక బాధ పడుతున్నారు. ఉన్నతిని సాధించాలంటూ ఉనికి కోల్పోతున్నారు. అన్ని సమకూరివుంటే మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి ఎక్కడైనాచాలు. పట్టణాలకే వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు.
సునీల్ ‘వరికంకులు’ తెచ్చి వరండాలో కట్టాడు. ఎవరో వచ్చి మాట్లాడివెళుతున్నారు. సునీల్ ముఖం మీద చిరునవ్వు వీడనేలేదు.
ఇంటిముందుకి గంగిరెద్దులనాడించే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇంట్లో వండిన పిండి వంటలు, అన్నము అన్ని ఆకుల్లో పెట్టిచ్చింది, వాళ్ళు అయ్యవారికి దండాలు, అమ్మగారికి దండాలు, పిల్లలకి దీవెనలిచ్చివెళ్ళారు.
పక్కింటి కమలమ్మ మనుమరాలు రమ ‘టౌన్’లో చదువుతోంది. పండక్కి అమ్మమ్మ దగ్గరకి వచ్చింది. ఉష దగ్గరకి వచ్చి రకరకాల ముగ్గులు నేర్చుకొని ఎలా వేయాలో అడిగి, తమ బడి విషయాలు చెప్పి వెళ్ళింది.
ఉష పెరట్లోకొచ్చింది. పాలేరు శివయ్యను పిలవడానికి, శివయ్య భార్య గౌరితో ముచ్చట్లాడుతున్నాడు. శివయ్య ఏమన్నాడో గౌరి చక్కిలిగింతలు పెట్టినట్లు నవ్వుతోంది. ఉష నవ్వుతూ మళ్ళీ పిలవచ్చులే అనుకొంటూ వీధి గుమ్మంలో కొచ్చింది.
గుమ్మానికి కట్టిన మామిడాకులు ఇంకా మామిడి సువాసన వెదజల్లుతున్నాయి. గడపకు రాసిని పసుపు కుంకాలు, మెట్లకు పెట్టిన ఎర్రమట్టి ఆ ఇంటి పండుగ వాతావరణం పెంచాయి. ఇంటి ముందు ముగ్గు చెరిగి, కొత్త ముగ్గుకోసం ఎదురుచూస్తోంది!
దూరంగా కోడి, కోడిపిల్లలు తిరుగుతున్నాయి. వాటిని తరుముతూ ఓ కుక్క వచ్చింది. ఉష కుక్కని ‘‘ ఉష్.. ఉష్’’ అని అదలిస్తూ చేతులు విదిల్చింది.
ఉష్ - ఉష్ అంటూనే ఒళ్ళంత చెమటలు పడుతుంటే కళ్ళు విప్పింది ఉష.
ప్రక్కన ‘సెల్’ అలారం మోగుతోంది. లేచిదాన్ని టక్కున ఆపింది. కరెంటు పోయినట్టుంది. ఫ్యాన్ ఆగిపోయి చెమటలు పడుతున్నాయి.
అయితే ఇప్పటివరకు తను ఎంత సజీవమైన కలకంది. అది నెరవేరేదేనా!
ఈరోజు పండుగ. తొందరగా లేవాలి. పనులు నిలచిపోతాయి. పిల్లలు లేచి ‘కోచింగ్ సెంటర్ల’లకి రెడి అవ్వాలి.
మంచం దిగి వీధి గుమ్మం తలుపు తీసింది. అపార్ట్‌మెంట్‌లో ఎదురుగా వీధి లేదు. ఎదురుగా వేరే ఎవరిదో గుమ్మం.
ఓ గ్లాసుతో నీళ్ళు తెచ్చి గుమ్మం ముందు చల్లి, గుడ్డతో తుడిచింది.ముగ్గు ‘స్టిక్కర్’ తెచ్చి నేలమీద అతికించింది. ప్లాస్టిక్ మామిడాకులు తగిలించి, లోపల కొచ్చింది.
అప్పటికే సమయం తరిగిపోతోంది. పిల్లలిద్దరూ రెడి అయి ‘బ్రేక్ ఫాస్ట్’కి వచ్చారు.
వాళ్ళకి బ్రెడ్, జామ్, వేసి ప్లేట్లలో పెట్టింది. తినేలోపే క్రాపులు దువ్వింది. పిల్లల స్కూలు బస్ రాగానే పుస్తకాల బ్యాగ్‌లు తగిలించుకొని వెళ్ళిపోయారు.
సునీల్ ఇంకో అరగంటలో లేస్తాడు. కాఫి డికాషన్ వేసింది. సునీల్ లేవగానే కాఫి చేతికిచ్చింది.
సునీల్ కాఫి తాగుతూ తనకీరోజు మీటింగ్‌లు వున్నాయని త్వరగా వెళ్ళాలని సాయంత్రం వీలుంటే త్వరగా వస్తానని అన్నాడు.
ఉషక్కూడ ఈరోజు ఆఫీసులో పనుందని మధ్యాహ్నం ‘పర్మిషన్’ పెట్టుకుని వచ్చేస్తానని చెప్పింది.
