నెల్లూరు

ముందుమాట (హాస్య కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీరంగిపిట్ట జోగినాధం ఇంటికి చిన్ననాటి మిత్రుడు చిరుగాలి సుమన్ వచ్చాడు. జోగినాధం భార్య జోగులాంబ యిచ్చిన కాఫీ సిప్ చేస్తూ మిత్రులిద్దరూ మంటల్లోపడ్డారు.
‘‘ఏంటి? ఇలా వచ్చావ్.. ఏదైనా విషయం ఉందా?’’ యథాలాపంగా అడిగాడు జోగినాథం.
‘‘అబ్బే ఏం లేదురా.. చెల్లెమ్మ చేతి కాఫీ తాగుదామని’’
‘‘సోది ఆపి విషయానికి రా!’’
‘‘ఏం లేదురా... ఈ మధ్య నేను ఒక పుస్తకం రాసాను’’ - బొటన వేలు నేలకి రాస్తూ సిగ్గుపడుతూ చెప్పాడు సుమన్.
‘‘నీ సిగ్గు చిమడా - నువ్వు పుస్తకం రాశావా... ఆ పుస్తకం కథాకమామిషు చెప్పు’’ ఆసక్తిగా అడిగాడు జోగినాధం.
‘‘నేను ఒక సంవత్సర కాలం ఆలోచించి, ఆలోచించి పరిశోధించి, పరిశోధించి, జుట్టుపీక్కుని...’’ అంటూ సుమన్ ఏదో చెప్పబోయేంతలో - జోగినాధం అడ్డుపడుతూ...
‘‘అందుకేనా - గిరజాల జుట్టుతో మిలమిలా మెరిసిపోయేవాడివి. ఇప్పుడు రుూ బట్టతల వచ్చింది’’
బట్టతల తడుముకుని బావురుమని అంతలోనే తేరుకుని ‘‘మధ్యలో అడ్డురాకురా.. నన్ను పూర్తిగా చెప్పనీ’’ అంటూ మిత్రుడిని విసుక్కుని కంటిన్యూ చేశాడు.
‘‘నా మనసు అనే మజ్జిగ కుండను.. భావావేశం అనే కవ్వంతో చిలికి చిలికి.. అక్షరాల వెన్నముద్ద బయటకి తీసి.. కాగితం పొయ్యి మీద వేడిచేసి.. కవిత్వం అనే నెయ్యిని బయటికి తీసా ..’’
‘‘అబ్బో నీ కవిత్వం గొప్పస్థాయిలో ఉంది.. మట్టిబుర్ర నాకేం అర్ధమవుతుంది’’
‘‘ఏంలేదురా.. ఈ వీధిలో ప్రముఖకవి అల్లిబిల్లి అప్పారావు ఉన్నాడని విన్నాను. ఆయన చేత నా పుస్తకం ‘‘కెవ్వు కేక’’కు ముందుమాట రాయించాలని వచ్చాను’’ నానుస్తూ చెప్పాడు సుమన్.
ఆ మాటకి జోగినాధం ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘‘వద్దురా ఆయనది ఢిల్లీస్థాయి, నీది గల్లీస్థాయి - నీకు ముందుమాట రాస్తాడటరా.. నీ పిచ్చిగానీ’’...
‘‘ఎలాగయినా.. కాళ్లావేళ్లా పడి బతిమాలి ముందుమాట రాయిస్తాను.. అది నా పుస్తకాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది..’’
‘‘ఒరేయ్ ఆయనకి వళ్లంతా’’ అంటూ జోగినాధం ఏదో చెప్పబోయేంతలో..
‘‘రోమాలా’’ సుమన్ అన్నాడు
‘‘కాదురా.. కాదురా.. అల్లిబిల్లి అప్పారావుని అహం అప్పారావు అంటారు అందరూ - సరే నీ ఛావు నువ్వు ఛావు.. నాకు ఆఫీస్‌కి టైమ్ అయింది’’ అంటూ రెడీ అయి ఆఫీస్‌కి ప్రయాణమయ్యాడు జోగినాధం.
తన కవితల పుస్తకాన్ని సంచీలో పెట్టుకుని.. అల్లిబిల్లి అప్పారావు యింటి వైపు అడుగులు వేశాడు సుమన్.
వరండాలోనే కనిపించాడు అప్పారావు.. ఒళ్లంతా ఆముదం రాసుకుని - సూర్యనమస్కారాలు చేస్తూ కనిపించాడు - దూరంగా టేప్‌రికార్డర్‌లో ‘‘అహం బ్రహ్మశ్మీ - అహం బ్రహ్మశ్మీ’’ అంటూ నాదం వినిపించసాగింది.