సునీల్ ‘లంచ్ బాక్స్’ వద్దని టిఫిన్ బయటే చేస్తానని వెళ్ళిపోయాడు, సునీల్ వెళ్ళాక ఉష అలాగే సోఫాలో కూర్చుండిపోయింది.
ఉదయం లేచిన దగ్గర్నుండి హడావుడి. పిల్లలు పుస్తకాలు ఎక్కడైన పెడితే వెతుకులాట, ఏ వస్తువు కనిపించక పోయినా గాభరా. పనిమనిషి రాకపోతే అదనపుపని. అనుకోని అతిధులు వస్తే శెలవుకోసం ఆర్భాటం ఏ అనుభూతులు లేకుండానే కరిగిపోయే క్షణాలు.
ఉద్యోగం మానేసి గృహిణిగా వుండే ధైర్యం లేదు. పెళ్ళి కావలసిన ఆడబిడ్డ, ఉన్నత చదువులు చదవాల్సిన పిల్లలు, హౌస్ లోన్, ఎడ్యుకేషన్‌ల లోన్, ఇంకా రకరకాల బాకీలు, రోగాలు, మెయిన్‌టెన్స్‌లు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే ఈమాత్రం నెట్టుకురాగలుగుతున్నాము. ఏ ఒక్కటి తక్కువైన వెలితి. ఉన్నదానిలో తృప్తి పొందాలన్న అత్యాశ ఆకాశన్నంటుతోంది.
ఎప్పుడో విశ్రాంతి ఈ జీవితానికి. పిల్లలు పెద్దయ్యేవరకు వారికి చాకిరి చేసి ఎంతో ఉన్నత స్థితికి చేయూత ఇస్తే ముసలితనంలో చేతి కర్రిచ్చి ఆశ్రమాల్లో చేరుస్తున్నారు. మరల వాళ్ళ జీవితాలు అంతే. ఇదొక రంగులమయం ఇందులోంచి బయటపడాలనుకోవడం గట్టునపడ్డ చేపపిల్లలాంటిదే!
ఎన్ని ఆలోచించిన ఇలాంటి జీవితానికి అలవాటుపడ్డ మనిషి అందులోనే మునిగి తేలుతుంటాడు. కలలు కనడం మానవనైజం! అందులోనైనా హాయిగా విహరించాలి.
ఏమిటి తమ జీవితం. పిల్లలు మంచి చదువులు చదువుతున్న రోజులో కనీసం ఓగంట ఆనందంగా మాట్లాడుకోలేక పోతున్నాము. డబ్బు సంపాదిస్తున్నా రోజూ ఏదో ఒక ‘టెన్షన్’ బస్సు దొరుకుతుందో లేదోనని, ఆఫీసులో ఏ సమస్యలు ఎదుర్కోవాలోనని.
పిల్లలకు మంచి ర్యాంకులు వస్తాయో లేదోనని దిగులు. అంతా పోటీ ప్రపంచమైపోయింది.
పండుగ రోజు కూడా ప్రశాంతత లేదు. హడావుడి, పూజ చేసుకొనే టైం లేదు. చిన్న వయసులోనే బి.పి., షుగర్స్ వచ్చేస్తున్నాయి.
ఆడపిల్ల ఇంటికి బస్సుల్లో క్షేమంగా వస్తుందో రాదో అనే దిగులు, కరెంట్ పోతే ‘ట్యాంక్’ నిండాక నీళ్ళురాక అదొక బాధ.
పట్టణాల్లో పరుగెత్తేకంటే పల్లెటూర్లో ఎద్దులబండి లాంటి నిదానమే బాగుంటుందేమో!
అందరు పిల్లలు ఇంజనీర్స్, డాక్టర్స్, సాఫ్ట్‌వేర్స్ అవ్వాలని కోరికలు. పరుగు పందెంలో ఎన్ని రాళ్ళు తగులుతాయో!
గడియారం గంటలు కొట్టడంతో ఉష ఉలిక్కిపడి సోఫాలోంచి లేచింది. తను ఆఫీసుకు రెడి అవ్వాలి.
తను తెల్లవారు ఝామున ఎంతమంచి కలకన్నది. అలాంటి జీవితం తనకు దొరుకుతుందా! ఎన్నాళ్ళు ఏమి చేసినా మనిషి ప్రశాంతత కోరుకుంటాడు.
అందమైన కల జీవితంకాదు. అందరికి అన్ని దొరకవు. కలలు కనడం, మనసులోనే ఆనందించడంతో సరిపోతుంది. తమలాంటి వాళ్ళకి నిద్రపోవటానికే కాలం సరిపోదు. ఇలాంటి కలలుకని వాస్తవం అవ్వాలనుకోవటం ఎంత అత్యాశ అన్ని వదులుకొని వెళ్ళలేని సమాజపు ముళ్ళకంచె బంధించేస్తోంది!
అభివృద్ధి సాధించటంలో తప్పులేదుకాని, వేగవంతమైన కాల ప్రపంచంలో మనిషి ఏదో కోల్పోతున్నాడు. ఆ కోల్పోని శాంతి వరమే తనకు కావాలి.

- అనురాధ రామకృష్ణ,
మనుమసిద్దినగర్, నెల్లూరు - 524001
సెల్ - 9394837563

ఇలా బ్రతికి చూడు..!
బతుకుతెరువుకై మనిషి పడే
ఆరాటమే జీవన పోరాటం
కునుకు తియ్యాల్నా, కడుపు నిండాలన్నా
పెదవి విప్పాలన్నా, కాలు కదపాలన్నా
గండమే.. సుడిగుండమే
ఆందోళనలుంటాయి,
ఆవేదనొలొస్తాయి,
అడ్డుగోడలుంటాయి
అడ్డంకులొస్తాయి
నిరాశలో ఆశను వెదుకు అప్పుడు
ఓటమిలోనే గెలుపును చూడు ఎప్పుడు
అలా బ్రతికి చూడు.. ఏమవుతుంది?
గెలుపు నీదవుతుంది..!
కలత మిగిలినా.. కన్నీటమునిగినా
దిగులు చెందకు, దీనంగా చూడకు
కన్నీటికే కలతలన్ని తీరితే
కడలికే చోటుండదు ఆ కన్నీళ్లలో
ఎన్నాళ్లని వుంటాయి ఎన్ని కలతలయినా?
ఎదబరువు తీరదా? ఏనాటికయినా?
యిలా తలచి చూడు! ఏమవుతుంది?
ఎద కుదురుతుంది...!
ద్వేషమెంత దహించినా! ఎదలో పగ ఎంత రగిలినా
ఆవేశపడకు, ఆందోళన చెందకు
ఎల్లకాలముండునా ఎంత ద్వేషమయినా
అంతలోనే చల్లారునులే అంతులేని పగయినా!
ఉడుకు నెత్తురుండేది వయసు వేడిలోనే
మంచులా మారులే వయసుడిగిన వేళ
అలా తరచి చూడు ఏమవుతుంది?
శాంతి నీ పరమవుతుంది..!
ఒడిదుడుకులకు వెరవకు, కడగండ్లకు చెదరకు,
కలసిరాలేదని కుమలకు
చిత్తశుద్ధి ఉంటే నీ చేతలలో
గెలుపు పడిగాపులు కాస్తుంది
నీ గుమ్మంలో, నీ గమ్యంలో
ఇలా సాగి చూడు ఏమవుతుంది
బ్రతుకు నీదవుతుంది..!