‘గురువుగారూ..’ అంటూ ఆయన పాదాల మీద పడ్డాడు సుమన్.. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు అప్పారావు.
‘‘గురువు గారూ నేను మీకు ఏకలవ్య శిష్యుడిని - ప్రతిరోజూ దినపత్రికలో మీ ఫొటోలు చూస్తుంటాను...
‘‘ఒబామాతో అల్లిబిల్లి’’ ‘‘వీరప్పన్‌తో అల్లిబిల్లి’’ ‘‘సద్దాంతో అల్లిబిల్లి’’ - అంటూ వరసగా చెప్పుకుపోతున్నాడు సుమన్.
అప్పారావు ముఖం 100 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది సంతోషంతో..
‘‘ఏంటి బాబూ విషయం’’ అన్నాడు ప్రసన్నంగా.
కుర్చీలో కూర్చోమన్నాడు, స్నానం చేసి వస్తానంటూ లోపలికి నడవబోయాడు.
‘‘సార్.. ఏం లేదు.. నా మొట్టమొదటి పుస్తకం ‘‘కెవ్వుకేక’’కి మీరు ముందుమాట రాస్తే - నా పుస్తకానికి, విశ్వవిఖ్యాతి వస్తుందని నా నమ్మకం’’ అంటూ గొణిగాడు.
‘‘బాబూ నేను లోకల్ పీపుల్‌కి ముందుమాట రాయను.. అయినా నా అభిమానివి అంటున్నావు కాబట్టి రాస్తాను..’’ అంటూ ఆ పుస్తకాన్ని అందుకుని..
‘‘కవిత్వం గురించి యుగాండా కవి జుంబారే ఏమన్నాడు అంటే.. కుక్కతోక ఊడినంత సులభంగా కవిత్వం రాయాలి, చైనా కవయిత్రి చింగ్ చూయింగ్ ఏమందంటే గాడిద కూసినంత మధురంగా కవిత్వం ఉండాలి అంటుంది.
ఇలా ఏవేవో కోట్ చేశాడు.
చివరకు - నేను యిటీవల చదివిన చెత్తపుస్తకాల్లో ఒక కవి రచించిన ‘‘కెవ్వు కేక’’ ఇందులో వచనం తప్ప.. కవిత్వం లేదు - ఇది కవిత్వం కాదు. ఊడిపోయిన మేకతోక.. రాలిపోయిన కోడి ఈక.. ఈయనకి నా ఆశీస్సులు అందాలి’’ అంటూ ముందుమాట ముగించాడు.
ఆముదం తాగిన ముఖంతో పుస్తకం అందుకున్నాడు సుమన్.
మరుసటి రోజు ఉదయం జోగినాధం యింటికెళ్లి ఈ ముందుమాట చదివి వినిపించాడు. ఆయన నిట్టూర్చి ‘‘ఒరే బడుద్దాయ్.. నేను ముందరే చెప్పాను కదరా.. ముందుమాట పేరుతో ఇలా తిట్టించుకోవడం నీకు అవసరమా? కవిత్వం గురించి వాడలా అన్నాడు.. వీడిలా అన్నాడు.. అంటాడు.. వాడు ఏమంటాడో రాయడా.. ఈయనకి కవిత్వం పేటెంట్ హక్కా, కవిత్వం ఈయనకి నచ్చినట్లు రాయలా.. ప్రజలకు నచ్చేలా ముందుమాటలో వర్ధమాన కవులను చేయిపట్టుకుని ప్రోత్సహించి ముందుకి తీసుకురావాలి.. అంతేగానీ ఇలా దుడ్డుకర్రతో చావగొట్టడం కాదు’’ అంటూ జోగినాధం హితబోధ చేశాడు.
సుడిగాలి సుమన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. చేతిలోకి ముందుమాట తీసుకుని పరపరా చింపి ముక్కలు చేశాడు.
‘‘నా ముందుమాట నేనే రాసుకుంటా.. నా కవిత్వమనే పూలతోటలో సాహిత్య ఆకాశంలో ఎగిరే అక్షరభానుడిని నేనే’’ అంటూ సాగిపోయాడు.
(ఈ కథ కేవలం కల్పితం. ఈ అల్లిబిల్లి అప్పారావు మీ ఊళ్లో..
మా ఊళ్లో ఉండొచ్చు.. ఏ ఊళ్లో అయినా వుండొచ్చు. లేదా మన మనసులో అహంగా దాగీ వుండొచ్చు)

- గోవిందరాజు సుభద్రాదేవి
- మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 9848627158
7386362476

స్పందన

నిడివి ఎక్కువైన చింతాలయ్య రూరల్
పోలీసుల జీవితాలు ఎలా వుంటాయో ఇతివృత్తంగా తీసుకుని అల్లిన కథ చింతాలయ్య రూరల్. ఓ యువకుడు పోలీసుకావాలని కలలు కని దానిని సాధించడం, పెళ్లి చేసుకున్న తరువాత ఉద్యోగ ధర్మంలో భాగంగా తనను పట్టించుకోవడం లేదని భార్య నిరాశ చెందడం వంటి కోణంలో రాసిన కథ బాగుంది. కానీ కథ చాలా పెద్దదిగా అనిపించింది. రచయిత్రి చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పి వుంటే కథ ఇంకా బాగా వచ్చేది. కథలో ఇతర పాత్రల ప్రవేశం వల్ల కథలో చెప్పదలచుకున్న అంశం పక్కదారి పట్టింది. అలాకాకుండా పోలీసు అయిన భర్త, భార్య మధ్య కథను నడిపించి వుండి, చివరకు భార్యే మారి భర్తను అర్ధం చేసుకుని వుంటే కథ వేరేలా ఉండేది. మొత్తం మీద పోలీసు బాధలను చూపించే ప్రయత్నం చేసిన రచయిత్రి అనురాధ గారికి ధన్యవాదములు
- శ్రీనివాసరెడ్డి, లాయర్‌పేట, ఒంగోలు

లక్కరాజును ఆపడం కష్టం
మెరుపులో మెరుస్తున్న రచయితల్లో లక్కరాజును ఈ మధ్య మరీ ఆపడం కష్టతరమైంది. ఎవరాపగలరు అంటూ ఆయన రాసిన కవితను చదువుతూ పోతుంటే ఆయన్ను ఇక ఆపడం కష్టమనిపించింది. ఎంత బాగా రాశారండి కవిత. ఈ సృష్టిలో జరిగే ఆ మార్తాండుని లీలను ఎవరు మాత్రం ఆపగలరు.. అంటూ రాసిన ప్రతి వాక్యం అద్భుతం.
- సావిత్రి, తిలక్‌రోడ్డు, తిరుపతి
- పీసుపాటి అనిల్, మార్కాపురం

ఆకుపచ్చని స్వప్నం
మనకు దగ్గరగా వుండి, మన మనస్సులో పదిలమైన స్థానం పొందిన ఆత్మీయులు అకాలంగా మరణిస్తే బాధ ఎలా వుంటుందో తెలియజెప్పిన కవిత ఆకుపచ్చని స్వప్నం. ఒక పచ్చని ఆకుతో పోల్చిన తీరు బాగుంది. రచయిత కుర్రా ప్రసాద్‌బాబు గురించి చెప్పేదేముంది.
- పి. అన్నపూర్ణ, రచయిత్రి, నెల్లూరు
- రమేష్ సాయ, కనిగిరి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

పుస్తక సమీక్ష

గ్రామీణ నేపథ్యంతో సాగే జీవన చిత్రాలు

- ప్రతులకు -
అవ్వారు శ్రీధర్‌బాబు
23-1-57, పెండెంవారివీధి,
ఫత్తేఖాన్‌పేట, నెల్లూరు.
చరవాణి : 8500130770