- బాలు, నెల్లూరు, చరవాణి : 9866140700

బఫే మీల్స్..!
పులిని చూసి నక్కవాతలెట్టుకున్నట్లు, డంబపు కార్యక్రమాలే కానీ
మనస్ఫూర్తిగా భోజనం పెట్టాలని, తృప్తిగా తినాలని ఎవరుకుంది?
పైగా తిన్నదరగకుండా ఐస్‌వాటర్, ఐస్‌క్రీమ్‌లు
ఇచ్చేది ఒకటి, తినేది రెండు.. జఠరాగ్ని చల్లారక చస్తుందా?
మనం తిన్నది పెట్టటానికి, ఇచ్చింది తీసుకోటానికా పిలుపులని భావన
మనసుపెట్టి ప్రేమతో వండి వడ్డించేది కాదు..
ఊరంతా ఊరేగి వచ్చే క్యాటరింగ్ మీల్స్ అది..
డబ్బు పారేసి, ఆర్డరిచ్చి చేతులుకంటకుండా చూసుకోవడం
చెప్పుల్లో కాళ్లుపెట్టి, ప్లేట్లో చెంచాలెట్టి, టివిల్లో కళ్లు పెట్టి
చేతిలో బొచ్చ పట్టి అటూ ఇటూ తిరుగుతూ తినే బఫే మీల్స్ అది.
అదే బఫెలోస్ తిన్నట్లు.. ఒకవేళ
బంతిలో కూర్చొని తింటుంటే వెనుక నిలబడి
బస్సులో సీటుకై టవలు వేసినట్లు
ఎప్పుడు లేస్తాడా అని ఎదురుచూస్తుంటారు
ఇక వాడు తినేది ఏంది? తిన్నా వంటబట్టేదేంది?
ఎక్కడి నుండి వచ్చిందీ అలవాటు? ఎందుకు చేస్తున్నాడీ పొరపాటు?
ఆ‘కలి’ మహత్యమా! కలి మహత్యమా?
కలిచేటి కాలమా! కలిమికి చేటి కాలమా?
చెడు మొలిచేటి కాలమా! మంచిని కూలిచేటి కాలమా?
ఉన్నవారికైనా.. లేనివారికైనా.. ఇష్టమున్నా లేకున్నా
నల్గురూ నడిచే త్రోవంటూ.. తప్పని పరిస్థితి
జనం కోసం భోజనమా! భోజనం కోసం జనమా!
అన్నది ఓ పట్టున అర్ధంకాదు... ఇదంతా వ్యర్థమని, అనర్థమని
జరుగుతున్న తంతు మాత్రం చూడరు. ఎవరి గ్రూపుతో వారి ముచ్చట్లు
ఎంత నిండుగా చేసినా వెలితినే చూచి వెక్కిరించేవారెందరో..
ఆలోచించాలి మనం.. పాతను ఆచరిస్తే మిగిలేను ఎంతో ధనం
మనం మారితే ఘనం.. లేకుంటే ముందుముందు దొరకదు భోజనం
అందుకే అందరూ ఆలోచించాలి..
మనం చేసే వేస్టేజితో ఎన్ని కుటుంబాలు బ్రతకవచ్చో.

- నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,
ఉపాధ్యాయులు, అల్లూరు. చరవాణి : 9908101646

కలికాల జీవులు
జాగ్రత్తబాబూ.. ఈలోకం
ఆవలిస్తే పేగులు తినే రకం
ఊసరవెల్లులు
ఎదుటివారికి నీతులు చెప్పే
దొంగ సన్నాసులు
తడిగుడ్డతో గొంతులు కోసే
నమ్మక ద్రోహులు
మాయమాటలతో బోల్తా కొట్టించే
గుంటనక్కలు
ఏ ఎండకాగొడుగు పట్టే
అవకాశవాదులు
ఆశ్రయమిచ్చిన వారినే
అంతమొందించే
ద్రోహ జీవులు
అందుగలరిందు లేరని
సందేహము వలదు
వీరెందెందు వెదకి చూసినా
అందందే కానవచ్చు
కలికాల జీవులు
అందుకే చెపుతున్నా
జాగ్రత్త బాబూ.. ఈ లోకం
ఆవలిస్తే పేగులు తినే రకం.

- కైపు ఆదిశేషారెడ్డి, పెదచెరుకూరు, నెల్లూరు, చరవాణి : 9985714281

ఆశల సూర్యుడు
సుఖాలకి దుఃఖాలకి వున్న రంగుల్ని
వేరుచేసి
మాకైతే ఆనందాల
పండుగను అందిస్తావు
మిగిలిన అతుకు గుడ్డలతో
నీ యింట్లో దీపాలు వెలిగిస్తావో
ఒట్టి ప్రమిదగా మిగులుతావో
ఎవరు చెప్పగలరు?
చొక్కాకి కాజాగుండీలకు ఉన్న
అనుబంధం మనది
కానీ యిప్పుడు
రెడీమేడ్ గార్మెంట్స్
మీ కుటుంబం నోటిముద్దను
లాక్కుంటూ
కన్నీటిని బహూకరిస్తున్నది
నీ క్రియాశీలను మార్కెట్లో రేటుగట్టి
నీకు దుఃఖాన్ని ప్రసాదిస్తున్నది
నిరాశపడకు నేస్తం
ఆశల సూర్యుడు ఉదయిస్తాడు మళ్లీ!
(ఫిబ్రవరి 28న టైలర్ సడే సందర్భంగా)