నెల్లూరు నగరానికి చెందిన అవ్వారు శ్రీధర్‌బాబు పిల్లల మనసు గెలిచిన ఉపాధ్యాయుడు. పాఠాల మధ్యలో అలవాటు ప్రకారం పిట్టకథలు చెప్పాల్సి వచ్చేది. అలా కథలు చదివి చదివి తానే ఇప్పుడు కథకుడిగా మారారు. 19 కథలను ఎంపిక చేసి జీవన చిత్రాలు పేరిట కథా సంకలనం పాఠకులకు అందించారు. అవన్నీ గ్రామీణ నేపథ్యం ఉన్న కథలే కావడంతో పాఠకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మధ్యలో హాస్య కథలు కూడా బాగున్నాయి.
మళ్లీ మళ్లీ ఓడిపోతుంటాం అనే కథలో నెల్లూరు పట్టపుపాళెం ప్రాంత వాసుల దీనస్థితిని చందు రూపంలో చక్కగా ఆవిష్కరించారు. తీరప్రాంతంలో ధర్మల్ విద్యుత్‌కేంద్రాల వల్ల ఎటువంటి నష్టాలు పొందాల్సి ఉంటుందో ఈ కథ ద్వారా రచయిత సమాజాన్ని మేల్కొలిపే యత్నం చేశారు. మా పల్లె ఎటుపోయిందో కథలో మనుషులతోపాటు వర్షాలూ మోసం చేస్తున్నాయి అనే ప్రయోగం బాగుంది. గాలికి పైరు ఊగుతూ మాకు టాటా చెపుతున్నాయి అనడం బాగుంది. సంప్రదాయాలు మరుగున పడిపోకుండా పెళ్లి పిలుపులు, చిన్ననాటి ముచ్చట్లు పాఠకులను పాతజ్ఞాపకాల్లో విహరింపచేశాయి. స్నేహపూరిత వడ్డింపులు నేటి పెళ్లిళ్లలో ఎడారిలో నీళ్లే చక్కగా వర్తిస్తుంది. సందర్భం సందర్భోచితంగా ఉంది. చదువుకొచ్చిన ముప్పు శీర్షికలో చిన్నారి ముద్దు చేష్టలతో ప్రారంభించి కానె్వంట్ కష్టాలను చక్కగా వర్ణించి చివరకు సర్కారు బడులే మేలనే కానె్సప్ట్‌తో రచించిన తీరు అద్భుతంగా ఉంది. అయితే కథకు శీర్షిక సరికాలేదనిపించింది. అమ్మకో ఉత్తరం కథ చిన్నదైనా సందేశాత్మకంగా ఉంది. మనసు మంచిదై ఉండాల అనే కథలో ఒకే ఒక్క సన్నివేశాన్ని కథగా మలచిన తీరు బాగుంది. ఇందులో మాండలికాన్ని రచయిత చక్కగా వాడుకున్నారు. చదువుకుంటే వృథాకాదు, హాస్య రచనగా తికమక ఉంది. ఇలా 19 కథలు విభిన్న అంశాలతో పాఠకులకు మనసు దోచేవిగా ఉన్నాయి.

- గౌతమి, 9347109377
మినీ కవిత
జోడీ వీడింది
పెళ్లిలో జోడీ
వీడిపోయింది
జోళ్లది

పెళ్లయ్యింది
ప్రేమిస్తే అవుతుందన్నారు
పెళ్లి!
ప్రేమించాను
అయ్యింది పెళ్లి
ఆమెకు మరొకరితో!!
నా కలం
ప్రేయసీ! నీ కోసం
కన్నీళ్లు చిందిస్తున్నా నేను!
కవితల్ని చిలకరిస్తోంది
నా కలం!

- జి.విజయకుమార్,
రీడ్స్‌పేట,చిత్తూరు

మన బడిని
వెతుకుదాం రండి!
నేను చదివిన పాఠశాల నా నిజ దేవాలయం
కులం కదలికలు లేని అదొక ఒయాసిస్సు
ఐకమత్యపు ఆయుధాలు ధరించి
మా మార్గాన్ని మేమే నిర్మించుకునే
క్రమశిక్షణ కలిగిన పోరాటసైనికులం అవుతాం

అక్కడ మతప్రార్థనలు జరగవు
సదస్సులు, జాతర్లు అంతకంటే ఉండవు
మన మాతృభూమిని మనమెలా ప్రేమించాలో
విశ్వకుటుంబంలా ఎలా తీర్చిదిద్దుకోవాలో
గురువులు నిబద్ధతతో బోధిస్తారు

అవును మాదొక ప్రభుత్వపాఠశాల
ఇలా చెప్పడానికి నాకెంతో గర్వంగా ఉంది
చిన్నప్పటి నుంచీ నేను ప్రభుత్వ పాఠశాలలోనే
చదువురెక్కల్ని నిర్మించుకున్నాను
కొందరికెందుకో ఇలాంటి బడులంటే చులకన
కాని ఇక్కడ ధనిక పేద భావాలకు తావులేదు
పచ్చదనం, పరిశుభ్రతే మా లక్ష్యం
ఉన్నత విలువలతో చదివి
మా పాఠశాలని తీర్చిదిద్దడమే మా ధ్యేయం
మా గురువులే మాకు ఉత్తమ మార్గనిర్దేశకులు
అవును మాదొక ప్రభుత్వ పాఠశాల
మీరూ చిన్నప్పుడు ఏదో ఒక పాఠశాలలో
మీ బతుకుల్ని మీరు దిద్దుకునే ఉంటారు
ఇంకా మీ జ్ఞాపకాల్లో ఆ బడి నిలిచి
అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది
ఒక్కసారి తన ఒడిలోకి రమ్మని
ఆప్యాయంగా మిమ్మల్ని
ఆహ్వానిస్తూ ఉంటుంది

మీరు చదువుకుంటున్నప్పుడు
ఆ బడి ఎలా ఉండాలని కలగనేవారో
ఏదయితే ఉండాలనుకుంటుండేవారో
ఇప్పుడేదయితే అక్కడ లేదో
దాన్ని మీ బడికి బహుమతిగా అందించి
కృతజ్ఞతలు అర్పించి ఆనందంగా
ఆ దేవాలయానికి నమస్కరించి రండి
నిజంగా అది మీరు చదువుకున్న పాఠశాలే
రేపటి నుంచి ఒక్కొక్కరు కదలండి
ఈ కవిత చదివాక మీ పాఠశాల ఎక్కడుందో
మీ బతుకు చిత్రపటంలో వెతకండి
మీ బాల్యాన్ని.. మీ స్నేహాన్ని పొందడం
అదొక అనిర్వచనీయమైన అనుభూతి
వాటిని ఎన్నటికీ జారవిడుచుకోవద్దు
కదలండిప్పటికయినా
కాశీ ప్రయాణం కంటే
హజ్ యాత్రకంటే ముందుగా
మనం దర్శించాల్సింది
ఈ నిజ దేవాలయానే్న..

- షారోన్‌బేగం, సోమశిల, నెల్లూరు
చరవాణి : 8985963150

మనోగీతికలు

ఎదురుచూస్తున్నాను
నేను కాలం తీరాన కనిపెట్టుకొని
కూర్చున్న వ్యక్తిని
ఎన్నో పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి
ఒక్క పండగకైనా మనిషి కనపడతాడేమోనని
వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను
కనపడితే వాడి కాళ్లకు మొక్కుదామని...
మనుషులను ప్రేమిస్తూ వస్తువులను వాడుకొనేవారు-అప్పుడు
మనుషులను వాడుకుంటూ
వస్తువులను ప్రేమిస్తున్నారు- ఇప్పుడు
ఇల్లు, ఇల్లాలు లేకున్నా జేబులో
సెల్లు మాత్రం ఉండాలి
అప్పోసప్పో చేసి నట్టింట్లో ఒక టి.వి. ఉండాలి
ఇంటర్‌నెట్లూ, ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌ల రాజ్యంలో
మనిషి కూడా మంత్రించినట్లు
ఒక యంత్రమైపోయాడు
ఏ పండుగకైనా మనిషి కనపడకపోతాడా అని
ఆశగా ఎదురుచూస్తున్నాను
కనపడితే వాడికాళ్లకు మొక్కుదామని..
పచ్చనోట్ల సంపాదనలో, ఆస్తిపాస్తుల ఆర్జనలో
మమతానుబంధాలను వదిలేసి
మారణహోమం సృష్టిస్తూ
సభ్యతా సంస్కారాలను మరిచి
మానవత్వం మంచంపట్టింది
మారిన మనిషి కనపడకపోతాడా అని ప్రతి పండగకు ఎదురుచూస్తున్నాను.
కనపడితే వాడికాళ్లకు మొక్కుదామని..
పసిబిడ్డ నుండి పండు ముసలి దాకా
ఆడతనానికి రక్షణేది?
భూమి-పుట్ర, నగా-నట్ర కబ్జా కాకుండా
కాపాడే చట్టమేది?
బహిరంగ చుంబనాది
శృంగారాలను అడ్డుకొనే సంస్కృతేది?
జరుగుతున్న కాలంలో మనుషులెవరూ లేరు, మరబొమ్మలు తప్ప
ఏ పర్వమైనా ఒక మానవతామూర్తిని
తెస్తుందేమోనని
ఆశగా ఆర్తిగా ఎదురుచూస్తున్నాను
తెస్తే వాడి కాళ్లకు మొక్కుదామని -
గుండెలో గుడికడదామని...

- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి
చరవాణి : 9490227114

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- గోవిందరాజు సుభద్రాదేవి - మోపూరు పెంచల నరసింహం