- గుర్రాల రమణయ్య,
చరవాణి : 9963921943

కాలం ఇచ్చిన
స్ఫూర్తి
కాలమనే వృక్షం నుండి
గత సంవత్సరముల
పండుటాకులు రాలిపోవును
కాల హిమశిఖరం నుండి
ఒక్కొక్క క్షణబిందువు
ఆవిరై పోవును
కాలచక్ర భ్రమణంలో
కాలనదీ ప్రవాహంలో
రేపు..4నేడు2 అగును
నేడు..4నిన్న2 అగును
రేపు2 ఆశయం..
నిన్న2 అనుభవం
నేడు2 కర్తవ్యం..
రేపటి ఆశయాలను
సదా స్మరించుకుంటూ...
నిన్నటి అనుభవాల నుండి
గుణపాఠాలను నేర్చుకుంటూ..
నేడు కర్తవ్యదీక్షతో
విజయపథంలో సాగిపో నేస్తమా
ఇదే కాలం ఇచ్చే స్ఫూర్తి..

- మోపూరు పెంచల
నరసింహం
చరవాణి : 9346393501

స్పందన

హాస్యభరితంగా సాగిన
ఎంతటి వీరుడవో తెలిసెరా..
గతవారం మెరుపులో కోలపల్లి గారి కలం నుంచి జాలువారిన ఎంతటి వీరుడవో తెలిసెరా... కథ చివరి వరకు హాస్యభరితంగా సాగింది. ఒక బొద్దింకను ప్రధాన అంశంగా ఎంచుకుని కథను మలచిన తీరు బాగుంది. కథలో పరమవీరచక్ర మేజర్ ప్రతాపరావు, విశాలక్ష్మి పాత్రల మధ్య సంభాషనలు బాగా కుదిరాయి. కాకపోతే ఉల్లిపాయలతో అన్ని కూరలు చేయొచ్చా అన్న సంగతి ఈ కథను చదివిన తరువాతే తెలిసింది. అన్నన్ని ఉల్లిపాయలు తింటే ఉల్లి రేటు ఇప్పుడు తగ్గింది కాబట్టి సరే అదే ఉల్లిపాయల ధరలు మండిపోతే పరిస్థితి ఏమిటి?. ఇక అంతే. మంచి హాస్యకవితను అందించినందుకు రచయితకు అభినందనలు.
- తలారి సుభద్ర, గూడూరు
- అయినాబత్తిన ఘనశ్యాం, ఒంగోలు.

అన్ని కవితలు మెరిసాయి
మెరుపులో గత వారం అన్ని కవితలు మెరిశాయి. అన్ని సంక్షిప్త కవితలే అయినా భావం మాత్రం అపారం. ముఖ్యంగా అక్షర నైవేద్యం, అర్ధం లేని నిశ్శబ్దం, ప్రేమకు ప్రేమతో కవితలు చాలా బాగున్నాయి. అలాగే పుస్తక సమీక్ష కూడా బాగుంది. మాదొక చిన్న విన్నపం కొన్ని కార్టూన్లు మావి మీ వద్దకు ఉన్నాయి. వాటిని వీలువెంబడి ప్రచురిస్తారని ఆశిస్తూ..
- రవి కుంచె, నెల్లూరు
- షేక్.ఖాజాసాహెబ్, ఉదయగిరి

తెలుగుభాషకు
పట్టం కట్టిన అక్షర నైవేద్యం
ప్రముఖ రచయిత మోపూరు పెంచలనరసింహం గారు రాసిన అక్షర నైవేద్యం తెలుగుభాషకు నిజంగా పట్ట్భాషేకంలా కుదిరింది. ఆయన ఇదివరకు రాసిన కవితలన్నీ చదివాను. కానీ తెలుగుభాషపై ఆయనకున్న భక్తి ఈ కవితలో చూపించారు. ప్రతి పదం కూడా తెలుగుభాష గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు పోటీపడ్డాయి.
- సజ్జా హేమలత, పిచ్చిరెడ్డితోపు, నాయుడుపేట
- శ్రీనివాసులు వేణుంబాక, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- అనురాధ రామకృష్ణ